[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఈ[/dropcap] మధ్యన మా ఇంటికి మరమ్మత్తులు చేయించాల్సొచ్చింది. కార్పెంటర్‌ని పిలిచాము. చెయ్యవలసిన పని చెప్పగానే అదేదో అశ్వమేధయాగమంత పనన్నట్టు దీర్ఘాలోచనలో పడిపోయాడు. ఇంట్లో ఇటు తిరిగేడు.. అటు తిరిగేడు. పైకి చూసేడు. కిందకి చూసేడు. ఇదివరకు మేము చేయించగా మిగిలిన చెక్కముక్కలన్నింటినీ తెచ్చి, ఓ పక్కన పోగేసి, ఓ పేద్ద నిట్టూర్పు విడిచేడు. మాకేమీ అర్థం కాలేదు. ఏదో చెయ్యకూడని పని చెప్పినట్టు అంత ఆలోచిస్తున్నాడేవిటా అనుకుంటుంటే అప్పుడు నెమ్మదిగా నోరిప్పేడు, “చెప్పండి సర్..” అంటూ..
ఏంటి చెప్పేదీ!.. అప్పటికే మూడుసార్లు చెప్పేం.. వంటింట్లో సింక్ కింద తలుపు ఊడిపోతోంది.. అది సరిగ్గా బిగించాలి, ముందుగదిలో టేబుల్‌ది ఒక కోడు కదులుతోంది.. అది సరిచెయ్యాలి. డైనింగ్ టేబుల్ దగ్గరి కుర్చీలకి చిన్న చిన్న మరమ్మత్తులు చేసి, కింద కొత్త రబ్బర్లు వెయ్యాలి.. ..ఇలాంటివన్నీ ఎన్నిసార్లని చెప్తాం.. వీళ్లతో మాట్లాడ్దం కష్టమని మాకు తెలుసు. అందుకే మొత్తం చెయ్యవలసిన పనంతా చెప్పేసి, కావల్సిన సామాన్లన్నీ వాళ్ళనే తెచ్చుకుని చేసేటట్టూ, అంతా కలిపి డబ్బెంత కావాలో చెప్పమన్నట్టూ చెప్పేం..
ఆ వచ్చినమనిషి మళ్ళీ ఇల్లంతా తిరిగేడు. మా మొహాలు చూసేడు. విరిగిన కోడున్న టేబుల్‌ని చూసేడు. నాకేదో అనుమానమొచ్చింది.. బహుశా ఇతను మమ్మల్ని ఆ విరిగిన కోడున్న టేబుల్‌తో పోల్చుకుంటున్నాడేమోననీ.. హంతే.. చిర్రెత్తుకొచ్చింది..
మా ఇంట్లోవాళ్ళు పరమ శాంత స్వభావులు.. మిన్ను విరిగి మీద పడినా చలించరు. అందుకని నేనే “ఏంటీ.. మాట్లాడవేం.. ఎంత కావాలో చెప్పూ!” గట్టిగా అరిచేను.
నా అరుపుకి అతనేం అదరలేదు.. బెదరలేదు.. కదలని కొండలా అలాగే నిల్చుని ఏ భావం లేకుండా నా వైపు చూసేడు. నా ఆవేశం చూసిన ఇంట్లోవాళ్ళు నన్ను ఆగమని సైగ చేసి, “చెయ్యగలవా.. లేదా..” అనడిగేరు అతన్ని.
అతనికి అర్ద్థమైపోయింది.. మేము పెద్దవాళ్లమైపోయాం.. ఇదివరకులా బైటకెళ్ళి సామాన్లు తెచ్చుకోలేం.. అన్నింటికీ అతని మీదే ఆధారపడిపోయేమని అతనికి అర్థమైపోయింది..
