నారద భక్తి సూత్రాలు-11

0
4

[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]

నారద భక్తి సూత్రాలు

66. త్రిరూప భంగ పూర్వకం నిత్యదాస్య నిత్య కాన్తా భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైక కార్యం

అర్థం: భక్తుడు, భక్తి, భజింపంబడు భగవంతుడు అన్న త్రిపుటి నశించాలి. ప్రేమతో భగవంతుడిని తలవాలి. ప్రేమైక రూపమైన భక్తియే భగవంతుని ప్రాప్తికి సాధనము.

భక్తుడు, భక్తి, భగవంతుడు.

ప్రేమించువాడు, ప్రేమ, ప్రేమించబడు పరమాత్మ

జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం

ద్రష్ట(జీవుడు) దర్శనం, దృశ్యం

ధ్యాత, ధ్యానం, ధ్యేయం ఇవ్వన్ని త్రిపుటిగా చెప్పబడుతాయి.

ఈ భేదం కలిగి ఉన్నంత వరకూ పరమాత్మను చేరలేరు.

జ్ఞాని ఈ త్రిపుటిని భేదించి పరమాత్మ యందు మమైక్యవుతాడు.

గీతలో భగవంతుడు

“ప్రియో హి జ్ఞానినోఽ త్యర్థమహంస చ మమ ప్రియః॥” (7-17) అని చెబుతాడు.

జ్ఞాని అయిన వానికి నేను ప్రియము. అజ్ఞానియును నాకు ప్రియము. జ్ఞాని నేనే అయి ఉన్నాను అని.

ఆ జ్ఞాని నా స్వరూపమే అని చెప్పాడు.

తన భావాలు, ఆలోచనలు సర్వం పరమాత్మ పరం చేసిన తరువాత అంతా పరమాత్మే అయి జ్ఞాని నశిస్తాడు. కాని అట్టి వారు కనపడటం కడు దుర్లభం అని కూడా భగవానుడే చెబుతాడు.

పట్టుదలతో అనుష్ఠానం చేసుకున్న ధ్యానయోగి అనేక జన్మల తరువాత పరిశుద్ధుడై ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.

శంకర భగవద్పాదులు తన శివానందలహరిలో

“సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్యసంభాషణే।

సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్॥” అంటారు.

ఈశ్వర పూజ వలన ఈశ్వర సమాన రూపమవుతుంది

శివభక్తితో శివనామజపంతో శివుని దగ్గరగా ఉన్న భావము కలుగుతుంది. శివభక్తులతో సంగం వలన శివలోకంలో ఉన్నట్లుగా ఉంటుంది. శివ స్థావరజంగాత్మకమైన నీ స్వరూపం ధ్యానము వలన నాకీ జన్మలో సాయుజ్య ముక్తికి దొరుకుతుంది.

ఈ శ్లోకంలో శంకరులు సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం చూపారు.

ఈ విధమైన సాధన వలన త్రిపుటి నశించి అద్వైతం సిద్ధిస్తుంది.

ఆత్మజ్ఞానము వలన కలిగే ప్రయోజనము జనన మరణాలనుంచి బయట పడటమే.

“కార్యోపాధిరయం జీవః కారణోపాధిరాశ్వరః।

కార్యకారణతాం హిత్సా పార్ణబోధో విశిష్యతే॥”

అన్నది శ్రుతి వాక్యం.

మలినమైన ఉపాధి జీవుడు. మయోపాధి ఈశ్వరుడు. ఈ కార్యకోరణోపాధులను తొలగించాలి. అదే ఉపాధిద్వయ రహిత భగవంతుని మీద జ్ఞానం అని నారదుల వారు ఈ సూత్రంలో బోధిస్తున్నారు.

67. భక్తా ఏకాన్తినో ముఖ్యాః

భక్తులు ఏకాంత స్థలంలో ఏకాంత చిత్తంతో ఉండటము ఉత్తమం.

ఏకాంతవాసం భక్తులకు ఉత్తమం.

గురువు వల్ల శిష్యునికి ఈశ్వరుడు ఒక్కడే కాని రెండు కాదని తెలుస్తుంది. ఏకాంతమంటే మఠంలోనో మరో చోట ఉండటము కాదు, ఆత్మలో ఏకాంతము అనుభవములోకి రావాలి.

హృదయంలో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే సంఘంలో ఉన్నట్లే అవుతుంది.

అలా కాక హృదయంలో సదా పరమాత్మను ఆలోచన చేస్తుంటే చిత్తం శాంతించి, ఆలోచనలు శాంతి పొంది హృదయంలో ఏకాంతం అనుభవమవుతుంది.

