[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap]లోగా శ్రీదేవి అనే మా రెండో పెద్దమ్మ, పిచ్చి అత్తగారూ, ఐదుగురు పిల్లలూ, బోలెడు మంది బలగం, ఎప్పుడూ స్టేషన్ దగ్గరుండడం వల్ల వచ్చిపోయే చుట్టాలతో, సతమతమవుతునే, భర్త ‘నీకేం తెలుసు… చదువా? ఉద్యోగమా?’ అన్నారని మాట పట్టింపుతో ఆంధ్రా మెట్రిక్ కట్టి పాసయి, తర్వాత పి.యూ.సీ, ఆ తరువాత బి.ఏ. పాసయ్యింది.
అప్పటికి మా పెద్దక్క పెళ్ళయి ఆవిడ మనవడినెత్తింది. పట్టుదలతో విద్యుత్ సౌధాలో ఉద్యోగం తెచ్చుకుంది. సికింద్రాబాద్‌లోని సీతయ్య తోటలో కరెంట్ ఉండేది కాదు. లాంతరు వెలుగులో చదువుకునేది. భర్త సహకారం లేదు. నీళ్ళు ఉమ్మడి బావి నుండి తెచ్చుకోవడం, ఐదుగురు పిల్లలు. అప్పుడే… చిన్న వయసులోనే అల్లుడు… అయినా పట్టుదల మా అమ్మమ్మ రక్తంలోనే ఉందనుకుంట! మా పెద్దమ్మ సావిత్రి కూడా ఎమ్.ఎస్.ఇ.బి.లో ఉద్యోగం సంపాదించుకుంది. ఈ విధంగా మా అమ్మమ్మ ముగ్గురు కూతుళ్ళు ఉగ్యోగస్తులయ్యారు.
తాతగారు పోయినప్పుడు ఫ్రీడం ఫైటర్‌గా ఆయనకి ఇచ్చిన మూడు వందల గజాల్లో, సికింద్రాబాద్ కల్పనా టాకీస్ బ్యాక్ సైడ్, అమ్మమ్మ మూడు గదుల ఇల్లు కట్టి ‘జస్‌జిత్’ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ నడిపే సీరా సత్యనారాయణకి అద్దెకివ్వడం, తను ఖాళీ చెయ్యమంటే; ‘ఇరవై ఏళ్ళు వున్నాను కనుక ఇల్లు నాదే అవుతుంది’ అని కోర్టులో వెయ్యడం… ఆ ప్రస్థానం నా ఆరో ఏట మొదలయి, నాకు పెళ్ళయి, ఇద్దరు పిల్లలు పుట్టేదాకా సాగింది.
మధ్యలో అమ్మమ్మ ఇందిరాగాంధీ పి.ఎం.గా ఉన్నప్పుడు ఆవిడకి తన పరిస్థితి అంతా వివరిస్తూ ఒక లేఖ రాసింది. ఎటువంటి రిప్లై రాలేదు.
కొంత కాలానికి ఓ నాటి మధ్యాహ్నం అమ్మమ్మ ఆర్.టి.సీ. క్వార్టర్స్ బయట వడియాలు ఎండపెడ్తుండగా ఇద్దరు వ్యక్తులు జీపులో వచ్చి “శ్రీమతి శ్రీహరిరావ్ ఉన్నారా?” అని అడిగారు.
అమ్మమ్మ తనే అని చెప్పింది. “ఈ ఉత్తరం మీరే రాశారా?” అని అడిగారు. అమ్మమ్మ ‘ఔను’ అంది. వాళ్ళు ఢిల్లీ నుండొచ్చినట్టు విని “పి.ఎం. నా లేఖ చదివారా?” అమ్మమ్మ బోలెడు ఆశ్చర్యపోయింది. “ఈవిడ బ్రతికుందా చూసి రమ్మని పంపారని” వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు.
ఆ తరువాత మా అన్నయ్య శ్రీకాంత్ మురళీ చాలా కష్టపడ్డాక, ఆ కోర్టు కేసు తెమిలి, సీరా సత్యనారాయణని ఖాళీ చేయించి అమ్మమ్మకి ఇల్లు ఇప్పించారు.
