[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా అనువాదం, ప్రవృత్తిరీత్యా విమర్శ చేసే నాకు చలం సాహిత్యం గురించి వ్రాసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. విమర్శకులకు న్యాయదృష్టి ఉండాలి. ఏ పక్షపాతమూ, ముందుగా స్థిరపరచుకొన్న అభిప్రాయాలు విమర్శపై ప్రభావం చూపకూడదు. రెండవవారు అనువాదకులు. వీళ్లు అసలు ఏ రంగు రుచి వాసన లేని నీటిలాగా ఉండాలి. మూలరచయిత ఆభిప్రాయం ఏదో అదే వీరి గొంతులో పలకాలి. ఏ విధంగా చూసినా ఈ పత్రంలో నేను, నా అభిప్రాయాలు చోటు చేసుకొనే అవకాశం లేదు. అటువంటప్పుడు సాహిత్యలోకంలో ప్రచారంలో ఉన్న విధంగా కాక చలాన్ని వేరే కోణంలో వ్యాఖ్యానించటం సాధ్యమా? తన గురించి, తన సాహిత్యం గురించి చలం ఏమంటున్నారు?
“నన్ను వేరుగా, నా పద్ధతుల్ని వేరుగా, నేను రాసే విషయాన్ని వేరుగా, చూడడం పొరబాటు. నేను నమ్మిన వాటినే రాశాను. రాసిన వాటినే ఆచరించాను. నాలో ఎత్తులుగాని లోతులుగాని, వాటినుంచి వేరే కొలవడానికి వీలులేదు. తప్పైతే, రాతలు, పద్ధతులు, నేను అన్నీ తప్పే!” మ్యూజింగ్స్ పుట 244.
ఆందుచేత ఈ వ్యాసంలో ఆయన చెప్పిన విషయాలను చెప్పినట్లుగానే వివరించాలిగానీ మరో విధంగా ఏదో అంతరార్థం ఉన్నట్లుగా భావించటానికి వీలులేదు. నాకు మిగిలిన ఒకే ఒక అవకాశం ఏమిటంటే, అందరూ చలం సాహిత్యం అనగానే గతానుగతికంగా చెప్పే నవలలు కథలు, నాటకాలను కాక ఎవరిదృష్టి అంతగా పడక మిగిలిపోయిన వాటిగురించి ఆలోచించటం, చెప్పటం. చలం రచనల్లో మనకు అందుతున్న గొప్ప విషయాలు ఇవి.
వ్యక్తిగా, రచయితగా చలం గొప్పతనం:
చలం మాటల వల్ల మనకు అర్థమయ్యే గొప్ప విషయం ఏమిటంటే ఆయనకు ఎటువంటి కపటత్వం లేకపోవటం. పైగా ఆయన జీవితమంతా సమాజంలోని కపటత్వాన్ని నిరసించటంతోనే గడచిపోయింది. అదికాక ఆయన గొప్ప అనుభవవాది. గొప్పగా అనుభవించగల శక్తిసామర్థ్యాలు ఉన్నవాడు. ఈ గుణం ఉన్నవారు ఎందరో ఉండవచ్చు. కానీ తమ అనుభవాన్ని అనుభవంగా సమర్థవంతంగా భాషలో తిరిగి వ్యక్తీకరించటం చలానికి సాధ్యమైనట్లు, వారందరికీ సాధ్యం కాదు.
అలా చేయగలిగిన వారు తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి మరొకరు ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ. చలం లాగా విశ్వనాథకూడా ఎంత క్లిష్టభావాన్నైనా అలవోకగా వ్యక్తీకరించగలరు. చలంలాగానే ఆయన కూడా ప్రపంచం తనను గూర్చి ఏమనుకుంటుందో లెక్క చెయ్యలేదు. తాను ఏమనుకుంటున్నాడో దాన్ని చెప్పటానికి జంకలేదు. నిర్భీతి వారిద్దరి స్వంతం.
అలాగే మంచి సాహిత్యాన్ని గొప్పగా అనువాదం చెయ్యటం దాన్ని గొప్పగా అనుభవించినప్పుడే సాధ్యం. ఈ కారణం వల్లనే బైబిల్‌ని చలం గొప్పగా అనువదించారు. ఇందుచేతనే రవీంద్ర గీతాంజలిని చలం అనువదించినట్లుగా ఎవరూ అనువదించలేదు. నా చిన్నతనంలో చలం అనువాదకుడిగానే నాకు పరిచయం. ఆయన గీతాంజలిని రుచి చూచిన తరువాత, ఒకానొక స్వప్నలోకపు తలుపులు నాకు తెరచుకున్నాయి. నిద్రలో మెలకువలో రవీంద్ర కవిత నన్ను వెన్నంటే ఉండేది. ఇక్కడ ఉన్నవారిలో చాలామందికి ఆ అనుభవం కలిగే ఉంటుంది. చలం భాష, శైలి వల్ల ప్రభావితంకాని ఆధునిక రచయితలెవరూ లేరేమో!
చలం శైలి, అనువాదాల గొప్పదనం:
‘ఆధునిక తెలుగు వచన శైలిపై చలం ప్రభావం’ అనేది చాలా మంచి ఫలితాలను ఇచ్చే గొప్ప పరిశోధనాంశం. చలం శైలి అలా రూపొందటానికి కూడా, పైన చెప్పినట్లుగా ప్రతి విషయాన్నీ లోతుగా, తీవ్రంగా భావించి, అనుభవించ గలగటం, అదే విషయాన్ని ఏ కపటత్వం, కప్పిపుచ్చటం లేకుండా సూటిగా, సరళంగా చెప్ప గలగటమే కారణం. మరో విధంగా చెప్పాలంటే చలం వద్ద ఏ విధమైన కపటత్వం లేకపోవటమే ఆయన శైలికి అంత స్వచ్ఛతను, ఆకట్టుకొనే గుణాన్నీ ఇచ్చింది. అందువల్లనే కేవలం తన శైలినే మెచ్చుకొనే వారిని ఆయన నిరసించారు. ఆయన, ఆయన శైలి, ఆయన చెప్పదలచుకొన్న విషయం, ఆయన జీవితం వేరుకావు. వేరుచేసి చూడటం తగదు. మహాభారతాన్ని తెలుగు చేసినందుకు కవిత్రయానికి తెలుగు వారు ఎలా ఋణపడి ఉన్నారో రవీంద్ర కవితను తెలుగు చేసిన చలానికీ అంతే ఋణపడి ఉండాలి. ఆయన కలంలో రవీంద్ర కవిత స్వచ్ఛంగా తెలుగులో ప్రవహించింది. చలం భావజాలాన్ని మెచ్చుకోని, అంగీకరించని వారు కూడా ఆయన తెలుగుభాషకు కొత్త జవజీవాలతోకూడిన శైలిని అందించిన విషయాన్ని అంగీకరించి తీరాలి.
