అలనాటి అపురూపాలు-157

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి బీనా రాయ్ మనోగతం:

తన భర్త ప్రేమ్ నాథ్ గురించి, తమ వైవాహిక జీవితం గురించి నటి బీనారాయ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

ప్రేమ్‍ నాథ్ గారితో పెళ్ళయ్యాక బీనా రాయ్ సినిమాలు మానేశారు. అయితే సినిమాలు మానేయమని తన భర్త ఎన్నడూ చెప్పలేదని అన్నారు. “తీరిక లేని కెరీర్‌ని, ఇంటి బాధ్యతలని ఒకేసారి చక్కబెట్టుకోవడం కష్టం. మా ఆయన నిర్ణయం నాకే వదిలేశారు. ఇంట్లో ఉండమని గానీ, స్టూడియోలకి వెళ్ళమని గాని ఆయన చెప్పలేదు. నా నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను.”

మొదట్లో తాను, తన భర్తా ఇద్దరూ నటిస్తూ – కుటుంబాన్ని నిర్వహిస్తూ, పిల్లలని చూసుకున్నామనీ, కానీ కొన్నాళ్ళకి అంతా గందరగోళమై, – ‘వల్లాహ్ క్యా బాత్ హై’ సినిమా తరువాత తాను యాక్టింగ్ కెరీర్‌కి వీడ్కోలు పలికానని బీనా రాయ్ తెలిపారు. “కొంత కాలం నేనూ మావారు గట్టిగానే ప్రయత్నించాం, ఎవరో ఒకరం ఇంట్లో ఉండేలా చూసుకున్నాం. అప్పట్లో ఆయన కెరీర్ బావుండేది, నాదీ ఓ మాదిరిగా ఉండేది. చివరికి నేనే త్యాగం చేశాను. ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.”

కెరీర్‍లో ఉచ్చస్థితిలో ఉండి, అప్పట్లో ఒక్కో సినిమాకి లక్షన్నర రూపాయల పారితోషికం తీసుకుంటున్న నటికి – సినిమాలు మానేయడమంటే – అదో బృహత్ నిర్ణయం! వెండి తెర మీద బీనా రాయ్ ప్రకాశమది. చిన్నప్పటి నుంచి నటి అవ్వాలని కోరుకున్నారామె. అందరు సినీ దిగ్గజాల మాదిరే, బీనా రాయ్‍ ప్రస్థానం అంత సాఫీగా సాగలేదు. ప్రతిభాశాలియైన బీనా నిరాహార దీక్ష చేస్తానని బెదిరించి, నటించేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందారు. అలకలు, బెదిరింపులు, రాజీల అనంతరం – తమ చిన్నారి కూతురు ఆమె స్వప్నాలను సాకరం చేసుకోనేందుకు అంగీకరించారు అమ్మానాన్నలు.

తన భర్త ప్రేమ్ నాథ్, నటి మధుబాలల ప్రేమ గురించి అడినప్పుడు బీనా ఒక్క క్షణం కూడా సంకోచించలేదు. కొన్ని పదునైన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఒకప్పుడు – మధుబాలతో పీకల లోతు ప్రేమలో మునిగిపోయారని – బీనా ఒప్పుకున్నారు, వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారనీ తనకి తెలుసన్నారు. కానీ మతపరమైన విభేదాల వల్ల ప్రేమ్ నాథ్ గారి తండ్రి – ముస్లిం యువతినికి కోడలిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు. ప్రేమ్ నాథ్, మధుబాల కలిసి సుప్రసిద్ధ హిల్ ఫోర్ట్ ‘హాజీ మలాంగ్’కి వెళ్ళినట్టు తనకు తెలుసునని బీనా తెలిపారు.