“పుణ్యక్షేత్రం నదీతీరం గుహాపర్వత మస్తకం

తీర్థ ప్రదేశాః సింధూనాం సంగమః పావనం వనం॥

ఉద్యానాని వివిక్తాని బిల్లమూలం తటం గిరేః

దేవతాయతనం కూలం సముద్రస్య నిజం గృహమ్॥

సాధనే షు ప్రశస్తాని స్థానాన్యేతాని మంత్రిణః

అథవా నివసేత్తత్ర యత్ర చిత్తం ప్రసీదతి॥”

పుణ్యక్షేత్రం, నదీతీరం, పర్వతగుహ, పర్వతోపరిభాగం, పుణ్యతీర్థప్రదేశం, నదీ సముద్ర సంగమ ప్రదేశం, నిర్జన ప్రదేశం, మారేడు చెట్టు మూలం, సాత్విక పూజ గల దేవాలయాలు, సముద్రతీరం, అనుకూలంగా ఉంటే స్వగృహం సాధన, అనుష్ఠానానికి ఉత్తమం.

68. కణ్ఠావరోధ రోమాఇ్ఛశ్రుభిః పరస్పరం లపమానాః పావయన్తి కులాని పృథివీం చ

పరమ భక్తులు పరస్పరం ఒకరినొకరు గద్గద స్వరంతో పలకరించుకుంటారు. భగవద్ గాథలు చదువుకుంటారు. పంచుకుంటారు.

పరమ భక్తులు తాము భగవంతుని గాథలు చదువుకుంటారు. అవి గద్గద స్వరంతో పంచుకుంటారు. వారు ఆనందబాష్పాలు గలిగి ఉంటారు.

లోకపు వ్యర్థపు మాటలు మాట్లాడుకోరు.

ఏ వంశంలో ఉత్తమమైన భగవద్భక్తుడు పుడతాడో ఆ వంశం పావనమవుతుంది.

ఆ భూమి పులకిస్తుంది.

ఏ ఇంట్లో ఆత్మజ్ఞాని ఉంటాడో ఆ ఇంట కాలు పెట్టటడమే అదృష్టం.

ఆ మహాత్ముని చేత ఆ గృహం పవిత్రమైనదవుతుంది.

69. తీర్థకుర్వన్తి తీర్థాని, సుకర్మీకుర్వన్తి కర్మాణి సచ్చాస్త్రీ కుర్వన్తి శాస్త్రాణి

పరమభక్తులు తీర్థాలను పుణ్యతీర్థాలు చేస్తున్నారు. కర్మలను సకర్మలుగా చేస్తున్నారు. సామాన్య శాస్త్రాలను సత్శాస్త్రాలుగా చేస్తున్నారు.

పరమ భక్తులైన మునులు దేశంలో నివసించిన చోట పవిత్రమైన క్షేత్రాలుగా మారాయి.

తిరుపతి వద్ద కపిలుడు ఉన్నందున కపిలతీర్థం అయింది.

శ్రీశంకరులు జన్మించిన కాలడి పరమ పుణ్యక్షేత్రమైయింది.

యోగుల వలన ప్రదేశాలు పవిత్రమవుతాయి. వారి భక్తి వలన ఆ ప్రదేశానికి శక్తి కలిగి తదనంతర భక్తులకు మార్గమవుతాయి.

భగీరథుడు గంగ కోసం ధ్యానించి నందున గంగ ఆయనతో “సర్వులు తమ పాపాలను నా యందు మునిగి వదిలించుకుంటారు. మరి ఆ పాపం నేను ఎలా కడుక్కోవాలి?” అని అడుగుతుంది.

దానికి భగీరథుడు “అమ్మా! యోగులు, భక్తులు, పవిత్రమైన వారు నీలో మునిగినప్పుడు నీ దగ్గర ఉన్న ఆ పాపం పోతుంది” అని చెబుతాడు.

భక్తులైన వారు, యోగుల వలన గంగానది సైతం పవిత్రమవుతుంది.

కృష్ణస్వామి పాదం తగిలి బృందావనం పవిత్రమైయింది.

శ్రీ రామకృష్ణులు నివాసమున్న గృహం పరమ పావనమయి భక్తులకు సేదతీరుస్తోంది.

శారదామాయి కూర్చున్న రాయి ఎంతో పవిత్రంగా మారి భక్తులు పూజించేదిగా మారింది.

