ఈ తరం కథ

1
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]తూ[/dropcap]ర్పున వెలుగురేకలు విచ్చుకుంటున్నాయి. చలికాలం కావటం వల్ల ఉదయం ఆరుగంటలు దాటినా ఇంకా మసకమసకగానే ఉంది. రాత్రి కురిసిన మంచు బిందువులు కరిగి పూలమొక్కల ఆకుల మీద నుంచీ బొట్లుబొట్లుగా జారుతున్నాయి. సత్యవాణి ఉదయాన్నే లేచి, స్నానం చేసి కిచెన్‌లో పెనం మీద అట్లు వేస్తూంది. గిరిధర్ కూడా స్నానం చేసి వచ్చి సోఫాలో కుర్చుని ఆ రోజు వార్తాపత్రిక తిరగేస్తున్నాడు.

సత్యవాణి చేతులు కొంగుకు తుడుచుకుంటూ హాలు లోకి వచ్చింది. “టిఫెన్ రెడీ అయింది. డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారా! ఇక్కడికి తెమ్మంటారా!” అడిగింది.

“ప్రశాంత్‌ని కూడా రానీ వాణీ! అందరం కలసి తినవచ్చు. నిద్ర లేచాడేమో చూసిరా!” అన్నాడు.

సత్యవాణి డైనింగ్ రూమ్ పక్కన ఉన్న బెడ్ రూమ్ డోర్ దగ్గర నిలబడి “ప్రశూ!” అని పిలిచింది. సమాధానం లేదు. డోర్ కొద్దిగా నెట్టిచూసింది. బోల్ట్ పెట్టి లేదు. ప్రశాంత్ పక్కమీద దిండు, దుప్పట్లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తిరిగివచ్చి “వాడు వాకింగ్‌కి వెళ్ళినట్లున్నాడండీ! మీరు తినండి” అన్నది. “సరే! వడ్డించు” అన్నాడు గిరిధర్ లేస్తూ.

ఉదయం ఎనిమిది గంటలు అయింది.  ప్రశాంత్ ఇంకా రాలేదు. కొడుక్కి ఇష్టమైన మినప రొట్టె, అందులోకి అల్లం చెట్నీ చేసింది సత్యవాణి. టిఫెన్ చల్లారిపోతూంది. అతను ఇంకా రాలేదు. సత్యవాణి ప్రాణం ఉసూరుమంది. టైం తొమ్మిది దాటింది. పదయింది. ఎదురుచూపులు కాస్తా ఆందోళనగా మారింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూంది. ఎక్కడికి వెళ్లి ఉంటాడు? చిన్నపిల్లాడు కాదే! యం.టెక్., చేసి ఉద్యోగం చేస్తున్నాడు. పాతికేళ్ళ వయసు. ఆలోచనగా అనుకుంది.

“ఒకవేళ వాళ్ళ ప్రెండ్ ఇంటికి వెళ్లాడేమో! అడిగి చూడండి” అన్నది. గిరిధర్ తనకు తెలిసిన కొడుకు ప్రెండ్స్ నంబర్లు నాలుగిటికి కాల్ చేసాడు. అందరూ ప్రశాంత్ తమ దగ్గరకు రాలేదని చెప్పారు. ఎదురుచూసీ, చూసీ విసుగెత్తి సత్యవాణి కొడుకు బెడ్ మీద పక్కబట్టలు సర్దుదామని ఆ గదిలోకి వచ్చింది. దుప్పట్లు దులిపి, మడత పట్టి, పుస్తకాలు సర్దటం కోసం రీడింగ్ టేబుల్ దగ్గరకి వచ్చింది. అక్కడ ఒక లావాటి పుస్తకంలో తెల్ల పేపర్ గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. సత్యవాణి గభాలున అందుకుని విప్పిచూసింది.

“మమ్మీ! డాడీ! నేను, లాస్య ప్రేమించుకున్నాం. మీకు చెబితే ఒప్పుకోరని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. నా కోసం వెతకవద్దు” అని ఉంది. అది చూడగానే “ఏమండీ!” అంటూ బావురుమంది సత్యవాణి. గిరిధర్ పరుగులాంటి నడకతో ఆ గదిలోకి వచ్చాడు. ఆయనకి కాగితం అందించింది. అది చదువుతూంటే గిరిధర్ ముఖం నల్లగా అయింది.

