కుసుమ వేదన-6

0
3

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

ద్వితీయాశ్వాసము – మూడవ భాగము

తే.గీ.॥
అటుల పాపకు కుసుమని నామమివ్వ
నటులె బిలిచిరి యందరు; నాశ దీర
కుసుమ గుసుమంచు బిలిచిరి కూర్మి తోడ
అంత నానంద పరవశ మందె బాల. (71)

సీ.॥
తత్తరుబాటునన్ తనరు పాదములతో
ముద్దు గొలుపుచునుండె ముద్దుబాల
తన బోసి నవ్వుల తడిపొడి మాటలన్
తనివి దీరుతునుండె తమకు నపుడు
అమ్మంచు నత్తంచు యమ్మడి పల్కుల
కానందమొందిరి యందరపుడు
పసిపాప తోడిదే వసుధంచు వారలు
మురిపెంబు తోగూడి మురియుచుండె

తే.గీ.॥
అటుల బెరిగి బాల యంతకంతనగుచు
యిటుల జూడ నదియు నిక్కమాయె
పటు తరంబు వేగ పాఠశాలకు బోవ
యీడు వచ్చె నింత మేరలోన. (72)

కుసుమ బాల్యము

తే.గీ.॥
బాల్యమందున యా బాల భయము లేక
చెట్ల నెక్కుచు దుముకుచు చెంగుమనుచు
కోతికొమ్మచ్చు లాడెను కొదువ లేక
తల్లిదండ్రులు వలదన్న నొల్లననచు. (73)

చం.॥
తన సరివారి తోడను సుతారపు గ్రీడల నాడుకొంచు; యా
దినమును యాతపాటలకు ధీటుగ కృత్యములాచరించుచున్
తనరుగ పాఠశాలను తప్పక విద్యల నభ్యసించి; వ
చ్చెను కుసుమాంబ నద్దరిని చెన్నల రారెడి తేజమబ్బగన్. (74)

ఉ.॥
స్థానిక పాఠశాలలను చాలగ విద్యల నభ్యసించుచున్
మానక నేర్చి బాల మరి మంచియు చెడ్డల బేధమెంచుచున్
మానస మందునన్ సులభ మార్గము నెంచును దల్లిదండ్రికిన్
కానుక లిచ్చెగా కుసుమను కారణజన్మని మెచ్చెనందరున్. (75)

చం.॥
చదువుల గూడి సాగెదరు చక్కని తేజము గూర్చుచుండగా
కదలుచు యాడి పాడిచును కాలముతో సరిసాగునీ ధరన్
అదనుగ గొప్ప విద్యలను అందుచు పొందుచు డెందమందునన్
పదమును వేయు చుండె నిక పాటుగ నీధర యందు మిన్నగా. (76)

కుసుమ యౌవనము

ఉ.॥
పున్నమి చంద్రబింబమున పూని కళంకము గానుపించు; నీ
యన్నుల మిన్న మోమునిట అన్ని విధంబుల నెన్నగానదే
చిన్ని కళంకమైన; సరి చెన్నల రారగ పూవుబోడి; ఎ
ఎన్నెన్ని విధంబులన్ పొసగు నీ ధర యందున మేటి రత్నమౌ. (77)

సీ.॥
ఆ చంద్ర బింబమందచ్చొసె నొక మచ్చ
యీ యింతి వదనాన యేడ లేదె
చూడ చక్కని చుక్క శోభిల్లు జగతిలో
చూడు వారలకును శోభ గూర్చు
శృంగార జగతిలో సింగారి యీ జాణ
మందార మకరంద మరులు గొలుప
అరవింద లోచనం బైనదీ జవరాలి
యెద జూడ మరులొందు యెవరికైన

తే.గీ.॥
ఇట్టి సుగుణాల సుమబాల యెందు గలదు?
కట్టిపడవేయు మోహన కంతునైన
చేప వేటాడు కులమందు చెలియ బుట్టె
వలువ పని చూడ చిత్రంబు నటుల గాదె. (78)

ఉ.॥
చక్కదనాల చుక్క యది చంచల నేత్ర దిశాంత ముల్దిగన్
దిక్కులు నష్టమున్ భ్రమసె దివ్యముగా వెలుగొందు నత్తరిన్
చుక్కలు నేలజూసె మరి చోద్యముగా ధర మానినింక నువు
జక్కగ జూసి పోదమని జాబిలి సైతము భూమి చూడదే. (79)

సీ.॥
అరవింద దళములే హస్తంబులన్ గొని
దైవ పూజలు సేయు ధర్మ వనిత
శుక్రవారపు వేళ శుచియైన మనసుతో
దేవిని గొల్చెడి దివ్య భక్తి
ప్రతి పండుగలలోను పాటించు నియమంబు
నిర్మాంస భక్షణల నియమురాలు
తల్లిదండ్రుల యెడ తగని భక్తి ప్రపత్తి
బంధు మిత్రుల యెడ బంధుప్రీతి

ఆ.వె.॥
యిట్టి సుకృత కర్మ యింతి బుట్టె ధరణి
నాతి శ్రేణిలోన ఖ్యాతి గనుచు
పెరిగి నప్పుడంత పేర్మితో కుసుమాంబ
సంతసించిరంత సకల జనులు. (80)

తే.గీ.॥
హేమమాలిని కుసుమాంబ ప్రేమ మీర
బంధుమిత్రుల తోడను బాగుగాను
నడచుకొను జాణ కడువడి నయము తోడ
సకల సద్గుణ రాశి యా చంచలాక్షి. (81)

తే.గీ.॥
కొంత చదువైన బిమ్మట; కుసుమ తల్లి
దండ్రి పెండ్లిని చేయగా తలచిరంత
మంచి వరునికి వేటను మానకుండ
మొదలు బెట్టిరి; కులమున మోదమలర. (82)

ఆశ్వాసాంత గద్యము:
ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వెలయు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము ద్వితీయాశ్వాసము సర్వమూ సమాప్తము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here