నడక దారిలో..!!
[dropcap]ఒ[/dropcap]కప్పుడు గతిలేక, రవాణా సౌకర్యాలు లేక సామాన్యుడికి ఎక్కడికి పోవాలన్నా ‘నడక’ తప్పనిసరి అయ్యేది. ఇక నడకకు ప్రత్యామ్నాయం మరోటి ఉండేది కాదు. కాస్త ధనవంతులకైతే సైకిలు, రెండెడ్లబండ్లు, ఒంటెద్దు బండ్లు, స్టీమర్లు, పడవలు, వారి వారి హోదాలను బట్టి రవాణా సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఇప్పుడు మధ్యతరగతివాడికి సైతం, పైగా ఉద్యోగస్థుడై ఉంటే, రైలు – ఓడ, విమానయానం సైతం అందుబాటులోనికి వస్తున్నది. ఎంత లేనివాడికైనా ఇంట్లో కనీసం సైకిలు వుంటున్నది. ఇక ఎగువ మధ్యతరగతి, ఆపై వర్గాలకు ఈనాడు రెండు లేదా మూడేసి కార్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి సుఖం మరిగిపోయి (తప్పని పరిస్థితులలో సైతం), శరీరానికి కనీస శ్రమ లేకుండా పోతున్నది.
తద్వారా ఊబకాయం, దానివల్ల రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సుఖం కొన్ని కష్టాలకు కారణం అవుతున్నది. వ్యాయామం ఇప్పుడు తప్పనిసరి అవుతున్నది. యోగా ఇతర వ్యాయామ క్రీడలతో పాటు ‘నడక’ తప్పనిసరి అవుతున్నది. వ్యాయామం కోసం ఇప్పుడు ఎంత ధనవంతుడైనా, సైకిలు కొనుక్కోవలసి వస్తున్నది. అవసరాన్నిబట్టి ప్రతిరోజూ కొంత సమయం నడక కోసం వినియోగించవలసి వస్తున్నది. వైద్యుల ఆరోగ్య సలహాలతో ‘నడక’ అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. మనిషి జీవన శైలిలో ఇది నిత్యకృత్యమై పోయింది. ఆడ, మగ, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి మనిషి చూపు నడకపై పడుతోంది.
ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్నాక స్వచ్ఛమైన గాలిలో నడక మంచిదని చెబుతుంటారు, అది కూడా సూర్యోదయం అవుతున్న సమయంలో నడిస్తే, సూర్యరశ్మి వల్ల సహజంగా (ఉచితంగా) లభించే ‘విటమిన్-డి’ని పొందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారి వారి అనుకూలతలను బట్టి కొంతమంది సాయంత్రం కాస్త చల్లబడ్డాక నడవడానికి అలవాటు పడి వుంటారు. అయినా ఉదయమే సూర్యోదయం సమయాన నడవడం వల్ల అవసరమైన వ్యాయాయం లభించడమే గాక, శరీరానికి అవసరమైన, ప్రకృతి సిద్దమైన విటమిన్- డి లభిస్తుందని వైద్యుల ఉవాచ.
నడవడం కోసం కొంతమంది కళాశాల/పాఠశాలల ఆటస్థలాలు వినియోగించుకుంటున్నారు. కొంతమంది రోడ్డు ఫుట్‌పాత్ లనే నడవడం కోసం వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద గార్డెన్స్‌లో నడక కోసం శాస్త్రీయపరమైన ప్రత్యేక ట్రాక్‌లు నిర్మించి వాడుతున్నారు. ఇలాంటి ప్రదేశాలలో ఉన్నతాధికారులు, ఇతర సెలబ్రెటీలు నడకకు రావడం వల్ల అక్కడ అనేక ప్రత్యేక సదుపాయాలూ సమకూరుస్తున్నారు. ఈమధ్య కాలంలో ‘వాకర్స్ క్లబ్బులు’ కూడా వెలుస్తున్నాయి. దీనిని బట్టి నడక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ప్రజలలో ఎంత అవగాహనకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గొప్ప ప్రజాచైతన్యం గానే పరిగణించాలి.