మునుల వలన భక్తుల వలన సామాన్యమైన ప్రదేశాలు జలాలు పవిత్రమైనవిగా మారుతాయి.

70. తన్మయాః

భగవంతుని భక్తులు భగవంతునితో సమానులవుతున్నారు.

గీతలో భగవానుడు చెప్పినట్లుగా “మన్మయా మాముపాశ్రితాః”

భగవంతుని ఆశ్రయించిన వారు భగవత్స్వరూపులే అవుతున్నారు.

కర్పూరం అగ్నిలో లీనమై అగ్నిగా మారిపోతుందో, ఉప్పు నీటిలో పడగానే కరిగి నీరుగా మారుతుందో, నది సముద్రంలో కలసి నామరూపాలు లేకుండా పోతుందో అలాగే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది.

హనుమంతులవారు శ్రీరామునితో

“దేహబుద్ధ్యా త్వద్దాసోహం జీవబుద్ధ్యా త్వదంశకః

ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిః”

దేహబుద్ధితో చూస్తే నీ దాసుడిని, జీవబుద్ధితో చూస్తే నీ అంశం, ఆత్మబుద్ధితో చూసితే నీ స్వరూపమే నా ఆత్మ అవుతున్నది అని హనుమంతులవారు రామునితో చెబుతాడు.

ఆత్మ పరమాత్మలో సంగమిస్తుంది. కాబట్టి భక్తునికి భగవంతునికి తేడా లేదు.

71. మోదన్తే పితరో నృత్యన్తి దేవతాః సనాథా చేయం భూర్బవతి

తన్మయులైన భక్తుల జన్మము వలన పితృ దేవతలు సంతోషిస్తారు దేవతలు ఆనందపడతారు. మంచి రాజుతో కూడి ధర్మపరిపాలనతో కూడిన ప్రభుత్వం అవుతుంది.

భక్తులు జీవించే భూమి సంతోషిస్తుంది. భూదేవి వారి పోషణలో హాయిగా ఊపిరి పీలుస్తుంది. భక్తులను దీవిస్తుంది.

పితరులు, పెద్దలు ఆనందపడతారు. పితరులు పెద్దలు అంటే భక్తుల తల్లితండ్రులే కాదు. అటు ఏడు తరాలు, భక్తుని తదనంతరం ఏడు తరాలు.

భక్తుల వలన భూమికి తిరిగి తన దైవిక శక్తి కలుగుతుంది. భూమి ఊపిరి పీల్చటము, ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉండటము జరుగుతుంది. భక్తులు ఉద్భవించిన చోట భూమి ఆనందముతో పొంగిపోతుంది.

మహనీయులు పుట్టినప్పుడు వారి వంశజులకు పితృదేవతలకు గయలో శ్రాద్ధతర్పణాలు చేస్తారు. అందుచేత వారి వంశలో పెద్దలు పితృ లోకం నుంచి పుణ్యలోకాలను చేరుకుంటారు.

భూమికి సనాథత్వం వస్తుంది. రాజులు ధర్మం తెలుసుకొని ధర్మపాలన జరుపుతారు. బుద్ధదేవుడు జన్మించినప్పుడు బింబిసార మహారాజు చక్కటి పాలనను ఇస్తున్నాడు.

వశిష్ఠుడు శ్రీరామునికి ధర్మం బోధించి రామునిచే ధర్మపాలన అందేలా సహాయం చేశాడు.

అలాగే సమర్థరామదాసు శివాజీ చక్రవర్తికి మార్గదర్శకత్వం నిలిచాడు.

భక్తులు మహాత్ములు జన్మించినప్పుడు భూమి అందుకే పులకరించిపోతుంది. అసురుల బలం తగ్గిపోతుంది.

శాంతి పెరిగి ఎల్లడెలా ఆనందం వెల్లువిరుస్తుంది.

72. నాస్తి తేషు జాతి విద్యా రూపకుల ధన క్రియాది భేదః

భగవద్భక్తి యందు భేదాలు లేవు. స్త్రీపురుషులైనా, జాతి మత భేదం లేక విద్య ఉన్న వాడు, విద్యలేని వాడు అన్న లేడా లేక రూపవంతుడు, రూపవంతుడు కానివాడు అని చూడక, ధనవంతుడు పేదవాడు అన్న భేదం లేక, వర్ణ భేదం చూడక యజ్ఞాది కర్మలు చేయువాడు, ఏమీ చెయ్యనివాడు అని చూడక సర్వులు భక్తులైన చాలు భగవంతునికి ఇష్టులు. ఆధ్యాత్మక రామాయణంలో రాముడు చెబుతాడు – వారి జన్మ బట్టి కాని, వారి వర్ణం బట్టికాని, స్త్రీపురుషుల తేడాలు కాని నా ఆరాధనలో లేవు. నన్ను ఇష్టపడటమే నన్ను అర్పించుటకు అర్హత అని అంటాడు.