గంట గడిచినా సత్యవాణి దుఃఖం చల్లారలేదు. గిరిధర్ ఎంత ఓదార్చినా ఏడుస్తూనే ఉంది. “పాతికేళ్ళు అష్టకష్టాలు పడి పెంచిన బిడ్డని ప్రేమ పేరుతో గద్దల్లాగా తన్నుకుపోతున్నారు ఆడపిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ ఇందుకేనా!” అన్నది.

“తప్పు. అలా అనకూడదు. అందులో మనవాడి ప్రమేయం ఎంత ఉందో ఎవరికి తెలుసు?” అన్నాడు గిరిధర్.

“ప్రశాంత్ మాత్రం కళ్ళు మూసుకుపోయి అలా ఎలా వెళ్ళాడండీ! ప్రేమగా చూసి పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా! వాడికి మనం ఎంత చాకిరీ చేశాం? జ్వరం వస్తే నేను రాత్రంతా మేలుకుని కూర్చునేదాన్ని. వాడి చదువు కోసం మీరు తిండీతిప్పలు కూడా ఆలోచించకుండా ఓవర్ డ్యూటీలు చేసారు. ఆ పిల్ల మైకంలో పడి అన్నీ మర్చిపోయాడు” మళ్ళీ ఏడుపు ఉధృతంగా వచ్చింది.

“కన్నందుకు పిల్లల్ని పెంచటం మన బాధ్యత. తర్వాత వాళ్ళ ఇష్టం. పక్షులు కూడా పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వదలివేస్తాయి. మనలాగా పట్టుకుని ఉంచవు” అన్నాడు గిరిధర్.

“అందరూ ఈ ఉదాహరణ ఒకటి చెబుతారు. పక్షులకు సెంటిమెంట్ ఉండదు. బంధాలు ఉండవు. మనం పక్షులం కాదు, మనుషులం. వాటికి లాగా వదిలేసి ఉండలేము” అన్నది.

ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సత్యవాణి ఏడుపు ఉపశమించింది. లేచి, ఏదో పని మీద పెరటివైపు వచ్చింది. పక్కింటి ఆమె గోడ మీదనుంచీ చూస్తూ “వాణీ గారూ!” అని పిలిచింది. సత్యవాణి అటు చూసింది. “మీ అబ్బాయి ఎవరో అమ్మాయని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడట. మా అబ్బాయి క్లాస్‌మేట్లు మీ అబ్బాయి ప్రెండ్స్ అట. తను చూసి చెప్పాడు” అన్నది.

‘అప్పుడే మీ దాకా వచ్చిందా విషయం?’ అనుకుంది.

“నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకున్నారట. తల్లిదండ్రులు చెప్పినట్లు వినేటట్లు ఉన్నారా ఈ కాలం పిల్లలు? వాళ్ళేమిటో! వాళ్ళ వ్యవహారాలే మిటో? అన్నీ సీక్రెట్లు..” పక్కింటామె చెబుతూనే ఉంది. సత్యవాణి ఇంట్లోకి వచ్చేసింది.

***

గిరిధర్ – సత్యవాణి, ప్రశాంత్ – లాస్య, లాస్య తల్లిదండ్రులు రణధీర్ – సునందలు పోలీస్ స్టేషన్‌లో కూర్చొని ఉన్నారు. అందరి ముఖాలూ సీరియస్‌గా ఉన్నాయి. అప్పటికి ప్రశాంత్, లాస్యల వివాహం అయి వారం రోజులు అయింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ వారందరి వంకా చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రశాంత్, లాస్య తామిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామనీ, తమ తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదనీ, వారి నుంచీ రక్షణ కల్పించాలనీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ ఇద్దరి తల్లిదండ్రులనీ స్టేషన్‌కి పిలిపించాడు. ఏనాడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సత్యవాణికి అక్కడ వాతావరణం చూస్తూంటే బెంబేలుగా ఉన్నది. భయంభయంగా చూస్తూ కూర్చుంది.

