[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
179. శ్లో.
మాం తు శోకాభిసంతప్తం మాధవః పీడయన్నివ।
భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ॥
(కిష్కింధకాండ, 1. 5)
శ్రీరాముడు: అచట అయోధ్యానగరమునకు వెలుపల గల నందిగ్రామము నందు ఉపవాసాదివ్రత నియములను పాటిస్తూ భరతుడు మిగుల దుఃఖమునకు లోనైయున్నాడు.
ఇచట సీతాదేవి అపహరణకు గురియై ఎంతయో పరితపించుచున్నది. ఈ ఇరువురి వ్యథలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమునకు లోనై యున్నాను. ఈ రెంటికిని తోడుగా ఇప్పుడు వసంతుడు నన్ను మిగుల పీడించుచున్నట్లున్నాడు.
(మనం పడుతున్న బాధను మనవాళ్ళు పడుతున్న బాధతో పోల్చి మరింత బాధ పడటం సత్పురుషుల లక్షణం!)
శ్లో.
తాం వినా స విహంగో యః పక్షీ ప్రణదితస్తదా।
వాయసః పాదపగతః ప్రహృష్టమ్ అభినర్దతి॥
ఏష వై తత్ర వైదేహ్యా విహగః ప్రతిహారకః।
పక్షీ మాం తు విశాలాక్ష్యాః సమీపమ్ ఉపనేష్యతి॥
(కిష్కింధకాండ, 1. 55, 56)
శ్రీరాముడు: లోగడ సీతాదేవి నాతో గూడియున్నప్పుడు కాకి ఆకాశమున ఎగురుతూ ‘కావు కావు’మని అరచేది. అది అశుభసూచకం (ఎడబాటుకు సూచకం). ఇప్పుడు ఆ కాకియే చెట్టు పై చేరి, హర్షముతో కూయుచున్నది. ఇది శుభసూచకము (త్వరలోనే జానకి నన్ను చేరునని తెలుపుతున్నది). అంతరిక్షమున విహరించుచూ అరచిన ఆ కాకి సీతను అపహరణకు గురి చేసినది. చెట్టు మిద కూయుచున్న ఈ కాకి నన్ను విశాలాక్షియైన ఆమె కడకు చేర్చనున్నది.
శ్లో.
యది గచ్ఛతి పాతాళం తతో హ్యధికమేవ వా।
సర్వథా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ॥
ప్రవృత్తిర్లభ్యతాం తావత్ తస్య పాపస్య రక్షసః।
తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి॥
యది యాతిదితేర్గర్భం రావణః సహ సీతయా।
తత్రాప్యేనం హనిష్యామి న చేద్దాస్యతి మైథిలీమ్॥
(కిష్కింధకాండ, 1. 118, 119, 120)
లక్ష్మణుడు: ఓ శ్రీరామా! రావణుడు పాతాళ లోకంలో గాని, అంతకంటే దూరం వెళ్ళినా గాని, ఎట్టి పరిస్థితులలోనూ మన చేతిలో వానికి చావు తప్పదు. ముందర వాని ఉనికి తెలియనిమ్ము. ఆ తరువాత సీతాదేవిని మనకు అప్పగించినచో అతడు బ్రతికి బయటపడును. లేనిచో అతని ప్రాణాలు మిగలవు. సీతాదేవితో సహా అతను అదితి గర్భంలో దాక్కుని యున్నను వైదేహిని అప్పగించని యెడల అక్కడ గూడ అతనిని బ్రతుకనీయను.
..శ్రీరామలక్ష్మణులకు రావణుడు పాలించే లంకానగరం గురించి తెలియదా అప్పటికి అన్న ప్రశ్న పలువురు అడుగుతూ ఉంటారు. దీనిని బట్టి తెలియదని స్పష్టమవుతున్నది. లేదా రావణుడు లంక గాక మరెక్కడైనా సీతను దాచిపెట్టాడా అన్న ఆలోచన ఉన్నదా?
శ్లో.
ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్।
సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభమ్॥
ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు।
ఉత్సాహమాత్రమ్ ఆశ్రిత్య సీతాం ప్రతిలభేమహి॥
త్యజ్యతాం కామవృత్తత్వం శోకం సన్న్యస్య పృష్ఠతః।
మహాత్మానం కృతాత్మానమ్ ఆత్మానం నావబుధ్యసే॥
(కిష్కింధకాండ, 1. 122, 123, 124)
లక్ష్మణుడు: ఉత్సాహాన్ని మించిన బలం లేదు. అది గలవారికి లోకంలో అసాధ్యమనేది ఏదీ లేదు. ఉత్సాహవంతులు ఎట్టి కష్టమైనా వెనక్కి తగ్గరు. ఉత్సాహంతో ముందుకు సాగితే సీతాదేవి తప్పక లభించగలదు. అన్నా! నీవు ఎంతో ధైర్యశాలివి, మనో నిగ్రహం కలవాడవు. కనుక కాముకుని వలె వ్యవహరించకు. శోకమును పారద్రోలుము. నీ మహత్త్వమును గూర్చి నీవు తెలియకున్నావు.
180. శ్లో.
బుద్ధివిజ్ఞానసంపన్న ఇంగితైః సర్వమాచర।
న హ్యబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి హి॥
(కిష్కింధకాండ, 2. 18)
హనుమంతుడు సుగ్రీవునితో:
నీ బుద్ధిని, విజ్ఞానమును, ఇంగితమును ఉపయోగించి, ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావమును గుర్తించి, యుక్తమెరిగి ఆచరింపుము. బుద్ధికి పని జెప్పని రాజు ప్రజలను పరిపాలింపజాలడు.
హనుమంతుడిని మనకు కిష్కింధకాండలోని రెండవ సర్గలోని 13వ శ్లోకంలో మహర్షి పరిచయం చేస్తాడు. ‘ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః’ అంటాడు.
శ్లో.
కపిరూపం పరిత్యజ్య హనుమాన్మారుతాత్మజః।
భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః॥
(కిష్కింధకాండ, 3. 2)
వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరామలక్ష్మణుల విశ్వాసమును పొందుటకు తన కపిరూపమును త్యజించి భిక్షుకుని రూపమును (సాధువు) ధరించెను.
ఈ సందర్భంలో కొందరు భిక్షువు అనగా సన్యాసి అని, సన్యాసి గృహస్థులకు అభివాదం చేయునా అని ప్రశ్నిస్తారు.
‘భిక్షతే భిక్షుః’ అనునది అమరకోశం లోని విషయం అడగటానికి వచ్చినవాడు (యాచించుటకు వచ్చిన వాడు) అన్న అర్థాన్ని స్వీకరించుట సమంజసం. శ్రీరామలక్ష్మణుల వివరాలు తెలుసుకోగోరిన వాడు గావున ఆ అర్థమే సమంజసం. ఉత్తరాంగంలో శ్రీరాముడు హనుమంతుని చతుర్వేదాలు అధ్యయనం చేసిన వానిగా వర్ణించటం కలదు. అందున ఆంజనేయుని ‘బ్రహ్మచారి’గా (బ్రహ్మపృష్ఠాన్ని అధ్యయనం చేసినవానిగా), పండితునిగా, చతురునిగా పేర్కొనటం జరిగినది. ‘భిక్షువు’ అనగా కేవలం ‘సన్యాసి’ అనుకోవటం యుక్తము కాదు.
శ్లో.
తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవసచివం కపిమ్।
వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమ్ అరిందమ॥
నానృగ్వేద వినీతస్య నాయజుర్వేద్ధారిణః।
నాసామవేదవిదుషః శక్యమేవం ప్రభాషితుమ్॥
నూనం వ్యాకరణం కృత్స్నమ్ అనేన బహుధా శ్రుతమ్।
బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్॥
న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రోవోస్తథా।
అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్॥
(కిష్కింధకాండ, 4. 27, 28, 29, 30)
శ్రీరాముడు లక్ష్మణునితో:
సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు (హనుమంతుడు) మాట్లాడుటలో కుశలుడు. నా మీద, సుగ్రీవుని మీద ప్రీతి గలవాడు. అందుచేత నీవు ఇతనితో తగు విధముగా మాట్లాడు. ఋగ్వేదమునందును, యజుర్వేదమునందును, సామవేదమునందును సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడుటకు సమర్థుడు. ఇతను చాలా విషయాలు చెప్పాడు. సమస్త వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు. మాట్లాడునప్పుడు ముఖమునందును, కనులలోనూ, ఫాలభాగమునందును, కనుబొమల యందును, ఇంకను ఏ అవయవములయందును శరీరము నందెచ్చటను ఎట్టి వికారమూ కనబడలేదు.
