ఓం.
ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో నేనూ మా శ్రీమతి యథాలాపంగా మా రాబోయే భారత సందర్శనంలో విశాఖ నుంచి చెన్నై(కార్లో) వెళ్దామనుకున్నాం.
మా శ్రీమతి, మధ్యలో తిరుమలలో వెంకన్న దర్శనం చేసుకు వెళ్తే బాగుంటుందని ప్రతిపాదించింది.
దానికి నేను నా వితండవాదానికి కాస్త (వెట)కారం జోడించి..
అంత ప్రయాస పడి వెళ్లడం దేనికి, తీరా వెళ్లినా కళ్లు చూడడానికి (నేత్ర దర్శనం) ఒకసారి, కాళ్లు చూడడానికి (నిజపాద దర్శనం) ఒకసారి చూడాలి కదా!
దాని బదులు యింట్లోనే కళ్లుమూసుకుని ధ్యానించుకంటే ఇంకా తృప్తిగా వుంటుంది.
అంటే..
మీతో యెప్పుడూ వున్న సోదేగా.. అని విసుక్కుంది.
ఆ తరువాత మా దైనందిన కార్యక్రమాల్లో మునిగి పోయాం.
ఆ రాత్రి మామూలుగా నిద్రపోయాను. కాస్సేపటికి ఒక కల!
వెంకన్న బాబు చిరునవ్వుతో, “నన్ను చూడడానికి, నీ యిబ్బంది ఏమిటి?” అని అడుగుతున్నట్లుగా!!!!!!
పగలు తర్కించుకున్న విషయమేకదా. ఈవిధంగా స్ఫురణకు వచ్చిందని సమాధానపరచుకుని, కాసిన్ని మంచినీళ్లు తాగి నిద్రకుపక్రమించాను. కానీ నిద్ర పట్టలేదు. ప్రక్కనే వున్న చరవాణిలో చలనం గమనించి చేతిలోకి తీసుకున్నాను.
నా బాల్య మిత్రుడు రామచంద్ర రావు (రాము) (విశాఖపట్నం) వద్దనుండి ఒక అభ్యర్థన.. వాట్సప్‌లో..
మాకు మా కార్యక్రమానికి ‘తిరుమల శ్రీవారి అంగాంగ వర్ణన’ కావాలి. నువ్వు చేయగలవని అనుకుంటున్నాను. అని. విషయసూచిక కూడా అందులోనే వుంది.
నాకు, రాముకు సాహిత్యపరమైన సమాచార మార్పిడి, (దూరదేశాల్లో వున్నా, వాట్సప్ పుణ్యమా అని) సాధారణమే కాబట్టి, దాన్ని విశేషంగా తీసుకోలేదు.
ఎలాగూ నిద్ర రావడం లేదు కనుక ప్రయత్నిద్దామని కూర్చున్నాను. ‘విషయావలోకన’ కోసం అంతర్జాలంలో స్వామివారి స్వరూపాన్ని ఓ మారు నిశితంగా చూసుకుని.. ఉపక్రమించాను.
పదాలు అలవోకగా స్ఫురించ సాగాయి. ఏకబిగిన రచన సాగి పూర్తయ్యింది..
ఒప్పుకున్న పనేదో పూర్తయిందన్నట్టుగా వెంటనే దాన్ని రాముకు పంపించి, బరువు దిగినట్లయి, మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. నడిరాత్రి దాటినందున వెంటనే నిద్ర పట్టేసింది.
మళ్లీ వెంకన్న బాబు దర్శనం!!!
ఆ కళ్లల్లో ఓ చిఱు దరహాసం!! ఓ పిసరు మేలమాడుతున్నట్లనిపించింది.
ఏం నాయనా! ఆపాదమస్తకం చూసుకున్నావా? తృప్తిగా వుందా? అన్న భావన ద్యోతకమౌతోంది!!!!!
అంతవరకూ ఎంతో సాధారణమనిపించినదంతా ఒక్కసారిగా అంతరార్థం అవగతమై ఒళ్లు గగుర్పాటు చెంది, ఒక అసాధారణమైన అనుభూతి !!!!!
అప్రయత్నంగా ధారగా కన్నీరు..
అందులోనే..
ఒక భావం..
~
నామాలచాటున నవ్వేల? నాస్వామి
ఆనవ్వదెందుకో నాకు తెలుసు!
పట్టుదలతో, నిన్ను పట్టించుకోనని
పట్టుబట్టి, నన్ను పట్టినావు
చిట్టికలహమెగాని, చింతమానినగదా
నీ స్మరణతో నాకు నే తరింతు
అంగాంగ వర్ణన, అవధరింపుము స్వామి
నేనెంతవాడను, నిన్ను బొగడ
నిదురలోనను, గలుగు నీ నామస్మరణ
నిఖిలజగమెల్ల నీమూర్తి నిండియుండ
నిర్గుణమ్మయి నీవేల నీరజాక్ష
కానుపించవు? కపటివి కమలనయన
అలా యీ అనుభవం అర్థం కాని కలలా, ‘కలయో నిజమో, వైష్ణవ మాయో’ అన్నట్లుగా నిలిచి పోయింది.