నడక విషయంలో విశాఖపట్నం బీచ్ రోడ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పాలి. అదేమిటంటే ఉదయం బీచ్ రోడ్ ఇరువైపులా కొన్నిగంటలు ట్రాఫిక్ ఆపేస్తారు. ఎవరో మహానుభావుడు, అక్కడి ఉన్నతాధికారికి వచ్చిన గొప్ప ఆలోచన ఇది. స్వచ్ఛందంగా ఆ సమయాలలో ఎలాంటి వాహనాలు ఆ రోడ్డు మీదుగా పోవు. వందలు, వేల సంఖ్యలో వివిధ స్థాయిల్లో ప్రజలు నడక కోసం అక్కడికి వస్తారు. పక్కనున్న సముద్రపు అలల హోరులో, చల్లని గాలిని ఆస్వాదిస్తూ జనం ఆనందంగా నడుస్తారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వపరంగా, చిన్న చిన్న పార్కులను కూడా అక్కడి స్థానిక ప్రజలు నడక కోసం ఉపయోగిస్తున్నప్పటికీ పార్కుల నిర్వాహణ సరిగా జరగకపోవడం కొంత ఇబ్బందులకు, నిరుత్సాహానికి గురిచేస్తున్నాయని చెప్పక తప్పదు. అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడమే దీనికి ప్రధాన కారణం.
అవసరమైన నిధులు ఎప్పటికకప్పుడు సమకూర్చలేకపోవడం, ప్రభుత్వ ప్రాధాన్యతలలో అవి లేకపోవడం కూడా కారణం అని చెప్పవచ్చు. అయితే అన్ని పార్కులో ఇలా నిరాదరణకు గురి అవుతున్నాయని కూడా చెప్పలేము. అది అంతా ఆయా పార్కుల నిర్వాహణాధికారుల అభిరుచి, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల ప్రత్యేక శ్రద్ధ మీద కూడా ఆయా ప్రాంతాల, ముఖ్యంగా పార్కుల అభివృద్ధి ఆధారపడి వుంటుంది. ప్రజలు కూడా తమకు ఏమి కావాలో అడిగి చేయించుకునే అర్హతను తమ ఓటును అమ్ముకుని పోగొట్టుకుంటున్నారు. ఇలా ఎంతో అభివృద్ధిని మన తెలుగు రాష్ట్రాలు కోల్పోతున్నాయి. ఇది దురదృష్టకరం.
నేను, మహబూబాబాద్‌లో పని చేస్తున్నప్పుడు, నడిచే సరైన ప్రదేశాలు లేక, రైలు పట్టాలు వెంబడి ప్రశాంతంగా నడిచేవాడిని. హన్మకొండలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాక (1994) నాకు దగ్గరలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ కలిసి వచ్చింది. విశాలమైన ఆకళాశాల ఆటస్థలంలో నడవడం చాలా గొప్పగా ఉండేది.
సంవత్సరకాలంగా సికింద్రాబాద్‌లో ఉండడం వల్ల (సఫిల్ గూడ) నడక కోసం దగ్గర ప్రదేశం చూసుకోక తప్పలేదు. కొంతమంది దగ్గరలోని సఫిల్ గూడా రైల్వే స్టేషన్, రామకృష్ణాపురం స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద నడుస్తారుగాని, రైళ్ల రాకపోకల రణగొణ ధ్వనిలో ప్రశాంతంగా నడిచే అవకాశం ఉండదు. అదృష్టవశాత్తు నాకు సఫిల్ గూడ రైల్వే స్టేషన్‌కు దగ్గరలోనే ఒక పార్కు కంటబడింది. వందల సంఖ్యలో నడవడానికి, ఉదయం సాయంత్రం కూడా అక్కడికి వస్తారు. ఆదివారం ఆ పార్కు,నడిచే జనంతో, పిల్లలతో కిటకిటలాడుతూ, కళకళలాడుతుంది.
అదే ‘మినీ ట్యాంక్‍బండ్ పార్కు’. ఇక్కడ నడిచేవారు, యోగా చేసేవారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకునేవారు, ఇతర వ్యాయామాలు చేసుకునేవారు, ప్రేమికుల జంటలు, ఇంటిలో కుదరక వచ్చి అదే పనిగా ఫోన్ చేసుకునేవాళ్ళు, ఇంట్లోవాళ్ల బాధ పడలేక గార్డెన్‌కు వచ్చి నడవకుండా ఒకచోట కూలబడి, కాసేపు గడిపి వెళ్ళేవాళ్ళు, కేవలం అందమైన అమ్మాయిలను చూడడానికి వచ్చి, వాళ్ళ వెనుక బాడీ గార్డుల్లా నడిచేవాళ్ళు,ఇలా రకరకాల వ్యక్తులు అక్కడ తారసపడుతుంటారు.
