మనోరంజన్

0
4

[dropcap]సూ[/dropcap]ర్యోదయ సమయంలో ఆకాశంలో కిరణ సముదాయంలో ఎన్నో సూర్య వర్ణాలు. ఆకాశంలో పక్షులు ఒక క్రమంలో ఎగురుతున్నాయి.. కొంగలు తెల్లగా, కాకులు నల్లగా కనిపిస్తూ ఆకాశాన్ని పరుచుకున్నాయి. ఆహ్లాద వాతావరణంలో మాఘ మాసం పూజల సందడితో వెళ్ళింది. శివరాత్రి నాడు నోములు పట్టేవారు ఇంకా ఉన్నారు, పడుతున్నారు. విదేశాల్లో ఉన్నా సరే పట్టి, ఇండియా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ళకి తీర్పులు చేస్తున్నారు. ఒక్కోసారి అక్కడే మనవాళ్ళు ఉంటే నోము చేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయంలో పుట్టారు అంటూ కొందరు నోములు ఇష్టం గానే చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా నోము పేరుతో పుణ్యాన్ని సంపాదించాలి అంటారు, ఎందుకంటే పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఆ వచ్చినప్పుడే ఈ తరహా పూజలు నోములు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఈ నాటి కొత్త తరం పిల్లలకి చెప్పాలి. మా చుట్టాలు ఒకరు పెద్ద చదువు చదివిన అమ్మాయి పెళ్ళి తరువాత చాలా నోములు చేసింది. వాళ్ళ అత్తగారు సిటీ జీవితం. చంటిపిల్ల వల్ల కుదరలేదు, మీ అమ్మ పట్టిస్తే నోములు చేసుకో నా కొడుకు ఉన్నతి కోసమే కదా అన్నది. ఆడపడుచు మాత్రం మా అమ్మ చెయ్యనివి నువ్వు ఎందుకు చెయ్యడం అని సాగదీసింది. బాల్కనీలో కూర్చుని ఆకాశం వంక చూస్తూ కాఫీని నెమ్మదిగా తాగుతూ ఆలోచిస్తోంది శోభ.

ఎక్కడ పుట్టాయి? ఎక్కడ పెరిగాయి ఈ పక్షులు, ఆకాశంలో హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. వాటి జీవిత సరళి వేరు మనిషికి అలా కుదరదు. విహంగ వీక్షణం అంత సులభము కాదు.

ప్రక్క దేశం వెళ్ళాలి అని అన్నా ఎన్నో కాగితాలు, ఆరోగ్య పరీక్షలు. అన్ని బాగున్నా చాలా డబ్బు ఖర్చు అనిపిస్తు ఉంటుంది.

కూతురు పురుటికని రమ్మని ఎన్నో సార్లు అడిగింది. “మీ అత్తగారిని తీసుకెళ్లి నాకు కుదరదు” అన్నది శోభ.

“అమ్మా, చదువుకున్నావు, అన్ని తెలిసిన అలా ఇంటికి అంకితమై, సదా నాన్న సేవలో అంటే ఎలా?” అని అంటుంది కూతురు.

“నువ్వు సుఖంగా ఉండు, మీ అత్తగారు అయితేనే మంచిది” అని తప్పించుకుని ఉరుకుంటూ ఉంటుంది.

సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు తెగ వస్తున్నాయి. సౌండ్ వినిపిస్తుంది కాని చూడలేదు

ఇప్పుడు కాల్ వచ్చింది. ఎవరా అని చూసింది. కొత్త నంబర్ ఎవరో? అనుకుంటూ “హలో” అన్నది.

“నేను శోభా, నాకు ఒక ఆశ్రమం పేరు చెప్పు. ఒకామెకు ఇంట్లో గందరగోళంగా ఉన్నది. ఒక నెల ఉండి వెళ్లిపోతుంది” అంది సరోజ ఫోన్‍లో.

“ఎప్పటికీ కావాలి?”

