[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]పొ[/dropcap]ద్దున్నే పనుల్లో బిజీగా ఉండగా తమ్ముడు ఫోన్ చేసేడు.. “ఏంట్రా తంబీ ఇంత పొద్దున్నే…” అంటే, “అక్కయ్యా, శీనూ మీ ఇంటిగ్గానీ వచ్చేడా?” అనడిగేడు. “లేదురా, ఏం…” అన్నాను. “శీనూ ఇంట్లోంచి వెళ్ళిపోయేడే… మాకు చాలా ఖంగారుగా ఉంది. ఓసారి రావే…” అన్నాడు. నాకు ఒక్కసారి షాక్‌లా అనిపించింది. శీనూ మా తమ్ముడి పెద్దకొడుకు. ఇంటర్ చదువుతున్నాడు. ఏమాట కామాటే చెప్పుకోవాలి, కుర్రాడు ఈ రోజుల్లో ఇంటర్లోకి రాగానే తలెగరేసుకు తిరిగే కొందరి పిల్లల్లాంటివాడు కాదు. బుధ్ధిమంతుడు. మా తమ్ముడు, మరదళ్ళ చక్కటి పెంపకం వల్ల చక్కగా చదువుకుంటున్నాడు. అల్లరి చిల్లరగా తిరిగే మూకతో అస్సలు చేరడు. మరి అలాంటివాడు ఇంట్లోంచి వెళ్ళిపోడమేంటీ! వెంటనే ఆటో చేసుకుని అరగంటలో తమ్ముడింటికి చేరిపోయేను.
అక్కడ సీన్ ఇలా ఉంది. వంటింటి గుమ్మంలో కూలబడి మరదలు శారద కొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. నాల్రోజులక్రితం ఊర్నించి వచ్చిన పెద్దమ్మ శారద పక్కన కూర్చుని ఓదారుస్తోంది. అమ్మ హాల్లో సోఫాలో విచారంగా కూర్చుని ఉంది. తమ్ముడు ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
“నాన్నగారేరి?” అన్న నా మాటకి “శీనూని వెదకడానికి వెళ్ళేరు…” అంది నెమ్మదిగా అమ్మ.
“అసలేమైంది? రాత్రే వెళ్ళిపోయేడా, పొద్దున్నా? మీరెప్పుడు చూసుకున్నారూ? వాడిని ఎవరైనా ఏమైనా అన్నారా?“ అన్న నా ప్రశ్నలకి అక్కడ దొరికిన సమాచారం ఇలా ఉంది.
తెల్లారగట్ల నాలుగ్గంటలకి వాళ్ళమ్మ వాడిని లేపి, బోర్నవిటా కలిపిచ్చిందిట. అది తాగి వాడు పుస్తకాలు ముందేసుకుని చదువుకోవడం మొదలు పెట్టేడుట. కాసేపటికి అమ్మ, పెద్దమ్మ కూడా లేచి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటుంటే శీనూకి ఎక్కిళ్ళు వచ్చేయిట. అమ్మ మంచినీళ్ళు పట్టికెళ్ళి ఇస్తే తగ్గలేదుట. తమ్ముడు పంచదారనీళ్ళు కలిపిస్తే కూడా తగ్గలేదుట. నాన్నగారు కాస్త అమృతాంజనం తీసుకుని వాడికి గుండెలమీద, వీపుమీద రాసేరుట. అయినా తగ్గలేదుట. వీళ్లందరూ ఇలా వాడి చుట్టూ తిరుగుతుంటే పెద్దమ్మ ఒక్కసారిగా “అయ్యో అయ్యో, నా గొలుసు పోయింది నాయనోయ్, నా గొలుసు పోయింది” అని పెద్దగా అరవడం మొదలుపెట్టిందిట. అందరి దృష్టీ పెద్దమ్మ వైపు తిరగ్గానే “నాలుక్కాసుల గొలుసు, దుక్కలా గుంటుంది, ఇక్కడే పెట్టేను”. అంటూ ఇల్లంతా హడావిడిగా వెతికెయ్యడం మొదలుపెట్టిందిట. కాసేపు పెద్దమ్మ గొలుసు కోసం అందరూ వెతికేరుట. శీనూ కూడా వెతుకుదామనుకున్నాట్ట కానీ పాపం వాడికి ఆ ఎక్కిళ్ళే తగ్గకపోగా ఇంకా వెంటవెంటనే రావడం ఎక్కువయిందిట. అందరూ ఇంట్లో హడావిడిగా అంతా తిరిగేస్తుంటే పెద్దమ్మ హఠాత్తుగా శీనూ దగ్గరికొచ్చి, వాడి మొహం మీద చెయ్యాడిస్తూ, “ఇదిగో, ఈ వెధవే తీసేడు నా గొలుసు. ఇవ్వరా ఎక్కడ దాచావో” అందిట. పెద్దమ్మ మాటలకి శీనూ స్థాణువైపోయేడుట. మిగిలిన వాళ్లందరూ పెద్దమ్మని లోపలికి తీసుకుపోయి అసలు నువ్వు గొలుసు నీతో తెచ్చుకున్నావా, లేదా గుర్తు చేసుకో అంటూ అడగడం మొదలుపెట్టారుట.
