నేను.. కస్తూర్‌ని-11

0
3

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

గాంధీ భాయి మరొక స్నేహితుడు హర్మన్ కలెన్‌బాక్. అదేం విన్యాసం కావాలన్నా కూర్చున్న చోటే తెల్ల కాయితం పైన చేసేసేవాడు. అలాంటి విన్యాసకారి. అతడికి రాని విద్య లేదు. వడ్రంగి తనం, తాపీ పని, చిత్ర లేఖనం, వంట, మరమ్మత్తులు, విన్యాసం అన్నీ అతనిలో ఉండేవి. ముందు మద్యం, తంబాకు, మాంసం, ఆడవాళ్ళ సహవాసం అన్నీ ఉండేవట. భాయి ప్రభావానికి ఎంత లోనయ్యాడంటే శాకాహారి అయ్యాడు. బ్రహ్మచారిగా చివరివరకూ మిగిలాడు. మద్యం త్రాగడం పూర్తిగా మానివేశాడు. జొహాన్స్‌బర్గ్ బయట అతడికి 1100 ఎకరాల స్థలం ఉండేది. పోరాటం ముగిసేదాక భారతీయులకు వదిలేశాడు. “మన చుట్టుపట్ల ఉన్నవాళ్ళకు ఇబ్బంది కలగకుండా ‘సరైనదాన్ని’ గుర్తించడం కావాలి. టాల్‌స్టాయ్ చేసిందదే. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను” అంటూ తన అన్నయ్య సైమన్‌కు ఉత్తరం రాశాడట. టాల్‌స్టాయ్ గారి మహా అభిమాని. భాయికి తమ్ముడా, స్నేహితుడా అని చెప్పలేము, అంత దగ్గరయ్యాడు. మా మిలి గర్భవతయ్యి, పొలాక్ ఇంటికి వచ్చి బిడ్డ పుట్టిన తరువాత భాయి, కలెన్ ఇద్దరూ తమ కోసమే ప్రత్యేకంగా ‘ద క్రాల్’ అనే ఇంటిని జొహాన్స్‌బర్గ్‌లో కట్టుకున్నారు. మేము అప్పుడు ఆశ్రమంలో ఉన్నాము. ఉదయం ఐదుకు లేచి, ఇల్లు- తోట పనులు ముగించి, నడుస్తూ లేదా సైకిల్ పైన పట్టణానికి పనికి వెళ్ళేవారు. ఆ తెల్లవాళ్ళ జొహాన్స్‌బర్గ్‌లో నౌకర్లు లేని ఒకే ఒక ఇల్లు వీరిది. “పనుల్లో ఆడపనులు, మగపనులు అని లేవని తెలియ చెప్పింది కలెన్” అనేవారు భాయి.

మొత్తానికి గాంధీభాయిని ‘తను సగం ఆడది’ అనేలా చేసింది వీరందరూ. మోక అనే ముడి ఇనుమును లండన్ వేడి చేసింది. దక్షిణ ఆఫ్రికా దంచింది. బయటి దేశాలకు వెళ్ళకుంటే, అందులోనూ మిలి- సోన్యా లాంటి ఆడవాళ్ళు, హెన్రి, కలెన్‌లా రోజంతా చర్చించేవాళ్ళు, అడుగడుక్కీ వాదించేవారు లేకుంటే గాంధీభాయి పక్కా హిందుస్తానీగానే మిగిలేవారు అని నాకు ఎన్నో సార్లు అనిపించింది.

అదెలా ఉన్నా, భాయి ఆడతనానికి చాలా మంది ఆడవాళ్ళు ఆయనను నమ్మేవాళ్ళు. ఆయన అనుచరులయ్యారు. భాయి ఏం చెప్తే అది చెయ్యడానికి తయారయ్యేవారు. భాయి అందంగా అయితే లేరు, పెద్ద శరీరమూ కాదు, దొరికిన ఆడవాళ్ళతో సంగమించడం-వెంట పడడం, పొగడడం ఇలాంటివేం లేవు, చాలా మొండి మనిషి, నగలు, దుస్తులు, వ్యామోహం, సిగ్గు అనే ఆడవాళ్ళ మోహపు పై పొరలను నిర్దాక్షిణ్యంగా ఒకటొకటిగా ఒలిచేసేవారు. తిట్టేవారు. కానీ, అన్ని చోట్లా ఆయన మాటలకు ఆడవాళ్ళు మరులు గొని ఆయన కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడేవారు. బహుశా ఆయన ఆడతనం మాటల్లోనూ, కరుణలోనూ, అక్కరలోనూ నిండి కనిపించేది. ఆయన మాటల్లోని శాంతికి అందరూ మనసిచ్చేవారు అనిపిస్తుంది. నేను కూడా.