“ఇప్పుడే”

“అలా కుదరదు. మా ఊళ్ళో ముందే అప్లయ్ చేయాలి. ఆర్డర్‌లో పిలుస్తారు, ఇంటర్వ్యూ ఉంటుంది. వెంటనే కుదరదు. నువ్వు చెప్పిన భీమవరంలో వివరాలు నాకు అంతగా తెలియవు. అయినా పెద్దింటి వారికి అక్కడి పరిస్థితులు నచ్చాలి కదా. బాగా బ్రతికే వాళ్ళు ఉండలేరు.. అయినా ఒక నెలలో తీరిపోతాయి అనే భావన ఆశ్చర్యంగా ఉన్నది. అయినా సరే నువ్వు అడిగావు కనుక చెపుతున్నా సరోజా, మా పిన్ని వాళ్ళ గాంధీ ఆశ్రమం ఉన్నది. అక్కడ అతిథి గృహం, ప్రార్థన మందిరంగా ఒక పెద్దగా ఉన్న హలు ఉన్నాయి. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టారు దాతగా వచ్చి కట్టించి ఇచ్చారు. మీకు ఫోన్ నంబర్ పెడతాను మాట్లాడుకొని పంపండి. వాళ్ళవి ఇంకా ఐదు ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడ నచ్చితే అక్కడ ఉండమని చెప్పు” అన్నది శోభ.

వెంటనే నంబర్ పెట్టీ ఫోన్ చేసి పిన్నికి చెప్పింది. ఈలోగా పనిమనిషి వెంకట రమణ వచ్చింది, “అమ్మగారు కాఫీ ఇవ్వండి” అంటూ.

కాఫీ కలిపి ఫ్లాస్క్‌లో పోసి ఉంచుతుంది శోభ. ఎవరు వచ్చినా ఇవ్వడానికి అనువుగా పెట్టుకుంటుంది. కప్పు తెచ్చి వేడి కాఫీ పోసి ఇచ్చింది వెంకట రమణకి. ఆమె కాఫీ తాగి ఇల్లు చిమ్మి తడి బట్ట పెట్టింది. వెనకాల శోభ ముగ్గు పెట్టుకు వచ్చింది. అంట్లు తోమి బట్టలు నానేసింది వెంకట రమణ. “కూరలు చెప్పండి, తరిగి ఇస్తాను” అన్నది.

“చిక్కుడు కాయ, టమేటా కూర; మామిడి కాయ పప్పు, దోసకాయ పచ్చడి, చారు” అంది శోభ. “కొత్తిమీర ఎక్కువ తరుగు అన్నిటా వెయ్యాలి లేకపోతే రుచి ఉండదు. దోసెలు పిండి అయిపోయింది. నీకు ఉప్మా చేసి పెడతాను ఆయనకి అత్తగారికి వేసి పెట్టాను. మామ గారు ఏమి వద్దు అంటు అరటి పండు యాపిల్ పండు తిన్నారు” అంది.

“వద్దమ్మా బ్రెడ్ ఇవ్వండి” చాలు అంది వెంకట రమణ. సరే అంటూ బ్రెడ్ పై మామిడికాయ కొబ్బరి పచ్చడి రాసి నెయ్యి వేసి పెనంపై టోస్ట్ చేసి ఇచ్చింది. ఓ నాలుగు ముక్కలు పెట్టింది. తను రెండు తిన్నది.

ఒక్కో ఇంట్లోనే ఎన్నో రకాల మనస్తత్వాలు. ఎవరికి నచ్చింది వారు తింటారు. అందరీ అల్పాహారం అయ్యాక ఆ ప్లేట్స్ తోమి కప్పులు కడిగి స్టాండ్ లో సర్దింది వెంకట రమణ.

తన పనులన్నీ అయ్యాక సరోజకి కాల్ చేసింది శోభ – “మాట్లాడారా పిన్నితో” అని.

“ఆ మాట్లాడాను. కానీ ప్రస్తుతం రూమ్ లేదు, రెండు రోజుల్లో ఇస్తాను అన్నారు. కాని నేను బయలుదేరాను అంటే సరే నా గదిలో ఉండవచ్చును, రెండు రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను అన్నారు. గూగుల్ పే లో డబ్బు కట్టేసాను. ఆవిడ వద్దు వచ్చాక చూసుకుందాం అన్నా సరే నేను డబ్బు కట్టాను” అంది సరోజ.