రణధీర్ ముఖం గంభీరంగా పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన కాంట్రాక్టర్ పనిచేసి చాలా సంపాదించాడు. లాస్య ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచీ అమ్మాయి నోట్లో నుంచీ మాట రాకముందే కావలసినవి తెచ్చి ఇచ్చేవాడు. గారాబంగా పెంచాడు. ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచిపోయింది లాస్యకు. అలా పెంచిన తండ్రి నుంచీ రక్షణ కల్పించాలని కంప్లైంట్ ఇచ్చింది. అది వినగానే అయన ముఖం ఎర్రబడింది. త్యాగాలు చేయవలసిన అవసరం లేదు గానీ, అందరూ తల్లిదండ్రుల కన్నా మిన్నగానే చూసాడు. కూతురు చేసిన పని ఆయనకు గుండెల్లో పొడిచినట్లుంది. లాస్య అందరి ముఖాల్లో ఫీలింగ్స్ ని కుతూహలంగా చూస్తూంది. సెన్సేషన్ సృష్టించినట్లు ఆనందంగా ఉంది ఆ అమ్మాయికి.

“ఇప్పుడు ఏం చేద్దామనుకుంటునారు? మీ పిల్లలిద్దరికీ మైనారిటీ తీరిపోయింది. మేజర్లుగా వారికిష్టమైన పెళ్లి చేసుకునే హక్కుంది. పైగా చట్టబద్ధంగా రిజిస్టార్ ఆఫీస్‌లో పెళ్లి కూడా అయింది. ఇక మీరు చేయగలిగేది ఏముంది? మీకు ఇష్టమున్నా, లేకపోయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

“మా వాడు ఏ అమ్మాయిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. వాడు సుఖంగా ఉండటమే మాకు కావలసింది. ఏం వాణీ!” అన్నాడు గిరిధర్.

“నాకు కూడా ఇష్టమే!” ముఖం తిప్పుకుంది సత్యవాణి.

“మా అమ్మాయి ఇష్టాన్ని మేము ఏనాడూ కాదనలేదు. ఇప్పుడు కూడా అంతే! అసలు ఈ విషయాన్ని ముందే చెబితే నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసేవాడిని” అన్నాడు గిరిధర్.

“అంతే! అంతే!” అన్నది సునంద నీరసంగా. ఆమెకి ఈ వాతావరణం నుంచీ తొందరగా బయటపడితే మంచిది అనిపిస్తూంది.

“ఇంకేమిటి ప్రాబ్లం?” అన్నాడు ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, లాస్య వంక చూస్తూ. వాళ్ళు ఇంత తేలికగా అంగీకరించేసరికి ఏం మాట్లాడాలో తోచలేదు ప్రశాంత్‌కి. “ప్రాబ్లం ఏమీ లేదు” అన్నాడు అప్రయత్నంగా.

“కానీ మాకు వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టంలేదు. విడిగా ఉంటాం. కావాల్సిన ఏర్పాట్లు చేయమనండి” అన్నది లాస్య మొండిగా.

“సరే!” అన్నాడు రణధీర్. “ఇక అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళండి” అన్నాడు ఇన్ స్పెక్టర్.

***

ప్రశాంత్, లాస్య విడిగా కాపురం పెట్టి నెలరోజులు అయింది. లాస్య తండ్రి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అందులో కావలసిన సామగ్రి అంతా ఏర్పాటు చేసి, కూతురికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ప్రశాంత్, లాస్య ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి. చేతిలో డబ్బు ఉంది.  కావలసినంత స్వేచ్ఛ ఉంది. ప్రశాంత్ ఇంటికి వెళ్లి రోజూ తను వాడుకునే బైక్ తీసుకువచ్చాడు. లాస్యకు కొత్త బండి కొనిపెట్టాడు.

ఉదయాన్నే ఇద్దరూ రెడీ అయి ఉద్యోగానికి బయలుదేరతారు. హోటల్లో టిఫెన్ చేసి ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళతారు. మద్యాహ్నం ఆఫీస్ క్యాంటిన్‌లో లంచ్. సాయంత్రం ఇంటికి వచ్చి బండిమీద అలా షికారు వెళ్ళటమో,  సినిమాకి వెళ్ళటమో చేసి, వచ్చేటప్పుడు రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. రాత్రికి స్వర్గం చూడటం. నూతన దాంపత్యపు రుచితో మధువు గ్రోలుతున్నట్లు ఉంది ఇద్దరికీ.

రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలల్లో ఒక్కరోజు కూడా ఇంట్లో వంట చేయలేదు లాస్య. ప్రశాంత్ తల్లి హోటల్ భోజనం చేస్తే ఆరోగ్యం పాడవుతుందని, రోజూ కొడుకుకి లంచ్ బాక్స్ ఇస్తుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే కమ్మగా వండిపెడుతూ ఉంది. ఏ ఆరు నెలలకో, సంవత్సరానికో ఒకసారి తప్ప బయట భోజనం చేయరు. బయట తిళ్ళు అలవాటు లేని ప్రశాంత్‌కి ఈ రెండు నెలలు బయట తిని, తిని జిహ్వ చచ్చిపోయినట్లుంది.