దిండి- నటాల్ నుండి ట్రాన్స్‌వాల్‌కి

అమ్మాయ్! ఒక చిన్న ముక్క భూమి కోసం ఎన్నెన్నో వ్యాజ్యాలు జరగడాన్నినువ్వు వినే ఉంటావు. ఇతరుల మధ్య అయితే సరే, అన్నదమ్ముల నడుమ ఎన్నో జగడాలు, కొట్లాటలు, హత్యలు జరగడం కద్దు. కానీ ఈ కలెన్ అనే ఆయన, ఎంత విశాల హృదయం కల మనిషంటే వేల కొలది ఎకరాల స్థలాన్ని కావాలంటే ఆజీవ పర్యంతం వదిలేసేవాడేమో!

సరళత, స్వసహాయం, శ్రమతో కూడిన జీవితాన్ని సత్యాగ్రహులు తమ వ్యక్తిగత జీవితాల్లో అలవరచుకోవాలనే ఉద్దేశంతోనే ఫీనిక్స్ ఆశ్రమం ప్రారంభమయ్యింది. దాని కొనసాగింపుగా టాల్‌స్టాయ్ ఫార్మ్‌ని 1910 లో ప్రారంభించాము. టాల్‌స్టాయి ఋషి చనిపోయిన సంవత్సరం అది ప్రారంభమయ్యి, మేము వచ్చేదాక అంటే నాలుగు సంవత్సరాలు నడిచింది. భారతీయ సత్యాగ్రహుల కుటుంబాలు దిక్కులేనట్టు చెల్లా చెదరయ్యాయి. వీరందరినీ ఒక చోట చేర్చినాక టాల్‌స్టాయి ఆశ్రమం ప్రారంభమయ్యింది. అది రస్కిన్, టాల్ స్టాయిల మాదిరిగా ఆదర్శంగా బ్రతకాలని చేసిన రెండవ ప్రయోగం.

అక్కడికి ముందుగా వెళ్ళింది గాంధీ భాయి, మణిలాల్, కలెన్. ఆ వెయ్యి ఎకరాల నేలలో మిట్టలు, తగ్గులు, ముళ్ళ పొదలు, పిచ్చి చెట్లు నిండి పోయాయి. యంత్రాలను తీసుకు రాకుండా మనుషులే తమ చేతులతో, పనిముట్లతో నేలను చదును చెయ్యాలి. తమ ఇళ్ళను తామేకట్టుకోవాలి అనే నిబంధన పెట్టారు. ఎవరో పెట్టలేదు, మేమే విధించుకున్నది. నటాల్ కాంగ్రెస్ లోని అంతః కలహాలతో విసిగి పోయి, భాయి కొన్ని రోజులు అన్నిటినుండి దూరంగా ఉన్నారు. అందుకని ఎప్పుడూ ఫార్మ్ లోనే ఉండేవారు. హెన్రి-మిలి, కలెన్ అందరూ ఒకే చోట ఉన్నాము. “ఫీనిక్స్‌లో మాదిరి ఇక్కడ బుర్రతినే ఆలోచనలు లేవు. నేను, మగన్ లాల్ దైహిక శ్రమలో నిమగ్నులై ఉంటాము” అని ఎవరికో రాసిన ఉత్తరంలో రాయించారు. 1910 లో నేను, పిల్లలు చేరుకున్నాము.

అందరూ ఉదయాన్నే లేచేవాళ్ళము. మగవాళ్ళు, పిల్లలు గోధుమలు విసరడానికి కూర్చునేవారు. గాంధీ భాయిది ముందుగా వ్యాయామం, తరువాత విసరడం, మిగిలిన పనులు. ఆయన వ్యాయామం అంటే స్కిప్పింగ్. రుచిగా ఉన్నవాటిని కోరి, కోరి తినడం గురించి లక్ష్యమే ఉండేది కాదు. తన లెక్క ప్రకారం ఏదో కొంచెం తినేసి పనికి పూనుకునేవారు. మేము పిల్లలకు పాఠం చెప్పడానికి కూర్చునేవాళ్ళం. సాయంత్రం అందరూ కలిసి భోంచేసేవాళ్ళం. ప్రార్థన, పఠనం రోజూ ఉండేవి. ఆ రోజు జరిగిన సంఘటనలు చర్చకొచ్చేవి. వాటిలో ఆడవాళ్ళు పాల్గొని తీరాలి అని ఉండేది.

