చిరుజల్లు-60

0
3

నీరు పల్ల మెరుగు

[dropcap]ఇం[/dropcap]టర్వ్యూ జరుగుతోంది. ఇరవై మంది అభ్యర్థులు హాల్లో తమ వంతు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

విశ్వనాథ్ కూడా వాళ్లల్లో ఒకడు. ఎలాగైనా ఇంటర్వ్యూ చేసేవాళ్లని మెప్పించి ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ఉన్నాడు. ఒక రకంగా అతనికి ఉద్యోగం రావచ్చు. ఎందుకంటే ఇది వరకు ఒక కంపెనీలో పని చేసిన అనుభవం ఉంది. మరొకరకంగా  ఉద్యోగం రాకపోవటానికీ అవకాశం ఉంది. ఎందుకంటే, ఇంతకు ముందు అతను పని చేసిన కంపెనీ దివాలా తీసింది. మూసేశారు.

ఇంటర్వ్యూ చేసే వాళ్లకు ఏదైనా ఒక పాథటిక్ స్టోరీ చెప్పి సానుభూతి పొందాలని ఆలోచిస్తున్నాడు. ఏం స్టోరీ చెప్పాలి? ‘భార్య జబ్బుతో ఉంది.’ ‘ఏం జబ్బు? ఎంతకీ నయంకాని రోగం ఒకటే కాన్సర్. వైద్యం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. లక్షల్లో ఖర్చు చేయాలి. ఈ ఉద్యోగం ఇస్తే ఒకరి ప్రాణం కాపాడిన వారు అవుతారు..’ ఇదే చెప్పాలని అనుకున్నాడు.

విశ్వనాథ్‌కి పిలుపు వచ్చింది. లోపలికి వెళ్లాడు. వరుసగా ముగ్గురు కూర్చున్నారు. ఒకరు బాగా వయస్సు, అనుభవం ఉన్నవాడిలా ఉన్నాడు. మరొక ఆయన నడి వయస్సులో ఉన్నాడు. సన్నాగా, పొడుగ్గా, జెండా కర్రకు పాంటూ, షర్టూ తొడిగిన వాడిలా ఉన్నాడు. మూడో మనిషి ఒక స్త్రీ. పెద్ద వయస్సు ఉన్నదేం కాదు.. తన ఈడుదే. అందంగా అల్ట్రా మెడరన్‌గా ఉంది.

విశ్వనాథ్ ముగ్గరికీ విష్ చేశాడు. ప్రశ్నల వర్షం మొదలైంది. ఊరూ, పేరూ  చదువూ, పూర్వ అనుభం ఇవన్నీ ‘అల్ట్రా మోడరన్ ఆమె’ అడుగుతోంది. మిగిలిన ఇద్దరూ మౌనంగా వింటున్నారు.

“ఇది వరలో ఏ కంపెనీలో పని చేశారు?”  అని అడిగింది, ఇంగ్లీషులో కంపెనీ పేరు చెప్పాడు.

“అందులో మీరు ఏం చేసేవారు?”

“ఐ.టి విభాగంలో టీమ్ లీడర్‌గా పని చేశాను. తరువాత మేనేజర్‌గా ప్రమోట్ అయ్యాను..”

“ఆ కంపెనీ దివాలా తీసింది గదా..” అన్నదామె.

అడగకుండానే తన విషాద భరిత జీవిత కథ చెప్పాడు. ఉద్యోగం తనకు ఎంత అవసరమో చెప్పాడు. మానవతా దృక్పథంతో చూడాలనీ కోరాడు.

“నీ భార్యకు కాన్సర్ ఎప్పటి నుంచి? ఎలాంటి కాన్సర్? ఏ హాస్పటల్‌లో ఏ డాక్టర్ దగ్గర వైద్యం చేయిస్తున్నారు?” అంటూ వివరాలు అడిగింది.

నోటికొచ్చిన విషయాలు చెప్పాడు.

“నీ భార్య పేరు ఏమిటి? ఆమె ఎక్కడ చదువుకుంది? ఆమెది ఏ ఊరు?” అని మరి కొన్ని ప్రశ్నలు వేసింది.

అన్నిటికీ ఎంతో ఓపిక, జాలి ఉట్టిపడేలా సమాధానాలు చెప్పాడు.

“అమెరికా ఉపాధ్యక్షురాలి పేరేమిటి?” అని అడిగాడు జెండా కర్ర.

“నాకు అమెరికా విషయాలు అంతగా తెలియదు..” అన్నాడు విశ్వనాథ్.

“కర్నూలు రాజధానిగా మొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మొదట ముఖ్యమంత్రిగా పని చేసినవారు ఎవరు?”

“అంత పాత విషయాలు అంతగా తెలియదు..” అని అన్నాడు విశ్వనాథ్.

“పోనీ సినిమా విషయాలు తెల్సా? నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమాకు డైరెక్టరు ఎవరు?”

“గుర్తు లేదు..”

