[dropcap]ఆ[/dropcap]డంబర జీవనశైలికి అలవాటు పడిన మనకు వినిపిస్తున్న బోధలు – అవి దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా లభించినా, మత సంబంధమైన కూటముల ద్వారా లభించినా – అవి భౌతికాభివృద్ధి, సుఖలాలసల దిశలో ప్రేరేపిస్తున్నవేగాని, మనిషిగల హద్దులు, విలువలు, బాధ్యతలు, కర్తవ్యాల గురించి చెప్పడం లేదనీ; కాబట్టి కొందరు పెద్దలు తమ అధ్యయనాల నుండి, అనుభవాల నుండి చెప్పిన అంశాలను ఒక చోట సమీకరించి అందించే ప్రయత్నంగా “మనము – భూమి – పర్యావరణము” అనే పుస్తకాన్ని వెలువరించారు ప్రకాశకులు.
కే.ఎస్. సుదర్శన్, కే.ఎన్. గోవిందాచర్య, సురేశ్ సోనీ, సీతారాం కేదలాయ, ఎస్. గురుమూర్తి, శ్రీ బలభద్ర దాస్, ఛాయాదేవీ దాస్, శ్రీ ఉపద్రష్ట లక్ష్మణసూరి వ్రాసిన వ్యాసాలను డా. వడ్డి విజయసారథి సంకలనం చేశారు. ప్రకృతి, పర్యావరణం, విద్యావ్యవస్థ, భారతీయ విలువలు, సాంప్రదాయిక వ్యవసాయం, పాశ్చాత్యీకరణ తదితర అంశాలపై ఈ పుస్తకంలో తొమ్మిది వ్యాసాలున్నాయి.
“పెద్దపెద్ద ఆనకట్టలు, జలాశయాలు నిర్మించటంవల్ల పెద్దరైతులకు ప్రయోజనం కలిగింది. వారు ముడిసరుకులు పండిస్తారు. వాటిని అమ్ముకుంటారు, లాభాలు సంపాదిస్తారు. కాని, చిన్న రైతులు, సన్నకారు రైతులు చచ్చిపోతున్నారు. ఈ విధమైన ఫలితాలనిచ్చే పాశ్చాత్యుల అభివృద్ధిమార్గం మనకు తగినది కాదు. అందుకని మనం నూతన అభివృద్ధిమార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. అలా నూతన అభివృద్ధిమార్గాన్ని ఎంచుకొనే సమయంలో ప్రతివ్యక్తికీ పని లభించటమనేది ఆ మార్గానికి మూలాధారం కావాలని స్పష్టంగా గ్రహించుకోవాలి. నూతన అభివృద్ధిమార్గం గ్రామాధారితమై ఉంటుంది. తక్కువ పెట్టుబడితో నడిచేదై ఉంటుంది. ఇంధనము లేదా శక్తివనరులను అతితక్కువగా వినియోగించుకొనేదై ఉంటుంది. ప్రకృతిలో ఒదిగి, స్నేహం చేసేదిగా ఉంటుంది” అంటారు శ్రీ కే.ఎస్. సుదర్శన్ “ప్రపంచపు రూపకల్పనలో ధరిత్రి పర్యావరణముల పాత్ర” అనే వ్యాసంలో.
“విద్యావ్యవస్థను సంస్కరించడానికి వేసిన కమిషన్లలో ఒకటైన డి.ఎస్. కొఠారి కమిషన్ భారతీయ విద్యావ్యవస్థపై వ్యాఖ్యానిస్తూ ‘ప్రస్తుతం భారతదేశ మేధాసంపత్తి యొక్క అతి పెద్ద సమస్య – దాని గరిమనాభి భారత్లో కాక యూరప్ కేంద్రంగా ఉండటం’ అని అన్నారు. దీని కారణంగా మన జీవనశైలి మారిపోయింది. మన వేషధారణ, మన ప్రవర్తన, మన అభిప్రాయాలు, మన జీవన విలువలూ అన్నీ యూరప్ కేంద్రంగా ఏర్పడినవే.. “మనం చేయవలసిందల్లా ఈ గురుత్వకేంద్రాన్ని భారత్ కేంద్రంగా మలచటమే” అని డి.ఎస్. కొఠారీ అన్నారని శ్రీ సురేశ్ సోనీ వివరిస్తారు “సజ్జన, సాత్త్విక శక్తిజాగరణ ద్వారానే ప్రపంచశాంతి” అనే వ్యాసంలో.
గ్రామీణ జీవన సంస్కృతిని, గ్రామీణకళలనూ పునరుజ్జీవింపచేసేందుకు ఆరు సంపదలను రక్షించుకోవాలనీ, అప్పుడు దేశం దానంతట అదే బాగుపడుతుందని అన్నారు సీతారామ్ కేదలాయ.
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 127 పేజీల పుస్తకం వెల రూ.80/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.