తమిళం, హిందూ, ముస్లిం, పార్శి, క్రైస్తవులు, ఆఫ్రికన్ ఇలా అందరూ ఆశ్రమంలో ఉండేవాళ్లం. 50 మంది పెద్దవాళ్ళు, 30 పిల్లలు ఉండేవారు. ఉదయం ఆరునుండి ఎనిమిది దాకా శ్రమదానం. పదిన్నర నుండి సాయంత్రం నాలుగు దాకా క్లాసులు. సాయంత్రం ఐదున్నరకు భోజనం. పిల్లలకు రోజుకు ఎనిమిది గంటల చదువు. రెండు గంటలు రాత. మిగిలిన సమయం చేతిపని. ఆరునుండి పదహారు వయసుగల విద్యార్థులుండేవారు. ఉదయం పదిన్నర నుండి నాలుగు దాకా తరగతులను భాయే విద్యార్థులకు తీసుకునేవారు. సోమవారం నుండి శనివారం దాకా గురు-శిష్యులకు ఉప్పు,పప్పు, కూరగాయలు ఉండవు. పళ్ళు, ముఖ్యంగా అరటి పళ్ళు-ఆపిలు తినడం, వాటితో పాటు బ్రెడ్, ఆలివ్ నూనె, అన్నం, సాగూ గంజి. సాయంత్రం ఐదున్నర కల్లా భోజనం. వారానికొకసారి గాంధీ భాయి జొహాన్స్‌బర్గ్‌కు వెళ్ళివచ్చేవారు.

సత్యం, నిర్భయత్వం, పేదరికం(సరళత) ఈ మూడు విలువలను అలవాటు చేసుకోవాలని భాయి చెప్పేవారు. చిమ్మడం, తుడవడం, నీళ్ళు తేవడం లాంటి పనులు అమూల్య క్రియలు: అవి వ్యక్తియొక్క మానసిక, సామాజిక, నైతిక పెరుగుదలకు, వ్యక్తిత్వం రూపొందడానికి అత్యవసరం అని చెప్పేవారు. తాము చేస్తూ ఇతరుల నుండి చేయించేవారు.

కార్డస్ అని ఒక ఫాదర్ ఆశ్రమంలో ఉండడానికి వచ్చారు. మిగతా ఫాదర్‌ల మాదిరిగా లేరు ఆయన. థియొసొఫిస్ట్ అనో ఏమోగా మారి క్రైస్తవ మతాన్ని వదిలేసారు. మిగతా తెల్లవాళ్ళతో పాటు ఉండడానికి కుదిరేది కాదు. గాంధీభాయికి చాలా ఆత్మీయులయ్యారు. ఆయన మా ఇళ్ళ వద్ద తమ బిడారాన్ని తామే కట్టుకున్నారు. భాయి మాదిరిగానే ఏ పనైనా చేసేవారు. పిల్లలతో చాలా మాట్లాడేవారు. మా పిల్లలకు ఇంగ్లీషు చెప్పేవారు. నాతో మాట్లాడాలని ఉండేది ఆయనకు. కానీ నేను ఆయన ఎదుటకు వెళ్ళేదాన్ని కాదు. భోజనాల టేబల్ పైన ఆయన ఎదుట కూర్చుని తినేది నాకు నచ్చేది కాదు.