ఇంక అతను మొదలెట్టేడు.. ఆ టేబుల్ రిపైర్ బదులు కొత్తగా టేబుల్ చెయ్యాలన్నంత బిల్డప్ ఇచ్చేడు. సింక్ కింద తలుపు మొత్తం తీసేసి కొత్త ప్లైవుడ్, డెకొలామ్ తెచ్చి వెయ్యాలన్నాడు. కుర్చీలన్నీ మళ్ళీ చేసెయ్యాలన్నంత పనున్నట్టు ఆయాసపడిపోయేడు. అంతా కలిపి ఓ ఇరవై వేలవుతుందనీ, మేము ఇల్లు కదలక్కర్లేకుండా అన్నీ తనే తెచ్చుకుని, తన స్వంతపనిలా చేస్తాననీ చెప్పేడు.
మాకు మతి పోయినంత పనైంది.. ఇరవై వేలా! ఎంత ఇన్ఫ్లేషన్ అయితే మటుకు మరీ అంత ఎక్కువా! వేలంటే వీళ్ళకెలా కనపడుతున్నాయీ..
సరిగ్గా అప్పుడే వచ్చింది మా వదిన.. మా వదిన్ని చూడగానే మాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టైంది. అక్కడ అప్పుడు జరుగుతున్నదంతా చిటికెలో గ్రహించేసింది. అయినా ఏమీ తెలీనట్టు..
“స్వర్ణా, మా కార్పెంటర్‌ని తీసుకురమ్మన్నావుగా.. వస్తున్నాడు.. అవునూ.. ఇతనెవరూ..!” అనడిగింది.
“కార్పెంటరే వదినా. తెలిసినవాళ్ళ నడిగితే పంపించేరు.. మీ వాడొస్తుంటే ఇంకెందుకులే..”
నా మాటలకి ఎదురుగా ఉన్న కార్పెంటరు మొహంలో భావాలు మారేయి. నిర్లక్ష్య ధోరణి పోయి ఒక విధమైన జాగ్రత్త లాంటిది కనిపించింది.
“ఎవరైనా ఇంతకన్న తక్కువకి చేస్తానంటే నేను మీకు ఉట్టినే చేసి పెడతానమ్మా..” అన్నాడు ఏమీ బెదరనట్టు.
“అసలు పనేవిటీ..” వదిన నెమ్మదిగా ఆరాలు మొదలెట్టింది..
వరసగా చెప్పినవన్నీ విని, కార్పెంటరు అడిగిన లెక్క వినీ ఒక్కటే మాటంది..
“స్వర్ణా.. మనం చాలా విషయాల్లో అమెరికావాళ్లని ఫాలో అయిపోతాం.. ఇందులో మటుకు ఎందుకు కాకూడదు.. వాళ్ళు ఐక్యా నుంచి విడిభాగాలన్నీ స్క్రూలతో సహా తెచ్చుకుంటారు.. కావల్సినవన్నీ ఒకే పేకెట్‌లో ఇచ్చేస్తారు. వాటిని ఎలా బిగించాలో బొమ్మలతో సహా ప్రింట్ చేసిన పుస్తకాలిస్తారు.. ఇప్పుడు ఇండియాలో కూడా అలా వస్తున్నాయి. అవి ఇంటికి తెచ్చుకుని మనం ఫిట్ చేసేసుకోడమే.. మెటీరియల్ కన్న లేబర్‌కి ఎక్కువవుతున్నప్పుడు ఈమధ్య చాలామంది ఇలా చేస్తున్నారు.. మీరు కూడా ఎందుకు చెయ్యకూడదూ!..”
ఇవన్నీ చెప్పుకోడానికి బాగుంటాయి.. కానీ ప్రాక్టికల్‌గా చూసుకుంటే.. ఎవరైనా రెండు మెతుకులు వండి కంచంలో పెడితే చాలనే వయసుకి వచ్చేసేం. మా పనులే మేం చేసుకోలేకపోతుంటే ఈ రిపైర్లు కూడా ఎక్కడ చేసుకోగలం! కానీ ఆ మాట పైకంటే ఎదురుగా ఉన్న కార్పెంటర్‌కి లోకువైపోతాం..