చలం సాహిత్యంలో తెలుగువారందరినీ ప్రభావితం చేసిన మరొక గొప్పవిషయం చలం సౌందర్యదృష్టి. చలం ప్రకృతివర్ణనలు వాటికి అవే సాటి. తన జీవితమంతా చలం ప్రకృతి ఒడిలోనే గడిపాడు. ప్రకృతిసౌందర్యాన్ని అలా దగ్గరనుండి అనుభవించి, దానికి తన సహజమైన అసమాన శైలితో అక్షరరూపాన్ని కలుగజేశారు. చలానికి గల ఈ గొప్ప సౌందర్యదృష్టే ఆయన సాహిత్యానికి మంచి ఆకర్షణను కలిగించింది. ఆయనకు ప్రకృతికి ప్రతిరూపమైన స్త్రీ పట్ల ఆకర్షణను కలిగించింది. తన జీవితమంతా స్త్రీ, ఈశ్వరుడు ఆక్రమించారని ఆయనే చెప్పుకొన్నారు. ‘స్త్రీ’ అనే ఒకానొక విలక్షణ మైన రచనను తన ముఫ్ఫైయవ ఏట, ఆ కాలంలోనే, అంటే 1925లోనే చేశారు. దాన్ని స్త్రీలోకానికే అంకితం చేశారు. ఈ పుస్తకంలో ఆయన స్త్రీల సమస్త సమస్యలను చాలా ఆచరణాత్మకంగా చర్చించారు. వాటికి అప్పటికి అందుబాటులో ఉన్న పరిష్కారాలను, జాగ్రత్తలను తెలియజేశారు. స్త్రీల పట్ల అంత అక్కరతో ఇంచుమించు తొంభై సంవత్సరాలక్రితం ఇటువంటి రచన చెయ్యటం అనేది చాలా గొప్ప విషయం. ఈ పుస్తకంలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ సందర్భశుద్ధిని కలిగి ఉండటం చలానికి ఉన్న గొప్ప పరిశీలనా శక్తికి నిదర్శనం.
చలం చెప్పిన విషయాలన్నీ శిరోధార్యాలేనా?
అయితే ఈ పుస్తకంలో కూడా ఆయన చదువుకున్న స్త్రీల పట్ల మనం ఎవరం అంగీకరించని కొన్ని విషయాలను చెప్పారు. అయితే వాటన్నింటికీ ‘పురుషులు స్వబుద్ధితో స్త్రీలపై అధికారాలను ఒదులుకోకపోవటమే’ కారణమని ఆయన అంటారు.
“ప్రస్తుతం ‘ఎడ్వాన్సుడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ పబ్లిక్ స్పిరిటెడ్’ తెలుగు స్త్రీలని చూసిన కొద్దీ, వాళ్ళు తమ పురోభివృద్ధి ప్రయత్నంలో పెడదారి పట్టినట్లు తోస్తుంది. వాళ్ళు నేర్చుకున్న విద్యాలోపమేమో చదువుకున్న కొద్దీ దొంగనీతిలో విశ్వాసమూ, సాధనా ఎక్కువవుతున్నాయి. సంఘంలో ప్రవేశించిన కొద్దీ అబద్ధపు జీవిత రహస్యం ప్రబలుతోంది. నవీన స్త్రీ భార్యగా, వంట ఆమెగా, పిల్లల తల్లిగా, హోస్ట్‌గా, శారీరకంగా, మానసికంగా కూడా ఫెయిల్ అవుతోంది. నిజమైన స్వతంత్రతగానీ, వోపెన్ మైండెడ్‌నెస్ గానీ, విజ్ఞానంగానీ సంపాదించలేదు. కపటీ, భీరురాలూ, స్వార్థపరురాలూ, సంకుచిత మనస్కురాలూ, కారెక్టర్‍లో, ఇండివిడ్యువాలిటీలో, సూనృతంలో, ఆరోగ్యంలో, మనోబలంలో, పాత స్త్రీ కొత్త స్తీకన్న నయం. విద్య కుతంత్రాలకీ అల్పత్వానికీ ఫ్యాషన్స్‌కీ, సక్సెస్‌ఫుల్ డూప్లిసిటీకి, ఫాల్స్ రీజనింగ్‌కి తోడ్పడుతోంది. వ్యభిచారం తనలో తప్ప ఇతరులలో ఏమాత్రమూ సహించదు ఈ నవీన స్త్రీ.” – ‘బాధ్యతలు’ స్త్రీ- పుట 137.
కారణం ఏదైనా, సందర్భం ఏదైనా చదువుకున్న ఆధునిక స్త్రీలు ఎవరైనా, అనగా స్త్రీవాదులైనా కాకపోయినా ఈ విషయాలను అంగీకరిస్తారా? పురుషులందరూ ఒకేలా ఉండనట్లే, స్త్రీలు కూడా అందరూ ఒకేలా ఉండరు. స్త్రీలు, పురుషులు కూడా మనుషులే! ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి. స్త్రీలలో మాత్రమే ఈ లోపాలు ఉంటాయి అంటే ఎవరూ ఒప్పుకోరు. స్త్రీల ఆర్థిక, మానసిక, శారీరక వికాసం గూర్చి ఎంతో ఆచరణాత్మకంగా చెప్పిన చలం, స్త్రీపురుషుల మధ్య అభివృద్ధి చెందవలసిన స్నేహం గూర్చి చెప్పిన చలం ఈ మాటలను రాశాడంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం. చలం ‘స్త్రీ’ అనే పుస్తకంలో ఒక్క స్త్రీల కష్టాలను, విముక్తిని మాత్రమే కాక, మొత్తం మీద స్త్రీ పురుష సంబంధాలలో సమాజంలో ఉన్న అస్తవ్యస్థ పరిస్థితిని తూర్పార బట్టాడు. ఇది వాస్తవం.