ఇలా భాయి కొంతకాలం రాజకీయాల నుండి దూరంగా ఉండి మా అందరితో పాటు ఉంటూ, చదువుతూ రాస్తూ, ఆశ్రమ జీవితాన్ని మెరుగుపరచే విధంగా ఆలోచిస్తూ, లాయరుగిరి చేస్తూ ఉండిపోయారు. ఉత్తరాలు రాస్తూ, పత్రికలకు రాస్తూ, వచ్చినవాళ్ళను కలుస్తూ, చర్చలు చేస్తూ, ధార్మిక గ్రంథాలను చదువుతూ ఉన్నారు. ఆయన దృష్టిలో పడడానికి, దగ్గరవడానికి ఆశ్రమంలో పోటీ నడుస్తున్నట్టుండేది. ఆయన పెట్టిన నియమాలను ఆయన కంటే ఎక్కువగా పాటించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ పోరాటానికి దిగాల్సిన ఒక సందర్భం వచ్చింది. ఇంతవరకు సంగ్రహించిన శక్తినంతా ధారపోసి మళ్ళీ పోరాడేటట్టు చేసిందది.

1911 సుమారు అనుకుంటాను: బయటి దేశాలనుండి వచ్చేవారు కుటుంబాన్ని తీసుకొచ్చేటప్పుడు భార్యను మాత్రం తీసుకు రావాలి, అలాగే ఆమె తన భార్యేననడానికి పెళ్ళి సర్టిఫకేట్ తీసుకురావాలి అనే చట్టం వచ్చింది. విచిత్రం అనిపిస్తుంది కదూ! హిందుస్తాన్‌లో భార్య అనడానికి ఏ ప్రమాణపత్రం ఉంటుంది? మెడలో తాళీ, తోడుగా భర్త, చేతిలోని పిల్లలే మా సర్టిఫికేట్. కానీ, బ్రిటిష్ వాళ్ళు అన్నిటికీ కాయితాలు అడిగారు. పెళ్ళి ప్రమాణ పత్రం లేకపోతే, ‘ఉంచుకున్నది’ అని పరిగణిస్తామన్నారు. ఆ పదం వినగానే నాకు ఎంత మండుకొచ్చిందంటే, “అదెవరు మమ్మల్ని ఉంచుకున్నదాని స్థాయికి దిగజార్చేవారు? పదండి, నేను కూడా సత్యాగ్రహం చేస్తాను, జైలుకు వస్తాను” అనేశాను.

చూడమ్మాయ్ ! ఏదైనా కానీ, మన క్రిందికి వచ్చేదాకా దాని వేడి అర్థం కాదు. దీనికి నేనే సాక్షిని. బహుశా దేవదాసు పుట్టిన తరువాత ఉండచ్చు . ఒకసారి నా అలంకారం, సింగారం గురించి చర్చ వచ్చింది. గాంధీ భాయి సూచ్యంగా చెప్పినా కూడా నేను నా బంగారాన్ని తీయడానికి ఇష్టపడలేదు. పన్నెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను అన్నిటికీ, జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను. డబ్బులు సమకూర్చడానికి నా నగలను ఇవ్వడానికి సిద్ధమయ్యాను. ఇంత వరకూ మేమిద్దరం భార్యాభర్తల్లా కాపురం చేసింది చట్టానికి లెక్కకు రాదంటే, మాది పెళ్ళే కాదు, మేము దంపతులమే కాదు అంటే ఎలా ఊరుకునేది? గాంధీ భాయితో నేను జైలుకు వస్తాను అన్నాను.

నా ఉత్సాహం భాయికి చాలా సంతోషం కలిగించింది. ఇదొక్కటే కాదు, భారతీయులకు వ్యతిరేకంగా ఇలాంటి అన్యాయమైన అన్ని చట్టాలను వెనిక్కి తీసుకోవాలని ఉద్యమం ప్రారంభమయ్యింది. వేలాది భారతీయులు చట్టాన్ని ఉల్లంఘించి సరిహద్దు దాటడానికి కాలి నడకన బయలుదేరాము.