ఆరోజు ఆదివారం. “రోజూ హోటల్లోనే తింటున్నాంగా! ఇవాళ ఇంట్లో వంట చేస్తే బాగుంటుంది” అన్నాడు ప్రశాంత్.

“ఓ.కె., విత్ ప్లెజర్” బెడ్ మీద బాసిపెట్టు వేసుకుని, రెండు చేతులూ ఒళ్ళో పెట్టుకుని ఊగుతూ అన్నది లాస్య.

“అన్నం ఎలా వండుతారు?” అడిగాడు కుతూహలంగా.

“నీకు కూడా రాదా?” అన్నది.

“నీకు కూడా.. అంటే? నీకు రాదా?”

“ఉహూ. నేనెప్పుడూ వండలేదు”

ఆ సమాధానానికి తెల్లబోయాడు. “ఇప్పుడెలా?” అన్నాడు.

“ఏముంది? గూగుల్‌లో సెర్చ్ చెయ్యి. ప్రొసీజర్ తెలుస్తుంది” అన్నది దిండుమీద వెనక్కువాలి ఆవలిస్తూ.

ప్రశాంత్ కిచెన్ లోకి వెళ్లి లాప్‌టాప్‌లో గూగుల్ సెర్చ్ కొట్టాడు. “రెండు కప్పుల బియ్యం తీసుకుని దానికి సరిపడా నీళ్ళుపోయాలి..” అని చదివాడు. ‘సరిపడా అంటే ఎంత?’ బుర్ర గోక్కున్నాడు. రెండు కప్పుల బియ్యం గిన్నెలోకి తీసుకుని రెండుకప్పుల నీళ్ళు కలిపాడు. ‘అన్నం మరీ కొంచమే అవుతుందేమో! బహుశా ఒక మనిషికి మాత్రమే చెప్పి ఉంటారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా!’ అనుకుని మరో రెండు కప్పులబియ్యం, నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టి ఇవతలకి వచ్చాడు.

లాస్య బెడ్ మీద కుర్చుని సెల్ ఫోన్‌లో వీడియోలు చూసుకుంటూంది. ప్రశాంత్ హాల్‌లో సోఫాలో కుర్చుని లాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. అరగంట అయింది. “ప్రశాంత్! కిచెన్‌లో నుంచీ ఏదో వాసన వస్తూంది. చూడు” పెద్దగా అరిచింది లాస్య.

‘అన్నం మాడినట్లుంది’ అనుకుంటూ గబగబా కిచెన్ లోకి వెళ్ళాడు. గిన్నె మీద మూత తీశాడు. అన్నం నల్లగా బొగ్గులాగా అయింది. గ్యాస్ కట్టేసి గిన్నె దించుతూంటే మెతుకులు గలగలా సౌండు చేశాయి. తీసుకువచ్చి లాస్యకి చూపించాడు.

“ఇది అసలు అన్నమేనా! ఇప్పుడు ఏం తినాలి? నాకు ఆకలి దంచేస్తూంది” ఏడుపు గొంతుతో అన్నది.

“నాకేం తెలుసు? భర్తకు వండి పెట్టాల్సిందిపోయి నా చేత చేయిస్తున్నావు” ఉక్రోషంగా అన్నాడు.

“నాకు రాదు” విసురుగా పెద్ద గొంతుతో అన్నది. “మా ఇంట్లో వంటమనిషే చేస్తుంది. ముందు ఏదైనా హోటల్‌కి వెళ్లి లంచ్ పార్సిల్ చేయించుకురా!” ఆర్డర్ వేస్తున్నట్లు అన్నది.

ప్రశాంత్‌కి ఒళ్ళు మండిపోయింది. అసలే కడుపులో ఆకలి నకనక లాడుతూంది. దాంతో కోపం ఉవ్వెత్తున లేచింది. “నా వల్ల కాదు. ఇంత ఎండలో బయటకి వెళ్ళలేను. నువ్వే వెళ్లి తీసుకురా!” అన్నాడు.

“నువ్వేదో నన్ను బాగా చూసుకుంటావని అనుకుంటే తినటానికి తిండి కూడా లేకుండా చేస్తున్నావు” ఏడుపు గొంతుతో అన్నది.

