అలనాటి అపురూపాలు-159

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నేనెలా సేదతీరుతానంటే – వైజయంతిమాల:

ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే సినీనటులకు కాస్త విశ్రాంతి సమయం దొరికితే వాళ్ళేం చేస్తారు? ఎలా సేదతీరుతారు? తనకి అలా విశ్రాంతి సమయం దొరికితే తానేం చేస్తానో చెప్పారు అలనాటి ప్రసిద్ధ నటి వైజయంతిమాల.

1960లో ఓ సినిమా పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో తెలుసుకుందాం.

***

అది మద్రాసు బీచ్.. సూర్యోదయపు వేళ.. అలలు నురుగులు కక్కుతూ తీరాన్ని తాకుతున్నాయి.. చిన్నపిల్లలు నవ్వుతూ, కేకలు పెడుతూ ఆడుకుంటున్నారు.. లేలేత వెచ్చదనం.. ఆటంకాలు లేని ఆనందం వారిది.. నేను మైమరిచిపోయాను.

హఠాత్తుగా నా మనసులో ఏదో ఒక శబ్దం, నేను ఇక ఇంటికి వెళ్ళాలని చెప్తోంది. వెళ్ళి నియమిత క్రమంలోని పనులని చేయమని చెప్తోంది. నేనో సెలెబ్రిటీననీ, వైజయంతిమాలనని గుర్తు చేసింది. రిలాక్స్ అయ్యేందుకు సెలబ్రిటీలకు దక్కే సమయం చాలా తక్కువ.

కనీసం నేను అలా నమ్ముతాను. అయితే ఈ నియమానికి లొంగిపోరాదని నేను చాలా రోజుల క్రితమే నిశ్చయించుకున్నాను. అయితే, నేను – కీర్తిని అనుసరించి వచ్చే – జనాల, అభిమానుల, ప్రచారాల సంకెళ్ళను భౌతికంగా  తెంచుకోలేకపోవచ్చు.

కానీ మానసికంగా, నేను స్వేచ్ఛగా ఉంటాను. స్వేచ్ఛగా శ్వాసిస్తాను, స్వేచ్ఛగా జీవితాను, స్వేచ్ఛగా సేదతీరుతాను. నిజమైన విశ్రాంతి అంటే ఓ రహస్యమైన ఊట లాంటిది. దానిని వినియోగించుకున్నప్పుడే గుర్తించగలం. భౌతికమైన విశ్రాంతిని నేను ఆస్వాదిస్తాను.

అయితే మానసిక విశ్రాంతి లేకపోతే భౌతిక విశ్రాంతి పరిపూర్ణం కాదు. భౌతిక విశ్రాంతితో మానసిక విశ్రాంతి అనేది ఎప్పటికీ నిజం కాదు. విశ్రాంతి అంటే నా ఉద్దేశంలో, రోజూ వారీ జీవితంలోని చిన్నా చితకా బెంగలను మరిచేలా చేసేది.

అది మనసును అజ్ఞాత ప్రదేశాలలో తిప్పుతుంది, అక్కడ ప్రతి ఒక్క కొత్త ఆవిష్కృతి కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది, ప్రతి ఆలోచనా కొత్త అర్థాన్ని అందిపుచ్చుకుంటుంది. మరి సినీతారలు ఎలా రిలాక్స్ అవుతారు?

అందరిలానే. ఉదాహరణకి నన్నే తీసుకోండి. పని లేని రోజున నేను – ఉదయం పూట సగం సమయం, ఎవరైనా, ‘పాపా, బాగా ఆలస్యం అవుతోంది ఇంక లేవవా’ అని అడిగేదాకా, మంచం మీదే గడుపుతాను. అప్పుడు కూడా అయిష్టంగానే మంచం దిగుతాను. బయటకి వచ్చి చల్లని, తాజా గాలిని పీల్చుకుంటాను. కళ్ళని నిద్ర బరువు ఇంకా వదలదు. అయితే రాత్రి పూట మంచి నిద్ర పడితే, అది భౌతికమైన విశ్రాంతనే భావించాలి.