పురుషుల కష్టాలపట్ల చలం స్పందన:
‘వొంటరితనం’ అనే కథలో ఆయన స్త్రీ ప్రవర్తన వల్ల పురుషుడు పడిన కష్టాలను హృదయ విదారకంగా వర్ణించారు. ఎందువల్లనో ఈ కథ గురించిన ప్రస్తావన గతానుగతికంగా వెలువడుతున్న సాహిత్య విమర్శల్లో కనిపించదు. బహుశ ‘దమయంతికూతురు’ అనే కథను రచించిన సత్యవతిగారు ఈ కథను రచిస్తే ‘దమయంతి మొగుడు’ అని పేరు పెట్టి ఉండేవారు. ఏదో జరిగిన సంగతిని యథాలాపంగా చెప్పినట్లుగా ఉన్న ఈ కథనం హృదయాన్ని పిండివేస్తుంది. ఆ కథలో భర్త పేరు వెంకటబ్రహ్మం. భార్య సుభద్ర. మొదటినుండీ ఆమె ప్రవర్తన భర్తకు కట్టుబడినది కాదు. అతని హోదా, మంచితనం, బాధ్యాతయుతమైన ప్రవర్తన ఏవీ అతని కాపురాన్ని సవ్యంగా నిలబెట్టలేకపోయాయి. కాని వెంకటబ్రహ్మం మంచి తండ్రి. అతనికి తన పిల్లలంటే ప్రాణం. వారు తన పిల్లలో కాదో అనే అనుమానం ఉన్నా, ఎప్పుడూ వారిని ప్రేమిస్తూనే ఉండేవాడు. అతను పోలీసు డిప్యూటీ సూపర్నెంటుగా మంచి హోదాలో, పులిలాగా సమర్థవంతంగా పని చేస్తూ ఉండగా, అతని భార్య సుభద్ర భర్త ఆఫీసులోనే రైటర్‌గా పనిచేసే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసినా ఆమె జంకదు. అతడు మంచి వ్యక్తి, “పెద్దదై, ముగ్గురు పిల్లల తల్లి అయి, యిన్నాళ్ళు అతనితో కలిసి కష్టసుఖాలు పంచుకున్నదాన్ని చెయ్యిచేసుకోవడం అతనికి మనస్కరించ లేదు” అని చలం రాస్తారు. ఆమెను ఏమీ దండించలేక, రైటర్‌కు బదిలీ చెయ్య ప్రయత్నించాడు. అది కుదరకపోగా అతను ఉద్యోగం మానేసి, ఆ ఊళ్లోనే వ్యాపారం పెట్టాడు. తనకు బదిలీ చేయించుకొని దూరంగా పోదామని ప్రయత్నిస్తే, భార్య ప్రియుణ్ణి వదలి రానంది. చివరకు, అతడే పిల్లలను తీసుకొని వేరే ఊరు వెళ్ళి పోయాడు. ఆయాలను, పనివాళ్ళను పెట్టుకొని పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచే ప్రయత్నం చేశాడు వెంకట బ్రహ్మం. వాళ్ళకు జ్వరాలొస్తే సేవలు చేశాడు. పనివాళ్లను మార్చాడు. కాని అమ్మా అంటూ ఏడ్చే ఆ పిల్లలను ఓదార్చలేకపోయాడు. వాళ్ళ ఫొటోలు తీయించి, భార్యకు పంపించాడు. ఆమె స్పందించ లేదు. చివరకు వాళ్లకు తాను అన్యాయం చేస్తున్నానేమో అని తోచి, భార్యతో ప్రియుడితో తన జీతంలో సగం పంపేలా ఒప్పందం చేసుకొని పిల్లలను వారివద్ద దిగవిడిచాడు. కాని అప్పటినుంచి అతడు పిల్లలపై బెంగతో బాధపడ్డాడు. ఒకరోజు ఆ ఊరు వెళ్ళి, ఎవరికీ కనపడకుండా ఆ ‘కుటుంబ’ జీవితాన్ని గమనించాడు. వారందరూ చాలా సుఖంగా ఉన్నట్లుగా, తానే ఒంటరై బాధపడుతున్నట్లుగా అతనికి తోచింది. అతనికి జీవితం దుర్భరమై పోయింది. తనకు బాగులేకపోతే విచారిచే వారులేరు. ప్రమోషను వస్తే సంతోషించే వారు లేరు. పిల్లలను చేరదీసి చదువుచెప్పాలని, షికార్లు తిప్పాలని, వారికి ఇష్టమైనవి కొని సంతోషపెట్టాలని ఎంతో తపించిపోయాడు. చివరకు ఆ రైటర్ చనిపోయిన తర్వాత వెళ్ళి వారితో కలిసి శేషజీవితాన్ని గడిపాడు వెంకటబ్రహ్మం. ఈ కథను చదివిన వారికి ఎవరికైనా కథానాయకుని పరిస్థితికి విచారం కలుగుతుంది. ఆమె ప్రవర్తన గూర్చి, మంచిగా గాని చెడ్డగా గాని ఏమీ చెప్పడు చలం. చలానికి సమాజంలో పురుషుల ఇబ్బందుల పట్ల కూడా అక్కర ఉన్నట్లుగా ఈ కథ మనకు స్పష్టం చేస్తోంది.
సాధారణంగా చలం కథల్లో స్త్రీ పురుష పాత్రలు ప్రవేశించగానే, వారు ఎవరైనా, వారిమధ్య శరీరకాంక్ష తలెత్తినట్లుగా చూపటం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా పరాయి స్త్రీపట్ల తనకు కలిగిన కామభావనకు సిగ్గుపడిన వ్యక్తి ‘మచ్చలు’ అనే కథలో కనిపిస్తాడు. పిచ్చిమొగుడి కిరాతకానికి బలై పోయిన దుర్గమ్మ ఉదంతాన్ని చెప్పే ఆ కథలో “నీకు చెల్లెల్ని, అన్నయ్యా, కొరక్కు- ఆపని తగదు నీకు. నన్ను కొరక్కు. నీకు ఆ బుద్ధి కూడదు. నీ కాళ్ళు పట్టుకుంటా, కొరక్కు” అని సన్నగా కీచుమని అరిచింది.
నా మోహం పటాపంచలయింది. భరించలేని సిగ్గుతో, జాలితో, ఆశ్చర్యంతో వెళ్ళిపోయినాను. నామీద, నాకామం మీద, పరమ అసహ్యం కలిగింది. ఆనాటినుంచి ఇంతవరకు పరాయి ఆడదాన్ని తాకలేదు. ఆ చూపు నన్ను దయ్యం వలె వెంట తరుముతోంది. ఆ కళ్ళు, దీనమైన ఆ కళ్ళు, ఎవరితోనూ చెప్పుకోలేని బాధతో కుంగిపోయిన ఆ పాపలు, రక్తధారలు కార్చిన ఆ పాపలు, – బొగ్గయిపోతున్నాయి. తననే కాకుండా, లోకాన్నంతా నాకు చెల్లెళ్ళని చేసింది దుర్గమ్మ. తల్లి కాలిపోతోంది. ఆలోచించాను. కొరకవద్దని అరిచిందేమిటి? ప్రేమ అన్నా, లాలన అన్నా దుర్గమ్మకి కొరకడంతో ఆరంభమని అభిప్రాయం. వాడూ ఆ రత్తయ్య కారణం. వాణ్ణి వెళ్ళి “ఇదేం రోగంరా!” అని తందామనుకున్నాను.” చివరకు లోకంలో ఎవరూ దుర్గమ్మను ఆమె భర్త పిచ్చిరత్తయ్య బారినుండి రక్షించరు. ఒకనాడు వాడు ఆమె మెడను లోతుగా కొరికి చీల్చటంతో ఆమె మరణించింది. సమాజంలో సంసారం స్త్రీల కష్టాలపట్ల నిజమైన సానుభూతి కనిపిస్తుంది కథనంలో. సంసారపుగుట్టు పేర జరిగే హింసను చాలా సహజ సిద్ధంగా చెప్పిన చలం కథల్లో కెల్లా గొప్ప కథగా ఇది తోస్తుంది.
