[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘కుండ’ అంతరంగం తెలుసుకుందాం.
***
మమ్మల్ని వేన్‌లో తీసుకొచ్చి ఇదిగో ఈ సంత దగ్గర రోడ్డు పక్కగా బొమ్మల కొలువు మాదిరి సైజులవారీగా, డిజైన్లవారీగా సర్ది పెట్టాడు కన్నయ్య. పుట్టాక, పల్లె మాత్రమే పరిచయమైన మాకు నగరం, ఇంత పెద్ద రోడ్లు, తిరణాల మాదిరి జనం, వచ్చీపోయే కార్లు, బస్సులు, ఆటోలు, బైకులు, సైకిళ్లు, బ్రిడ్జిపైన వేగంగా వెళ్తున్న రైలు (దాన్ని మెట్రో రైలంటారని ఇంతకుముందే విన్నాను).. అబ్బో! ఎంత సందడో! అంతలో ‘మనం ఇన్నాళ్లూ కలిసి ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఎవరు కొంటారో, ఎక్కడికి వెళ్తామో.. విడిపోక తప్పదు నేస్తం’ నా తోటి కుండ, బెంగగా అంది. నాకూ బాధగా అనిపించింది. ‘ఏం చేస్తాం. ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని కోరుకోవటం తప్ప’ అన్నాను నేను. తోటి కుండ వెంటనే నవ్వేసి ‘మనం చల్లగా ఉండటం కాదు, నీటిని చల్లబరచి, మనుషులు దప్పిక తీర్చి వారిని చల్లబరుస్తాం’ అంది. ‘అదీ నిజమేలే’ నేను ఒప్పేసుకున్నాను. ఎవరెవరో వస్తున్నారు. మా వాళ్లందరినీ పరిశీలనగా చూసి, ధర అడిగి, బేరాలాడుతున్నారు. మా కన్నయ్య ససేమిరా తగ్గనంటున్నాడు. తనకు గిట్టుబాటు కాదంటున్నాడు. కొద్ది సేపటికి ధోరణి మార్చాడు. ఎలాగయితేనేం నాలుగు కుండలు అమ్మాడు.
సాయంత్రం అయింది. అప్పుడొచ్చారు ఓ తాతగారు, వెంట ఓ చిన్న కుర్రాడు.. మనవడు కాబోలు. ఆయన దృష్టి నా మీద పడింది. ‘అదుగో ఆ కుండ’ అంటూ నన్ను చూపించాడు. కన్నయ్య నన్ను తీసి ఆయనకు అందించాడు. తాతగారు నన్ను పరిశీలనగా చూసి, ‘ఊఁ.. పంపు కూడా ఉంది’ అనుకుంటూ సంతృప్తిగా ముఖం పెట్టారు. ఆ వెంటనే నా నేస్తం వైపు చూపించి, ‘అది కూడా ఇటివ్వు’ అన్నారు. కన్నయ్య ఇచ్చాడు. దాన్ని కూడా పరిశీలించి ‘రెండూ తీసుకుంటా, ఎంతకిస్తావు?’ అడిగారు. వెంటనే మా ఇద్దరి ఆనందానికి హద్దులేకపోయింది. ‘ఇద్దరం ఒకేచోటికి చేరుతున్నాం’ ఇద్దరం హాయిగా నిట్టూరుస్తుండగా, ‘రెండు తీసుకున్నా, నాలుగు తీసుకున్నా ఒకటే రేటండీ, ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు’ అన్నాడు. తాతగారు అందరిలా బేరం ఆడలేదు. జేబులోంచి మూడొందల ఇరవై రూపాయలు తీసి కన్నయ్యకు అందించారు.
