శ్రీ సాయి బోధించిన వైదిక రహస్యాలు

0
3

[dropcap]మ[/dropcap]న మహాత్ములు చేసే బోధలన్నీ ఆనాటి దేశ, కాల, సమాజ పరిస్థితులకు అనుగుణంగా, అనుకూలంగా వుంటాయి. ఆ బోధలే మనకు ధర్మాలు అయ్యాయి. ఈ కారణం వలనే మహాత్ముల బోధలన్నీ ఏకీభవించవు. ఒక్క తత్వం విషయంలోనే వీరి బోధలన్నీ ఏకీభవిస్తాయి.

ఈ విధంగా ప్రస్తుత కాల ధర్మాన్ని నిర్ణయించేది సద్గురువే! కలియుగానికి సాటిలేని, మేటిలేని సద్గురువు శ్రీ సాయినాధులు. కనుక శ్రీ సాయి ఏమి చెప్పారో అవే మనకు వేద శాస్త్రాలు. శ్రీ సాయి ఏమి బోధించారో అవే మనకు ధర్మ శాస్త్రాలు. శ్రీ సాయి వేటిని శాసించారో అవే మనకు ధర్మాలు. శ్రీ సాయినాధుల తన భక్తులకు ఉపదేశింఛిన మరి కొన్ని వైదిక రహస్యాలను ఇప్పుడు స్మరించుకుందాము.

  1. అమ్మా! ఎందుకీ ఉపవాస వ్రతం. ఎవ్వరిని సంతోష పెట్టుటకు? అన్నం, అన్నం భుజించువారు ఇరువురూ దైవ స్వరూపులే! మనకు ఉపవాసం వుండే ఖర్మ ఏమిటి? ఎందుకీ కఠిన వ్రతాలను చేపడతావు? హాయిగా ఇంటికి వెళ్ళి, అన్నం భుజించి, ఇంటిలోని వారందరకూ పెట్టి నీవూ భుజింపుము. ఆ విధంగా చేస్తే నన్ను ఎంతో సంతోష పెట్టినదానివవుతావు.
  2. నేనెవరి నుండీ ఊరికే ఏదీ తీసుకోను. నేను అందరినీ అడగను కూడా. ఆ ఫకీరు నాకెవరిని చూపిస్తాడో, వారినే నేను దక్షిణ అడుగుతాను. అట్లా దక్షిణ ఇచ్చిన వారు విత్తనాలను నాటుకుంటున్నారు. తరువాత పెరిగిన పంటను కోసుకుంటున్నారు.
  3. మీలో ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎప్పుడు నన్ను స్మరించినా సరే, నా ముందు భక్తితో చేతులు చాస్తే చాలు, నేను వెంటనే మీ చెంతన వుంటాను. రాత్రింబవళ్ళు ఎప్పుడైనా సరే, మీ బాధ్యతను స్వీకరించి మీ విశ్వాసాన్ని పెంచుతాను.
  4. కర్మ ఒక్క మార్గం చిత్రమైనది. నేనేమీ చెయ్యకున్ననూ, నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. ఆది అదృష్టము బట్టి వచ్చును. నేను సాక్షీ భూతుడను మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుదును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు దోసి భగవంతునకు నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధం లూడి మోక్షమును పొందెదరు.
  5. ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో, ఎల్లప్పుడు వారు నన్నే దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయూ వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు, నన్నే సదా ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే నాకు సర్వశ్య శరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణగస్తుడను, వారికి మోక్షము నిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచూ నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే ఏమియూ తినరో అట్టివారిపై నేను ఆధారపడి వుందును. ఎవరయితే నా సన్నిధానముకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోవునట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా, నీ హృదయములో వున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here