శ్లో.
తవ ప్రసాదేన నృసింహ రాఘవ
ప్రియాం చ రాజ్యం చ సమాప్నుయామహమ్।
తథా కురు త్వం నరదేవ వైరిణం
యథా నిహంస్యద్య రిపుం మమాగ్రజమ్॥
సీతా కపీంద్రక్షణదాచరాణాం
రాజీవహేమజ్వలనోపమాని।
సుగ్రీవరామప్రణయప్రసంగే
వామాని నేత్రాణి సమం స్ఫురంతి॥
(కిష్కింధకాండ, 5. 32, 33)
సుగ్రీవుడు శ్రీరామునితో: ఓ రాఘవా! నీ యనుగ్రహము వలన నా భార్యను, రాజ్యమును పొందబోవుచున్నాను. తగు ఉపాయమును ఆలోచించి, నాకు బద్ధ శత్రువైన మా అన్నను నేడే హతమార్చుము.
ఈ విధంగా ఇరువురూ మాట్లాడుకుంటున్నప్పుడు కమలము వంటి సీతాదేవి యొక్క ఎడమ నేత్రము, బంగారు వన్నె గల వాలి యొక్క ఎడమ కన్ను, అగ్నిజ్వాలల వంటి రావణుని వామ నేత్రములు ఒక్కసారిగా అదిరినవి!
..వాలిని సంహరించటం అనునది దీనిని బట్టి స్థిరమైన అంశం. అతనితో సంప్రదింపు, లేదా వార్తాలాపం అన్నవి పూర్తిగా అప్రస్తుతం, అసందర్భం అని తెలియుచున్నవి.
శ్లో.
సీతాస్నేహప్రవృత్తేన స తు బాష్పేణ దూషితః।
హా ప్రియేతి రుదన్ ధైర్యమ్ ఉత్సృజ్య న్యపతత్ క్షితౌ॥
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్।
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే।
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్॥
(కిష్కింధకాండ, 6. 17, 22)
శ్రీరాముడు; సీతపై గల గాఢానురాగముతో కనులలో నీరు నిండగా ఆభరణముల వస్త్రమును చూసి ‘హా ప్రియా’ అని విలపించుచు ధైర్యము సడలి నేలపై పడిపోయెను.
లక్ష్మణుడు: అన్నా! ఈ కేయూరములను, కుండలములను నేను ఎరుగను. కానీ నిత్యము మా వదినెకు పాదాభివందనములు చేయుచుండుట వలన ఈ కాలి అందెలను మాత్రము ఆమెవేయని గుర్తించుచున్నాను!
శ్లో.
సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర।
అనంతరం విధాస్యామి సంప్రధార్య బలాబలమ్॥
(కిష్కింధకాండ, 8. 42)
శ్రీరాముడు సుగ్రీవునితో: మీ వైర కారణమును విని, మీ ఇరువురికి బలాబలములను, గుణ దోషములను లోతుగా పరిశీలించెదను. అనంతరము తగిన ఉపాయమును ఆలోచించి, నీకు మేలు కలుగునట్లు చూచెదను.
శ్లో.