ప్రపంచములో ప్రజలలో తేడాలు ఉండవచ్చు కాని నిజభక్తునికి పరమాత్మ మీద ఉన్న అనురాగములో మాత్రం కాదు.

జన్మను బట్టి ఒకరిని నిర్ధారించకూడదు.

కబీరు కేవలం వస్త్రాలు నేసే సాలెవాడుగా జన్మించాడు. నందుడు అంటరానివాడుగా జన్మించాడు. కాని నందుని కోసం దేవాలయం గోడలు పగిలి భగవంతుడు బయటకు వచ్చేశాడు. తిరుప్పాణి ఆళ్వారు మొదలైన జిజ్ఞాసులు ఉన్నారు.

విశ్వామిత్రుడు క్షత్రియుడు. వ్యాసుడు, తుకారాము, కన్నప్ప, నమ్మళ్ళవార్, జాబాల వీరంతా జన్మతః బ్రాహ్మణులు కాదు. కాని తమ భక్తితో పరమాత్మను మెప్పించారు.

ఇలా ఎందరో భక్తులు ఉన్నారు.

స్త్రీలలో మైత్రేయి, చూడాల, కాత్యాయిని, మదాలస, శబరి, గార్గి మొదలైన భక్తులు ఉన్నారు. వారు భక్తితో పాటు జ్ఞానం కూడా పొందారు.

వారి జన్మ బట్టి గాక వారి భక్తి బట్టి వారు మోక్షానికి అర్హులు అవుతున్నారు.

జ్ఞానమన్న ఓడ మీదకు ప్రతివారు వారి కులాల పట్టి కాక, వారి భక్తి బట్టి ఎక్కుతున్నారు. సంసార సాగరం దాటుతున్నారు.

ఏ హైందవేతరులలోనైనా ఈ స్మరణం, కీర్తనం వంటివి పాటించటము వలన వారు కూడా మోక్షానికి అర్హులవుతున్నారు. భక్తి వర్ణాశ్రమ ధర్మాలను తిరిగి రాస్తుంది.

జన్మ బట్టి కాక వారి సత్య ధర్మాది ప్రవర్తన వల్ల మాత్రమే భక్తులు మోక్షసాయుజ్యాన్ని పొందగలరు.

సత్యం, దానం, క్షమ, సదాచారం, కరుణ, తపస్సు, జీవ కారుణ్యము ఎవరిలో ఉంటాయో వాడు మోక్షానికి అర్హుడు.

73. యతస్తదీయాః

ఏ కారణము వల్ల భగవంతునికీ భక్తునికీ భేదం లేదని చెప్పబడుతోందో ఆ కారణం వలన జాతి విద్యా రూప కుల భేదం లేదని గ్రహించాలి.

భక్తులు భగవంతునికి చెందిన వారు. వారు పరమాత్మ యొక్క పరిపూర్ణమైన ప్రేమను పొందుతారు.

భగవంతుడు వారి అనన్యభక్తికి మెచ్చి వారితో ఉంటాడు. వారిలో ఉంటాడు. వారిగా ఉంటాడు.

భక్తులు భగవంతుని యొక్క ప్రతిరూపాలుగా మారి భూమి మీద తిరుగుతూ ఉంటారు.

గీతలో భగవానుడు

“సర్వ భూతస్థమాత్మానం సర్వభూతాని చా త్మని

ఈక్ష్య తే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః”

యోగంతో కూడిన మనసు గలవాడే సమస్త ప్రాణుల యందు సమభావంతో చూసేవాడు పరమభక్తుడు జ్ఞాని యని పిలవబడుతున్నాడు.

సమస్త జీవుల యందు సమభావన కల్గి సమంగా ప్రేమ చూపేవాడు

“సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని।

సమం పశ్యన్నాత్మయాజీ స్వారాజ్యమధిగచ్చతి”

ఎవరు సర్వ భూతములలో తనను చూసుకుంటాడో, సర్వభూతాలను తనలో చూసుకుంటాడో వాడు మోక్షం పొందుతాడు. సమస్తంలో ఉండే పరమాత్మ ఒక్కటేయని నిజం గ్రహించిన వాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here