[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.
“మహీపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘మొదటికే మోసం’ అనే కథ చెపుతాను విను.” అంటూ బేతాళుడు చెప్పసాగాడు.
***
అమరావతి నగర చేరువలోని అడవిలో ఎండు కట్టెలు సేకరించి వాటిని ముక్కలుగా చేసి నగరంలో అమ్ముతూ జీవించే శివయ్య అనే వ్యవసాయ కూలీ ఉండేవాడు.
ఒక రోజు అడవిలో కట్టెలు సేకరిస్తు ఉండగా చేరువలో “రక్షించండి”, “కాపాడండి” అన్నపిలుపు విని ఆ దిశగా చేతిలోని గొడ్డలితో పరుగు తీసాడు శివయ్య. అక్కడ ఎలుగుబంటి ఒక సాధువును తరుముతూ కనిపించింది. చేతిలోని గొడ్డలితో దాన్ని గాయపరిచాడు శివయ్య. బెదిరిన ఎలుగుబంటి అడవిలోనికి పరుగుతీసింది.
“స్వామీ భయపడకండి. అది గాయపడి వెళ్లిపోయింది” అని తినడానికి ఫలాలు, మంచినీరు ఆ సాధువుకు అందించాడు. స్తిమితపడిన సాధువు “నాయనా నా ప్రాణదాతవు. ఏం కావాలో కోరుకో. నీ కోరిక తప్పక తీరుస్తాను” అన్నాడు.
“స్వామి నేను ప్రతి దినం ఇలా కష్టపడకుండా నా కుటుంబంతో జీవితాంతం సుఖంగా జీవించే మార్గం ఏదైనా చెప్పండి” అన్నాడు.
“ఈ రోజు రాత్రి నీకు కలలో కనిపించే ప్రదేశంలోని చెట్టు మొదట్లో బంగారు నాణాల నిధి ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకుని సగ భాగం దేవాలయం లోని హుండీలో వేయి, మిగిలిన సగభాగంతో నీ కుటుంబంతో హాయిగా జీవించు” అని సాధువు దీవించాడు.
“అలాగే స్వామీ, మొదట నేను పొందిన దానిలో సగ భాగం మా ఊరి మల్లికార్జున స్వామి ఆలయంలో యిస్తాను” అన్నాడు శివయ్య.
ఆశీర్వదించి తన దారిన వెళ్లిపొయాడు సాధువు.
ఆ రాత్రి శివయ్యకు అడవిలోని చింతల తోపు మధ్య ఉన్న పనస చెట్టు కనిపించింది. మరుదినం గొడ్డలి బదులు గడ్డపార, మట్టి తీయడానికి పార తీసుకుని వెళ్ళి, చింతల తోపు మధ్యన ఉన్న పనస చెట్టు మొదట్లో తవ్వగా, చాలా బంగారు నాణాలు కనిపించాయి. అవి చూసిన శివయ్య క్షణకాలం ఆలోచించి, రెండు బంగారు నాణాలు తీసుకుని యథావిధిగా తవ్విన చోట మట్టివేసి చదును చేసి, ఆలయం చేరుకుని దేవుని హుండీలో బంగారు నాణం వేసే సరికి రాత్రి సమయం కావడంతో ఇల్లు చేరాడు.
“ఏదో నిధి తెస్తాను అన్నారుగా, చేతులు ఊపుకుంటూ వచ్చారే” అంది శివయ్య భార్య ఉమ.
“ఓసి పిచ్చిదానా, మొత్తం తీసుకుంటే సగం దేవునికి ఇవ్వాలి. అందుకే మొదట నేను పొందిన దానిలో సగ భాగం దేవునికి ఇస్తాను అని సాధువుతో చెప్పాను. మొదట నేను పొందిన దానిలో సగం దేవుని భాగం ఇచ్చాను, రేపు మరోసారి పొందే భాగంలో దేవునికి భాగం ఇవ్వనవసరం లేదుగా” అన్నాడు శివయ్య.
“ఎంత తెలివైనవారండి మీరు” అన్నది శివయ్య భార్య.
తెల్లవారుతూనే అడవిలోనికి వెళ్లిన శివయ్యకు పనసచెట్టు మొదట్లో పెద్ద గొయ్యి కనిపించింది.
***
కథ చెప్పడం పూర్తి చేసిన బేతాళుడు “రాజా, ఎందుకు అతనికి అక్కడ నిధి కనిపించకుండా పోయిందో తెలిసి చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు.
“బేతాళా, శివయ్య దేవుని మోసగిద్దాం అనుకున్నాడు. ముందు రోజు శివయ్య నిధి తవ్వడం ఎవరో రహస్యంగా గమనించి అదే రోజు రాత్రి ఆ నిధిని తవ్వి తీసుకుపోయారు. చెరపకురా చెడేవు అని పెద్దలు ఏనాడో చెప్పారు కదా! మొదటికే మోసం వచ్చింది. శివయ్య దేవునే మోసగించబోయి తానే మోసపోయాడు” అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.