అథ దీర్ఘస్య కాలస్య బిలాత్ తస్మాద్వినిస్సృతమ్।
సఫేనం రుధిరం రక్తమ్ అహం దృష్ట్వా సుదుఃఖితః॥
నర్దతామ్ అసురాణాం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః।
నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్స్వనో గురోః॥
అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తైః భ్రాతరం హతమ్।
పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా।
శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగతస్సఖే॥
(కిష్కింధకాండ, 9. 17, 18, 19)
సుగ్రీవుడు శ్రీరామునితో: ..చాలా కాలమునకు ఆ గుహ నుండి నురుగుతో కూడిన ఎర్రని రక్తము బయటకు వచ్చుచుండుట చూసి దుఃఖించాను. ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులును, యుద్ధరంగమున దెబ్బ తినిన మా అన్న యొక్క ఆక్రందన ధ్వనులును నా చెవికి సోకెను.
ఈ చిహ్నముల వలన రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న నిహతుడైనట్లు నిశ్చయించుకొన్నాను. తరువాత కొండంత బండంతో ఆ గుహద్వారమును మూసివేసి శోకార్తుడనై తిలతర్పణములను వదిలి కిష్కింధకు చేరితిని.
శ్లో.
యావత్ తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం।
తావత్ స జీవేత్ పాపాత్మా వాలీ చారిత్రదూషకః॥
(కిష్కింధకాండ, 10. 33)
శ్రీరాముడు: వానరోత్తమా! వాలి నీ భార్యను అపహరించిన దుర్మార్గుడు. అతను దుష్టవర్తనుడు. అతడు నా కంటబడనంత వరకే జీవించి యుండును.
శ్లో.
మత్తోయమితి మా మంస్థా యద్యభీతోసి సంయుగే।
మదోయం సంప్రహారేస్మిన్ వీరపానం సమర్థ్యతామ్॥
(కిష్కింధకాండ, 11. 38)
వాలి దుంధుభితో: ఓ దుందుభీ! ఈ వాలి మధాపానము చేసి మత్తిల్లియున్నాడని భావింపకుము. యుద్ధ సమయమున దీనిని ‘వీరపానము’గా ఎరుగుము!
శ్లో.
తమేవముక్త్వా సంకృద్ధో మాలాముతిక్షప్య కాంచనీమ్।
పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత॥
(కిష్కింధకాండ, 11. 39)
తండ్రియైన దేవేంద్రుడు ఇచ్చిన కాంచనమాలను వేసుకుని యుద్ధమునకు సిద్ధమై నిలచెను.
..ఈ సందర్బములో కూడా మాలను ప్రస్తావించటం జరిగింది కానీ దాని మహిమ ఇటువంటిది అని మహర్షి చెప్పలేదు. పిదప వాలి ఆ మాలను – శ్రీరాముని చేతిలో నుండి వచ్చిన బాణానికి హతుడై ప్రాణాలు వదులుతున్నప్పుడు సుగ్రీవుడికి ఇస్తాడు. అప్పుడు కూడా అది శత్రువు శక్తిని హరించునది అని చెప్పలేదు. పలువురు వ్యాఖ్యానాలలో ఈ మాట వచ్చియున్నది. ఇకపోతే తనను చాటుగా ఏల సంహరించావని శ్రీరాముని అడిగినప్పుడు శ్రీరాముడు ఈ మాల గురించి ప్రస్తావన తేలేదు. ఇది గమనార్హం!
శ్లో.
కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ।
లక్ష్మణేవ సహ భ్రాత్రా ప్రయతః సంయతాంజలిః॥
ప్రణమంతి హి యే తేషాం మునీనాం భావితాత్మనాం।
న తేషామశుభం కించిత్ శరీరే రామ దృశ్యతే॥
తతో రామః సహ భ్రాత్రా లక్ష్మణేన కృతాంజలిః।
సముద్దిశ్య మహాత్మానః తాన్ ఋషీన్ అభ్యవాదయత్॥
(కిష్కింధకాండ, 13. 25, 26, 27)
సుగ్రీవుడు రెండవసారి కిష్కింధకు వెళుతూ (వాలితో యుద్ధానికి) సప్త మునుల గురించి శ్రీరామలక్ష్మణులకి చెబుతాడు. వారికి అక్కడ (దారిలో) నమస్కారం చేసుకొన్న వారికి అశుభములు ఉండవని చెబుతాడు. ఇరువురు నమస్కారం చేసుకుని ముందరికి సాగారు.
(ఇంకా ఉంది)