అందరూ తనని అలా నిలదీస్తుంటే పెద్దమ్మ నవ్వుతూ “అబ్బే, ఉట్టినే అలా చెప్పేను. మన శీనూగాడికి ఎక్కిళ్ళొస్తున్నాయి కదా! అవెంతకీ తగ్గటం లేదు. అలా ఎక్కిళ్ళు తగ్గకపోతే వాళ్లని ఒక్కసారిగా భయపెడితే అవి తగ్గుతాయని చెప్తారు. అందుకని వాణ్ణి అలా భయపెట్టేను. చూడండి, వాడికి ఎక్కిళ్ళు తగ్గిపోయుంటాయీ…” అందిట. పెద్దమ్మ మాటలకి తెల్లబోయిన అందరూ ముందుగదిలోకి వచ్చి చూసేటప్పటికి అక్కడ శీనూ లేడుట. ఇది జరిగి అప్పుడే నాలుగ్గంటలయింది. అదిగో, అప్పట్నించీ శీనూ ఎక్కడి కెళ్ళాడోనని అందరూ గాభరా పడుతున్నారు.
నాకు మతి పోయింది. ఇలా భయపెడితే ఎక్కిళ్ళు తగ్గుతాయంటే మటుకు పెద్దమ్మ అలా చిన్నపిల్లాడిని భయపెట్టేస్తుందా! అందరి దగ్గరా ప్రేమే తప్పితే ఎప్పుడూ ఎవరిచేతా ఒక్కమాట కూడా అనిపించుకోని పిల్లాడు, ఇవాళిలా పెద్దమ్మ నువ్వు దొంగవీ అనగానే ఎంత బాధపడ్దాడో. ఎక్కడికి పోయేడో వెర్రివెధవ. పెద్దమ్మ వైపు కోపంగా చూసేను. “నాకేం తెలుసే అలా వెళ్ళిపోతాడనీ… ఎక్కిళ్ళు తగ్గుతాయని అన్నాను. అలా అన్నందుకు అందరిలాగా కాసేపు ఏడ్చి ఊరుకుంటాడనుకున్నాను కానీ…” అనింకా ఏదో అనబోతున్న పెద్దమ్మని నేను గట్టిగా ఏదో అనబోతుంటే గుమ్మంలో నాన్నగారు శీనూని భుజం చుట్టూ చెయ్యేసి తీసుకురావడం కనిపించింది. శారద ఒక్క ఉదుటున లేచి శీనూని పట్టేసుకుంది. “ఎక్కడున్నాడు నాన్నా…” అనడిగితే పాపం అంత పెద్ద షాక్‌కి వాడికి ఎక్కడి కెళ్ళాలో తెలీక వీధి చివరి పార్కులో కూర్చుండి పోయేడుట. నాన్నని చూడగానే, “నేను గొలుసు తియ్యలేదు తాతయ్యా, నేను దొంగని కాదు” అని పట్టుకుని ఏడవడం మొదలు పెట్టేడుట. అప్పుడు నాన్నగారు పెద్దమ్మ విషయం వివరంగా చెప్పి, వాణ్ణి సముదాయించి ఇంటికి తీసుకొచ్చేరుట.
అందరికీ ఎంత రిలీఫ్‌గా అనిపించిందో. పెద్దమ్మని ఒక శత్రువులా చూసేం. పెద్దమ్మేవయినా తక్కువ తిందా… “ఏదో మంచికి పోతే చెడు ఎదురైందన్నట్టు నన్నంటారేవిటే.. రేప్పొద్దున్న చదువూ, ఉద్యోగం అంటూ నాలుగు రకాల మనుషుల మధ్య బతకాల్సిన పిల్లాడు. ఒక్క చిన్న మాటకే ఇలా అయిపోతే రేప్పొద్దున్న ఎలా బతుకుతాడూ? బాబూ, నాన్నా అంటూ మీ ప్రేమలు మండినట్టే ఉన్నాయి కానీ వాడికి కాస్త గట్టితనం నేర్పి లోకంలో ఎలా బతకాలో చెప్పండి కాస్త…” అని మాకే హితోపదేశం చేసింది. అవునా! పెద్దమ్మ చెప్పినమాట నిజమేనా!…