“బాగా చూసుకోవటానికి నువ్వేమైనా చిన్న పిల్లవా! నీకు మాత్రం బాధ్యత లేదా!”

“నేనిప్పుడే మా డాడీ దగ్గరకి వెళ్ళిపోతాను” ఏడుపు గొంతుతో లేవబోయింది.

ప్రశాంత్ గిన్నెని చప్పుడయ్యేటట్లు డ్రెస్సింగ్ టేబుల్ మీద విసురుగా పెట్టాడు. “ఆగు. నేనే వెళ్లి తీసుకువస్తాను” గోడకి తగిలించిన బండితాళాలు తీసుకుని కాళ్ళు బాదుకుంటున్నట్లు వెళ్ళిపోయాడు.

ప్రశాంత్ తెచ్చిన భోజనం తిని లాస్య బెడ్ రూమ్‌లో పడుకుంది. ఆరోజు మొట్టమొదటి సారిగా ఇద్దరూ మాట్లాడుకోలేదు. లాస్య బెడ్ రూమ్ లోనూ, ప్రశాంత్ హాల్‌లో సోఫా లోనూ పడుకున్నారు. ఆలోచిస్తుంటే ఆమెలో అన్నీ లోపాలు గానే కనిపించాయి. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొడుతూ కనబడుతుంది. ఇంట్లో ఒక్కపని కూడా చెయ్యదు. ఇంట్లో వంటచేయదు సరికదా, హోటల్ నుంచీ తెచ్చిన టిఫెన్‌లు తిని కాగితాలు డ్రెస్సింగ్ టేబుల్ మీద వదిలేస్తుంది. అవి ఎంతసేపైనా అలాగే ఉంటాయి. ఇల్లంతా దుమ్ముకొట్టుకుని నడుస్తూంటే నేలమీద అడుగులు కనిపిస్తూ ఉంటాయి. శలవురోజు వస్తే తెల్లవారిన తర్వాత పదిగంటల వరకూ నిద్రపోతూనే ఉంటుంది.

ఇంటి దగ్గర సత్యవాణి తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, పూజ చేస్తుంది. ప్రశాంత్ నిద్ర లేచేసరికి ఇల్లంతా అగరొత్తుల సువాసనతో గుబాళిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా, ముగ్గులు వేసి ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండి ప్రశాంతంగా ఉంటుంది. సెలవు రోజైనా, వర్కింగ్ డే అయినా తండ్రీ కొడుకులు కూడా ఉదయం అయిదు గంటలకే స్నానం చేస్తారు. తనకి, తండ్రికి దగ్గర ఉండి వడ్డిస్తూ ఉంటుంది తల్లి. అందరితో సౌమ్యంగా, గౌరవంగా మాట్లాడుతుంది. ఆ ఇల్లు ఎప్పుడూ శాంతి నిలయంగా ఉంటుంది. ఇక్కడ లాస్య నోటికి ఏ మాట పడితే ఆ మాట అంటుంది. ఎదుటి వారు హర్ట్ అవుతారేమో అని కొంచెం కూడా ఆలోచించదు. లాస్య అందం, నవ్వు మొహం చూసి ఆకర్షింపబడ్డాడు. పైపై మెరుగులు చూసి మోసపోయానేమో అని మొట్టమొదటి సారిగా అనిపించింది ప్రశాంత్‌కి.

బెడ్ రూమ్‌లో పడుకుని లాస్య కూడా ఆలోచిస్తూంది. తన తండ్రి ఎంతో గారాబంగా చూస్తాడు. అడిగినవన్నీ క్షణం ఆలస్యం చేయకుండా తెచ్చి ఇస్తాడు. తండ్రి కన్నా బాగా చూసుకుంటాడనే కదా ప్రశాంత్‌ని చేసుకుంది? ఏ వస్తువు కొనాలన్నా “అంత ఖరీదైనది ఇప్పుడు అవసరమా!” అంటాడు. డబ్బు పొదుపుగా వాడుకోవాలట. ఇలా రూపాయి, రూపాయి లెక్క చూసుకోవటం అంటే తనకు చిరాకు. డబ్బు పోతే పోయింది. కోరిక తీరటమే తనకి కావలసింది. మొన్నటికి మొన్న షాపింగ్ మాల్‌లో పదివేలు పెట్టి డ్రెస్ కొన్నది. నాలుగు రోజులు కట్టుకునే సరికి దాని మీద మోజుపోయింది. నీళ్ళు కిందపోతే ఇల్లు తుడిచే గుడ్డగా దాన్ని ఉపయోగించింది. అప్పుడు ఎంతసేపు లెక్చర్ ఇచ్చాడనీ! పైగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి ఇంటిపని వంటపనీ చూసుకోవాలట. అవన్నీ తనకి ఏం తెలుసు? తను మొహం కడుక్కోవాలంటే బ్రష్ ఎక్కడుందో ఇప్పటికీ తనకి తెలియదు. మమ్మీ అందిస్తుంది. రోషంగా అనుకుంది లాస్య.