అసలైన విశ్రాంతి ఆ తరువాతనే లభిస్తుంది. మానసికమైన చలాకీతనం నా రోజూ వారీ స్టూడియో వ్యవహారాలను మరిచిపోయేలా చేస్తుంది. కాంతివంతగా వెలిగే ఆర్చ్ లైట్లతో సెట్లలోని ముతక వాతావరణం, గ్రీస్ పెయింట్ పూసిన ముఖాలు, కృత్రిమంగా నమ్మించే ఆ ప్రపంచానికి కాస్త విరామం.

చుట్టూ గ్లామర్ ఉన్నప్పటికీ, ఇవన్నీ బాగా విసుగు తెప్పిస్తాయి. ఈ మార్పులేని నిరుత్సాహాన్ని దూరం చేసుకోవాలంటే, రిలాక్సేషన్ కోసం, ఏదైనా మంచి అభిరుచిని కల్పించుకోవాలి.

కేవలం విసుగుదలని తరిమేయడం పెద్దగా ఉపకరించదు. అది మరింత విసుగు కల్పించే చర్యలకి ఉపోద్ఘాతం వంటిది. అదృష్టవశాత్తు నటన కాకుండా, నాకెన్నో ఇతర ఆసక్తులు ఉన్నాయి, దానివల్ల నేనెప్పుడూ ఖాళీగా ఉండను. అయితే సేదతీరేందుకు నాట్యం నాకున్న ఉత్తమమైన మార్గం.

నటన కన్నా నాట్యం ఇంకా శ్రమతో కూడినది కదా అని ఒక స్నేహితురాలు అడిగింది. “నాట్యాన్ని నువ్వు పరిగణించేంత గంభీరంగా ఎవరైనా తీసుకుంటే ఆది ఎప్పటికీ మనోరంజనం కాలేదు” అని అందామె. కానీ వాస్తవం ఏమిటంటే, నేను నాట్యాన్ని అంత గంభీరంగా పరిగణిస్తాను కాబట్టే, దానిని అంతగా ఆస్వాదిస్తూ విశ్రాంతి పొందగలను, అదే చెప్పానామెకు.

నాట్యం అనేది నాకు ఏదో కాలక్షేపం కాదు, అది నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మద్రాసులో ఉన్నప్పుడల్లా తీరిక సమయాల్లో నేను నా డాన్స్ స్కూలు ‘నాట్యాలయ’కి తప్పనిసరిగా హాజరవుతాను. దాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమయిన అంశాలన్నింటినీ పరిశీలిస్తాను.

నా తీరిక సమయంలో ఎక్కువ భాగం నాట్య సాధనకి కేటాయిస్తాను. భరతనాట్యం ఒక గొప్ప కళ. ఏకాగ్రతగా నిత్యం సాధన చేయడం వల్ల శరీర కదలికలని, వ్యక్తీకరణని గొప్పగా మేళవించగలం.

ఐతే నిజానికి నేను అసలైన నాట్య ప్రదర్శనలలో కాక, సాధనలోనే (రిహార్సల్స్) బాగా విశ్రాంతి పొందుతాను. నా పాదాల లయకి, మనసు గాల్లో తేలి, నన్ను మేకప్-ప్రపంచానికి దూరంగా, సుదూరంగా తీసుకెళ్తుంది.

వేదికలపై నాట్యం చేయడం నాకు మొదటినుంచీ ఇష్టం. అదే ప్రేక్షకుడికి, కళాకారుడికి మధ్య సంపూర్ణ సామరస్యం ఏర్పడడానికి దారితీస్తుంది. బహుశా కనిపించని ఈ లంకె – మానసికమైన ఒత్తిడిని దూరం చేస్తుంది.

నాట్యం నాలో ఒక ఊటలా తాజా శక్తిని నాలో విడుదల చేస్తున్నట్లనిపిస్తుంది. నూతన చైతన్యమిస్తుంది, సేదతీరుస్తుంది. దీన్ని ‘రిలాక్సేషన్’ అంటారా అని మీరు అడగవచ్చు. అయితే మీ సంకుచిత పరిధి లోని సమస్యల నుండి మిమ్మల్ని విశాల ప్రపంచంలోకి, మరొక పరిధిలోకి తీసుకువెళ్ళేది రిలాక్సేషన్. కాదంటారా?

ఇటీవల బొంబాయిలోనూ, అహ్మదాబాదులోను జరిగిన మూడు రోజుల నాట్య ప్రదర్శన సందర్భంగా, మొదటి రోజు సాయంత్రమే నా కుడి పాదంలో ఒక బొబ్బని గుర్తించాను. దాన్ని పట్టించుకోకుండా, ప్రదర్శన కొనసాగించాను.