అతనికి తెల్సిన ప్రపంచం వేరు. ఆ ప్రపంచం గురించి బయట వాళ్లకు తెలియదు. బయటి ప్రపంచం గురించి అతనికి తెలియదు.

ఇంటర్వ్యూ అయిపోయింది. విశ్వనాథ్ రూంలో నుంచి బయటకు వెళ్లాడు.

సాయంత్రం ఆరుగంటలు అయింది.

ఆవేళ అంతా ఇంటర్వ్యూలు చేసి, అనేక మంది జీవిత గాథలు విని విసిగి పోయిన అనూరాధ టీ త్రాగి, రిలాక్స్ అయింది.

అందరిలోకి విశ్వనాథ్ చెప్పిన కథే ఆమె కళ్ల ముందు మెదులుతోంది.

అనూరాధను అతను గుర్తించక పోవచ్చు. గుర్తుంచుకోవాల్సినంత పరిచయం అతనికి లేదు. కానీ అతడిని ఎన్నటికీ మర్చిపోలేంత కథ ఆమెకు తెల్సు.

..అతడి భార్య. కాన్సర్ పేషెంట్, డబ్బు ఇబ్బందులు, మంచి సెంటిమెంటు గల కథే చెప్పాడు. కానీ అదంతా పచ్చి అబద్ధం అని అనూరాధకు తెల్సు..

పదేళ్ల కిందటి మాట.

అనూరాధది చిన్న పల్లెటూరు. అయితేనేం అదొక అందమైన లోకం. నిత్యం ఎడతెగక పారే ఏరు. పచ్చని పొలాలు. తోటలూ – మధ్యలో బారులు తీరినట్లున్న ఇళ్లు ఎవరికీ చిన్న ఆపద వచ్చినా, అందరూ వచ్చి ఇంటి ముందు వాలేవాళ్లు. ఎవరికి ఏ చిన్న సంతోషం కలిగినా అందరూ సంతోషంతో పొంగిపోయేవాళ్లు. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అన్నంత ఆప్యాయంగా కలిసిమెలిసి జీవించేవాళ్లు.

అలాంటి ఊరిలో ఆమె పుట్టి పెరిగింది.

హిమబిందుది అదే ఊరు. ఇద్దరూ ఎదురెదురు ఇళ్లల్లోనే ఉండేవాళ్లు. ప్రాణస్నేహితుల్లా పెరిగి పెద్ద వాళ్లు అయ్యారు.

హిమ బిందుది బాగా కలిగిన కుటుంబం. చీటికీ మాటికీ ఎవరికి ఏ ఆపద వచ్చినా అవసరం వచ్చినా వాళ్ల కుటుంబమే ఆదుకునేది. అందు చేత ఎవరింట్లో ఏ పూవు పూసినా, ఏ కాయ కాసినా తెచ్చి హిమహిందుకి ఇచ్చేవాళ్లు.

హిమబిందు చంద్రబింబింలా ఎదిగింది. చదువు పూర్తి అయింది. పై చదువులకు  పై ఊరికి పంపించే ప్రయ్తనాలు చేస్తూనే, పెళ్లి ప్రయత్నాలూ ప్రారంభించారు.

ఆ సమయంలో విశ్వనాథ్ హిమబిందును పెళ్లి చూపులు చూడటానికి వచ్చాడు.

పెళ్లి చూపులకు ఎవరింటికి ఎవరొచ్చినా, ఊళ్లో వాళ్లంతా వాళ్ల ఇంటి ముందే చేరి సినిమా యాక్టర్లని చూసినట్లు ఎంతో ఆరాధనా భావంతో చూసేవాళ్లు.

విశ్వనాథ్ మంచి అందగాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వాళ్లు ఊళ్లో దిగినప్పటి నుంచీ అందరూ వాళ్ల చుట్టూ చేరి, హిమబిందు కుటుంబం గురించి ఆకాశానికి ఎత్తడం మొదలు పెట్టారు.

“అమ్మాయిగారి తాతగారు కాలవ ఇటు మళ్లించారండీ. వారి పూణ్యమా అని పొలాల్లో పంటలు పండిచుకుంటున్నామండీ.. అమ్మాయి గారి తండ్రిగారు ఆ గుడి కట్టింటారండీ.. ఏ పండగ వచ్చినా ఊరంతా ఆ గుడి కాడ చేరతామండీ.. అమ్మాయి గారు పుట్టిన సంవత్సరం బడి పెట్టించారండి.. అమ్మాయిగారు తప్పటడుగులు వేసేటప్పుడు ఊళ్లో పోస్టాఫీస్ పెట్టించారండి. నడక మొదలెట్టినప్పుడు కరెంటు తెప్పించారండి.. అమ్మాయిగారు నవ్వగానే ఊళ్లో అందరి ఇళ్లల్లో కరెంటు దీపాలు ఎలిగాయండి.. అమ్మాయిగారు ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో  సిరిసంపదలు పాలపొంగులా బుస్సున పొంగుతాయండీ..” అంటూ అడగకుండానే అన్నీ చెప్పుకొచ్చారు.