ఒక సమయం – సందర్భాన్ని పురస్కరించుకుని భక్తాదులు ఒక ఊరినుండి దేవుడి మహిమగల నేలకు శ్రద్ధా భక్తులతో ఊరేగింపుగా వెళ్తారు. దిండి అంటారు దాన్ని. మాది కూడా ఒక రకమైన దిండి అది. 1913 అనుకుంటాను. నటాల్ న్యూ క్యాసల్ నుండి ట్రాన్స్‌వాల్ సరిహద్దు టాల్‌స్టాయ్ ఆశ్రమం వరకు కాలి నడకన యాత్ర జరిగింది. ఎవరి అనుమతి కూడా తీసుకోకుండా ప్రాంతాల నడుమ భారతీయ కూలీలు వెనుక ముందూ నడిచారు. తంబి నాయుడు- హెన్రి-కలెన్-మిలి-సోన్యా-వెస్ట్ లాంటి తెల్లవాళ్ళు, ఇంకా ఎందరెందరో భాయి స్నేహితులు యాత్ర విజయానికి పగలనక, రాత్రనక కష్ట పడ్డారు. అంత దాకా దక్షిణ అఫ్రికాలో ఉన్న ఎంతో మందికి, మనవాళ్ళకూ, ఇలాంటి ఒక ప్రయత్నం సాధ్యం అని అనిపించనేలేదు. ఈ ఆలోచన భాయికి తట్టడమే కాదు, పగలనక రాత్రనక కష్టపడి, వెంటపడి తనకు వచ్చిన ఆలోచనను కార్య రూపంలోకి వచ్చేట్టు చూసుకున్నారు.

ఈ సత్యాగ్రహం ప్రారంభం కాకముందు భాయి ఒక వారం ‘ఆత్మశుద్ధి’ ఉపవాసాన్ని చేశారు. తరువాత మొత్తం పదిహేడు సార్లు ఉపవాసం చేసుండొచ్చు. ఇది ఆయన మొదటి ప్రయత్నం. ఇలా చేయడానికి వీలవుతుంది అని తెలియచెప్పిన ఉపవాసం ఇది. మేమప్పుడు టాల్‌స్టాయి ఫార్మ్‌లో ఉన్నా ఫీనిక్స్ ఫార్మ్‌లో ఈ ఉపవాసం జరిగింది. నాకనిపించేది ఆ ఉపవాస దీక్షలోనే ఆయన దక్షిణ ఆఫ్రికాలో మాకు మిగిలిన పనులు, దాన్ని తీవ్రతరం చెయ్యడానికి మార్గాలు, తిరిగి వెళ్ళిపోయేది ఎప్పుడు అని నిర్ణయించుకున్నారు.

కాలినడక సత్యాగ్రహం ప్రారంభమవడానికి ముందు రెండూ ప్రాంతాల భారతీయులు, వారి సంఘాలు, భారతీయ నాయకులు, తెల్ల స్నేహితులు, లాయర్లు, వ్యాపారులు, స్థానిక ప్రభుత్వం ఇలా అందరితోనూ రోజుల కొద్దీ చర్చలు జరిగాయి. ఆడవాళ్లతో నేను, మిలి, సోన్యా మాట్లాడాము. అక్టోబర్ నెలాఖరు, 29న యాత్ర ప్రారంభమయ్యింది. ముందుగా టాల్‌స్టాయ్ ఆశ్రమం ఆడవాళ్ళు ట్రాన్స్‌వాల్ సరిహద్దు దాటి నటాల్ న్యూ కాసల్ గని ప్రదేశాన్ని చేరారు. గని శ్రామికులు సమ్మెలో ఉన్నారు. వారూ మాతో చేరిపోయారు. చివరికి అంత కలిసి నటాల్ చార్ల్స్ టౌన్ నుండి ట్రాన్స్‌వాల్ సరిహద్దు వైపు నవంబర్ 6 వ తేదీన ఉండాలి. బయలుదేరాము. ఊళ్ళో దీపావళి సంబరాలు, మాకేమో పోలీసుల లాఠీ దెబ్బలు.

మొత్తం 127 ఆడవాళ్ళు, 57 మంది పిల్లలు, 200 మగవాళ్ళు నడిచాము! అదెంత మందో కష్టపడి ఈ ప్రణాళికను తయారు చేశారు. రోజుకు 24 మైళ్ళు నడిచేవాళ్ళము. రెండువేల మంది కలిసి నడవడం అంటే మాటలు కాదు.