అన్నింటికీ అనువైన ప్రదేశం ఈ మినీ ట్యాంక్ బండ్. లోపలికి ప్రవేశించ గానే, కుడివైపు రోడ్డుకు ఎత్తుగా ఉండడం వల్ల, ట్రాఫిక్ ఇబందులు వుండవు. ఎడమవైపు చిన్న మురికినీరుతో నిండి వున్న సరస్సు (ఒకప్పుడు మంచినీళ్ళ కోసం, బట్టలు ఉతుక్కోవడం కోసం ఉపయోగపడేదట! ఇప్పుడు పలుచోట్లనుండి వచ్చే మురికి నీరు ఇందులో నిల్వ ఉంటుంది). ఈ సరస్సు నీళ్లు కన్పడనంతగా గుర్రపు డెక్క అల్లుకుని పచ్చని చాప అందంగా పరిచినట్లు ఉంటుంది. ఇక్కడ మామూలు దోమలు కాదు, ‘హైబ్రిడ్ -దోమలు’ ఉత్పత్తి అవుతాయి. ఇవి అనేక చోట్లకు వలస కూడా పోతుంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం, సంబంధిత మున్సిపాలిటీ పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ దోమల బెడద, వాటి ప్రభావం నడిచేవారికి, సాయంత్రం నాలుగు గంటల తర్వాత బాగా కనిపిస్తుంది. ఎక్కువ మంది జనం ఉపయోగించుకునే ఈ స్థలాన్ని అలా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు?
దీనికి తోడు, బండ్ ఎడమ వైపు భాగం పిచ్చిచెట్లు పెద్దపెద్దగా పెరిగి డొంకలు, పొదలు గామారి, రకరకాల పాములకు ఆశ్రయం ఇస్తున్నాయి. మంచి పూలమొక్కలు, లాన్ వంటివి పెంచవలసిన చోట, ఇలా ముళ్లపొదలు పిచ్చి డొంకలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా కాలం దాటిన తర్వాత, ఒకరోజు ఈ వ్యాస రచయిత ముందునుంచే ఒక పొడవాటి గోధుమరంగు త్రాచు పాము సరసరా ప్రాకివెళ్ళిపోవడం భయంకర అనుభవం. తరువాత రోజువారీ పరిశుభ్రత లోపించిన వైనం అక్కడికి వెళ్ళేవారికందరికీ అనుభవమే!
నిజానికి ఈ మినీ ట్యాంక్‍బండ్ దాని చుట్టుప్రక్కల ప్రజలు నడకకు ఉపయోగించుకోవడానికి అనువైన ప్రదేశం. ఇలాంటి పార్కుకు మరిన్ని సదుపాయాలు కల్పించి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది. పరిశుభ్రతకు, పూలవనానికి ప్రాధాన్యతనిచ్చి అవసరమైతే సాధారణం రుసుము వాకర్స్ నుండి వసూలు చేయడంలో తప్పులేదేమో! నా మటుకు నేను నడక కోసం ప్రతిరోజూ ఉదయం ఒక గంట గడుపుతాను.
ఇక్కడ నడవడంలో ఒక రకమైన తృప్తి మిగులుతుంది. ఇలా ప్రతి రోజూ నాలా ఎందరో. అధికారులు మరింత శ్రద్ధ తీసుకుంటే, సరస్సును గుర్రపుడెక్కనుండి విముక్తి చేసి,మంచినీటితో నింపి, ఉద్యానవనంలా బండ్‍ను అభివృద్ధి చేస్తే మరింతమంది సురక్షితంగా ఈ మినీ ట్యాంక్ బండ్‌ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఆ సమయం కోసం ఎదురుచూడవలసిందే! నడిచేవారి సంఖ్య పెరగాలిసిందే!!
(మళ్ళీ కలుద్దాం)