చలం రచించిన ‘పంకజం’ అనే ఒక నాటికలో తన ఆపదను తప్పించుకోవటానికి దొంగలకు భార్యను అప్పగించిన మధుసూదరావు అనే భర్త, తర్వాత, ఆమెను భార్యగా స్వీకరించడు, కొంత కాలం గడిచాక, ఆమె పిల్ల తల్లి అయ్యాక వచ్చి, బిడ్డను చెన్నపట్నంలో మిషనరీలకు ఇచ్చి, తనవెంట రమ్మంటాడు. ఆమె తల్లి కూడా అతనికే వత్తాసు పలుకుతుంది. “నాబిడ్డకంటే, నేను తప్ప మరొక గతిలేని నా బిడ్డకంటే.. మీరెక్కువా నాకు”. అని తిరస్కరించి, తన తోవ తాను తాను చూచుకుంటుంది. మాతృత్వబాధ్యతను మరువని తల్లిగా పంకజం పాత్రను గొప్పగా చిత్రించాడు చలం.
‘మచ్చలు’ కథలో మాత్రమే చలం కథానాయకుడు స్త్రీపట్ల అనుచితవాంఛను వెలువరించటం తప్పు అనే స్పృహ ఉన్నవాడు. కానీ ‘భాషన్నా తెలీదు’, ‘ఎదగనే లేదు’ ‘దెయ్యాలు’ పరీక్షలు వంటి ఇతర కథల్లో చలం కథానాయకులు స్త్రీల పట్ల లైంగికదృష్టి తప్ప మరొక దృష్టిలేని పురుషులు. ఈ కథలను చదివినప్పుడు స్త్రీ సమస్యల పట్ల రచయితకు ఉన్న సానుభూతి మాట దేవుడెరుగు, ఆ సంబంధం పట్ల కథానాయకునికి ఉన్న తాపత్రయం పాఠకునికి వెగటును కలిగించక మానదు. ‘సరస్వతీ ప్రసన్నం’ కథలో స్త్రీల చదువు పట్ల కథానాయకుడు చెప్పే అమూల్యమైన అభిప్రాయాలను మచ్చుకు చూడండి. “మొగపిల్లలు పడుతున్న బాధలు చాలవా? పువ్వుల్నికూడా ఆ మరలోనే పెట్టి తిప్పాలా! ఇంక ఆల్టర్నేటివ్ పెళ్ళి అనే నరకమా?ఎంత క్రూరంగా పరిణమించింది యీ నవీన జీవితం! పోనీ అందంలేని ఆడవాళ్లు చదువుకోవచ్చు. చాతనైతే పెళ్ళి చేసుకోవచ్చు. కాని యిట్లాంటి సౌందర్యం ఉన్న వాళ్ళకి యేం ఖర్మం? బల్లల దగ్గర కూచుని ఆ లేత బుజాలు ముందుకి వొంగి, చక్కని కళ్ళకి జోడు తగిలిస్తే యెట్లా వుంటుంది? ఈ ముద్దుమాటలు మాని యింగ్లీషుముక్కలు మాట్లాడుతూ వుంటే! కాని అందం జీవనోపాధిని ఇస్తుందా! ఏ మొగాణ్నో పట్టుకుని, రక్తమూ డబ్బూ పీల్చి వాడికి బానిస కావాలి యింక! అందం పోయినతర్వాత! తక్కిన నౌకర్ల వలెనే కూడబెట్టుకోవాలి. పెన్షన్ ఇవ్వాలి. గొప్ప పాటకుడు వంట చేస్తాడా? గొప్ప నటకుడు కూలీ చేస్తాడా? గొప్ప కథకుడు టీచరు పని చేస్తాడా? గొప్పకవి ప్లీడరు పని చేస్తాడా? శృంగారం గల స్త్రీ మంత్రసాని కావలసిన ఖర్మమేమిటి?” ఇలా సాగుతుంది కథకుని ఆలోచన.
ఈ భావజాలానికి మూలం ‘సుందరుల తత్వము’ అనే వ్యాసంలో ఉంది. “అందమైన స్త్రీలే తక్కువ. అందులో తమకి అందమున్నదనీ, అందం మహిమావంతమైన శక్తి అనీ, విజయాలకు అమోఘ సాధనమనీ వివేకమున్న స్త్రీలు మరీ తక్కువ. తమ స్వంత ఆనందం కోసం గానీ, దేశోపకారార్థంగానీ, విప్లవోద్దేశంతో గానీ సౌందర్యశక్తిని ఉపయోగించడం ఈ దేశపు స్త్రీలు నేర్చుకోలేదు. కొంతమంది మాత్రం, ఇప్పుడిప్పుడే మేలుకొని తమ స్వంతవిషయాలలో స్వల్పలాభాలకు వినియోగించుకుంటున్నారు. అంత కన్న సౌందర్యవతులైన స్త్రీలు తను చెప్పిన మాట వినే బంధువులుగా తమకు గల పురుషులు, ఆ స్త్రీల ద్వారా దుర్ఘటమైన కార్యాలు సాధించుకుంటున్నారు. ధనమూ, బలమూ తెలివి వలెనే సౌందర్యం కూడా ఒక వరమూ, ఒక సాధనమూ కాని తక్కిన వాటి వలె యీ సాధనాన్ని స్త్రీ కార్యసాఫల్యం కోసం వినియోగించుకోవడం, ప్రపంచం వొప్పుకోవటం లేదు. ..” -పుట 75.
‘లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే..’ అనే కథలో కూడా ఇదే భావజాలం కనిపిస్తుంది. ఈ కథలో నాయిక లిల్లీ తన ఉద్యోగాన్ని సంపాదించుకోవటానికి నిలబెట్టుకోవటానికి కథానాయకునితో పాటు ఇతరులతోను సంబంధం పెట్టుకుంటుంది. భావజాలంతో, స్త్రీ పురుష భేదంతో సంబంధం లేకుండా ఆధునికులెవరికీ ఈ ధోరణి అంగీకారయోగ్యంకాని విషయాన్ని మనం చలంలాగా, ఆయన అభిమానులుగా నిజాయితీతో అంగీకరించాలి. చలానికి ఉన్న గొప్పశైలి, ఆయనకు స్త్రీలపట్ల గొప్ప గౌరవం, స్త్రీల సమస్యల పట్ల మంచి అవగాహన, ఆయన వెలువరించిన వెగటును కలిగించే ఇటువంటి అభిప్రాయాలను ఖండించటంలో మనకు అడ్డం రాకూడదు.