అమ్మాయ్! ఇలా ఒకసారి కళ్ళు మూసుకుని నిన్ను నువ్వు ఈ యాత్రలో ఉన్నట్టు ఊహించుకో. రోజూవారి పనులు, ఇంట్లో ఉన్న రక్షణ, సుఖాలనన్నిటినీ వదులుకుని అంత మంది ప్రజలు ఎందుకలా నడిచారు అనేది అర్థమవుతుంది. దార్లో దొరికిన మసీదుల్లో, నదీ తీరాల్లో, పాఠశాలల్లో రాత్రి ఉండేవాళ్లం. ఆయా ఊళ్ళ భారతీయులో లేదా సానుభూతిపరులైన వ్యాపారులో భోజనం, ఫలహారం, నీళ్ళు, ఉండడానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. కొన్ని సార్లు అవేమీ దొరక్కుండా బ్రెడ్డు, పళ్ళు తిని నడిచాము. పాటలు, సంభాషణలు, ప్రార్థనలు, నినాదాలు, మధ్య మధ్యలో సముదాయ- వృత్తి- ప్రాంతాల భారతీయ నాయకులు మాట్లాడేవారు. అలసిపోయినా కానీ అందరూ ఉత్సాహంతో నడుస్తూనే వెళ్ళారు. గాంధీ భాయి యాత్రకు వెనుక ఉండేవారు. అందరి తలల పైన, చంకల్లో బుట్టలు, సంచులు ఉండేవి. ఆడవాళ్ళ చేతుల్లో పిల్లలుండేవారు. ఎవరో ఒక దేశబంధు అందరికీ బూట్లు ఇప్పించారు. కానీ బూట్లు తొడిగి అలవాటు లేని భారతీయ కూలీలు బూటు లేసులను ముడి వేసి భుజం మీద మోస్తూ ఉత్తకాళ్ళతోనే నడిచారు. అందరి మనసుల్లోని కోపం, కడుపులో రగిలే మంట కాళ్ళకు బలాన్నిచ్చాయి.

యాత్రకై మేమే విధించుకున్న కొన్నినియమాలు ఉండేవి. వాటి ప్రకారం సత్యాగ్రహులెవ్వరూ మద్యం సేవించరాదు. బీడీలు లాంటి వ్యసనాలకు డబ్బు ఖర్చు చెయ్యరాదు. ఎవరినీ అడుగరాదు. దొంగతనం, మోసం, వ్యభిచారం చెయ్యకూడదు. గాంధీభాయిని మధ్యలో బంధించినా కానీ మిగిలిన నాయకుల నేతృత్వంలో నడవాలి: పోలీసులతో గొడవ పడకూడదు: వాళ్ళు కొట్టినా, తన్నినా సహించుకోవాలి, శాంతితో మెలగాలి: రాత్రి బిడారం వేసిన చోట గలీజు చెయ్యరాదు, నడకలో రోడ్డు పక్కన స్వచ్ఛతను పాటించాలి అని మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్పేవాళ్ళు. ప్రతిజ్ఞలా అందరితో చెప్పించేవారు.

వేలకొలది ప్రజలు, రోజుల కొద్దీ హక్కులను అడుగుతూ నడిచిన, అంతవరకూ ఏ దేశం కూడా కనరాని, వినని ఈ సంఘటనకు విశ్వమే ఉలిక్కి పడింది. దాన్నిఆపాలని ఏవేవో వ్యూహాలు, ప్రయత్నాలు చేశారు. కానీ ‘కూలీ’లలో ఎంతటి ఆవేశం కనిపించిందంటే, వారు తమకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలన్నిటినీ రద్దు చేసేవరకూ నడుస్తామని చెప్పారు. మధ్యలో పోలీసులు వచ్చారు. సేన వచ్చింది. తుకడీలు వచ్చాయి. సరిహద్దు దగ్గరికి వచ్చినప్పుడు భాయి, కలెన్, హెన్రి, తంబి, మిలి, సోన్యాలు ముందు ముందు నడిచారు. తొమ్మిదవ రోజు భాయిని బంధించారు. వెంటనే హెన్రి, కలన్‌లు వెళ్ళి బెయిల్ తెచ్చారు. బెయిల్ దొరకగానే అందరూ కారులో వచ్చి, పరిగెడుతూ యాత్రలో చేరుకున్నారు. భాయిని మళ్ళీ బంధించారు. మళ్ళీ విడుదలయ్యారు. మళ్ళీ బంధించారు. పోలీసుల బలమైన అడ్డుగోడను దాటి వేలకొలది ప్రజలు ట్రాన్స్‌వాల్ సరిహద్దు దాటారు. సరిహద్దుకివతల నేను, మిగిలిన ఆడవాళ్ళు బంధించబడి జైలుకు వెళ్ళాము. మిగిలన వాళ్ల నేతృత్వంలో యాత్ర ముందుకు వెళ్ళింది. పన్నెండవ రోజు సరిహద్దు దాటినాక యాత్ర ముగిసింది. కానీ ప్రతిఘటన ఆగలేదు. సరిహద్దు దాటినాక వేర్వేరు రీతుల్లో సత్యాగ్రహం కొనసాగింది. జైలు, విడుదల, ఉత్తరాల వ్యవహారం, ఉపవాసం కొనసాగాయి.