లాస్య తనకి వంట చేతగాదు అని ఖచ్చితంగా చెప్పేసరికి ప్రశాంత్ తనే చెయ్యటానికి రెండురోజులు ప్రయత్నించాడు. తను కిచెన్‌లో వేడిలో మగ్గిపోతూంటే, లాస్య బెడ్ రూమ్‌లో ఏ.సి.వేసుకుని హాయిగా పడుకోవటం చూసి చిరాకువేసింది. ఇక ఈ పని నా వల్ల  కాదు అనిపించి, లాస్య కోసం భోజనం, టిఫెన్లు పార్సిల్ తెచ్చేవాడు. ఆఫీస్ పనికి తోడు ఇది అదనపు బాధ్యతగా మారేసరికి నాలుగు రోజుల్లో విసుగు వచ్చేసింది.

“నువ్వు ఉద్యోగం మానేసి ఇంటిపని చూసుకో! నేను ఒక్కడిని సంపాదిస్తే చాలదా!” అన్నాడు ఒకరోజు.

“నెవర్! నేను ఇంత కష్టపడి చదివింది ఇంట్లో వంట చేయటానికా! నువ్వే మానేయి” అన్నది.

“నాకు వంట రాదు”

“నాకు కూడా రాదు” విసురుగా అన్నది.

“రాకపోతే నేర్చుకో!” అన్నాడు.

“ఆ పనేదో నువ్వే చెయ్యి” అన్నది మొండిగా. ఇద్దరికీ మాటా మాటా  పెరిగింది. “నీతో పెళ్లి పెద్ద మిస్టేక్. నేను వెళ్ళిపోతాను” అన్నది.

ప్రశాంత్ ఆమె వంక సూటిగా చూసాడు. ఇదే మాట ఇప్పటికి నాలుగైదు సార్లు అన్నది. తనే తగ్గాడు. అంటే తనకి ఒక్కడికే నా భార్య కావలసినది? ఆమెకి భర్త అవసరం లేదా? ప్రశాంత్‌కి రోషం వచ్చింది. “వెళితే వెళ్ళు. నిన్నెవరూ ఇక్కడ ఉండమని బ్రతిమిలాడటం లేదు” అన్నాడు.

“మగాడికి నీకే అంత పౌరుషం ఉంటే ఆడదానికి నాకెంత ఉండాలి? గుడ్ బై!” విసవిసా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బైటకి వచ్చి “ఈ ఫ్లాట్ నాది. వెంటనే ఖాళీ చెయ్యి. సాయంత్రం సర్వెంట్ వచ్చి తాళం వేసి వెళతాడు” చెప్పి హై హీల్స్ టకటక లాడించుకుంటూ గబగబా వెళిపోయింది లాస్య.

***

ప్రశాంత్, అతని తల్లిదండ్రులు – లాస్య, ఆమె తల్లిదండ్రులు గంట క్రితం గిరిధర్ వాళ్ళింట్లో కలుసుకున్నారు. రణధీర్‌ను, సునందను గౌరవంగా లోపలకి ఆహ్వానించాడు గిరిధర్. రణధీర్ డబ్బున్నవాడినని దర్పం చూపలేదు. ఎంతో మర్యాదగా మాట్లాడాడు. కాఫీ టిఫెన్లు అయినాయి. ప్రశాంత్, లాస్య సీరియస్‌గా కూర్చున్నారు తప్ప పలకరించుకోలేదు. పెద్దవాళ్లందరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు.

“ఇంతకీ ఇప్పుడేమనుకుంటున్నావు బేబీ!” అన్నాడు రణధీర్.

“అతను నాకు కరెక్ట్ కాదు డాడీ! మా ఇద్దరికీ సెట్ అవదు. ఈ పెళ్లి అనేది ఒక మిస్టేక్” అన్నది లాస్య.

