[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
హ్రియమాణా తు వైదేహీ కంచిన్నాథమ్ అపశ్యతీ।
దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానర పుంగవాన్॥
తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనకప్రభమ్।
ఉత్తరీయం వరారోహా శుభాన్యాభరణాని చ।
ముమోచ యది రామాయ శంసేయురితి మైథిలీ॥
(అరణ్యకాండ, 54. 1,2)
ఒక పర్వత శిఖరముపై ఐదుగురు వానర ప్రముఖులు ఆమె కంటబడ్డారు. వెంటనే సీతాదేవి కొన్ని ఆభరణములను పట్టు ఉత్తరీయమున మూటగట్టి వారి మధ్యలో పడునట్లుగా పడవేసెను. శ్రీరాముడు వారిని కలుసుకుంటే వాళ్ళు ఆయనకు చూపించగలరని ఆమె భావించింది.
173. శ్లో.
వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణమ్।
సంభ్రమాత్తు దశగ్రీవః తత్కర్మ న స బుద్ధవాన్॥
(అరణ్యకాండ, 54. 3)
సీతాదేవి తన ఆభరణములను వస్త్రమున మూటగట్టి పడవేసిన విషయమును లంకకు వెళ్ళెడి తొందరలో రావణుడు గమనింపనే లేదు.
శ్లో.
నానాప్రహరణాః క్షిప్రమ్ ఇతో గచ్ఛత సత్వరాః।
జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయమ్॥
తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహతరాక్షసే।
పౌరుషం బలమాశ్రిత్య త్రాసమ్ ఉత్సృజ్య దూరతః॥
బలం హి సుమహద్యన్మే జనస్థానే నివేశితమ్।
సదూషణఖరం యుద్ధే హతం రామేణ సాయకైః॥
తత క్రోధో మమామర్షాత్ ధైర్యస్యోపరి వర్తతే।
వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణమ్॥
నిర్యాతయితుమిచ్ఛామి తచ్చ వైరమహం రిపోః।
న హి లప్స్యామ్యహం నిద్రామ్ అహత్వా సంయుగే రిపుమ్॥
తం త్విదానీమహం హత్వా ఖరదూషణఘాతినమ్।
రామం శర్మోపలప్స్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః॥
జనస్థానే వసద్భిస్తు భవద్భీరామమాశ్రితా।
ప్రవృత్తిరుపనేతవ్యా కింకరోతీతి తత్త్వతః॥
అప్రమాదాచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరైః।
కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి॥
యుష్మాకం చ బలజ్ఞోహం బహుశో రణమూర్ధని।
అతశ్చాస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః॥
(అరణ్యకాండ, 54. 20-28)
రావణుడు ముందుగా సీతాదేవిని తన అంతఃపురానికే తీసుకొని వెళ్ళాడు. తన అనుమతి లేకుండా ఏ స్త్రీ గాని పురుషుడు గానీ చూడరాదన్నాడు. ఎవరైనా అప్రియంగా మాట్లాడితే ప్రాణాలు మిగలవన్నాడు. ఆ తరువాత ఎనిమిది మంది రాక్షస యోధులతో ఇలా అన్నాడు:
రావణుడు: సాయుధులై వెంటనే జనస్థానానికి వెళ్ళండి. అది ఇది వరకు ఖరునిది. అక్కడ మనవాళ్లందరూ హతులై అది శూన్యంగా ఉంది. మీరు నిర్భయంగా అక్కడ ఉండండి. మన మహా సైన్యం అక్కడ హతమవటం నన్ను బాధపెడుతోంది. క్రోధం పెరిగి రామునిపై బద్ధ వైరం పెరుగుతున్నది. పగ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ రాముని ఇప్పుడే హతమార్చి తృప్తి పడాలనుకుంటున్నాను.
జనస్థానములో రాముని కదలికల గురించి పూర్తి సమాచారం ఇవ్వండి. రాముని వధించుటకై నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి.
ఇది ఎంతో కీలకమైన మాట!
రావణుని వ్యూహంలో సీతాపహరణం ఒక భాగం. శ్రీరాముని బలహీనపరచటం, అతని భార్యను అపహరించి సవాలు చేయటం, అన్నదమ్ముల మీద నిఘా పెట్టటం, అన్నీ వ్యూహాత్మకంగానే కనిపిస్తాయి. సీతాపహరణం అనేది ఒక్కటే రావణుని ధ్యేయం కాదు.