మనవాళ్ళు తిరగబడ్డారు. అరెస్టు, లాఠీ చార్జ్ లను వ్యతిరేకించి మిగతా ఊళ్ళలో హర్తాళ్ళు జరిగాయి. చాలా మందికి దెబ్బలు తగిలాయి. కొందరు మృతిచెందారు. వేల కొలది ప్రజలు జైళ్ళకు వెళ్ళారు. బెయిల్ లేకుండా భాయి, ఇతరులను బంధించారు. అంత సేపటికి ఆయన మూడు నాలుగు సార్లు జైలుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఒక పూట భోజనం మానేసి సత్యాగ్రహం కొనసాగించారు. సత్యాగ్రహులంతా ఒక పూట భోజనం మానేసి యాత్రలో ఉన్నవారికి మద్దతునివ్వలని పిలుపునిచ్చారు.

మా పత్రిక ‘ఇండియన్ ఒపీనియన్’ దీన్నంతిటినీ వివరంగా నివేదికనిచ్చింది. దక్షిణ ఆఫ్రికా ఉత్త తెల్లవాళ్ళ రాజ్యం కాకూడదని భాయి పత్రికలో రాశారు. సుమారు 50 వేల గని కార్మికులు సమ్మె చేశారు. వారితో పాటు చక్కెర ఫ్యాక్టరి, హోటళ్ళు, మార్కెట్లలోని పనివాళ్ళంతా పని ఆపేసి సమ్మె చేశారు. అన్నిచోట్లా పని వాళ్లు లేక ఉత్పాదన, పంపకం ఆగిపోయింది. ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు కరువయ్యారు. ఆ దేశంలో వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే పని చేసుకోవడం తక్కువ. ఇంటి చాకిరీకి నల్లవాళ్ళో, సేవకులో, పేదవారో ఉండి తీరాలి. అక్కడ నల్లవాళ్ల వద్ద సూక్ష్మంగా, క్రమశిక్షణతో పని చేయించడం కష్టం అని భారతీయులని పనులకు పెట్టుకునేవారు. విధేయులుగా, పదే పదే ఊరికి కూడా వెళ్ళకుండా తన వంతు పనులను చేస్తున్న మనవాళ పైన అక్కడి ఆడవాళ్లకు ఎక్కడలేని ఇష్టం. కాస్త దుబారా అనిపించినా భారతీయులనే పెట్టుకునేవారు. సత్యాగ్రహం వల్ల వారందరూ కష్టపడసాగారు.

ఇవన్నీ జరిగేటప్పుడు భాయి తన కార్యదర్శి సోన్యా ద్వారా నిరంతరం తమ గురువు గోపాలకృష్ట గోఖలే గారితో సంపర్కం పెట్టుకున్నారు. ఆయన సలహాల మేరకే తమ ముందడుగులను నిర్ణయించేవారు. రోజుకు రెండు మూడు టెలిగ్రాంలు ఆయన నుండి వచ్చేవి. భాయి కూడా పంపేవారు. అప్పటికి గాంధీ భాయి తమ ఐరోపా దుస్తులను వదిలివేశారు. పాలు వాడడం మానేశారు. పచ్చి పళ్ళు, ఎండు పళ్ళు తిని బ్రతకడానికి ప్రారంభించారు. ఆయనంత కాకపోయినా నేను కూడా రంగుల చీరలు, భారీ నగలు వదిలేశాను. నా వద్ద ఉన్నవి కూడా తక్కువే. నగలన్నీ భర్త బ్యారిస్టర్ అవడానికి కరగిపోయాయి. కొత్తగా భారీ చీరల సంగ్రహం పెరగలేదు. పత్తి బట్టల చీరలనే ధరించసాగాను.

