జీవితంలో మలుపులు

0
3

[dropcap]క[/dropcap]రోనా మహమ్మారి వల్ల మనిషి జీవితం ఇంత కకావికలమై అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడం ఇదే మొదటిసారి. మొట్టమొదట చైనాలో ఓ భూభాగంలో పుట్టిందన్న కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని దేశాలకూ వ్యాపించింది. ఎంత మంది ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు. వాళ్ళ సంఖ్య లక్షలు దాటిపోయింది. కోట్లు దాటుతోంది. ప్రపంచంలో మరణించిన వారి సంఖ్య లక్షలకి లక్షలు.

ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే మనిషి జీవితాన్ని వైరస్ అస్తవ్యస్తపరిచి భయభ్రాంతుల్ని చేస్తోంది. మనిషి మేధస్సు పరంగా చూస్తే ఎంతో శక్తివంతుడు అవచ్చు, ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నెన్నింటినో కనిపెట్టి ఉండవచ్చు. చంద్రమండలంపై అడుగుపెట్టి ఉండవచ్చు. అంగారక గ్రహం మీద అడుగు పెట్టడానికి తహతహలాడి ఉండవచ్చు. మిగతా గ్రహాల గురించి తెలుసుకోడానికి ప్రయత్నాలు సాగించి ఉండవచ్చు. ఇంత శక్తివంతుడయిన మనిషి ప్రకృతి చెంత తల వంచవల్సిందే.

ప్రకృతిని శాసించే అధికారం, శక్తి మనిషికి ముమ్మాటికి లేదు. ఉప్పెనల్ని, పెను తుఫానుల్ని, సునామీలను, భూకంపాల్ని ఆపగలిగే శక్తి మనిషికి ముమ్మాటికి లేదు. అది అలా ఉంచితే పడిలేచే కెరటాల్ని ఆపగలిగే శక్తి మనిషికి లేదు. పెద్ద పెద్ద వృక్షాల్ని కూకటి వేళ్ళతో సహా పెకలిస్తున్న ప్రచండగాలుల్ని సైతం ఆపగలిగే శక్తి మనిషికి లేదు.

అది తెలుసుకోకుండా మనిషి ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకుని వికృతంగా మార్చేస్తున్నాడు. ప్రకృతి విధ్వంసానికి పూనుకుంటున్నాడు. సొరంగాలు తవ్వతున్నాడు. డామ్‌ల పేరుతో భూమిని డొల్ల చేస్తున్నాడు. ఈ విపరీత పరిణామాల ఫలితమే ఈ మహామ్మారి కరోనా విలతాండవం అని అనుకుంటోంది ఆమె.

“కళ్యాణీ! ఏంటా ఆలోచన్లు? ఆర్ యూ ఓకే! మనకి ఇప్పుడు ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. కరోనా వైరస్ మనుషుల జీవితాల్ని కకావికలం చేస్తూ ఉన్నా మొదట గ్రీన్ జోన్‌లో ఉన్న మన జిల్లాలో వలస కూలీలు రాకతో రెడ్ జోన్‌గా మారిపోయింది. ఇప్పుడు కేసులు వేలలో ఉన్నాయి. దానికి తోడు నిబంధనలు కొద్దిగా సడలించగానే కేసులు సంఖ్య కూడా పెరిగిపోయింది.”

“ఈ సమయంలో ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం కాదు మన పని. ఈ వైరస్‌కి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. చికిత్స అందిస్తున్న డాక్టర్లను సైతం ఈ వైరస్ వదలటం లేదు. ఇప్పుడు మనం డాక్టర్ సుధగారికి సహాయంగా నిలబడాలి. పద.. పద..” అన్నాడు డాక్టరు కళ్ళాణచక్రవర్తి. భర్త మాటలకి తలూపి ఆమె అతని వెంట బయలుదేరింది.

కళ్యాణి సుధగారి నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పని చేస్తోంది. ముందుకు అడుగులు వేస్తోందే కాని ఆమె మది నిండా ఆలోచనలే. అవి వలస కూలీలు గురించి, కార్మికుల గురించే, అదీ వారి బ్రతుకుల గురించి. ఉన్న ఊర్లో పనులు లేక తట్టా బుట్టా పట్టుకుని, పిల్లా, పాపల్ని వెంటబెట్టుకుని కొందరు, ఒంటరిగా మరి కొందరు జీవనోపాధికి పై ప్రాంతాలకి వలస పోయిన ఈ వలస కూలీలు, కార్మికులు ఈ విపత్కర పరిస్థితుల్లో తిరిగి తమ స్వగ్రామానికి తండోపతండాలుగా తిరిగి వస్తున్నారు.