‘తాతయ్యా! నాకు ఆ చిన్ని కూజా కావాలి’ మనవడు అడిగాడు. ‘అందులో ఎన్ని నీళ్లు పడతాయని’ అన్నారు తాతగారు. ‘భలే ముద్దుగా ఉంది. నాకది కావాలి’ పట్టుబట్టాడు మనవడు. ‘తీసుకో బాబూ’ అంటూ దాన్ని అందించాడు కన్నయ్య. మనవడు హుషారుగా అందుకున్నాడు. ‘దాని రేటెంత?’ తాతగారు అడిగారు. ‘ఏం వద్దులెండి. మీరు పెద్ద కుండల్ని బేరమాడకుండా కొన్నారుకదా. ఇది ఫ్రీ అనుకోండి’ అన్నాడు కన్నయ్య. ‘భలే వాడివే’ తాతగారు నవ్వేసి ముందుకు కదిలి, ఆటోను కేకేశారు. మిగిలిన కుండలన్నీ మా వైపు దిగులుగా చూస్తున్నాయి. మేం, వాటివైపు ఓదార్పుగా చూసి, వీడ్కోలు చెపుతుండగా తాతగారు, ఆటో ఎక్కి, మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకు కూర్చున్నారు. మనవడు సరేసరి. ఆ చిన్ని కూజాను అపురూపంగా పట్టుకున్నాడు.
‘తాతయ్యా! కుండలో నీళ్లు ఎలా చల్లగా ఉంటాయి?’ మనవడు అడిగాడు. ‘వంశీ! మంచి ప్రశ్న అడిగావురా. మట్టితో తయారు చేసే ఈ కుండలకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అవి లేకుండా కుండ తయారవదు. కుండలో నీళ్లు పోసినప్పుడు, ఆ సన్నని రంధ్రాల్లోంచి నీరు బయటకు వచ్చి ఆవిరవుతూ ఉంటుంది. నీరు ఆవిరి కావాలంటే నీటికి ఉష్ణం అవసరం. ఈ వేడిని అది కుండలోని నీటి నుంచి, కుండ నుంచి గ్రహిస్తుంది. అలా నిరంతరం ఉష్ణం గ్రహిస్తూ, నీరు ఆవిరవడం వల్ల కుండలోని నీరు చల్లబడుతుంది. అయితే ఆవిరయ్యే నీటి పరిమాణం స్వల్పం కావడంతో కుండలో నీరు బాగా తగ్గిపోవటం జరగదు. మట్టి కుండలో నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి’ తాతగారు ముగించడం, ఆటో ఇంటి ముందు ఆగడం ఒకేసారి జరిగాయి. ‘ఓహో’ అంటూ ఆటో దిగాడు వంశీ. ఆటో అతనికి డబ్బులిచ్చి, ఆ వెనుకే తాతగారు దిగారు.
లోపలకి అడుగు పెడుతూనే ‘అమ్మా’ అంటూ కేకేశాడు వంశీ. లోపల్నుంచి వచ్చిన శుభ, కొడుకు చేతిలోని చిన్ని కూజా, మామ గారి చేతుల్లోని కుండలు చూడగానే ‘ఇంట్లో ఫ్రిజ్ ఉండగా ఇప్పుడీ మట్టి కుండలెందుకు? వంశీ! నువ్వు కూడా ఏమిటి?’ అంది. ‘కుండలో నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివట, తాతయ్య చెప్పారు. పైగా ఈ బుజ్జి కూజా ముద్దుగా ఉంది కదమ్మా’ అన్నాడు. ‘సరే, కానీలే’ అంది శుభ ఆ కుండల్ని అందుకుంటూ.