“ఎవరిని పెడుతున్నారు?” అడిగింది శోభ.

“నేనే వెడుతున్నా. కారు వచ్చి రెడీగా ఉంది”

“ఆఁ, మా ఉల్లో దిగి భోజనం చేసి వెళ్ళవచ్చును”

“కానీ కొత్త డ్రైవర్. ఏ దారిలో తీసుకు వెడతాడు అన్నది తెలియదు” అంది సరోజ

“అయ్యో నువ్వా, నువ్వు అయితే మా ఇంట్లోనే ఉండు” అన్నది శోభ

“నేను ప్రశాంతత కోసం కదా”

“సరే అయితే మధ్యలో ఒక సారి రావచ్చును, పిన్ని నువ్వు కలిసి. మధ్యలో లయన్స్ కాన్ఫరెన్స్ ఉన్నది. ఉగాది పండుగ బాగా చేస్తారు అక్కడ. ఉగాది అవార్డ్స్ కూడా ఇస్తారు – తాత గారు అమ్మమ్మ పేరు మీద. చాలా బాగుంటుంది అక్కడ. రిటైర్ అని వాళ్ళు వచ్చి నెల రెండు నెలలు ఉండి ప్రశాంతత పోంది సేవ చేసి వెడతారు. అక్కడే గాంధీగారి మూడు రోజులు ఉన్నారు. సర్వోదయ వాళ్ళు అక్కడ పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేశారు. పిన్ని ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్ అయినా గాంధేయవాధి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఆవిడకి సేవలో, సర్వీస్‌లో కాలం గడిచిపోయింది. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు. కుటుంబం పిల్లలు రెండింటికీ న్యాయం చెయ్యలేను అనుకుంది. తన అక్కపిల్లలు బాగోగులు చూస్తూ ఒకళ్ళని ఐఎఎస్ చదివించింది ఇంకొకళ్ళు సైంటిస్ట్ పేద పిల్లల్ని చదివిస్తూ ఉండేది. వాళ్ళ బావగారు తిక్క శంకరయ్య. పిన్ని మనుష్యుల్ని ప్రేమగా ఆత్మీయతగా చూసేది.

ప్రపంచంలో రక రకాల జీవితాలు కదా! తల్లి తండ్రులని వదిలేసి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు డొనేషన్స్ ఘనంగా ఇచ్చి తమ దాతృత్వం చాటుకుంటున్నారు. అలా ఎందరికో ప్రశాంత జీవితం ఇవ్వగలుగుతోంది పిన్ని. అక్కడ ఒక ప్రక్క కూరగాయల తోట, మరో ప్రక్క పువ్వుల మొక్కల తోట, గోశాల ఉంటాయి” అంది శోభ.

సరోజ ఎవరినో తీసుకు వెళ్లి జాయిన్ చేస్తుంది అని అనుకుంది. అయితే వాళ్ల ఇంట్లో వృద్దులు లేరు. ఇద్దరు కొడుకులు, భర్త పెద్ద బిజినెస్. కొడుక్కి పెళ్లి చేసింది కోడలు కూడా వచ్చింది.

సరోజ – ‘నేనే వెడుతున్నా’ అన్న మాటలు శోభకి చాలా బాధ కల్గించాయి. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ గొడవలు అని చెప్పింది, ఇంకా అడగకూడదు, అది పద్ధతి కాదు అని ఊరుకున్నధి..

శోభకి సరోజ చాలా తమాషాగా స్నేహితురాలు అయ్యింది. ఒకసారి ఒక కాంపిటీషన్ ప్రకటన శోభకి వచ్చింది. అందులో పిల్లలకి శ్రీ కృష్ణ యశోద వేషధారణ పోటీ. అది చూసి తన ఫ్రెండ్ పద్మావతి ప్రైమరీ స్కూల్ పిల్లలకి పంపింది. వాళ్ళు ఓ పాతిక మంది పాల్గొన్నారు. వాళ్ల వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. మూడు బహుమతులు వాళ్ళ స్కూల్ పిల్లలకి వచ్చాయి.