174. శ్లో.
దశ రాక్షసకోట్యశ్చ ద్వావింశతి రథాపరాః।
తేషాం ప్రభురహం సీతే! సర్వేషాం భీమకర్మణామ్॥
వర్జయిత్వా జరా వృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్।
సహస్రమేక మేకస్య మమ కార్యపురస్సరమ్॥
(అరణ్యకాండ, 55. 14,15)
రావణుడు సీతాదేవితో: నా ఆధీనంలో ముప్పది రెండు కోట్ల మంది రాక్షస యోధులు గలరు. వేయి మంది రాక్షసులు నా ఒక్కని సేవలోనే ఉంటారు!
శ్లో.
అశోకవనికామధ్యే మైథిలీ నీయతామియమ్।
తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారితా॥
తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాంత్వైశ్చ మైథిలీమ్।
ఆనయధ్వం వశం సర్వా వన్యాం గజవధూమివ॥
(అరణ్యకాండ, 56. 30, 31)
రావణుడు సీతకు ఎన్నో విషయాలు చెప్పాడు. అతని మాటలు లెక్క చేయనందున రాక్షస స్త్రీలను ఇలా ఆజ్ఞాపించాడు.
ఈ మైథిలిని అశోకవనానికి తీసుకుని వెళ్ళి అక్కడ మధ్యభాగంలో చుట్టూ చేరి కాపలా కాయండి. భయపెడుతూ, మరల ఓదారుస్తూ అడవిలోని ఒక ఆడ ఏనుగును వలె వశపరుచుకుని దారిలోకి తీసుకుని రండి.
తన కార్యానికీ, కోరిక నెరవేరటానికీ అందరికీ పని పెట్టాడు ఈ రాక్షసరాజు.
175. శ్లో.
సుకుమారీ చ బాలా చ నిత్యం చా దుఃఖదర్శినీ।
మద్వియోగేన వైదేహీ వ్యక్తం శోచతి దుర్మనాః॥
(అరణ్యకాండ, 58. 12)
శ్రీరాముడు లక్ష్మణుడితో: సుకుమారీ, బాల (అమాయకురాలు) ఐన సీత వనవాస క్లేశములను అనుభవిస్తూ నా ఎడబాటు వలన ఇంకా చింతాక్రాంతురాలై యుండవచ్చును.
176. శ్లో.
శోకం విముంచార్య! ధృతిం భజస్వ
సోత్సాహతా చాస్తు విమార్గణేస్యాః।
ఉత్సాహవంతో హి నరా న లోకే
సీదంతి కర్మస్వతిదుష్కరేషు॥
(అరణ్యకాండ, 63. 19)
శ్రీరాముడు సీతాదేవిని గుర్తు చేసుకుంటూ బహుధా విలపించునప్పుడు లక్ష్మణుడు చెప్పిన మాట:
ఓ పూజ్యుడా! శోకమును వీడుము. ధైర్యమును వహింపుము. నిరాశపడక వదినెనను ఉత్సాహముతో వెదకవలెను. లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్టకార్యముల యందైనను క్రుంగిపోరు.
శ్లో.
తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచ హ।
క్వ సీతేతి నిరీక్షన్ వై బాష్పసంరుద్ధయా దృశా॥
ఏవముక్తా నరేంద్రేణ తే మృగాః సహసోత్థితాః।
దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతో నభః స్థలమ్॥
క్వ సితేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః।
దర్శయంతి క్షితిం చైవ దక్షిణాం చ దిశం మృగాః॥
సాధు గచ్ఛావహే దేవ! దిశమేతాం హి నైఋతీమ్।
యది స్యాదాగమః కశ్చిత్ ఆర్యా వా సాథ లక్ష్యతే॥
(అరణ్యకాండ, 64. 17, 18, 22, 23)
శ్రీరాముడు అక్కడ మృగాలను చూసి ‘సీత ఎక్కడ?’ అని అడిగెను. కన్నీరు కారుస్తూ మసకబారిన దృష్టితో తమవైపే చూస్తూ శ్రీరాముడు అలా అడుగగా ఆ మృగాలన్నీ వెంటనే లేచి దక్షిణ దిశకు మరలి ఆకాశం వైపు చూడటం ప్రారంభించాయి.