నేను సాభిప్రాయంగా ఇంట్లోవాళ్ళ వైపు చూసేను..
ఏవనుకున్నాడో ఏవో.. ఎదురుగా ఉన్న కార్పెంటరు..
“సరేనమ్మా.. ఏదో మీరు పెద్దవయసువారు.. బైట కెళ్ళి ఏవీ తెచ్చుకోలేరు.. కనక పదిహేనువేలకి మొత్తం చేసేస్తాను.. ఎప్పుడు మొదలెట్టమంటారు!” అన్నాడు..
ఒక్కసారిగా అయిదువేలు తగ్గేటప్పటికి మాకు అనుమానం లాంటిది వచ్చేసింది.
ఇంక వదిన అందుకుంది.
“ఏమక్కర్లేదు.. అన్నీ కలిపి అయిదువేలిస్తాం.. కాస్త ప్లై వుడ్, చిన్న డెకొలాం ముక్క తప్పితే ఇంక కొనడానికి సామాన్లేవున్నాయీ.. మాకేం తెలీదనుకోకు. మేమంతా కాలేజీలో కార్పెంటరీ వర్క్ నేర్చుకున్నవాళ్లమే..”
తెల్లబోయేను. అసలు వదిన కాలేజీలో ఎప్పుడూ చదివిందీ.. ఇంటర్మీడియట్ అవగానే పెళ్ళైపోయింది కదా! బహుశా అప్పుడేమైనా నేర్చుకునుంటుందా.. ఏవో.. నేర్చుకుందేమో.. మరి నాకేమీ రాదే.. కనీసం గోడకి మేకు కొడదామన్నా ఆ మేకు అష్టవంకర్లు పోతుంది తప్పితే గోడలో దిగదు. బిక్కచచ్చిపోయి చూసేను వదిన వైపు.
అది విన్న ఆ కార్పెంటరు ‘కాలేజీల్లో వడ్రంగం చెపుతారామ్మా..’ అనడిగేడు.
“మేం చదివిన కాలేజీలో చెపుతారులే. మాది వేరే కాలేజీ..” అంది ధీమాగా..
ఆ మాటలకి కాస్త తగ్గిన అతను
“రెండ్రోజుల పనుంటుందమ్మా.. ఫెవికాల్, మేకులు, స్క్రూలు కలిపి చాలా అవుతుందమ్మా.. ఇదివరకులా లేవు.. రేట్లన్నీ పెరిగిపోయేయి.. అన్నీ నేనే తెచ్చుకుంటాను.. ఆఖరిమాటగా పదివేలిచ్చెయ్యండి..”
“ఏమక్కర్లేదు..మేం చేసుకుంటాంలే.. నువ్వెళ్ళిపో..” గట్టిగా అంటూ అతన్ని పంపించేసింది వదిన.
“అలా పంపించేసేవేంటి వదినా.. ఈ పనులు మనవెక్కడ చేసుకోగలం! ఇంట్లో ఇబ్బందిగా ఉంది.. ఎంతకో అంతకి సెటిల్ చేస్తావనుకున్నాను. ”
“ఏం పర్లేదు. ఓ రెండ్రోజులు పోయేక అతనే ఫోన్ చేసి అయిదువేలన్నా ఒప్పుకుంటాడు చూడు..”
“ఒకవేళ చెయ్యకపోతే..”
“లోకం గొడ్డోయిందా! ఇతను కాపోతే ఇంకోతనూ..” ధీమాగా అంది వదిన.
వదిన మాట మీద నాకు నమ్మకం కుదరలేదు. ఇరవైవేలన్నతను అయిదువేలకి ఒప్పుకుంటాడా!
హాశ్చర్యం.. రెండ్రోజులదాకా ఆగక్కర్లేకుండా మర్నాడే ఆ కార్పెంటర్ ఫోన్ చేసి “అంతా కలిపి అయిదువేలివ్వండమ్మా.. రేపు వచ్చేస్తాను..” అన్నాడు.
ఎంతైనా.. వదిన వదినే అనిపించింది..