అలా స్నేహం పెరిగింది. కానీ ఒకళ్ళ కొకళ్ళు ఎప్పుడు మాటలు చెప్పుకోవడంలో సంతృప్తి పడ్డారు. ఎవరి ఇంటి బాధ్యతలు, బరువులు వారివి. శోభకు ఇల్లు కదిలే తీరిక ఉండదు. మామగారు రిటైర్ అయ్యి వచ్చాక అంతా కలిసి నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న ఇల్లు కొన్నారు. మరిది కెనడాలో సైంటిస్ట్. కొత్త మొక్కలు తయారీలో దిట్ట. అక్కడ నుంచి బోన్సాయ్ మొక్కలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. చిన్న కొబ్బరి చెట్టు, మామిడిచెట్టు, కమల, నిమ్మ చెట్లు, సపోటా, సీతాఫలం చెట్టు ఉన్న పెద్ద కుండీలు వీధి బాల్కనీలో పెట్టాడు. మధ్యగదిలో చక్కగా పూల కుండీలు బోన్సాయ్‍లు ఉంటాయి.. ఇల్లు చూడ చక్కగా నందనవనంలో ఉన్నట్లు ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము అన్నది కాదు; ఎక్కడ ఉన్నా ఇంటికి మినిమం కంఫర్ట్‌లు ఉండాలి. వృద్దులు ఉన్న ఇళ్ళల్లో ఒక పద్ధతిగా, పిల్లలకి అవసరానికి ఒక పద్ధతిగా ఇల్లు అమర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే సుఖపడేలా ఇల్లు సర్దుకోవాలి. మానసిక ఒత్తిడి వలలో పడకుండా ఇంటి పనులు సుఖంగా చేసుకునేలా ఇల్లాలి సుఖం చూసిన వాడే మంచి భర్త. మామగారు ఆ పద్ధతిలో ఇల్లు ఉండాలి అంటారు. కొడుకుల్ని నలుగురునీ అదే పద్దతిలో పెంచారు. అందుకే ఆ ఇంట్లో సమస్యలు ఉండవు. ముఖ్యంగా భార్య కష్టం తెలుసుకుని భర్త కుటుంబం నడిపితే సమస్య రాదు. అందుకే ఆ ఇంట్లో శోభ అత్తగారి మాట వింటూ మిగిలిన కోడళ్ళనీ కూడా తన పద్ధతిలో ఉంచుతుంది. ఎవరికి ఎది కావాలి అనుకుంటే అదే వండుతు ఉంటుంది. ఏదో విదేశాలనుంచి ఏ రెండేళ్లలో వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని వెడతారు. శోభకి ముఖ్యంగా అందరితో కలిసి పోయే స్వభావం వల్ల సమస్యలు దూరం నుంచే పారిపోతాయి.

భోజనాలు అయ్యాక అన్ని సర్ధి టేబుల్ క్లీన్ చేసి పెట్టింది. వెంకట రమణ రెండు గంటలకి వచ్చి మిగిలిన సరుకులు పట్టుకెళ్ళి పోతుంది లేదా ఒక్కో రోజు అక్కడే తింటుంది. బట్టలు ఉతికి ఆరేసి వెడుతుంది. ఒక్కోసారి అత్తగారి దగ్గర కూర్చుని కబుర్లు చెపుతుంది. ఆమె మొగుడు అటో డ్రైవర్. అతను ఊళ్లకి వెడితే వీళ్ళ ఇంట్లోనే గడిపేస్తుంది. ఎంత ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయినా, మళ్ళీ ఆరవేసి తీసి బట్టలు దందలపై వేసి ఆరబెట్టి ఇస్త్రీ చెయ్యాలి అందుకు మన పని మనకే ఉంటుంది. ఇంటినిండా విద్యుత్ పరికరాలు నిండుగా ఉంటాయి. కానీ మనిషి ఉండి సోపు లిక్విడ్ బట్టలు వేసి మిషన్‌లో నంబర్ సెట్ చేసి టైమ్ పెట్టాలి, ఇవన్నీ వెంకట రమణ నేర్చుకుంది. చేతితో బాది ఉతకకుండా ఇలా చేస్తున్నారు. ఇలాంటి వస్తువులు ఉంటే పనివాళ్ళు ఆనంద పడతారు.