ప్రేమ్ నాథ్, బీనా రాయ్‍ల వివాహం మధుబాలను విపరీతంగా క్రుంగదీసింది. మధుబాల ఆరోగ్యం క్షీణించడం మొదలయింది. “అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె ఆరోగ్యం పాడవుతున్నందుకు మావారు బాధపడ్డారు. ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయిందన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బహుశా వాళ్ళు ఎన్నో అందమైన ఊసులు చెప్పుకుని ఉండి ఉంటారు, కాని వాళ్ళ ఆశలు ఫలించలేదు. ప్రేమకథలన్నీ సుఖాంతం అవుతాయని చెప్పలేం.. మా పెళ్ళయిన రోజున మధుబాల బాగా విచారానికి లోనయ్యిందని తెలిసింది” చెప్పారు బీనా రాయ్ – ప్రేమ్ నాథ్‌తో తన వివాహం గురించి మాట్లాడుతూ. వణికే గొంతుతో తన హనీమూన్ విశేషాలను గుర్తు చేసుకున్నారు బీనా రాయ్. ప్రతీ రోజూ, ప్రతీ క్షణం తన భర్త లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. “మేం మైసూరు వెళ్ళాం. మావారు నన్ను చాముండి హిల్స్‌కి లాంగ్ డ్రైవ్‌కి తీసుకువెళ్ళేవారు. ఆయన గొంతు బావుండేది. కె.ఎల్. సైగల్, ముకేశ్ గారి పాటలు బాగా పాడేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నా జీవితంలో పెద్ద ఎడబాటు! ఆయనతో నాది ఎంత చక్కని అనుబంధమో ఇప్పుడు తెలుస్తుంది.” అన్నారు బీనా.

అంతకుముందు ఎప్పుడో ఫిల్మ్‌లోర్ అనే పత్రికలో తన భర్త గురించి చేసిన వ్యాఖ్య గురించి అడగగా – బీనా – తన భర్తపై గొప్ప ప్రేమని వ్యక్తం చేస్తూ జవాబు చెప్పారు. “భర్తలతో వ్యవహారం కఠినమైనదే కదా? ప్రతీ వివాహం లోని ఎత్తుపల్లాలు ఉంటాయి.. అలాగే మాకూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.. అయినా మా ఇద్దరికీ విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. మేమిద్దరం కొన్ని సర్దుబాట్లు చేసుకొన్నాం.. అలా మా వైవాహిక జీవితం, ప్రేమ నిలిచాయి” అన్నారు.

‘ఔరత్’ అనే సినిమా సెట్లలో – ప్రేమ్ నాథ్‌తో తన ప్రేమ మొదలైన అపురూప క్షణాలను ఆమె తలచుకున్నారు. 1953లో దర్శకుడు బి. వర్మ – ప్రేమ్ నాథ్, బీనా రాయ్‌లను వెండితెరపై జోడీగా మొదటిసారి కలిపారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వారిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. వారిమధ్య అనుబంధం ఎంత త్వరగా దృఢపడిదంటే – ఆ సినిమా విడుదల కాకుండానే వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. సంతోషంగా జీవించారు.

ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించాకా, ప్రేమ్ నాథ్ 2 నవంబర్ 1992న  తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందడంతో వారి బంధం చెదిరింది. ఈ దిగ్గజ నటుడు తన 66వ పుట్టిన రోజుకు 18 రోజుల ముందు కన్నుమూశారు, దాంతో సినీ పరిశ్రమ స్తబ్ధుగా మారింది. ప్రేమ్ నాథ్ మరణం తరువాత బీనా రాయ్ ఒంటరిగా, ప్రశాతంగా జీవించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న ఈ నటి 78 ఏళ్ళ వయసులో 6 డిసెంబర్ 2009 నాడు హృదయ సంబంధ అనారోగ్యంతో మరణించారు.


నా జ్ఞాపకాలలో మద్రాసు నగరం – పి. సుశీల:

(ప్రముఖ గాయని శ్రీమతి పి. సుశీల ‘ది హిందూ’ దినపత్రిక ప్రతినిధి శుభా రావు కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి)

***

“మా సొంతూరు విజయనగరం. నా చిన్నప్పుడు, న్యాయవాది అయిన మా నాన్నగారితో కలిసి మద్రాసుకి ఎన్నో సార్లు వచ్చాను. అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తానికి కోర్టు మద్రాసులో మాత్రమే ఉండేది. తర్వాతి రోజుల్లో మద్రాసు ఆకాశవాణిలో పాడేందుకు నాన్నతో కలిసి వచ్చేదాన్ని. మేం అప్పట్లో ఉడ్‍లాండ్స్ హోటల్‍లో బస చేసేవాళ్ళం. ఈ హోటల్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టం.