అప్పట్లో మా అమ్మమ్మ గానీ, అమ్మ గానీ ‘ఇది మన వల్ల కాదు’ అని దేన్నీ అనుకునేవారు కాదు! అందుకే తాతయ్య పోయాక అమ్మమ్మకి ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ రావడం లేదని, మా తాతగారి ఫ్రెండ్ ముదిగొండ రాజలింగం గారి సలహా మీద వి.వి.గిరి (అప్పడి ప్రెసిడెంట్) వస్తున్నారని తెలిసి ఓ నాటి ఉదయమే ఆర్.టి.సీ. బస్ ఎక్కి రాజ్‌భవన్‌కి వెళ్ళారు. వెళ్తుంటే, ఆ డ్రైవర్ అమ్మని గుర్తుపట్టి, అదే ఆఫీస్ కాబట్టి… “ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగితే “ప్రెసిడెంట్‌ని కలవడానికి రాజ్‌భవన్‌కి” అందిట.
ఈ తెల్లవారు జామున సాదాసీదా దుస్తుల్లో వెళ్తున్న ముసలావిడనీ, ఈ స్త్రీని చూసి అతను పెద్దగా నవ్వి “అపాయింట్‌మెంట్ వుందా?” అని అడిగాడట
“ఏమో… అవన్నీ మాకు తెలియవు” అందట మా అమ్మ. అతను నెత్తి కొట్టుకొని, “ప్రెసిడెంట్ అలా అందరినీ కలవడు… పన్నెండింటికల్లా మళ్ళీ ఇక్కడ బస్‌స్టాప్‌కే రండి… ఎక్కించుకుని పోతాను” అని దింపి వెళ్ళిపోయాడట.
నిజంగానే ప్రెసిడెంట్ ఆఫీసులో ఆయన పటాటోపం, సెక్యూరిటీ వీళ్ళకి పని కష్టతరం అని అర్థమైంది… కాని అసాధ్యం అని మాత్రం అనుకోలేదు అప్పుడు కూడా.
అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లలో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి ఉన్నాడట. అతన్ని పట్టుకుని అమ్మమ్మ “బాబూ… ఇది మా వారు పోయినప్పుడు వి.వి.గిరి గారు స్వహస్తాలతో రాసిన లేఖ… దీన్ని తీసుకెళ్ళి మీ మిత్రుడి భార్య రమణమ్మ వచ్చిందని చెప్పు” అందట.
అతను ‘కుదరరమ్మా’ అనబోయి, దాని మీదున్న రాజముద్రనీ, తెలుగులో… ‘నీ గిరి’ అని రాసిన సంతకాన్నీ చూసి ఆగిపోయాడట. “ఇక్కడే ఉండండి…” అని వెళ్ళి, కొంతసేపటికొచ్చి, “రండి… రమ్మంటున్నారు” అని కూడా పెట్టుకుని రాజ్‌భవన్‌లోకి తీసుకెళ్ళాడట!
గిరిగారు, మా అమ్మమ్మని చూడగానే “రమణమ్మా… ఇది నీ పెద్ద కూతురా? నన్ను తిడ్తూ ఉత్తరం రాసిందే… అదేనా?” అన్నారుట మా అమ్మను చూసి. అమ్మమ్మ సిగ్గుపడి “ఇది మూడోది… సత్యవతి” అందట.
మా తాతగారు పోయినప్పుడు, వి.వి.గిరి గారు రెండు వేల రూపాయలు పంపితే, మా పెద్దమ్మ దుర్గా సావిత్రి మండిపడి, “మీ సాయానికి కృతజ్ఞతలు… మా అమ్మ దిక్కు లేకుండా లేదు… మా నాన్న ముగ్గురు కూతుళ్ళని ఇచ్చే పోయారు… ఈ రెండువేలూ మీ గవర్నమెంట్‌కి దేనికైనా పనికొస్తాయి. ఉంచుకోండి” అని లేఖ రాసి తిరగ్గొట్టింది. అదీ సంగతి…. ఆయన గుర్తు తెచ్చుకుని పెద్దగా నవ్వి “మా సింహం కడుపున సింహమే పుట్టిందిలే… సంతోషపడు” అన్నారుట గిరిగారు. ఆ తరువాత భార్య సరస్వతి గారిని కూడా పిలిపించి, వీళ్ళకి మర్యాదలు చేసి, ఆవిడ ఫ్రీడం పైటర్స్ పెన్షన్ ఫైలు మీద సంతకం చేసి, డిస్‍పాచ్ చేయించారుట!