అన్ని వ్యవస్థలు బందయిన సమయంలో రవాణా వ్యవస్థలేని సమయంలో వాళ్ళు ఎంతో దూర దూర ప్రదేశాల నుండి నడుచుకుంటూ స్వగ్రామాలకి చేరుకోవాలన్న తపన – అప్పుడు వాళ్ళు పడ్తున్న బాధలు టి.వి. చానెల్లో చూసిన కళ్యాణి ఒకింత ఆవేదనకి లోనయింది. భావోద్వేగంతో ఆమె మనస్సు ఊగిసలాడింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, పరాయి దేశ పరిపాలన అంతమయి ఏడు పదుల సంవత్సరాలు గడిచినా సమాజంలో పేదరికం అలాగే ఉంది. సమానత్వం రాలేదు. కొంత మంది ఎత్తుకు ఎదుగుతూ ఉంటే మరి కొందరి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది.

లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు, కార్మికులు పట్టుదల వదలకుండా ఆత్మస్థైర్యంతో నడిచి అయినా వెళ్ళాలన్న ఆలోచన ఆమెకి ఒకింత బాధను కలిగించినా వారి ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోక ఉండలేకపోయింది. జీవన పోరాటంలో ఈ జీవన యాత్రలో కొంత మంది అలసిపోతున్నారు. మరి కొంత మంది తమ జీవితాల్నే కోల్పోతున్నారు. ఆకలి, దప్పికలతో, మరి కొందరు, అన్ని తట్టుకుని ముందుకు సాగుతున్నారు.

“కళ్యాణి! ఈ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషి తుమ్మినా, దగ్గినా, తాకినా ఇతరులకు ఈ వైరస్ అంటుకుంటుంది. అందుకే రోగులకి జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఈ వైరస్‍కి ఇంకా సరియైన మందు కనిపెట్టలేదు. అందుకే ముందు జాగ్రత్తకే మన ప్రభుత్వం ఈ లాక్‍డౌన్ అమలు చేస్తోంది. విచిత్ర విషయం ఏంటంటే కరోనా వ్యాధితో చనిపోయిన వారిని బంధువులు కూడా తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయడానికి వెనకాడుతున్నారు. ఈ వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళకి ఒక విధంగా చూస్తే రిస్కులేని చావే.”

“భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి చేతులు హేండ్ వాష్ లోషన్‌తో శుభ్రపరుచుకుంటూ చేతులకి గ్లౌజులు తొడుక్కుని వైద్యం చేయాలి. జాగ్రత్తలు తీసుకుంటూ. రోగులకి అలా వైద్యం చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో వైద్యులకి కూడా ఈ వ్యాధి సోకుతోంది” డాక్టరు సుధగారు కళ్ళాణితో అన్నారు. ఆమె చెప్పిన పద్ధతుల్ని పాటిస్తూ ఆమె వెంట వెళ్ళింది కళ్యాణి.

మనిషి మరీ విచిత్రమైనవాడు. ఈ కరోనా వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పోలీసుశాఖ, వైద్య శాఖ, ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నాయి. పోలీసులంటే భయపడే మనిషి ఇప్పుడు వాళ్ళు ప్రజలకి చేస్తున్న సేవల్ని చూసి, వాళ్ళు పడ్తున్న కష్టాల్ని చూసి వాళ్ళకి పూజలు చేస్తున్నారు. వైద్య శాఖకి కూడా అంతే, అయితే డాక్టర్లు వల్లగాని, పోలీసు శాఖ వల్లకాని ఏ మాత్రం పొరపాటు జరిగినా దాడి చేస్తున్నారు. మంచి జరిగితే డాక్టర్ని ప్రాణం ఉన్న దేవుడు అన్న వాళ్ళు, ఏ మాత్రం పొరపాటు జరిగితే దాడి చేస్తున్నారు. వాళ్ళని తన్నడానికి కూడా వెనకాడడం లేదు. వాళ్ళ ఆలోచనా విధానం మారాలి. ఆలోచిస్తున్న కళ్యాణి ఆలోచన్లు అన్నీ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి చుట్టూ తిరుగుతున్నాయి. గతమంతా కళ్ళెదుట కదలాడుతోంది.