లక్ష్మణుడు: ఓ పూజ్యుడా! ‘సీత ఎక్కడ?’ అని అడగగానే ఇవన్నీ వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గాన్ని చూపిస్తున్నాయి. అందుచేత మనం నైరుతి దిశగా వెళదాము. అలా చేస్తే సీతాదేవి కనబడవచ్చును. లేదా ఆమెను కనుగొను ఉపాయమైనను దొరకగలదు.
శ్లో.
భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ!।
కే హి లోకే ప్రియం కర్తుం శక్తాః సౌమ్య! మమేశ్వరాః॥
కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినమ్।
అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ!॥
(అరణ్యకాండ, 64. 55, 56)
శ్రీరాముడు: ఓ లక్ష్మణా! సీతాదేవి అపహరింపబడుటయో? లేక భక్షింపబడుటయో జరిగియుండును. ఇంతటి అప్రియమును చేయు మొనగాడెవరు? సర్వేశ్వరుడు సమస్త లోకములను సృష్టించి, పాలించి, లయము చేయగల సమర్థుడేయైననను, ఆ దయాళువు కొన్ని సందర్భములలో ఆపన్నుల యెడ మౌనము వహించును. ఆ సమయంలో ఆ సర్వేస్వరుని గురించి లోకులు చులకనగా మాట్లాడుతారు.
శ్లో.
నిర్మర్యాదాన్ ఇమాన్ లోకాన్ కరిష్యామ్యద్య సాయకైః।
హృతాం మృతాం వా సౌమిత్రే! న దాస్యంతి మమేశ్వరాః॥
తథారూపాం హి వైదేహీం న దాస్యంతి యది ప్రియామ్।
నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్॥
ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో రామో నిష్పీడ్య కార్ముకమ్।
శరమాదాయ సందీప్తం ఘోరమాశీవిషోపమమ్॥
సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పరపురంజయః।
యుగాంతాగ్నిరివ క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్॥
యథా జరా యథా మృత్యుః యథా కాలో యథా విధిః।
నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ!।
తథాహం క్రోధసంయుక్తో న నివార్యోస్మి సర్వథా॥
పురేవ మే చారుదతీమ్ అనిందితాం
దిశంతి సీతామ్ యది నాద్య మైథిలీమ్।
సదేవగంధర్వమనుష్యపన్నగం
జగత్ సశైలం పరివర్తయామ్యహమ్॥
(అరణ్యకాండ, 64. 71-76)
శ్రీరాముడు సీతాదేవి కనిపించకపోయినప్పుడు శోకం, ఆగ్రహం, క్రోధంతో పలికిన మాటలు:
ఓ సౌమిత్రీ! నా ప్రేమ పెన్నిధి యైన సీత అపహరణకు గురియైనను, మృత్యువు పాలయైనను ఆమెను దేవతలు సురక్షితముగా నాకు అప్పగించనిచో నా బాణ పరంపరకు గురి చేసి ఈ లోకములను అన్నింటిని అస్తవ్యస్తం చేస్తాను. సీతాదేవి భద్రముగా నన్ను చేరనిచో ఈ సమస్త చరాచర జగత్తును రూపుమాపుతాను.
వెంటనే కళ్లెర్ర జేసి ధనుస్సును గట్టిగా పట్టుకొని విషసర్పము వలె భయంకరమైన, పదునైన బాణములను చేతబట్టాడు. అప్పుడు ప్రళయ కాలాగ్ని వలె కనిపించాడు. మరల ఇలా అన్నాడు:
సమస్త ప్రాణులను ముసలితనము, మృత్యువు, కాలము, విధి కబళిస్తూ ఉంటాయి. వాటిని ఎవ్వరు నిరోధింపజాలరు. నాకు క్రోధము వచ్చినప్పుడు అలాగే నన్ను ఎవ్వరూ ఆపలేరు.
పూర్వము సాధ్వీమణి సీతాదేవి – చక్కని పలువరుసతో దర్శనీయంగా ఉండేది. ఇప్పుడు అట్టి వైదేహిని నాకు అప్పగించనిచో, దేవతలతో, గంధర్వులతో, మానవులతో, నాగులతో, పర్వతములతో విలసిల్లుచుండెడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును.
(ఇంకా ఉంది)