చలం అభిప్రాయాల్లో వైరుధ్యాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసినదే. స్త్రీ పురుష సంబంధాలు ఆదర్శవంతంగా ఉండాలనే ఆకాంక్ష చలం రచనల్లో ఉన్నప్పటికీ ఎన్నోకథల్లో ఇలా స్త్రీల చదువు, వృత్తి, కుటుంబ జీవితాల గూర్చి ప్రతికూల భావాలు కూడా కనిపిస్తున్నాయి. చలం భావాల్లోని వైరుధ్యాలు స్త్రీకి సంబంధించి కూడా ఉన్నాయనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. తురగా జానకీ రాణిగారు అన్నట్లుగా చలం ఒకసారి తేనెలోను, మరొకసారి విషంలోను కలాన్ని ముంచి తన రచనలను చేశారు.
ఒకవేళ ఈ విషయంలో ఆయన భావాల్లో ఒక క్రమపరిణామం ఉందేమో అని పరిశీలించినా, అటువంటి అవకాశం కనిపించటంలేదు. ‘స్త్రీ’ని 1925లో రచిస్తే, ఈ కథలన్నింటినీ ముఫ్ఫైదశకంలో రచించాడు. స్త్రీల చదువుపట్ల ఇంత ప్రతికూలవ్యాఖ్యలు ఉన్న ‘సరస్వతీ ప్రసన్నం ‘ కథలోనే స్త్రీపురుషులు ఇరువురూ జీవితంలో బానిసలు కాక తప్పదనే ఒక అభిప్రాయాన్ని కూడా వెలువరిస్తాడు చలం. జీవితం అనేది స్త్రీ పురుషులిద్దరికి చెందినది, ఇద్దరూ తమతమ సంపూర్ణశక్తిసామర్థ్యాలతో జీవించటం అవసరం. అందం ఉన్న స్త్రీకి మానసిక వికాసం అవసరం లేదనేది, అనాగరిక భావన. ఆమె తనఅందాన్ని తన భౌతిక ఉన్నతికి ఉపయోగించుకోవాలనటం మరింత హీనమైన భావన.
అనుసూయ అనే పెద్దకథలో వితంతువైన యువతి తనలోని సహజాతానికి, జీవన వాస్తవికతకు మధ్య నిస్సహాయంగా నలిగి మరణింటాన్ని చూపిన చలం, “భాషన్నా తెలీదు” అన్న కథలో, ఒక రైలు ప్రయాణంలో ఏ కారణం చేతో తనతో ఉన్న ముసలివ్యక్తి బారినుండి తప్పించుకోవాలని చూసే ఒక యువతిని తను కూడా ఒక ఊళ్లోకి తీసుకొనిపోయి, ఒక పడవలో అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యంకాక ఆమెను అక్కడే వివస్త్రగా, వదలి వెళ్ళటాన్ని వర్ణిస్తారు. ఇక ఆయన రచించిన లెక్కలేనన్ని కథల్లో నవలల్లో పురుషుని చేత తన్నులు తినటం స్త్రీలు తమ విశేషాధికారంగా భావిస్తూ ఉండటం చిత్రితమైంది. ఈ కాలంలో స్త్రీలం ఎవరం ఇటువంటి విషయాలను అంగీకరించలేము.
‘స్త్రీలు – నాట్యరంగము’ అనే వ్యాసంలో చలం ఇలా అంటారు. “స్త్రీలు నాట్యరంగమెక్కాలా లేదా అని ఇందరం పురుషులం తీరికగా కూచుని యోచించడం హాస్యాస్పదంగా కనపడుతోంది. నాట్యరంగంలో ప్రవేశించాలో, లేదో స్త్రీలు నిర్ణయించుకోవాలిగాని, మనమెవరం ఆ విషయం నిర్థారణ చెయ్యడానికి? మన తీర్మానం ఆమోదించి మన ఘనతను శిరసావహించి, యే స్త్రీలు తమ ప్రవర్తనను దిద్దుకోపోతున్నారు?” -ఆనందం.. పుట 59.
ఇంత ఉదారంగా స్త్రీల నిర్ణయ స్వాతంత్ర్యం గురించి మాట్లాడిన చలం తర్వాతి పుటలోనే ఏమంటున్నాడో చూద్దాం: “నాటకాలు చూడడం వల్లనే అనేకమంది స్త్రీల మనసులు దుర్నీతిమార్గాన పట్టాయే, యింక వేషాలు వేస్తే చెప్పాలా? తప్పకుండా స్త్రీలు దుర్నీతిపాలౌతారు. కారనేవారు వాళ్ళ స్వప్రయోజనం కోసం, మోసపుమాటలు మాట్లాడుతున్నారు! నమ్మకండి. కనక తమ స్త్రీలను నాటక రంగానికి పంపతలచుకున్న వారు, తమబాధ్యతను వొదులుకుని, స్త్రీ నీతి ఆమె బాధ్యతే కాని తమకేమీ ప్రసక్తి లేదనుకుని, ఆ స్వేచ్ఛనీ వొప్పుకోవాలి.” పుట-60. “ఇట్లాంటి కళలని పోషించడానికి మన పూర్వీకులు, ఎంతో వివేకంతో ఒక కులాన్నే స్థాపించారు. ఇప్పుడు మన సంఘసంస్కర్తలు బైలుదేరి వేశ్యలందరికీ పెళ్ళిళ్ళుచేయడం, నాట్యం మాన్పించడం, పెళ్ళిళ్లు చేసుకున్న కులస్త్రీలని, భర్తల్ని వొదిలి నాటకాలు వెయ్యమనడం సాగించారు.” పుట 63.