ఆమె వర్తమానంలో జీవిస్తున్నా మనస్సు స్థిమితం కోల్పోయి గతించిన గతాన్ని తలచుకుంటోంది. ఆ సమయంలో జరిగిన అనుభవాలు భయంగా మారుతున్నాయి. ఆ గత భయాన్ని మరచి పోవాలంటే వర్తమానంలో ఉంటూ భవిష్యత్ ఆలోచన్లు మనసులోకి రావాలి. గతానుభవాలు అసంతృప్తో బాధో కలిగిస్తాయి.

***

జీవితంలో అనేక సందర్భాల్లో మనం అనుకున్నవి కాకుండా అనుకోనివి జరుగుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నో చూస్తూ ఉంటాం. జీవితంలో అనేక మంది మనకి తారసపడ్తారు. కొంతమంది మన జీవితం పై ప్రభావం చూపుతారు. ఆ ప్రభావం మంచిదయితే పరవాలేదు. అదే చెడ్డదయితే దాన్ని గురించి బాగా ఆలోచించి నిర్ణయిచుకోవాలి.

పై చదువులు చదువుకోవాలన్న కళ్యాణి కోరికను కాదని డిగ్రీ పూర్తవగానే పెళ్ళి చేసుకోమని ఇంట్లో వాళ్ళు చేసిన ఒత్తిడికి ఆమె తల వొంచవల్సి వచ్చింది. మెడికల్ రిప్రజెంటెటివ్ మన్మథరావు చేత మెడలో తాళి కట్టించుకోవల్సి వచ్చింది.

మన్మథరావు గురించి చెప్పుకోవాలంటే అతనికి లేని వ్యసనం లేదు. పేరుకు తగ్గట్టే తను ఓ విలాస పురుషుడు. గంటకో వస్త్రం మార్చినట్టు గంటకో అమ్మాయితో సరదాలు, కోరికలు తీర్చుకోవడమే అతని హాబీ. బయట ఆడవాళ్ళ దగ్గర అతని ప్రవర్తన ఎలా ఉన్నా భార్య దగ్గరకు వచ్చేట్టటికి మాత్రం శాడిస్టుగా మారి పైశాచికంగా తన లైంగికానందం, వాంఛ తీర్చుకొనేవాడు. అతని వికృత చేష్టలు తనకి భయాన్ని, హ్యేయాన్ని కలిగించేవి. రాత్రి అయిందంటేనే కళ్యాణికి భయం భయంగా ఉండేది. ఇదే పెళ్ళయిన తరువాత సంవత్సరకాలంలో ఆమె దాంపత్య జీవితం.

అలాంటి జీవితంలో ఆనందం పొందే క్షణాలు లేనేలేవు. ఎన్నాళ్ళు ఈ నరకయాతన అనుభవించాలి? అని అనుకున్న సమయంలోనే విధి ఆమెని విధవరాలిగా పుట్టింటికి పంపింది. భర్తి మరణం ఆమెకు బాధ కలిగించలేదు కదా ఒక విధంగా ఆనందాన్నే ఇచ్చింది. ఆ తరువాత ఆమెకు తెలిసిందేంటంటే ఎయిడ్సు వచ్చి తన భర్త మరణించాడని.

తను బ్రతికి ఉండగా మనుమరాలి పెళ్ళి చూడాలన్న నాన్నమ్మ కోరికకి కళ్యాణి జీవితం బలైంది. విధవగా పుట్టింటికి చేరటం కూడా ఆ విధి ఆడించిన వింత నాటకమే. మొత్తానికి ఆమె జీవితం మాత్రం పెద్దవాళ్ళ మూర్ఖత్వపు ఆలోచనలకి, చేతలకి బలైంది.