ఫ్రిజ్ లోని మంచినీళ్ళు తాగటం, ఎలక్ట్రిక్ కుక్కర్లో బియ్యం పోసి వండటం, ఓవెన్‍౬లో వేడి చెయ్యడం ఇవన్నీ ఎంతో ఇష్టాలు. మనకి రోట్లో కొబ్బరి పచ్చడి ఇష్టం, దానికేమో మిక్సి లో పచ్చడి ఇష్టం. “మారే కాలంతో పాటు మారాలి మాకు ఎలాగ స్తోమత లేదు, మీకు ఉన్నది సుఖపడాలి” అంటుంది. ఈ రోజుల్లో ఎవరూ ఎవరి మాట వినరు. పిల్లల పద్ధతి పిల్లలది. “అమ్మా నీకేమి తెలియదు” అని ఐఎఎస్ తల్లిని కూడా పిల్లలు అంటారు. ఇంక పెద్ద వాళ్ళు అయితే “నీ పద్ధతి నాకు నచ్చలేదు, అలా చెయ్యి, ఇలా పెట్టు” అంటారు.

వినే తల్లి అటు పిల్లలకి, ఇటు అత్తగారికి కూడా ఒక ఏమి తెలియని మనిషి. అసలు ఎదుటి వారి మాట వినరు, వాళ్ళ ధోరణి వాళ్ళదే. ఎంతో మందిని పరిశీలించింది శోభ. ఎవరూ తను చేసింది తప్పు అని ఒప్పుకోరు. జీవితంలో ఎవరితోనూ గొడవ పడకూడదు. నదిలో ఈదుతున్నప్పుడు ఆకులు, లతలు, తుక్కు, చెత్త గడ్డి ఎలా ఎన్నో ఎదురవుతాయి. వాటిని చేతులతో తోసుకుంటూ ఎలా ఈది గట్టుకి వస్తామో అదే పద్ధతిలో జీవితంలో మాటల విషయంలో కూడా తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అన్నాడు సుమతి శతకంలో ఏనాడో. అది ఎప్పటికీ నిత్య జీవిత సత్యమే. మనిషి తనను తాను తక్కువ చేసుకోడు. ఎదుటి వారిపైనే నింద వేస్తారు.

సరోజ బయటకి వచ్చింది అంటే ఎంతో పెద్ద కారణం ఉండాలి. ఇప్పుడు కొంచెం పెద్దది అయింది కనుక ధైర్యంగా బయటకి వచ్చింది. వానప్రస్తాశ్రమాలు గతంలో ఉండేవి, ఇప్పుడు వృద్ద ఆశ్రమాలు వచ్చాయి. కానీ అందులో అరవై లేనిదే జాయిన్ చేసుకోరు. ఇది గాంధీ ఆశ్రమం కనుక సేవకి ఎందరో వస్తూ వెడుతూ ఉంటారు. రక రకాల మానసిక ఒత్తిడులు లేకుండా చూసుకోవడానికి ఇది ఒక రిక్రియేషన్ సెంటర్ అంటారు. మరి సినిమాలు షికార్లు కొందరికి, మరికొందరికి కళలు. ఇంకొందరికి ఇలా ఆశ్రమ సేవలు!

సరోజ నిజానికి సోషల్ ఆక్టివిస్ట్‌గా తన జీవితాన్ని మలుచుకున్నది. పదహారవ ఏట ఇంటర్ చదివే రోజుల్లోనే పెళ్లి చేశారు. అత్తింటికి పంపారు. పెద్ద మండువా ఇల్లు. ఉమ్మడి కుటుంబంలో పడింది. అత్తగారు వెనుక మడి దడి ఆచారం మా పద్దతిలో అన్ని నేర్పుకుంటాను అన్నారు. సరే మరి మంచిది, వంకలు పెట్టకుండా వాళ్లే నేర్పారు. వద్దు అనడానికి లేదు. బావగారికి ముగ్గురు ఆడపిల్లలు. సరోజకు ఇద్దరు కొడుకులు. పిల్లల పెళ్లిల్లు పురుళ్ళు అయ్యాక బావగారు వేరే సిటీకి వెళ్ళిపోయారు బిజినెస్ పెంచే నిమిత్తం.

