[dropcap]“శ్రీ[/dropcap].. ఇండియా వెళ్లి వస్తాను..” అని కొడుకుతోను, “టికెట్ చూడు మంజీరా” అని కోడలితోను డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పింది వసుధ.
“అలాగే ఆంటీ, ఈ సారి ట్రిప్ ఎన్నాళ్ళు?” అడిగింది మంజీర.
“కొత్తగా అడుగుతావేం? ఆరునెలలు మామూలుగా ఉంటుంది. కదా అమ్మా!” అన్నాడు శ్రీకర్.
ప్రతి ఏడూ ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు ఇండియాలో ఉంటోంది వసుధ.
“లేదు శ్రీ, ఈసారి వన్ వే టికెట్ కొను. కొంత కాలం వుంటాను..” అంది వసుధ.
“వద్దు, పిల్లలు మిస్ అవుతారు..” అని శ్రీకర్ అంటే, “పిల్లలే కాదు అందరమూ మిస్ అవుతాం ఆంటీ!” అంది మంజీర.
“ఈసారి ఎందుకో నా వంతు ఏదైనా సేవ చేయాలని వుంది.. ప్లీజ్!”
“మీరు ఏమంటారు డాడ్?” అని తండ్రిని అడిగాడు.
“మాం వెంటే నేను. ఇప్పుడు కమాండింగ్ ఆవిడదే కదా!” అన్నాడు రాజశేఖర్.
“సరే నీ ఇష్టం!” అన్నాడు శ్రీకర్.
వారం తర్వాత ఇండియా వచ్చింది వసుధ. ఇల్లు సర్దుకుని వాతావరణం కుదుట పడ్డాక ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. వాళ్ళు ఒకసారి కలిశారు. ఆ తర్వాత ఎవరి పనులతో వారు బిజీ అయ్యారు.
వసుధ ఇల్లు అన్నిటికి సదుపాయంగా ఉంటుంది.. ఉండేది శ్రీనగర్ కాలనీ పార్కులు దగ్గిర కనుక వాకింగ్ చేయడానికి బాగుంది.
కొత్త పుస్తకాలు కొనుక్కుంది చదవడానికి. కాసేపు లైబ్రరీకి వెళ్లి టైం పాస్ చేస్తుంది. ఎవరైనా రాజకీయాలు, బుక్స్ గురించి మాటాడితే తన అభిప్రాయం చెబుతుంది.
పిల్లలు ఫోన్ చేస్తే ‘బాగానే గడుస్తోంది..’ అని చెప్పింది.
భర్త రాజశేఖరం కూడా అయన స్నేహితులను గురించి వాకబు చేస్తే ఎవరూ అందుబాటులో లేకపోయారు.
“ఇక్కడ బోరుగా వుంది. అమెరికాయే బాగుంది నాకు..” అంటూ గొడవ చేసేడు.
“మీరు వాకింగ్‌లో ఎవరినైనా స్నేహితులను చేసుకోండి” అని వసుధ అంటే
“వాళ్ళు నాకు నచ్చే కబుర్లు చెప్పరు. పార్టీలు, కులాలు తిట్టుకోడాలు. మంచి చేస్తే మెప్పులేదు. చెడ్డ పనులు చేసేవారిని సపోర్ట్ చేస్తారు. నేను టాపిక్ మార్చి అమెరికా విషయాలు చెబితే చివరికి దానికి ఏదో కామెంట్ పెద్ద ఫోజు అని”.
“ఎలాగో వచ్చాం కదా, కొంత కాలం ఎలాగో గడిపేద్దాం.. ప్లీజ్..” అని బతిమాలింది.
“నిజమే ఇక్కడి జనం ఇదివరకులా అభిమానంగా పలకరించడం లేదు. రాకపోకలూ లేవు. ఎంత సేపు పూజలు తీర్థయాత్రలు. జబ్బులు. డాక్టర్లు చేసే అనవసరపు ట్రీట్‌మెంట్ గురించి చెప్పడం భరించడం కష్టంగానే వుంది.”
“ఇకనుంచి మీరు నాతో రండి. నాతో ఎవరూ మాటాడరు. మనమే మాటాడుకోవచ్చు” అని ఒప్పించింది.
అయనకి ఇష్టం లేకపోయినా ఆమెను అనుసరించాడు.