సందర్భం ఏమైనా స్త్రీలగూర్చి ఇటువంటి అభిప్రాయాల్ని, సనాతన వాదులుగాని, స్త్రీవాదులుగానీ, ఆ మాటకు వస్తే ఈ కాలపు వ్యక్తులు ఎవరైనా భరించటం కష్టం. కులం గూర్చి సరే! ‘సుందరుల తత్వము’ అనే వ్యాసంలో చలం ఇలా అంటారు “స్త్రీ మాత్రం వీలైనంత వరకు తన సౌందర్య లాభం పొందాలనే వాంఛిస్తో వుంటుంది. నీళ్ళబిందెల్లో అద్దంలో చూసి తీర్చుకుంటూ ఉంటుంది ఆకోర్కెని. కాని పురుషాజ్ఞా ధిక్కారం గాని, పురుష నిర్మిత పాతివ్రత్యాశయ భగ్నం గాని ఆమెకి రుచించదు. అందువల్ల చిత్రమైన సమస్య ఏర్పడ్డది. అది యితర పురుష ప్రపంచం పట్ల క్రూర రూపాన్ని ధరించింది. ప్రస్తుత స్త్రీహృదయమెట్లా ఉందంటే తన అందాన్ని చూసి పురుషుడు ఆకర్షించ బడాలి. భ్రమసినట్టు తనకు తెలియజేయ్యాలి. ఎంత తీవ్రంగా తనని కాంక్షించినట్టు తోస్తే అంత తృప్తి.కాని ఏ అందం కోరి, ఏ ఉద్దేశ్యంతో తనను కాంక్షిస్తున్నారో, అది ఆమెకు అనంగీకారం. తాము ప్రేరేపించిన కాంక్షను పురుషుడు దమించేసుకున్నా సరే, లేక ఆ అగ్నిలో మండి భస్మమైనా సరే, కాని పురుషుడు ఆమెకూ తనకూ తప్ప ఇతరులకు వ్యక్తమపడేట్టు, చూపువల్ల గాని, వాక్కుల వల్లగాని, తన హృదయవాంఛను బహిరంగ పరిచాడా, పరమదుర్మార్గుడనే నింద పడవలసిందే! కాక ఆమె లావణ్యకాంతిని చూసి, ఏ అసాధారణ సూర్యాస్తమయ శోభనో చూసినట్లు మురిసి, విభ్రాంతుడై, నాలుగుబారల దూరంలో మూర్ఛాక్రాంతుడైతే, ఆమె మన్ననకు పాత్రుడౌతాడు. లావణ్యము పట్ల ఆకర్షణలేనివాడు జడుడు, ఆకర్షణ ఉన్నదని బహిరంగ పరచినవాడు ‘రౌడీ’” – పుట 76.
ఇటువంటి భావాలను ఏదో యాదృచ్ఛికంగా వెలువరించారని భావించలేము. వీటన్నింటికీ అనుగుణంగా రాసిన కథ ‘ఆరంభించరు’ నిదర్శనంగా మనకు కనిపిస్తోంది. ఈ కథ ఆరాత్రి అనే కథా సంపుటిలో చోటు చేసుకొన్నది. ఒకానొక స్వాతంత్ర్య సమరయోధురాలి వద్ద సెక్రటరీగా పనిచేయటానికి వెళ్లిన ఇద్దరు యువకుల కథ ఇది. ఇంటర్వ్యూకి హాజరైన శంకర్‌ను అతని జ్ఞాతి అక్కడ పనికి చేరవద్దని హెచ్చరిస్తాడు. ఆ కథానాయకి, తన అందాన్ని ఎరవేసి, చొరవను చూపి చివరకు, వారు చొరవ చూపినప్పుడు పనిలోనుండి తీసివేస్తుంది. వారు తీరనికాంక్షతో అనారోగ్యం పాలయ్యారు. అలాగే ‘పాపఫలాలు’ అనే కథలో మతప్రచారం చేసే స్త్రీ, ఆమె వద్ద పనిచేసే ఒక యువతి, ఇరువురితో సంబంధం పెట్టుకుంటాడు, ఆ మతప్రచారకురాలికి తెలుగు నేర్పటానికి కుదురుకొన్న కాశీపతి. ఈ రెండు కథల్లోనూ మనం ఎవరం అంగీకరించని విషయం కథకుడి (Tone) గొంతు, కథను చెప్పే విధానం. బ్రాహ్మణీకంలో, అనుసూయలో కనిపిస్తున్నట్లుగా, స్త్రీల నిస్సహాయత పట్ల సానుభూతి లేకపోగా, స్వతంత్రంగా తమ లక్ష్యాలకు అనుగుణంగా బ్రతుకుతున్న స్త్రీల పట్ల కథకుడిలో ప్రతికూల దృష్టి కనిపిస్తుంది. వారిని లొంగదీసుకోవటంలో, వారి పట్ల కథకుడిలో చెలరేగే భావాలలో స్త్రీల పట్ల గౌరవం మచ్చుకు కూడా కనిపించదు.
‘స్త్రీ’ని చదివేటప్పుడు, ‘అన్ని సంవత్సరాలక్రితం చలానికి స్త్రీల సమస్యల పట్ల ఇంత అవగాహన’ అని ఆశ్చర్యం గౌరవం కలుగుతాయి. కాని ఈ కథలను చదివేటప్పుడు, ‘స్త్రీ’ రాసినది, ఈ కథలను రాసినది ఒక్కరేనా అని అనుమానం వస్తుంది. ఏది ఏమైనా స్త్రీల అభ్యున్నతికి సాహిత్య కృషిచేసిన చలం కొన్నిరచనల్లో పొర్నొగ్రఫి ఉన్న విషయాన్నిమనం అంగీకరించి తీరాలి.
‘ఆనందం’ అనే వ్యాసంలో ‘ఎవరికి ఏత్యాగం అవసరమో అది వాళ్ళ ఆనందమే నిర్ణయించాలి. ఒక స్త్రీ తన భర్త ని వొదిలి, పిల్లల్ని వొదిలి పనికి మాలిన ప్రియుని వెంట పడుతుంది. ఇంకో స్త్రీ పనికి మాలిన భర్త కోసం ప్రియుణ్ణి లోకాన్ని, పిల్లల్ని వొదులుకుంటుంది. ఇంకో ఆమె బిడ్డకోసం భర్తనీ, సంఘాన్నీ, నీతినీ వొదులుతుంది. వీటిల్లో సంఘానికి నచ్చినవి మెచ్చుకుంటారు. తక్కిన వాటిని ఖండిస్తారు. కాని ఏది ధర్మమో ఏది ఆనందం ఇస్తుందో ఎవరికి వారు నిర్ణయించుకో వలసిందే గాని మనుషులుగాని, శాస్త్రాలుగాని నిర్నయించలేవు. ఎందుకంటే ఆనందమివ్వని ధర్మం ధర్మం కాదు, ఇంకోడిదీ..’ (పుట 13) అని చలం అంటారు.
చలం మెచ్చని మర్యాదస్తులు ఎవరు?