హిమబిందు అందానికీ వంక పెట్టటానికి వీల్లేదు. అందుచేత సంబంధం వదులుకుంటే ఎంత నష్టపోతారో వాళ్లకు అర్థమైంది.

అంగరంగ వైభవంగా హిమబిందు వివాహం జరిగింది. ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రులనీ, ఊరి వాళ్లనీ వదిలి పెట్టి హిమబిందు, విశ్వనాథ్ చిటికిన వేలు పట్టుకొని మహానగరానికి వచ్చింది.

సిటీకి వచ్చాక అసలు విషయాలు ఎన్నో తెల్సి వచ్చాయి. అతని కుటుంబం అనుకున్నంత ఉదాత్తమైనదేమీ కాదు. మధ్య తరగతి కుటుంబం.

వాళ్ల ఆలోచనలూ, అభిప్రాయాలూ అన్నీ మధ్య తరగతి మనస్తత్వానికి చెందినవే.

విశ్వనాథ్ కల్పన అనే అమ్మాయితో పీకలోతు ప్రేమలో పడిపోయాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. కానీ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. తాము చూసిన సంబంధమే చేసుకోవాలన్నారు. సరే మరి. తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం, వాళ్లు చూపించిన పిల్ల మెడలో తాళి కడతానన్నాడు. వచ్చే అమ్మాయి వాళ్లకు కోడలు కావచ్చు. కానీ తనకు భార్య కాదు. తన భార్య మాత్రం తను ప్రేమించిన కల్పనయే అని స్పష్టంగా చెప్పాడు.

కాపరానికి వచ్చాక తన సంసారం ఎంత డొల్లదో హిమబిందుకు అర్థమైంది. భర్తకు కల్పన తప్ప మరో లోకం లేదన్న విషయం తెలిసి వచ్చింది. ఈమెను కన్నెత్తి చూసేవాడు కాదు. మనిషి ఎదురుగానే ఉన్నా మనసు మాత్రం ఎక్కడో ఉండేది. పలకరించినా సమాధానం చెప్పేవాడు కాదు.

“నన్నెందు కింత నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని అడిగింది.

“నువ్వు పల్లెటూరి దానివి. నీకు ఫాషన్లు, షోకులూ తెలియవు. మా సరదాలూ, సంతోషాలూ తెలియవు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నలకు కోడలిగా వచ్చావు. అంతే. నాకు భార్యగా కాదు. కేవలం వాళ్లు కోరిక తీర్చటం కోసమే, నీ మెడలో తాళి కట్టాను..” అని స్పష్టంగా చెప్పాడు.

హిమబిందు విడాకులు ఇవ్వమని అడిగింది. అందుకు ఒప్పుకోలేదు. అత్తగారు అడ్డుపడింది.

“అదేదో మత్తు మందు చల్లింది. ఆ మోజు ఎన్నోళ్లో ఉండదు. పెళ్లి అయిన వాడితో, పెళ్లికాని దాని ప్రేమ ఎన్నాళ్లు నిలుస్తుంది. నాలుగు రోజులు పోతే వాడే దారికొస్తాడు. కొంచెం ఓపిక పట్టు” అని ఆమె హిమబిందు ముందు కాళ్లకు బంధం వేసింది.

విడిపోతే లోకం హీనంగా చూస్తుందని పుట్టింటి వాళ్లు చెప్పుకుంటూ వచ్చారు.

ఇంట్లోనే తనను హీనంగా చూస్తున్నప్పుడు, లోకంలో ఎవరో హీనంగా చూస్తారన్న భయం ఎందుకని హిమబిందు వాదించింది.

“నన్ను ప్రేమించమని కట్టుకున్న భర్తను యాచించటం కన్నా దరుదృష్టమైన సంఘటన మరొకటి ఉండదు. ఆయన నా ప్రేమను తిరస్కరించాడు. కొండను తాకిన నదీ ప్రవాహం నిశ్శబ్దంగా వెనక్కి మళ్లుతుంది. మరిన్ని పల్లపు పరిసరాలను సశ్యశ్యామలం చేస్తుంది..” అని హిమబిందు అనూరాధతో చెప్పింది.

ఒక రోజు హిమబిందు ఇంట్లో నుంచి మాయమైంది. ఒక భక్త సమాజంలో చేరి పేదవారికి సేవ చేసే కార్యక్రమంలో మునిగిపోయింది. ఆమె జీవితం అలా పది మందికి ఉపయోగపడుతోంది.

ఇదంతా తల్చుకొని అనూరాధ నిట్టూర్చింది.

మర్నాడు ఆమె విశ్వనాథ్‌కు ఉద్యోగం ఇచ్చింది. అతను ఆమెను ఆఫీసులో కల్సుకుని “థాంక్స్” చెప్పాడు. అతను వెనుతిరిగాడు, సీట్లో కూర్చున్నాడు.

‘రేపటి నుంచీ నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తాను’ అని అనుకున్నది అనూరాధ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here