మా అక్కకి వివాహం జరిగి మద్రాసుకు వచ్చాకా, 1950లో నేను కూడా ఇక్కడికి వచ్చి – అడయార్ లోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్‍లో సంగీతం కోర్సు (విద్వాన్) చేశాను. అప్పుడు నేనొక్కదాన్నే రైల్లో వచ్చాను. రైల్లో మూడో తరగతిలో ప్రయాణించడం ఏం బాలేదు. ఇక్కడ దిగాకా, స్టేషన్‌లో అక్క కోసం ఎదురు చూశాను. అక్క ఇల్లు ఎక్కడో, ఎలా వెళ్ళాలో తెలియదు. స్టేషనంతా జనాలతో నిండి ఉంది, అయినా అది సురక్షితమైన ప్రదేశం. జనాలంతా చాలా మంచివాళ్ళు. ఒంటరిగా వేచి ఉండడానికి నేను భయపడలేదు.

నిజానికి ఈ నగరం చక్కని ఊరు. ఇప్పట్లా కాకుండా, అప్పట్లో రోడ్ల మీద అసలు జనాలే ఉండేవారు కాదు. అక్కతో కలిసి ట్రిప్లికేన్‍లో ఉంటూ, కాలేజీకి తోపుడు రిక్షాలో వెళ్ళి వచ్చేదాన్ని. వెళ్ళడానికి అరగంట పట్టేది. మళ్ళీ అతనే వచ్చి సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళేవాడు.  అప్పట్లో మద్రాసు గురించి నాకు అంతే తెలుసు. కానీ నాకు సినిమాల్లో పాడే అవకాశం వచ్చాకా, నా ప్రపంచం విశాలమయింది. ట్రిప్లికేన్ నుంచి మేం మైలాపూర్ లోని వీరభద్రా స్ట్రీట్‌కి మారాము. అక్కడి నుంచి మైలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వినాయగర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి వెళ్ళాం. నెలకి అద్దె 125 రూపాయలు.  అది ఓ పాలెస్ లాంటి ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్‌‍లో మూడు గదులు, పై అంతస్తులో రెండు గదులు. ట్రామ్‍లో ప్రయాణించడం నాకెంతో ఇష్టంగా ఉండేది.

1957లో డా. మోహన్ రావు గారితో నాకు పెళ్ళయింది. 1958లో మేము కారు కొనుక్కున్నాం. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కారులోనే, ట్రామ్‌లు ఎక్కే అవకాశమే లేకపోయింది. ట్రామ్‍లో వెళ్తే శాంథోమ్ దగ్గర దిగిపోయి, బీచ్‌కి పరిగెత్తి, ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేదాన్ని. జలుబు చేస్తే మాత్రలు వేసుకొనేదాన్ని. ఇప్పుడు నగరమంతా వ్యాపించిన ఫ్లైఓవర్లను చూస్తే – నా ప్రియమైన నగరంలో ట్రామ్‍లు తిరగడానికి చోటేది అనిపిస్తుంది.

నాకు నెలకి అయిదు వందల రూపాయల జీతంతో ఎ.వి.ఎం. సంస్థలో కాంట్రాక్టు దొరికింది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. పనికి వెళ్ళడమంటే బడికి వెళ్ళొచ్చినట్టే. ఉదయాన్నే పదింటికల్లా వెడితే, మళ్ళీ సాయంత్రం ఆరింటికల్లా ఇంట్లో ఉండేదాన్ని.  ఈ మధ్య సమయంలో మేం పాటలు పాడేవాళ్ళం.. అవి ఇప్పుడు క్లాసిక్స్ అయ్యాయి. అప్పట్లో గొప్ప గొప్ప రికార్డింగ్ ఇంజనీర్లు ఉండేవారు.. రంగస్వామి, జీవా, స్వామినాథన్ తదితరులు ప్రసిద్ధులు. ఆర్కెస్ట్రా, గాయనీగాయకులు, కోరస్ కళాకారులు – అందరం ఒక గదిలో చేరేవాళ్ళం. మా అందరి గళాలు, వాయిద్యాల ధ్వని సక్రమంగా రికార్డయ్యేట్టు చూసేవారు ఇంజనీర్లు.