రెండవ రోజు రాత్రి పాదం బాగా నొప్పి చేసింది. వైద్యుడిని సంప్రదించాను. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఇక్కడ నేను ఇంకొక ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

ప్రేక్షకులని నిరాశ పరచడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకని వైద్యుడిని ఒప్పించి బొబ్బ పగలడానికి మందు పూయించుకున్నాను. కుడి పాదాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మర్నాడు రిహార్సల్స్ చేశాను. ఆందోళనగా ఉన్న హృదయంతో అహ్మదాబాదులో నేను ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

సంగీతం మొదలయ్యింది. నేను నా నొప్పిని పట్టించుకోకూదనుకున్నాను, అసలు దాని ఉనికినే విస్మరించాలని తలచాను. నాట్యం చేయడం ప్రారంభించాను, నొప్పిని మరిచిపోయేలా నృత్యం చేశాను, అది పని చేసింది!

నేను నర్తిస్తుంటే, నా మనసు భౌతికపరమైన అసౌకర్యాలను అధిగమించి స్వేచ్ఛగా వర్తించిది. నాకెంతో విశ్రాంతిగా అనిపించింది. పత్రికా ప్రతినిధులు, ప్రజలు నా ప్రదర్శలని మెచ్చుకున్నారు. మొదటి దాని కన్నా రెండవది, రెండవ దాని కన్నా మూడవది మరీ బావున్నాయని అన్నారు.

గెలవాలన్న సంకల్పం – జీవించాలన్న సంకల్పం కన్నా – దృఢమైనదన్న  నా నమ్మకాన్ని ఈ ఘటన బలపరిచింది. గాలిలో మేడలు కట్టడం నాకు విసుగు. అందుకని నా ఆలోచనలని కాగితంపై పెడతాను.

నృత్యం కోసం కొన్ని కఠినమైన భంగిమలను రచిస్తున్నప్పుడు, ఒక స్కెచ్‍బుక్‍ని వెంట ఉంచుకుంటాను. ఒక్కో భంగిమ కోసం నేను గీసే బొమ్మలు – అంత పరిపూర్ణంగా ఉండవు, చిన్నపిల్లలు గీసిన చిత్రాల్లా ఉంటాయి – అయినా అవి నా పనిలో చాలా గొప్పగా ఉపకరిస్తాయి.

నాకు పార్టీలకి, ఇతర వేడుకలని హాజరవడం పెద్దగా ఇష్టం ఉండదు. బొంబయిలో గాని మద్రాసులోని గాని బీచ్‍లో తిరగడం ఇష్టపడతాను. ఎప్పుడైనా, ఓ విదేశీ సినిమా చూస్తాను.

నాకు మంచి సంగీతం ఇష్టం. అలాగే ఊర్లో ఏదైనా హిచ్‍కాక్ సినిమా ఆడుతుంటే, నేను ఆగలేను. నేను ముందే చెప్పాను – ప్రణాళికతో రూపొందించుకునే విశ్రాంతి నాకు పెద్దగా పట్టదని.

విశ్రాంతి పొందాల్సింది మనసే, అప్పుడు శరీరం దానంతట అదే విశ్రాంతి పొందుతుంది. మానసిక విశ్రాంతి పొందడానికి ఉత్తమమైన మార్గం ప్రార్థన అని నేను భావిస్తాను.

నేను వీలైనంత సమయం ప్రార్థనలోనూ, పూజలలోనూ గడుపుతాను. మన పూర్వీకులు ఎప్పుడూ పూజని ఒక ఆధ్యాత్మిక ఆచారంగా పరిగణించలేదు. అది వాళ్లకి మానసిక క్రమశిక్షణని అలవర్చింది.

ప్రార్థన నుంచి లభించే శాంతి, సంతోషం మనలని ఎంతగానో సేదతీరుస్తాయి, ఎందుకంటే ప్రార్థన ఆత్మని శుద్ధి చేస్తుంది. దీర్ఘకాలంలో అంతర్గత శాంతి – ఒత్తిడులను కరిగిస్తుంది. ఒత్తిడులు లేకపోవడం విశ్రాంతి కలిగిస్తుంది.

***

ఇదీ వైజయంతిమాల సేదతీరే విధానం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here