అక్కడ భారతదేశంలోకూడా దక్షిణా అఫ్రికాలో జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్ర ప్రతిక్రియలు వ్యక్తమవసాగాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అక్కడి పత్రికలు, సంఘటనలు, వ్యక్తులూ చాలా జాగ్రత్తగా గమనించసాగారు. పోరాడే కుటుంబాలకు సహాయ పడడానికి నిధులను పోగు చెయ్యడం ఆరంభమయ్యింది. కవి రవీంద్రనాథ టాగోర్ గారు, గోపాలకృష్ణ గోఖలేగారు, మద్రాసు బిషప్, వైస్రాయ్ అయిన లార్డ్ హార్డింగ్, పోరుబందర్ బ్రిటిష్ ఏజంట్‌తో పాటు చాలా మంది నిధులకు తమ వంతు డబ్బులిచ్చారు. మేమెప్పుడూ ఆంధ్రకు వెళ్లలేదు. పదేళ్ళయింది భారతదేశానికి వచ్చి వెళ్ళి. కానీ ఈ ఉద్యమం గురించి ఒక తెలుగు నాటకం తయారయిందని వార్త వచ్చింది. అన్ని చోట్ల నిధులు సేకరించి దక్షిణ ఆఫ్రికా భారతీయులకు డబ్బుపంపారు.

భాయి నాలుగు సార్లు జైలుకు వెళ్ళొచ్చారు. నేను రెండు సార్లు వెళ్ళొచ్చాను. అప్పటికి ఒక ఫాదర్ మా వద్దకు వచ్చారు, చార్లి ఆండ్రూస్ అని ఆయన పేరు. చూడ్డానికి, ఆచారవిచారాలలో సాధువుల మాదిరిగానే ఉన్నారు. గోఖలేగారి స్నేహితులు, బ్రిటిష్ రాణివద్ద, ప్రభుత్వంతో ఎప్పుడూ మన తరుఫున వాదించేవారు. పత్రిక వెలువడడానికి సహాయపడేవారు. ఆయన గోధుమ- తెల్ల రంగుల వాళ్ల మధ్య వారధిలా ఉండేవారు. బాపు అహింస, క్రైస్తవ తత్త్వానికి దగ్గరగా ఉంది అని మెచ్చుకున్నారు. ఎవరూ కూడా భాయిని ఆయన పేరుతో పిలిచేవారు కాదు. ఆయనొక్కరే మోహన్ అని పిలిచేవారు. ఆయనను భాయి చార్లీ అని పిలిచేవారు. అంత స్నేహం వారిది. దక్షిణ ఆఫ్రికా పోరాటం ముగించి భారతానికి రావాలని, జాతీయ ఆందోళనలొ పాల్గొనాలని భాయిని ఒప్పించడానికి ఆండ్రూస్ గారిని గోఖలేగారు దక్షిణ ఆఫ్రికాకు పంపారు. ఆయన మా ఆశ్రమంలోనే ఉండిపోయారు.

ఆండ్రూస్ గారు దక్షిణ ఆఫ్రికాలోని తెల్లవాళ్లను, బ్రిటిష్ ప్రభుత్వాధికారులను కలిశారు. ఆయనే కాదు, చాలా మంది తెల్లవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా మాతో పాటే ప్రాణాలకు తెగించి పోరాడారు. దక్షిణాఫ్రికాలో ఉన్న కొంతమంది భారతీయ కూలీల నియంత్రణకు ఏవేవో చట్టాలు తెస్తే, భారత దేశపు 30 కోట్ల జనాలను రెచ్చగొట్టినట్లవుతుందని దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి తట్టింది. చివరికి 1914 జనవరి సమయానికి భాయి ఒక ఒప్పందానికి సంతకం చేశారు. మూడు పౌండ్ల ప్రత్యేక చట్టం రద్దయింది. నమోదు చట్టం వెనక్కి తీసుకోబడింది.

ఇక ఇక్కడ మా పని అయిపోయింది అనిపించింది. 1914 జూలైలో దక్షిణ ఆఫ్రికా వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మాకు వీడ్కోలు పలకడానికి డర్బాన్‌లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా? జనరల్ స్కూట్స్, జనరల్ బోథా. వారిద్దరూ భాయిని తమ శత్రువు అని తలచినవారు. వారితోపాటు నటాల్ భిషప్ కూడా ఉన్నారు. అందరూ భాయిని, ఆయన పోరాటాన్ని కొనియాడారు. స్కూట్స్ అయితే భాయి పోరాటం చేస్తున్నన్ని రోజులూ తను మునివేళ్ళ పైన జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here