అంతతో ఆగిందా? ఇంట్లో ఆమెకి అడుగడుగునా ఆంక్షలే. ఆమెను మనస్తాపానికి గురి చేసిన సంఘటనలే చివరికి పెట్టుకున్న బొట్టు, వేసుకున్న గాజులు, పువ్వులు అన్ని నిషిద్ధమే. ఈ కాలంలో కూడా ఎక్కడా ఇలాంటి ఆక్షలు లేనప్పటికీ చాదస్తపు వాసనలు మాత్రం ఆమె కుటుంబ సభ్యులను వదిలి పెట్టలేదు. ఆమెలో తర్కం, ఇవన్నీ పుట్టుకతో వచ్చినవే కదా అని. దాన్ని పట్టించుకునే వారు ఎవరు ఆ ఇంట్లో.

ఇంట్లో ఆమె స్థితి ఎలా ఉండేదంటే అన్నిటికీ సెంటిమెంట్లే! ఎవరికీ ఎదురుగా రాకుడదు. గదిలోనే కూర్చోవాలి అందరూ బయటకు వెళ్ళేవరకు. ఇవన్నీ ఆమెను మనస్తాపానికి గురి చేశాయి. ఏడుపు ఆమెకు వచ్చేది. ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె ఏ శుభకార్యాలకి వెళ్ళడానికి వీల్లేదు.

అలాంటి సమయంలోనే ఆమెను చూడ్డానికి స్నేహితురాలు స్నేహ వచ్చింది. పేరుకు తగ్గట్టు స్నేహానికి మారు పేరు. స్నేహ ఆమె తన బాధనంతా స్నేహితురాలితో చెప్పుకుని ఏడ్చింది. “నీకు మంచి రోజులు వస్తాయి కళ్యాణి! ఇలా డీలా పడకు” అని కళ్యాణిని ఓదార్చింది స్నేహ.

స్నేహ వాళ్ళ అక్క డాక్టరు సుధ. కళ్యాణి పరిస్థితి స్నేహ తన అక్కకి వివరించింది. ఆ తరువాత స్నేహ సహకారంతో వాళ్ళ అక్క సుధానర్సింగ్ హోమ్‌లో చిన్న ఉద్యోగం సంపాదించింది కళ్యాణి. ఆమె కుటుంబ సభ్యులు మెదట విముఖత చూపించినా కళ్యాణి మాత్రం వెనకడుగు వేయలేదు.

డాక్టరు సుధగారికి కళ్యాణి మీద సానుభుతి కంటే ఆమెను యోగ్యురాలిగా తీర్చిదిద్దాలన్నదే ఆమె తపన. అందుకే వైద్యానికి సంబంధించిన చిన్న చిన్న పనులు ఆమెకు నేర్పిస్తూ ఆమెను చివరకు నర్సు ట్రైనింగ్ కూడా పంపారు.

హాస్పటల్‌కి కొన్ని ఆపరేషన్లు చేయడానికి కళ్యాణచక్రవర్తిగారు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో కళ్యాణి అక్కడే ఉండి తన సహాయం వాళ్ళకి అందించేది.

కళ్యాణ్ చక్రవర్తిగారికి భార్య అంటే పిచ్చి ప్రేమ. అయితే విధి ఆడించిన వింత నాటకంలో అతనికి భార్య శాశ్వతంగా దూరమయింది. అప్పటి నుండి అతనిలో నైరాశ్యం చోటు చేసుకున్నాయి.

అటువంటి అతనిలో క్రమేపి మార్పు వచ్చింది కాలంతో పాటే. కళ్యాణిలో తన భార్య చేతలు, భావాలు అగుపించాయి అతనికి. అందుకే ఆమెను అభిమానించడం ఆరంభించాడు. ఆమె కార్యకుశలతను మెచ్చుకొనే వాడు కొన్ని సందర్భాల్లో.

“కళ్యాణీ! డాక్టర్ గారి మీద నీ అభిప్రాయం ఏంటి?” ఓ రోజు సుధగారు ఆమెను అడిగారు.

“అతను చాలా మంచి మనిషి” అంది కళ్యాణి.

“గుడ్! ఆ మాత్రం అతని మీద నీకు ఆ మంచి అభిప్రాయం ఉన్నందుకు. అయితే ఒక్క మాట. నీవు నీ భర్తను పోగొట్టుకున్నట్టే అతను కూడా భార్యకు దూరమయ్యాడు” అన్నారామె.

అతను భార్యకు దూరమయిన దురదృష్టవంతుడు అయినా తను మాత్రం భర్తను పోగొట్టుకున్న అదృష్టవంతురాలు. ఎందుకంటే భర్త వలన ఎన్నో బాధలు పడింది అనుకుంది కళ్యాణి.

