[dropcap]బ[/dropcap]తుకంతా కాళ్ళముందు పరిచి
ఊడిగం చేసినా
“నువ్ సహచరివి, సగభాగానివి”
అనలేని పెనిమిటి
కాస్త నోరెత్తిన మరునిముషమే
బరితెగించావంటాడు.
ఇంట్లోకి అన్నీ తెచ్చిచ్చి,
కూతంత వండి వార్చమంటే
తీపరమేంటో అంటూ మెటికలు విరిచే
అమ్మలక్కలు
“దానికేం తక్కువని దినాం ఈలొల్లి” అని కొరకొరా చూసే అన్నతమ్ముళ్ల లెక్కల మధ్య..
పుట్టి బుద్ధెరక్కముందే
కాళ్ళ సందుల్లో ఉబికిన బహిష్టు నెత్తురు మొదలు
ఇద్దరు పిల్లల్ని పదినెల్లు మోసి
రక్తం ధారబోసి కన్నదినం వరకూ
ఆడనై పుట్టినందుకు
నేనీదీన వందలాది అవమానాల కాల్వలూ
“అసెయ్ ఒసేయ్.. ఇదిగో అదిగో” తప్ప పేరుపెట్టి పిలవలేని పితృస్వామి అదిలింపులూ..
ఇంటిపనుల రంధిలో పడి
తానేంటో, తన పేరేంటో మర్చిపోయి పొరుగిళ్లకు పరిగెత్తి
లబోదిబోమన్న ఇల్లలికే ఈగలా
నేనో neglected species గా మారిపోయి,
గడికో రూపంలో పుట్టుకొస్తున్న
సరికొత్త పితృస్వామ్యాలు
మమ్ముల్ని endangered species లోకి నెట్టేసే
కుట్రలు smart గా పన్నుతుంటే
స్త్రీ బతుకులు దినాలుగా తప్ప
ఉత్సవాలుగా ఎక్కడున్నాయి?
అసలు స్త్రీలూ మనుషులే అన్న నిజం ఒప్పుకోలేని
నయా మనువాదుల సమాజంలో,
ఇళ్ళల్లోని స్త్రీ శ్రమను ఎగతాళి చేసే పుంగవులంతా
కట్టగట్టుకొచ్చి
ఈ ఒక్కరోజు ఉద్వేగాలు
అందమైన సందేశాలు
వందలాది పూదండల వర్షాలు కురిపిస్తే మాత్రం
ఆమె బతుకు చిత్రం మారేనా?
ఆమెపై మీరంతా మోపిన చిరకాల వివక్ష తీరేనా?