వృద్ధ అత్త మామ కొడుకులు భర్త ఉన్నారు. మామగారు కొంత వాటా వారి జరుగుబాటు మందులు మాకులు సరిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు. సరోజ పిల్లలలో ఇద్దరు ఇంజినీర్స్ చదివారు. పెద్దవాడి పెళ్లి అయిపోయింది. కోడలు హరిణికి బాగా డాన్స్ వచ్చు పుట్టింట్లో క్లాసులు చెప్పేది. సంగీతంలో కూడా డిప్లొమా చేసింది. యూనివర్సిటీ వారి ఇంటర్ కాలేజ్ పోటీల్లో చూసి, పిల్ల గురించి వివరాలు తెలిసికొని మధ్యవర్తి ద్వారా కబురు చేసి పెళ్లి చేశారు. హరిణి అందంగా ఉంటుంది, అంత కన్నా, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటుంది.

“అత్తయ్యా గారు మీకు అన్ని బాగా తెలుసు అని ఈ పెళ్లి వల్ల నేను జీవితంలో ఎదుగుతాను అనే నమ్మకంతో పెళ్లి చేసుకున్నాను. ఏడాది అయ్యింది, ఎవరూ నన్ను పట్టించుకోరు” అని వాపోయింది హరిణి.

“అదేమిటి మా అత్తమ్మ మాట నేను ఇప్పటికీ వింటున్నాను. నువ్వు అంతే” అంది సరోజ.

“అయితే మా బాబాయ్ కూతురు ఉన్నది, ఆ పిల్లని మా మరిదికి చెయ్యండి బాగుంటుంది” అంది హరిణి.

దానికి వాడు “నాకు ఇష్టం లేదు. కళలు కాకరకాయలు వద్దు, ఏదైనా పెద్ద చదువు పిల్ల అయితే నాతో పాటు ఉద్యోగం చేస్తుంది. నేను విదేశాలకి వెళ్ళాలి. అక్కడి ఉన్న సంబంధం చూడు” అని అన్నాడు.

ఆ పిల్ల స్కూల్ పెడతాను అన్నది. నీ అత్తవారి ఇష్టం అన్నారు.

సరోజ పెద్ద కొడుకు రంజన్ ప్రొఫెసర్. వాడు “ఏమి వద్దు నువ్వు ప్రోగ్రామ్స్ ఇయ్యి చాలు” అన్నాడు. అదే పెద్ద అంశంగా గందరగోళం అయ్యింది. ఈలోగా రెండో వాడి పెళ్లి గొడవ వచ్చింది.

అత్తగారు “సరోజా, నువ్వు నీ పిల్లలని స్వేచ్ఛగా పెంచావు” అన్నది. చిలికి చిలికి గాలివాన అయింది. “నువ్వు నీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకో” అన్నది కొడుకుతో సరోజ.

దాంతో భర్త, అత్త, ఇద్దరు దుర్వాస మహామునిలా ప్రవర్తించారు. సమయానికి వండి వార్చడం తప్ప ఇంకేమీ లేదు, ఆడపిల్లలు లేరు కనుక సరిపోయింది అన్నారు. దానితో సరోజకు కోపం వచ్చి “నేను వండితే మీరు అలా అంటున్నారు. నేను వెళ్ళిపోతే మీకు అందరికీ బాగా తెలిసి వస్తుంది” అని బయటికి వచ్చింది.

ఒక్కోసారి మనసు ఒత్తిడి తట్టుకోలేదు. కోడలి ముందు ఇలా విమర్శించడం చాలా బాధ అనిపించింది సరోజకి.

సరోజ భర్త మనోరంజన్ మంచి వాడు. తన భార్య కోడలి కోసం, అత్త కోసం – ఎంతో బాధ పడి – ఇద్దరి మధ్యా నలిగిపోతూ ఉన్నది; కొన్నాళ్ళు రిలీఫ్‌గా ఉంటుంది, కోడలు బాధ్యత పుచ్చుకుంటే బాగుంటుంది అని అన్నాడు.