“నా మాటలు వింటున్నావా?” ఆవిడ అడిగారు.

“వింటున్నాను చెప్పండి మేడమ్” అంది కళ్యాణి.

“భార్య చనిపోయన తరువాత అతను మరెవ్వరినీ పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడలేదు. నిన్ను చూసే వరకూ. నిన్నూ నీ ప్రవర్తన చూసిన తరువాత అతని నిర్ణయం మారింది. అతను నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారు.

నీ నిర్ణయం నాకు వెంటనే చెప్ప అవసరం లేదు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. నా ఉద్దేశం మాత్రం ఇలా ఉంది. నీవు ఈ పెళ్ళికి అంగీకరిస్తేనే మంచిదని. ఎందుకంటే నీలాంటి వారు సమాజంలో ముందు ముందు ఒంటరిగా జీవనపోరాటం చేయలేరు” డాక్టరు సుధగారు అన్నారు కళ్యాణితో.

“నన్ను ఆలోచించుకోనీండి మేడమ్!” అంది కళ్యాణి.

“నీవు ఆలోచించడమే కాకుండా మీ వాళ్ళను కూడా ఒప్పించాలి” సుధగారు కళ్యాణితో అన్నారు. ఆమె ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోయినా తనే ఏదో నిశ్చయానికి రావాలి ముందడుగు వేయాలి అనుకుంది.

“కళ్యాణి! నీతో కళ్యాణ చక్రవర్తి గారు మాట్లాడుతారు. ఈ అవకాశం మిస్ చేసుకోకు” డాక్టరు సుధ అన్నారు కళ్యాణితో.

అలాగే అన్నట్టు తలూపంది కళ్యాణి.

నర్సింగ్ హోమ్‌లో చిన్న పూల తోటలో కళ్యాణ చక్రవర్తి కళ్యాణీ కలుసుకున్నారు. “కళ్యాణీ! నీ గురించి సుధగారు అంతా చెప్పారు. నా గురించి కూడా ఆవిడ నీకు చెప్పే ఉంటారు. అయితే నా జీవితం తెరిచిన పుస్తకం. నేనేం సంఘసంస్కర్తను కాదు. గొప్పవాడ్ని అంతకన్నా కాదు.

నీకు తెలిసే ఉంటుంది. నా భార్య అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆమె నా జీవిత సర్వస్వం అని అనుకుంటున్న సమయంలోనే విధి ఆడించిన వింత నాటకంలో నేను ఏకాకిగా మిగిలిపోయాను” ఒకింత బాధతో నుదురు కొట్టుకుంటూ అన్నరాయన. కళ్యాణి సానుభూతిగా బాధపడ్తూ అతని వేపు చూసింది. ఆయన తిరిగి “అసలు ప్రస్తావనకు వస్తున్నాను. నిన్ను చూసిన తరువాత నా నిర్ణయం మారింది. జీవితాంతం పెళ్ళి చేసుకోకుడదనుకున్నాను నేను. కానీ ఇప్పుడు నిన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాను. ఎందుకంటే నా భార్య భావాలు ఆలోచనలు నీలో అగుపించాయి. అనుకోకుండా మనిద్దరి పేర్లు కలిసాయి. నా నిర్ణయం ఆమోదిస్తావని అనుకుంటున్నాను” అన్నాడు డాక్టరు కళ్యాణచక్రవర్తి.

“నాకు ఇష్టమే!” అంది తల వొంచుకుని. ఆమె మాటలకు అతని వదనంలో సంతోషరేఖలు తళుక్కుమన్నాయి. “నేను చాలా అదృష్టవంతుడ్ని. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. హామీ ఇస్తున్నాను” అతను అన్నాడు. అతని వంక కృతజ్ఞతా పూర్వకంగా చూసింది ఆమె. ఆ తరువాత ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి విముఖత చూపినా పెళ్ళి జరిగిపోయింది.

***

“కళ్యాణీ! నీకూ ఎన్నో పర్యాయాలు చెప్పేను. గతాన్ని ఓ పీడకలలా మరిచిపోవడానికి ప్రయత్నించాలని” కళ్యాణి ఆలోచన్లు కనిపెట్టిన కళ్యాణచక్రవర్తి అన్నాడు.

కళ్యాణి తన పనిలో నిమగ్నమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here