మద్రాసు కళలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక గొప్ప కేంద్రం. సృజనాత్మక వ్యక్తులకి అది స్వప్న నగరం. ప్రతి ఒక్క కళారూపం – శాస్త్రీయ సంగీతం, నృత్యం, సినీ సంగీతం, రంగస్థలం – అన్నీ గొప్పగా ఎదిగాయి ఇక్కడ. రసిక రంజని సభలో జరిగిన అద్భుతమైన కచేరీలను ఎలా మరిచిపోగలను? అప్పట్లో చిన్న పిల్లాడిని అడిగినా, అది ఎక్కడ ఉందో చెప్పగలిగేవాడు. అక్కడ ఎందరెందరు దిగ్గజాలు ప్రదర్శనలిచ్చారు – డి.కె. పట్టమ్మాల్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, హోనప్ప భాగవతార్, జిఎన్‌బి.. మహామహులు కదూ!

ఇక సినిమా థియేటర్స్! ఎన్నో ప్రసిద్ధమైన సినిమా హళ్ళు ఉండేవి. నాకు ఓడియన్, వెల్లింగ్‍టన్, రోక్సీ, కాసినో.. మొదలైన థియేటర్లలో సినిమా చూడడం ఇష్టం.

ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా తనవాళ్ళుగా ఆదరించడం మద్రాసుకు తెలుసు. మా గాయనీగాయకుల విషయమే తీసుకోండి – టి.ఎం. సౌందరరాజన్ సౌరాష్ట్ర నుండి; నేను, బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి; ఎస్. జానకి, చిత్ర కేరళ నుంచి వచ్చాం. ఇవాళ ఇది నా ఇల్లు. ఈ నగరం అనేక సంస్కృతులను, సాంప్రదాయలను, విభిన్నమైన మనుషులను తనలో మేళవించుకుంది. శతాబ్దాల తరబడి తోటివారితో ప్రశాంతంగా జీవించిన ప్రజల జీవితాన్ని నగరం ప్రతిబింబిస్తుంది.

ట్రామ్స్ నుంచి టైడల్ పార్క్ వరకూ – నగరం చాలా మారింది, అయితే ఒకటి మాత్రం మారలేదు. అదే నగరపు సంస్కృతి. నా వరకు నేను మార్పును అంగీకరించి ముందుకు సాగిపోవడం నేర్చుకున్నాను, వెనక్కి తిరిగి చూడకూడనుకున్నాను. ఈ లక్షణాన్ని నేను నా కెరీర్ తొలి రోజుల్లో – ఎవిఎం వారి కోసం పాడినప్పటి నుంచి అలవర్చుకున్నాను. ఒకసారి పద్మిని నటిస్తున్న ఎవిఎం వారి ‘చిత్తి’ అనే తమిళ సినిమాకి పాడాల్సి వచ్చింది. ఉన్నట్టుంది నా గొంతు పోయింది. ఇక ఎప్పటికీ పాడలేనని అనుకున్నాను. కానీ రికార్డింగ్ ఇంజనీర్ జీవా గారు యాజమాన్యాన్ని ఒప్పించి నా కోసం వేచి చూశారు. సెట్స్ కూడా తొలగించలేదు. చివరకి ఎట్టకేలకు ఎం.ఎస్. విశ్వనాథన్ గారు స్వరపరిచిన ‘కాలమితు కాలమితు’ అనే మధుర గీతాన్ని పాడగలిగాను.”

***

మద్రాసు నగరంతో తనకు ఉన్న అనుబంధాన్ని పై విధంగా తెలియజేశారు సుశీల గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here