***
ఆనంద నిలయంలో అలౌకిక దర్శనం:
మూలవిరాట్:
పరమాణువున కంటె పసిపాప యీతడు
అఖిల విశ్వమునకు అన్న యితడు
తేరిచూడగరాని తేజమ్మె యీతడు
కనుమూసి ధ్యానింప కాచునితడు
శ్రీవారి పద్మ పీఠం:
కమలాక్షుడీతడి పాదాలు కమలాలు
కామితార్థములిచ్చు కలిమి పట్టు
శ్రీ పదమ్ముల నిట్టు పట్టియుంచెడి తట్టు
శ్రీ పాదపీఠమ్ము పరమపదము
శ్రీవారి పరమోన్నత చరణాలు:
పదములు శ్రీ దివ్య పరమపదమును యిచ్చు
పారాణి రంజిత పాదయుగము
కనక శోభితమైన కడియాల సొబగులు
రత్న మంజీరాల రాజసములు
శ్రీవారి వస్త్రం:
బంగారు జలతారు పట్టువస్త్రాలు నీ
నీలి మేని చాయనిబ్బరించె
పూటకొక కొంగ్రొత్త పుట్టమ్ము ధరియించి
రాజసము జూపెదవు రమణమూర్తి
దుష్ట శిక్షణార్థం సూర్యకటారి:
శిష్టులను రక్షింప దుష్టులను శిక్షింప
సూర్య కటారి చే బూనినావు
కరుణమూర్తిగ నీవు కానుపించెదు గాని
యమధర్మరాజు, వధర్ములకును
శ్రీవారి వరద హస్తం:
కోరినవారికి కొంగుబంగారమై
వరములిచ్చేటిదీ వరదహస్తం
చాలు చాలింక పేరాశ వద్దనిచెప్పి
వారించుజనుల నీ వరదహస్తం
శ్రీవారి కటి హస్తం:
ఆర్తితోనర్థించు ఆపన్నులను యెపుడు
కాచి రక్షించు నీ కటి హస్తము
అక్కున జేకొని గ్రక్కున కాపాడు
అభయహస్తమ్మె యీ కటి హస్తము
శ్రీవారి యజ్ఞోపవీతము:
పరమ పవిత్రమౌ యజ్ఞోపవీతమ్ము
స్వర్ణ కాంతుల వెలయు సంస్కృతమ్ము
వామ స్కంధముపై వాటమై వెలయుచు
నిగమాల నాల్కల నిలుపుచుండు
హృదయంలో దేవేరి మహాలక్ష్మీ అమ్మవారు:
శ్రీ నివాసమ్మైన శ్రీవారి హృదయాన
కామితములిచ్చు కళ్యాణ లక్ష్మి
మాతృవాత్సల్యాన మానవుల బ్రోచేటి
శ్రీ మహాలక్ష్మి శ్రీ దేవ దేవి
హృదయంలో దేవేరి పద్మావతి అమ్మవారు:
అడవిలో తిరుగాడు ఆదిదేవుని కొఱకు
ఆకాశరాజునందవతరించి
పద్మావతీ దేవి పరిణయమ్మాడి శ్రీ
దేవదేవుని హృదిని తేజరిల్లె
భుజములయందు నవరత్నముల నాగాభరణాలు:
కొండపై వెలసిన కోనేటిరాయ, ని
న్నెడబాయలేని యా నాగరాజు
నవరత్న ఖచిత నాగాభరణ యుగ్మమై
సందిటన్ మెరసెను సుందరముగ
శ్రీవారి సుదర్శన చక్రం:
సుదర్శనమిదం రూపం చక్రహస్తం సుదర్శనం
~
కాలచక్ర బంధ మీలోకమనియెల్ల
కాలమందు తెలియజేయుచుండు
దివ్యకాంతులతోడ తేజరిల్లును కాని
వజ్ర కాఠిన్యమై వ్యవహరించు
శ్రీవారి పాంచజన్యం (శంఖువు):
పాంచజన్యపు శంఖునాదము పాపులకు హెచ్చరిక యౌ
కట్టె యెదుటను కానుపించుచు కాలునిన్ తలపించుచున్
నీతి తప్పి చరించు వారికి నీతి నియమము దెల్పుచున్
అందముగ కన్పించుచున్నను అగ్నికీలల జూపుచున్
తిరునామాలవాడు:
చల్లనౌ పచ్చకర్పూరమ్ము కస్తూరి
నామసుధామృత్తికతో నామమిడగ
తిరునామమై, తిరుమలకు నామమై
ప్రజల, భక్తి ప్రపత్తుల బడయ చేయు
నవరత్న ఖచిత కిరీటం:
గోవింద, గోవింద గోపురమ్మటులుండు
నీదు మకుటమ్ములు నీకె సాటి
వజ్రమ్ములైనను వెైడూర్యమైనను
నీ శిరమ్మున గాక, నిత్యమౌనె!
శుభం