మళ్ళీ పన్నెండింటికి వచ్చిన డ్రైవర్ ఎగతాళిగా, “ప్రెసిడెంట్ గారి ఇంట్లో అతిథి మర్యాదల్లో పడి అక్కడే ఉండిపోతారనుకున్నాను…” అన్నాడుట.
మా అమ్మ “నిజంగానే…. ఆయనా సరస్వతి గిరి గారూ చేసిన మర్యాదలు మరువలేము. మేం వెళ్ళిన పని అయిపోయింది” అని సంతోషంగా చెప్తే, స్టీరింగ్ ముందు నుండి లేచి కాళ్ళ మీద పడి, “మన్నించడమ్మా… మీరింత గొప్పవాళ్ళు అనుకోలేదు…” అన్నాడుట.
అమ్మమ్మ “ఒకప్పుడు మా ఇంట్లో నేల మీద కూర్చుని నేను వడ్డించిన అన్నం తిన్నవాడే అయినా రాష్ట్రపతి అయ్యాక మారిపోతాడనుకున్నాను… మారలేదు” అని కన్నీళ్ళతో చెప్పిందట.
ఇది జరిగిన నెలలోపు అమ్మమ్మకి పెన్షన్ వచ్చింది. ఆవిడ పోయేదాకా ఫస్ట్ క్లాస్ రైల్వే పాసూ, అటెండెంట్ పాసూ కూడా అనుభవించింది. ఫోన్ కూడా అప్పట్లో ఇచ్చారు.
ఇదంతా ఎందుకు చెప్పానంటే, కొంచెం మాది పట్టువదలని విక్రమార్క జాతి అని చెప్పడానికి!
ప్రొద్దుట్టే అమ్మమ్మ కుంపటి వెలిగించి కాఫీలు పెట్టేడప్పుడు తాతయ్య వీరగాథలూ, వాళ్ళు బ్రిటీషు ప్రభుత్వంతో అప్పుడు పడిన పాట్లూ అన్నీ కథలుగా చెప్పేది. అలా చిన్నప్పటి నుండీ వింటూ పెరిగాను. ‘దేశభక్తి మా ఇంటిపేరు’ అనే సినిమా డైలాగ్ కాదు కానీ అమ్మమ్మ కూడా జైలు కెళ్ళొచ్చింది. ప్రముఖ స్వాతంత్ర్య యోధులంతా ఆవిడకి తెలిసిన వాళ్ళే.
ఓ రోజున చీరాల ఎమ్.ఎల్.ఎ. – జి. కోటయ్యగారు ఆవిడ్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనా వీళ్ళ ‘ఆన్ ఫుట్ బ్యాచ్’లో ఒక సభ్యుడు ఆయన యవ్వనంలో వున్నప్పుడు. మా చిన్న ఇల్లునీ, అమ్మమ్మనీ, మమ్మల్నీ చూసి “తలచుకుంటే పంతులు ఏ విద్యాశాఖకో మినిస్టర్ అయ్యేవారమ్మా… చివరికి ఏమీ మిగల్లేదన్న మాట!” అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
ఎవరికి కష్టం వచ్చినా అమ్మమ్మ దగ్గరకి వచ్చేవాళ్ళు – “మా అమ్మాయికి మీ ఇంట్లో పురుడు పోసుకోమా?, “మా అమ్మాయికి మీ ఇంట్లో పెళ్ళి చేసుకోమా?”, “మా ఆడబిడ్డకి పెద్దాపరేషన్… రెండు నెలలు మీ ఇంట్లో ఉండమా?” అంటూ.
అమ్మమ్మ ఇల్లు చిన్నదైనా, ‘మా అమ్మాయిని అడిగి చెప్తాను’ అని ఏనాడు అనలేదు. అమ్మ ‘కాదు’ అని అమ్మమ్మ మాటకి ఏనాడూ ఎదురాడ లేదు!
మా బంధువుల్లో సగం మందికి అమ్మ ఆర్.టి.సి.లో ఉద్యోగాలు వేయించిందంటే అతిశయోక్తి కాదు! రేషన్‌లో రేషన్, మా బట్టల్లో బట్టలు, చివరకి దీపావళి టపాసుల్లో, పిండి వంటల్లో కూడా లేని వాళ్ళకి భాగం పెట్టేది అమ్మమ్మ. అలా పెరిగాము. పెద్ద లగ్జరీస్ లేవు… కానీ లేదు అన్న మాట కూడా లేదు. ఎప్పుడూ ఇతరులకి పెడ్తూనే ఉండేవాళ్ళం.
(సశేషం)