అటువంటప్పుడు ఒకరికి ఒకరు కట్టుబడి బ్రతికే వాళ్ళను తప్పు పట్టడం దేనికి? అది వాళ్ళ ఆనందం కావచ్చు కదా. ఆనందం ఒక్కటేకాక మనిషికి తృప్తి అనే ఒక అనుభవం ముఖ్యమైనది. నేను నా తల్లిదండ్రులను, నా భర్త/భార్యను, పిల్లలను, స్నేహితులను సంతోష పెట్టాను అనే తృప్తి కూడా మనిషికి ఉండవచ్చు. తృప్తి కూడా మానవవికాసానికి ఆనందమంత ముఖ్యమైనదే! మానవుని జీవితంలో ప్రేమ ఒక్క ప్రియునితో మాత్రమే కాదు ఎవరితోనైనా ఉండవచ్చు. ఆ ప్రేమకోసం చేసిన పని వారికి తృప్తినివ్వవచ్చు. నీతినియమాలతో బ్రతికే వారిని, (సమాజం నీతితప్పిన వారిని చేసినట్లుగా) ఒక ‘స్టిగ్మా’ పాలు చేయటం, ‘మర్యాదగా బ్రతకటం’, ‘మర్యాదస్తులు’ అనే పదాలను బూతులుగా చెలామణి చేయటం ఏ విధంగా న్యాయం? జీవితం బహుముఖమైనది. ఒక్క లైంగిక జీవితానికే పరిమితమైనది కాదు. ‘ఎవరి ఆనందాలు, ఎవరి విలువలు, ఎవరి తృప్తుల ప్రకారం వాళ్ళు బ్రతకాలి’ అనే వాదంతో స్వేచ్ఛావాది చలమైనా విభేదిస్తాడు అనుకోను. ఆయన విభేదించేది హిపోక్రసీతో, పైకి చెప్పే విలువలు, పాటించే విలువలు ఒక్కటి కాకపోవటాన్ని ఆయన వెక్కిరించారు. ఈ విషయాన్ని మనం మరువరాదు. చలం మర్యాదస్తులను వెక్కిరించలేదు, మర్యాదస్తులుగా చెలామణి అయ్యే కుహనా మర్యాదస్తులను ఆయన వెక్కిరించారు. ఆ పదాన్ని చలం భావజాలాన్ని అంగీకరించని వారిపట్ల వ్యంగ్యంగా ఉపయోగించే వారు ఈ విషయాన్ని గుర్తించాలి.
“పెళ్ళి అనేది మనుషుల్లో ఏ కారణాల వల్ల అమలులోకి వచ్చి ఉండినా, ప్రస్తుతం దాంట్లో ఎన్ని లోపాలు ఉండినా రాను రాను దాని ఆదర్శం ఒకే పురుషుడు, ఒకే స్త్రీ భార్యాభర్తలుగా ఉండాలి. మోనాగమీ గా అంగీకారమౌతుంది. ఈ మోనాగమీ ఆదర్శం ఎవరో ఎప్పుడో, ఏ పద్ధతులకో ఏ పరిస్థితులకో సంఘశాంతికో అక్రమంగా విధించిన శాసనమా లేక మనుష్య స్వభావంలోంచి దానంతట అది ఉత్పన్నమయిందా? మనుష్యస్వభావానికి విరుద్ధమైనదేదీ ఇంతకాలం నిలచి ఉండదు. మనుష్య స్వభావానికి విరుద్ధం కానంత మాత్రాన అది మనుష్య స్వభావానికి చాలా అనుగుణ్యమని, అవసరమని అనటానికి వీలులేదు. ఆ కాల పరిస్థితుల ప్రకారం ఆ అవసరం కొద్దీ మనుష్యులు ఆ పద్ధతిని ఆదర్శంగా అంగీకరించి ఉండవచ్చు. పైగా ఈ ఆదర్శం ఆయా మతాలను బట్టి వాటిమీద ఆధారపడుతుందో, వాటి ఆజ్ఞల ప్రకారం మారుతో వచ్చింది. ఆనాటికి ఉపకరించింది కనక, ఈ నాటికి ఉపకరిస్తోందని ఒప్పుకోవలసిన అవసరం లేదు.” స్త్రీ- పుట 99.
చలం పాక్షికంగానే అంగీకరించినా ‘ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు’ అనేది మనుష్యస్వభావానికి అనుగుణ్యమనే విషయం వాస్తవం. అనాదిగా ప్రచారంలో ఉన్న జానపద గాథలను అధ్యయనం చేసిన వారు కథావస్తువును అనుసరించి వాటిని కొన్ని గుంపులుగా ఏర్పరచారు. వాటిని “Tale types” గా పేర్కొని, ప్రత్యేకమైన సంఖ్యతో గుర్తించారు. ప్రపంచ దేశాలన్నింటిలో ప్రచారంలో ఉన్న గాథల్లో సవతి తల్లులతో పిల్లలు పడే బాధల గాథలు వీటిలో ఒకపెద్ద శాఖ. జంటగా ఏర్పడిన వ్యక్తుల మధ్య మూడవ వ్యక్తికి లైంగిక అనుబంధంతో కూడిన చొరబాటు ఉన్నప్పుడు అది ఎన్నో విధాల బాధాకరమనీ, మానవుని జీవనప్రస్థానంలో లైంగిక అనుబంధం ఎన్నెన్నో పొరలతో ముడివడిఉంటుందని, ఈ కథలన్నీ చెపుతున్నాయి. స్నోవైట్ : ATU 709, జూనిపర్ ట్రీ: ATU720, హాన్సెల్ అండ్ గ్రెటెల్ : ATU 327A, ది సిక్స్ స్వాన్స్: ATU450, వంటి వివిధమైన కథలు నిరూపిస్తున్నాయి. తెలుగువారి బాలనాగమ్మ కథ కూడా ఇందుకు అతీతం కాదు. చివరకు రామాయణ గాథ కూడా ఇటువంటి సమస్య వల్లనే రూపొందింది. రామాయణంలో బహుపత్నులను గ్రహించటం నాటి ఆచారంగా చూపినా, ఇతర గాథల్లో స్త్రీ మరణంతో మూడవ వ్యక్తి ఆ కుటుంబంలోకి ప్రవేశించటం, మరణించిన స్త్రీకి ప్రతినిధులుగా ఉన్న పిల్లలను బాధించటం కనిపిస్తుంది. మూడవవ్యక్తి చొరబాటు మృత్యువశాత్తు కలిగితేనే కుటుంబంలో ఇంత అశాంతి కలిగితే, ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగానో, నిగ్రహం లేకో ఏర్పడిన బంధం మరింత అశాంతిని కలిగిస్తుంది. ఇవన్నీ మానవుల కుటుంబ జీవితంలో లైంగిక ప్రవృత్తి కేవలం వ్యక్తిగతమైన విషయం కాదని, అవి అస్తవ్యస్థమైతే ఆ ప్రభావం వారిజీవితంపై తరతరాలుగా ఉంటుందనీ నిరూపిస్తున్నాయి. అందువల్ల వివాహ వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని సవరించాలిగానీ మొత్తం వ్యవస్థను నిర్మూలించాలనటం ఆచరణాత్మకం కాదు.