ఒకరోజు పార్కులో ఒక వ్యక్తి వచ్చారు. ఆయన చాలా స్లోగా నడుస్తున్నారు. వస్త్రధారణ మనిషి తీరు చూస్తే పెద్ద ఆఫీసర్ జాబ్ చేసినట్టు కనిపిస్తున్నాడు. ‘ఎవరూ తోడు లేకుండా ఇంత ట్రాఫిక్‌లో ఎలా వస్తారో పాపం!’ అనుకుంది వసుధ.
ఉండలేక ఒకరోజు అడిగింది.
“గుడ్ మార్నింగ్. మీకు ఇష్టం ఉంటే మాతో మాటాడుతారా? మేము మీతో కలిసి నడవచ్చా?” అని.
“వద్దు. నేను ఒంటరిగా నడుస్తా” అన్నాడు నిర్మొహమాటంగా.
“మీ పేరు?” అడిగాడు రాజశేఖర్.
“కపిల్ వర్మ!” అని చెప్పి రెండు రౌండ్స్ ఎలాగో తిరిగి వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు ఆయన.
వర్మ మాటకారి కాదు. అలాగే ఎవరి స్నేహం కోరుకోడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడని అర్ధం అయింది.
వర్మ లేచి ఇంటికి బయలుదేరితే వెనకాలే వసుధ, రాజశేఖర్ అనుసరించారు.
అడుగులో అడుగు వేసుకుంటూ కార్లు బైకులు తప్పించుకుని ఎప్పటికి ఇంటికి చేరుకుంటాడో అనుకుని ఇంటిదాకా వెళ్లి తిరిగి వచ్చారు.
“వర్మగారికి మనం బాడీ గార్డులం అన్నమాట..” అన్నాడు రాజశేఖర్ నవ్వుతూ.
“అలాగే అనుకోండి. మనకేమి నష్టం!” అంది వసుధ.
మరునాడు వసుధ, శేఖర్‌లకి ఎదురయ్యాడు వర్మ.
“గుడ్ మార్నింగ్” అని విష్ చేశారు. ఆయన కూడా విష్ చేశారు.
పార్కులో నుంచి తిరిగి వస్తుంటే ముందు నడుస్తున్న వర్మగారిని ఎవరో సైకిల్ మీద వెడుతూ డాష్ ఇచ్చారు. తూలిపడబోతుంటే వసుధ శేఖర్ చెరో వైపు పట్టుకుని ఆసరా ఇచ్చారు.
“చూసారా వర్మగారూ, మనం ఎంత జాగ్రత్తగా వున్నా ఎదుటివారి వలన దెబ్బలు తగులుతాయి. లేదా పడిపోతాం. వడ్డనకండి మీ ఇంటికి వచ్చి తీసుకువెళ్లి తిరిగి దిగబెడతాం”. అని చెప్పేరు.
అయన మాటాడలేదు. వద్దనలేదు. అదే చాలు.. అనుకున్నారు వసుధ శేఖర్‌లు.
ఆలా రోజూ వర్మ గారిని పార్కుకి తీసుకురావడం దిగబెట్టడం చేస్తున్నారు.
రెండురోజుల తర్వాత “మీరు ఎందుకు నా కోసం శ్రమ పడుతున్నారు? మీకు నాతో ఏమి సంబంధం?” అన్నాడు వర్మ గారు.
“మంచివారే. ఏదైనా సంబంధమే ఉండాలా! మానవత్వం. మా అన్నగారు అనుకున్నాం. తోడు రావాలని అనిపించింది. అంతే. కొన్నిటికి కారణాలు వుండవు.”
“నా భార్య చనిపోయి అయిదేళ్ళు గడిచింది. అప్పటిదాకా నేను బాగానే వున్నా. ఆ తరువాత క్రుంగిపోయాను. జబ్బుపడి కోలుకున్న వేగంగా నడవలేను. అసలు నడవక పొతే బెడ్‌కి పరిమితమై పోతానని భయం. ఇంటిపనికి వంట పనికి మనిషి వుంది.” అన్నాడు. ఇన్నాళ్లకు ఆయన ఈ మాత్రం మాటాడేరు.
“మరి పిల్లలు?” అడిగింది వసుధ.
“ఎవరూ లేరు.” అది వైరాగ్యమో, నిజమో.. అర్థం కాకపోయినా అయన అంతకంటే చెప్పరని, తెలుసు కనుక ఊరుకుంది.
అలా వర్మ గారికి వాకింగ్‌లో కంపెనీ ఇవ్వడం వసుధకి శేఖర్‌కి ఆనందంగా వుంది. ఆ పరిచయం అంతవరకే. అంతకు మించి వర్మగారి నుంచి రాబట్టడం వీలుకాలేదు.
