[dropcap]మ[/dropcap]న దేశంలో అన్ని మతాలలో ఉపవాసానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఇది శరీరానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండటం. అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలిసి ఉంటే తెలుస్తుంది. ఉపవాసం భగవదనుగ్రహం కోసం చేస్తారన్నది జగద్విదితమైన విషయం. కనుక ఉండవలసింది భగవంతుని సమీపంలో. ఇంటిపని వంట పని తగ్గితే సమయమంతా భగవద్ధ్యానంలో గడపటానికి వీలుగా ఉంటుంది. బరువైన, అరగటానికి కష్టమైన ఆహారం తీసుకోక పోవటంతో జీర్ణ వ్యవస్థకి వెచ్చించాల్సిన శక్తి కూడా భగవద్ధ్యానానికో, పూజకో వెచ్చించటానికి వీలవుతుంది.
ఈ ఉపవాసాలు మన కోరికలను తీర్చే సాధనం మాత్రమే అయినప్పటికీ, వాటిని పాటించడం ద్వారా మన జీర్ణవ్యవస్థ కూడా చక్కగా ఉంటుంది. వారానికి ఏడు రోజులు ఉపవాసం, విశ్వాసంతో పాటిస్తే, మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మన మనస్సు, ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది. శతాబ్దాలుగా ఋషులు అందరు దేవతలను పూజించడంతో ఉపవాసం ఉండడానికి కారణం ఇదే.
ఉపవాసం చేయడం వల్ల శరీరంలో హార్మోన్లు, కణాలు, జన్యువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తాయి. అదే సమయంలో.. జన్యువుల కార్యాచరణ పెరుగుతోంది. ఉరుకులు పరుగులు పెట్టించే ఈ ఆధునిక కాలంలో జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్ల వల్ల చాలా మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కానీ పండుగ పర్వ దినాలలో, కొన్ని విశిష్టమైన తిథులలో ఉపవాసం ఉండడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అడపాదడపా ఉపవాసం రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఉపవాసం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే శరీరంలోని మూలకణాలు, రోగనిరోధక వ్యవస్థ.. మరింత పారదర్శకంగా పనిచేయడానికి, ట్యూమర్ కిల్లింగ్ సెల్స్ ఉత్పత్తి పెరగడానికి ఉపవాసం సహాయపడుతుంది.
ఉపవాసం ఉన్న వ్యక్తి తన మనసులోకి చెడు ఆలోచనలు ప్రవేశించడానికి అనుమతించడు. అతను రోజంతా దేవునికి సమీపంగా వుండడానికి ప్రయత్న్సిస్తాడు కాబట్టి అతను ఒత్తిడి, ఆందోళన , నిద్రలేమి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. అతని మనస్సు శాంతిస్తుంది.
అప్పుడప్పుడు సందర్భాలను బట్టి ఉపవాసం చేయడం వలన మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందుతుందని ఆధునిక వైద్య శాస్త్రం కూడా స్పష్టం చేస్తోంది.