“ఎవరితో చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళారు. అప్పుడే మీ ప్రేమంతా పోయిందా!” వెటకారం ధ్వనించిన స్వరంతో అన్నది సునంద.

“మమ్మీ! నీకేం తెలియదు. నువ్వు మాట్లాడకు”

“నోర్ముయ్! గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు నీకు మహా తెలిసిందా! మీ జనరేషన్ వాళ్లకి ప్రేమించటం ఫాన్సీ. పెద్దలను ఎదిరించటం ఎడ్వెంచర్. కొంచెం కష్టం రాగానే విడిపోవటానికి రెడీ అవుతారు. మగపక్షి, ఆడపక్షి కొంతకాలం జత కడతాయి. గుడ్లు పెట్టగానే మగపక్షి ఎగిరిపోతుంది.  పిల్లలకి రెక్కలు రాగానే ఆడపక్షి వెళ్ళిపోతుంది. గూడు అనేది వాటికి తాత్కాలికమైన వలస. మీ లాంటి ప్రేమపక్షులకు కూడా పెళ్లి అనేది ఒక వలస. దూరాలోచన లేదు. జీవితం తల్లక్రిందులైన తర్వాత అప్పుడు ఏడుస్తారు” ఆవేశంగా అన్నది సునంద.

“మమ్మీ అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేం డాడీ!”

“మీ మమ్మీ అన్నదాన్లో తప్పేముంది బేబీ!” సీరియస్ గా చూసాడు రణధీర్.

“భర్తతో మనస్పర్ధలు వచ్చిన ఆడపిల్లకి పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వరా!”

“ప్రశాంత్ నిన్ను కొట్టి, తిట్టి నీ ప్రాణానికి హాని తలపెడితే మేం కలగజేసుకుంటాం. నీకు సపోర్ట్ ఇస్తాం. అంతేకానీ నువ్వు అహంకారంతో ఎదుటి వారి జీవితంలో అశాంతి రేపి వస్తే సపోర్ట్ చేయం” అన్నాడు.

లాస్య ఏం మాట్లాడాలో తోచనట్లు ఉండిపోయింది. ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి వేసింది సత్యవాణికి. “లాస్యా! నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకమ్మా! మా వాడికి నేను నచ్చ చెబుతాను” అని ప్రశాంత్ వైపు తిరిగి “ప్రశూ! నువ్వు ప్రతి చిన్న విషయం తల్లితో పోల్చుకోవద్దురా! మా కాలం వేరు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని అనుకునేవారు మా తల్లిదండ్రులు. ఇంటిపనులు నేర్పేవారు. ఇప్పటి ఆడపిల్లలు వేరు. వాళ్ళకి పెళ్లి కన్నా చదువు, కెరీర్ ముఖ్యం. చదువులో పడి వంట నేర్చుకోవటం లేదు. అంత చిన్న కారణానికి ఉద్యోగం మానేయమనటం బాగా లేదు. తనకిష్టమై మానేస్తే అది వేరు. ఇంటిపనులు ఇద్దరూ షేర్ చేసుకోండి. అంతగా వీలు కాకపోతే నాలుగు రోజులు ఇక్కడ ఉండి వెళ్ళండి. మాకూ సంతోషమే!” అన్నది.

“సరే అమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తాను” అన్నాడు ప్రశాంత్.

“లాస్యా! నువ్వు కూడా ప్రశాంత్‌కి సారీ చెప్పు. భర్తని గౌరవించలేని ఆడపిల్లకి నా ఇంట్లో స్థానం లేదు” ఈ మాటలు చెబుతుంటే రణధీర్ ముఖం  గంభీరంగా అయింది.

లాస్య లేచి నిలబడింది. చిన్నగా అడుగులు వేస్తూ ప్రశాంత్ దగ్గరకి వచ్చి “సారీ ప్రశాంత్! నా సిల్లీ బిహేవియర్‌తో నిన్ను బాధ పెట్టాను. ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ కలసి ఉందాం” అన్నది లో గొంతుకతో.

ప్రశాంత్ మనసులో పంతం, పట్టుదల సూర్య కిరణాలు సోకిన మంచు బిందువుల్లా కరిగిపోయాయి. “లవ్ మీన్స్ నెవర్ టు సే సారీ!” అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. లాస్య సిగ్గుపడింది.

అది చూస్తున్న పెద్దలందరి మనసులూ తేలికయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here