ఈ మాట సరోజకు ఎలక్ట్రోల్ డోస్‌లా పని చేసింది. వెంటనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నది. కానీ భర్తకు సదుపాయం ఉండదు. ముప్ఫై ఐదేళ్ల సంసార జీవితం – ఒక్కసారి ఒంటరిగా వెళ్ళడానికి ఎంతో సంశయించింది. కానీ భర్త కూడా వెళ్ళడానికి అంగీకరించాడు.

కందిపప్పు పొడి, కారం పొడి, వెల్లుల్లి పొడి, నూపొడి, గోంగూర పచ్చడి, దోస ఆవకాయ, మెంతి బద్దలు అన్ని చేసి పెట్టింది. ఇన్‍స్టెంట్ ఉప్మా రవ్వ, పులిహోర మిక్స్ తయారీ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది.

‘ఏమిటో రామాయణంలో ఆశ్రమవాసంలో సీత వాల్మీకి ఆశ్రమంలో ఉన్నది. లవుడు కుశుడు జన్మించి రాముల వారిని చేరారు. ఇప్పుడు తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రంజన్, చిత్తరంజన్. కానీ వీళ్ళ పెళ్లి వల్ల తనకు ఆశ్రమవాసం పట్టింది’ అనుకుంది. మొత్తానికి ఆశ్రమంలో చేరిపోయింది.

***

ఎప్పటి కప్పుడు మనోరంజన్ భార్య క్షేమం విషయాలు తెలుసుకుంటునే ఉన్నాడు. వారం అయ్యేటప్పటికి ఇంట్లో వంటిల్లు మూతపడింది. జొమాటో వాడు ఆహార పదార్థాలు అందరికి కూడా తెస్తున్నాడు. అంతే, మనోరంజన్ తల్లి – కోడల్ని కేకలు వేస్తూ రెండువైపులా అరుస్తుంటే విని, “అమ్మా, ఊరుకో, సరోజ మంచిది. నేనే రెస్ట్ కోసం వెళ్ళమన్నా” అంటూ తల్లిని శాంత పరిచి సర్దిచెప్పాడు.

“అమ్మ లేనిదే ఆహారం రాదు డాడీ” అని రెండో కొడుకు వాపోయాడు. దానితో తండ్రి కొడుకు కారు వేసుకుని బయలుదేరారు.

***

మృదుల అనే అమ్మాయి కంప్యూటర్ ఇంజినీర్. సంగీతం ద్వారా రోగాలు నయం చెయ్యడానికి ఎక్కువ కృషి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర హిందుస్తానీ రాగాలు బాగా కుదురుతున్నాయి. అయితే మన కర్ణాటక రాగాలు సినిమా పాటలు ద్వారా తేలికగా నయం చెయ్యవచ్చును అనే భావనలో ఒక సాప్ట్‌వేర్ సంస్థలో చేస్తోంది. దాని వల్ల అటు మెడికల్ షాప్ వాళ్ల అమ్మకాలు, డాక్టర్స్ వైద్యాలు తగ్గుతాయి అందుకని దాన్ని ముందుకు రానివ్వడం లేదు. అయినా కర్ణాటక సంగీతం అందరికీ రాదు కూడా. ఎంతో కృషి చెయ్యాలి. ఇంతకీ ఆ పిల్ల చిత్తరంజన్ ప్రొఫెసర్ కూతురు. ఆ పిల్లని పెళ్ళి చేసుకోవాలని కోరిక ఇంట్లో చెప్పాడు .

“చిత్తరంజన్ ఒక గొప్ప పిల్లని కోరుకున్నాడు. అలాంటప్పుడు మనం పెద్ద కోడలు తాలూకు పిల్లని ఎలా వప్పుకుంటాము? ఇద్దరు కలిసి డాన్స్ స్కూల్ పెడితే ఎలా? ఇంటిపట్టున ఉండే పిల్ల కావాలి లేదా పెద్ద ఎత్తున ఎదుగుదల ఉండే పిల్ల కావాలి. ఇప్పుడు కంప్యూటర్‌లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్) పై పరిశోధనలో ఉన్నది. రేపు పొద్దున సైన్స్ వారి నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక మనం వాడికే ఓటు వెయ్యాలి” అని మనోరంజన్ భార్య సరోజతో అన్నాడు. “అదే కదా నేను చెప్పి ఇంట్లో వాళ్ళ చేత పెసరట్టు తిన్నాను” అన్నది సరోజ.