చలం రచనలన్నీ ఆయనకు ఎప్పటికి ఏది తోస్తే అది రాసినట్లుగా కనపడుతున్నాయి. ఆయన ఏదో ఒక భావధారకు కట్టుబడి లేకపోగా, స్థిరపడిన అభిప్రాయాలన్నింటినీ ఖండిస్తూ పోయారు. అయితే ఆయన రచనల్లో పాత్రలు కూడా ఆయనలాగే నిజాయితీ గలవి. నిజజీవితంలో సంఘబహిష్కరణకు గురైన చలం లాగానే అవి కూడా సుఖమయ జీవితాన్ని వదలి మురికికూపాల్లోకి, డబ్బు ప్రసక్తిలేని బహిరంగజీవితానికి సిద్ధపడతాయి. చలం చివరకు అరుణాచలం చేరి ఆధ్యాత్మిక సాధనలో కుదురుకున్నారు. అక్కడ ఆయన చేసింది సాధనేకాని బోధనకాదు. అందుచేత, చలం అడుగుజాడల్లో నడచి స్వేచ్ఛాప్రణయగాథలను రచించాలని చూచే వారు కూడా తమ పాత్రలను, అంత నిజాయితీ గలవాటిగా మలచగలగాలి. ఆయనలాగా భౌతిక సుఖాలను ఏమాత్రం లెక్కచేయకుండా జీవించ గలగాలి. ఎసి సౌఖ్యాన్ని, ఇస్త్రీమడత నలగని నాగరక సుఖమయజీవితాన్ని క్షణమైనా విడవలేనివారు, తమకు, తమ కుటుంబానికి ఏ విధమైన ఆయాసం కలగకుండా బ్రతికే వారు, తమ పిల్లల భావిజీవితానికి చక్కనిబాటలను వేయటం మరువని వారు, ఇతరుల కుటుంబ జీవితాలను ప్రభావితం చేసే విశృంఖల జీవితాన్ని అద్భుతశైలీ విన్యాసంతో ఆకర్షణీయంగా కథలుగా రాస్తే, ఆ కథలలో పాత్రలు కూడా డబ్బుపై ఆధారపడిన సుఖాలను వేటినీ వదలలేక పోతే చలం వెక్కిరించిన మర్యాదస్తులకు వారు ఏమీ తీసిపోరు. ఇది మరొక రకం కపటత్వం. అదే హిపోక్రసి. చలం నిరసించినది దీన్నే! చలం చెప్పినదే చేశారు. చేసినదే చెప్పారు. ఆయన అడుగుజాడలలో సాహిత్యరచనలు చేయదలిచిన వారికి అదే సాహసం ఉండాలి.
చలానికి, చలం పాత్రలకు మనిషికి ఎందుకు నిగ్రహం కావాలో తెలియలేదు (‘నిగ్రహం’ వ్యాసం). మానవుడు జీవితంలో ఒక ఉద్వేగంలో నిగ్రహాన్ని సాధన చేయకపోతే మరో ఉద్వేగంలోనూ అది సాధ్యపడదు. ఇది వాస్తవం. చలం రచనల్లో ఈ వాస్తవం ఆయన ప్రమేయం లేకుండానే బయట పడింది. నిగ్రహప్రసక్తి లేకుండా లైంగిక సుఖాలను అనుభవించిన చలం పాత్రలు ఎన్నో కోపం, ఈర్ష్య వంటి ఇతర ఉద్వేగాల నిగ్రహం లేక హత్యలు, ఆత్మహత్యల పాలయ్యాయి. జైలుపాలయ్యాయి. ఇందులో సంఘం పోషించిన పాత్ర ఏమీ లేదు. ఎందుకంటే సంఘాన్ని ఆ పాత్రలు, పాత్రలను సంఘమూ బహిష్కరించాయి.
చలం ‘చలం’ అనే తన ఆత్మకథలో తన కొడుకు వసంత్ విషయంలో తాను ఏ దోవా చూపలేకపోయానని, చూపవలసి ఉంటే ఏమి చూపాలో తనకు తెలియలేదని వాపోయారు. ఆయన భార్య అతని సాహచర్యంలో వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ కూడా చాలా అలసిపోయి మతిస్థిమితం కోల్పోయి మరణించారు. ఆయన ప్రచారం చేసి ఆచరించిన భావాలకు ఆయన కుటుంబం బలైపోయింది. కుటుంబాలను వదలి లేచిపోవాలని చలం ప్రచారం చేయకపోయినా, చలం భావాలు కుటుంబజీవితాన్ని బలిగోరుతున్నాయి. ఒక తరం తరువాత మరొక తరం తమ పూర్వుల జ్ఞానాన్ని అందుకుంటూ, తమ జ్ఞానాన్ని జతచేస్తూ ముందుకు పోవటం మానవజాతి పురోగతిలో కనిపిస్తున్న మౌలికసూత్రం. అందుకు కుటుంబం ఒక ప్రాథమిక ఆకరం. ఈవిషయాన్ని ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలూ గుర్తించాయి. చాలా దేశాల్లో కుటుంబవవ్యవస్థను కాపాడుతాము అనే వారికే ప్రజలు పట్టం కడుతున్నారు. ఇన్ని కారణాల వల్ల మానవజీవితంలో కుటుంబం పాత్రను ఎవరూ తక్కువ చెయ్యలేరు.
ఈ విషయాలన్నిటి దృష్ట్యా తాను చేసింది, చెప్పింది సరైనదో కాదో ఎవరికి వారే తెలుసుకోవాలని చెప్పిన చలాన్ని, తనను అనుసరించవద్దని చెప్పిన చలాన్ని, మూసలన్నింటినీ నిరసించిన చలాన్ని, స్త్రీ విముక్తి కోరాడనే మూసలో పోసి విగ్రహారాధన చేయటం మానుకుందాం! స్త్రీ స్వేచ్ఛాసౌఖ్యాల ఆకాంక్షతో కూడిన రచనలతో పాటుగా అందుకు విరుద్ధంగా కూడా ఆయన రచించాడని అంగీకరిద్దాం. ఆయన రచనలను ముందుగా నిర్ధారించుకున్న ప్రమాణాలతో కాక, ఉన్నవి ఉన్నట్లుగా అంచనా వెయ్యటం నేర్చుకుందాం! అలా మనలో హిపోక్రసీ లేదని నిరూపించుకుందాం! ఆయనలో మనం నేర్చుకోవలసిన నిజాయితీని, ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా అనుసరిద్దాం!