ఒకరోజు పార్కులో సమావేశం జరిగింది. అప్పుడు వసుధను సీనియర్ సిటిజన్స్ కోసం ఏదైనా సలహా చెప్పమని అడిగారు.
ఆ పార్క్ గురించి కొందరు చెప్పారు. ఏభై ఏళ్లుగా చాలా మంది ఈ పార్క్‌కి వచ్చి సీనియర్ సిటిజన్స్ అయ్యారు. అందుకే పూర్తిగా సీనియర్ సిటిజెన్ పార్క్‌గా మార్చాము. వారికోసం ఏమిచేయాలో సలహా ఇవ్వాలని వసుధను అడిగినపుడు ఆమె తన ఆలోచన చెప్పింది.
“నేను ఆరు నెలలుగా వచ్చి చూస్తున్నప్పుడు అనిపించింది ఏమిటి అంటే ఇక్కడి పధ్ధతి ప్రకారం అరవై ఏళ్ళు దాటినవారు సీనియర్ సిటిజన్స్. కానీ ఈ రోజుల్లో 90 ఏళ్ళు వచ్చిన వారు కూడా నడవ గలిగినంత నడవాలని ఒకే చోట కూర్చోరాదని ఇప్పుడు డాక్టర్లు చెబుతున్న కారణంగా నడిచేవారు పెరిగారు. ఐతే వారికంటే చిన్నవారు, చురుకుగా ఉండేవారు చుట్టుపక్కలవారు ఎవరైనా వారికి తోడుగా ఉండి, ఇంటి నుంచి తీసుకువచ్చి, తిరిగి ఇంటి దగ్గిర దిగబెట్టేవారు ముందుకు రావాలని కోరుతున్నాను. ఒకొక్కరు ఒకరిని తీసుకురండి. ఏమంటారు?” అంది వసుధ.
“మరో విషయం కొందరు ఎక్కువ మాటాడితే కొందరు తక్కువ మాటాడుతారు. కొందరికి రాజకేయాలు ఇష్టం, కొందరికి బుక్స్, సినిమాలు, స్పోర్ట్స్, ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ఇలా వారికీ నచ్చిన కబుర్లు విశేషాలు చెప్పే ప్రయత్నం చేయండి. వారికీ సంతోషంగా ఉంటుంది.”
ఈ సూచన అందరికి నచ్చింది. దాన్ని వెంటనే అమలు చేశారు కూడా.
ఈ విషయాలు శ్రీకర్ మంజరికి చెప్పేరు.
“గ్రేట్ ఆంటీ, మరి ఎప్పుడు వస్తున్నారు వెనక్కి?”మంజరి అడిగింది.
“ఇంకా ఏమి అనుకోలేదు. మీ వయసు వారికీ ఎన్నో పనులు ఉంటాయి. మీకు తగిన స్నేహితులు వుంటారు. మన దేశంలో సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని హోమ్స్ వున్నా కొందరు అక్కడ ఉండటానికి ఇష్టపడని వారు వున్నారు. వారికి తోడుగా నేను డాడ్ కొంత కాలం ఇక్కడే వుండాలని వుంది.” చెప్పింది వసుధ.
“అయితే మేమే మీ వాకింగ్ ఫ్రెండ్స్‌ని చూడటానికి ఇండియా వస్తాం.” అన్నాడు శ్రీకర్.
పిల్లలు వచ్చిన సందర్భంగా పార్కులో అందరికి లంచ్ ఏర్పాటు చేసింది వసుధ. అందరూ వసుధ శేఖర గురించి మాటాడేరు.
“బాబూ శ్రీకర్, మాలో కొత్త సంతోషాన్ని నింపారు మీ అమ్మానాన్నలు. అందరూ వారిలా ఆలోచిస్తే బాగుండును. మేము వారికి కృతజ్ఞులం..” అన్నారు.
అదంతా చూసి మంజరి అత్తగారిని అభినందించింది.
శ్రీకర్ ఆ పార్కులో ఒక పెద్ద మీటింగ్ రూము కట్టడానికి, తాగు నీరు సదుపాయానికి డొనేషన్ ఇచ్చాడు. పార్టీలు సమావేశాలు జరుపుకునే వీలు కల్పించాడు.
భారతదేశం విడిచి వెళ్లినవారు కొందరు కృతఘ్నులై అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇది బాగాలేదు అంటూ విమర్శించే వారు వారి అభిప్రాయం మార్చుకోవాలి.
ఇక్కడివారు చేయలేనివి విదేశాలలో వున్నా కొంతమంది చేయడం హర్షణీయం.