ఒక్కోసారి పిల్లల విషయంలో వృద్ధుల మాట పక్కన పెట్టి – వారి జీవిత ఎదుగుదలకి అవకాశం ఇవ్వాలి. చిత్తరంజన్ బాగా ఆలోచించి తీసుకున్న పెళ్ళి నిర్ణయం మంచిది. ఎవరి జీవితం వారిది. ముగ్గురు కార్లో వస్తూ పెళ్లి నిర్ణయం చేశారు. అందరి మనసులో ఆనందం వచ్చి హృదయం తేలికపడింది.

ఫాల్గుణ మాసంలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ప్రొఫెసర్ గారికి ఫోన్ చెయ్యాలి అనుకున్నారు. ఒక్కోసారి ఆలోచించితే విచిత్రంగా ఉంటుంది.

“యూనివర్సిటీ వారిని అందర్నీ పిలవాలి. వాళ్ళకి వెయ్యి కార్డులు వేసినా చాలదు. అందరికీ మెయిల్ పెట్టమందాము. వాళ్ళు ఎలాగూ రెడీగా ఉన్నారు. పెళ్ళి చేసి అల్లుడు కూతుర్ని విదేశాలకి పంపాలని ఆయన అలోచన” అన్నాడు మనోరంజన్.

ఒక్కగా నొక్క కూతురు, ఎవరూ వదులు కుంటారు? నాకు ఆడపిల్లలు లేరు కనుక వదిన గారే ఆడబడుచు, మా పెద్ద కోడలు మాకు కూతురు లాంటిది అని పొగిడి లాంఛనాలు ఇప్పించారు. నో, నో మనోరంజన్ కోడలికి ఇచ్చాడు. ఆ విషయం సరోజకు తప్ప ఎవరికీ తెలియదు.

పచ్చి పూల మండపంలో యూనివర్సిటీ క్వార్టర్స్‌లో ఫంక్షన్ హల్ విద్యుత్ దీపాల వెలుగులో మెరిసి పోతోంది. పెద్ద కోడలి డాన్స్ ప్రోగ్రామ్‌లో ‘వచ్చెను అలమేలు మంగా నీ పచ్చల కడియాల ప్రణతి చెలంగ’ అనే శ్రీ అన్నమయ్య కృతి – డాక్టర్ శోభరాజ్ గళం నుంచి వినిపిస్తుంటే తన్మయత్వంతో నృత్యం చేసింది. అబ్బో చాలా బాగా చేసింది అని అంతా మెచ్చుకుని సన్మానం చేశారు.

ఆ రాత్రి పెళ్ళిలో మంచి విందు అనంతరం, పెద్దల ఆశీస్సులతో మృదుల చిత్తరంజన్ – పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు -అని శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన గట్టి మేళం వాయిస్తుండగా ఒకటయ్యారు. అందరూ ఆనంద పడ్డారు.

శోభనీ పెళ్లికి పిలిచింది సరోజ. విషయం తెలిసి నవ్వుకున్నది అత్తగారు. కోపగిస్తే కానీ కొత్త కోడలు రాలేదు.

కానీ సరోజ మాత్రం కొడుకు పెళ్లి కోసమే ఆశ్రమానికి వెళ్ళింది. ఇంటి ఇల్లాలు లేనిదే ఇల్లు ఒక కొలిక్కి రాదు, అందరూ భార్యలను సతాయిస్తారు. కానీ మంచిగా ప్రేమ పంచితే అంతకంటే ఇంకేమి ఉన్నది అని తరువాత అందరికీ ఒక విచిత్ర విషయంగా తెలిసింది. ‘మగువ మనసు మంచు కడిగిన మంచి ముత్యము వంటిది చెలిమి పంచి మసలుకుంటే అమే దేవత వంటిది’ ఆలిండియా రేడియోలో లలిత సంగీతం వనితావాణి నుంచి వినిపిస్తూ ఉన్నది.

శాంతి శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here