[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
కుందుర్తి కవితా వైభవం
[dropcap]అ[/dropcap]భ్యుదయ కవుల్లో వచన కవితా పరిణామానికి దోహదం చేసిన వారిలో, శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు మొదటి వరుసలో నిలుస్తారు. వచన కవితని ఒక ఉద్యమంలా భావించి, ఆ రూపాన్ని సుసంపన్నం చేయడంలో నిర్విరామ కృషి చేసిన వారిలో అగ్రేసరులు – శ్రీ కుందుర్తి. కుందుర్తి ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్’ సాహిత్య చరిత్రలో ఆయన సాగించిన ఉద్యమానికి అక్షరోదాహరణం.
‘పాతకాలం పద్యమైతే..
వర్తమానం వచన గేయం’
అన్న పంక్తులు, ఆయనకి వచన కవిత మీద ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తాయి. కేవలం వచన కవితా రూపాన్ని ఒక ఉద్యమంగా భావించడం అతివాదమనీ, వస్తు సంబంధంలేని ఉద్యమం ఉండకూడదనీ, కుందుర్తిని కొందరు విమర్శించారు. అయితే, ఆయన నూటికి నూరు పాళ్ళు అభ్యుదయ భావాల్ని అంగీకరించిన తర్వాతే ఆ భావాల్ని వెలువరించడానికి తగిన ప్రజారూపాల్లో వచన కవితకి పట్టం కట్టడం జరిగింది.
సామాజిక భావాల్ని ప్రజా సామాన్యానికి, వారి దైనందిన వ్యవహార భాషలో, భావన కృత్రిమత్వం లేకుండా అందించడం ఆయనకి ప్రధాన విషయం. అందుకు వచన కవిత సరియైన రూపమని ఆయన ఏనాటినుంచో కలగంటూ వచ్చారు. ఆయన కళ్ళ ముందే ఆయన భావించినంత దాని కంటే ఎక్కువగా, విశ్వరూపం ధరించింది వచన కవిత. కాని, యిందులో వచ్చిన కేవల ప్రయోగశీలత్వాన్నీ, అనుభూతి వస్తువునీ, శిల్ప ప్రాధాన్యాన్నీ, కృత్రిమత్వాన్నీ, పాశ్చాత్య అనుకరణల్నీ ఆయన హర్షించరు. ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు.
మొదటి వరుసలోని అభ్యుదయ కవుల్లో, శ్రీ కుందుర్తిలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది. తన కళ్ళముందు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో భావనా ధోరణలు తుఫానులా వీస్తుంటే, ఆయన తన అభిప్రాయాల్ని మార్చుకోలేదు. తన సిద్ధాంతాలూ, తన కవితా ప్రయోజనమూ, వాటికీ తన వ్యక్తిత్వానికీ ఉన్న సమన్వయం అపశ్రుతి పొందకుండా స్థైర్యాన్ని ప్రదర్శించారు.
1944లో కందుర్తి అంజనేయులుగారు – ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి మొట్టమొదటి కవితా సంకలనం – నయగారా ప్రకటించారు. ఈ ముగ్గురూ నయగారా కవులుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందారు. అంజనేయులు సమగ్ర రచనలు 1974 లో ప్రచురించబడినవి.
ఈయన రచనలలో సౌప్తికం, రసధుని, అమావాస్య, నాప్రేయసి, నయాగరా, తెలంగాణ, దండియాత్ర, ఆషా, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట మొదలైనవి ముఖ్యమైనవి.
కుందుర్తి వచన కవిత – ఆధునిక కవితా ప్రస్థానంలో సామాన్యునికి అంకితమైన భాషా కుటీరం. ఆయన ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్’ – సాహిత్య చరిత్రలో ఆయన సాగించిన ఉద్యమానికి అక్షరోదాహరణం.
కుందుర్తి ప్రతిభా పాటవాలను మనకు ఈ పుస్తకంలో పరిచయం చేసినవారు శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.