అంతలో బామ్మగారు వచ్చి ‘కొత్త కుండలు వచ్చాయా, వంశీకి అచ్చు నా పోలికలే వచ్చాయి. నేనూ చిన్నప్పుడు ఏటా గొడవ చేసి ఓ చిన్ని కూజా కొనిపించేదాన్ని’ మురిసిపోతూ అంది. ఆమె మాటలు చక్కని ఆహ్వాన గీతాల్లా వినిపించి మేం ఆనందిస్తుండగా ‘జయమ్మా, మజాకా.. ఆ అలవాటుతోనే కదూ పెళ్లయ్యాక కూడా కనిపించిన ప్రతీది కొనమని గొడవ చేశావు’ తాతగారు ఆమెను ఆటపట్టిస్తుండగా, ఓ పాప పరుగులు తీస్తూ లోపలికి వచ్చింది. వచ్చీరాగానే కుండల్ని, చిన్ని కూజాను చూసింది. వెంటనే ‘మరి నాకేదీ కూజా? అన్న ఎప్పుడూ తనకు మాత్రమే కొనుక్కుంటాడు. తాతయ్యా! నువ్వైనా నాకూ ఒకటి కొనొచ్చుగా?’ అంది. ‘నిజమే నీలూ! రేపు కొనుక్కొస్తాలే’ అన్నాడు తాతయ్య. ‘నాకు కూజా వద్దు. గుండ్రటి కుండే కావాలి. రేపు మా స్కూల్లో పాట్ పెయింటింగ్ పోటీ ఉంది’ చెప్పింది నీలూ. ‘అలాగే అమ్మా.. కుండలు సృజనాత్మక కళకి కూడా ఉపయోగపడతాయన్న మాట’ అన్నాడు తాతయ్య. ‘అవును. బోనాల కుండలకు కూడా చక్కని డిజైన్లు వేస్తారు. అలాగే దీపావళి పండుగకి బొమ్మలు పెట్టే సందర్భంలో బొమ్మలకు అటు, ఇటు దొంతులు పెట్టడం తెలంగాణ సంప్రదాయం. దొంతులు అంటే సైజులవారీగా ఒకదానిపై ఒకటి అమరి ఉంటాయి. అంతేకాదు, వాటి మీద చక్కని రంగుల ఆకులు, లతలు, పూల డిజైన్లతో చూడ ముచ్చటగా ఉంటాయి. పండుగ ముగిశాక ఆ దొంతుల్ని పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారు’ చెప్పింది శుభ. బొమ్మల కొలువులో కూడా మా జాతి ప్రముఖంగా ముందు ఉండటం విని మాకెంతో గర్వంగా అనిపించింది.
శుభ మమ్మల్ని శుభ్రంగా కడిగి, నీళ్లు నింపి చిన్న స్టూళ్ల పైన పెట్టింది. చిన్ని కూజాని వంశీ టేబుల్ మీద ఓ పక్కగా భద్రంగా పెట్టాడు. బూట్ల చప్పుడు వినిపించి అందరితో పాటు మేమూ తలుపు వైపు చూశాం. ‘నాన్నా! నా బుజ్జి కూజా చూడు’ వంశీ ఉత్సాహంగా చెప్పాడు. ‘చాలా ముద్దుగా ఉంది. కూజా అంటే నాకెప్పుడూ నక్క, కొంగ కథే గుర్తొస్తుంది అన్నాడు నాన్న. ‘అవును. నువ్వే చెప్పావు మాకు. నక్కకు బుద్ధి చెప్పడానికి కొంగ పొడవాటి కూజాలో పాయసం పోసి తినమంటుంది. భలే కథ’ అన్నాడు వంశీ.
‘కాళ్లు కడుక్కురా చక్రీ. పుచ్చకాయ ముక్కలు తిందాం’ అంది జయమ్మ. ‘హే. పుచ్చకాయ.. త్వరగా రా నాన్నా’ అంది నీలూ. ‘అలాగే’ అన్నాడు చక్రి. జయమ్మ అందరికీ పుచ్చకాయ ముక్కలు అందించింది.
చక్రి తన ప్లేటు అందుకుంటూ, ‘అసలు కుండలు కేవలం చల్లనీళ్ల కోసమే కాదు, పూర్వకాలంలో వాటిలోనే వంట చేసేవాళ్లు. కుండలో వండిన వంట ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా? ఎంతో ఆరోగ్యం కూడా.’ అన్నాడు చక్రి. ‘ఎందువల్ల?’ అడిగాడు వంశీ. ‘మట్టి కుండలు ఆల్కలైన్ స్వభావం కలిగి ఉండటం వల్ల ఆహారాన్ని అందులో ఉడికించి నప్పుడు ఆహారంలోని యాసిడ్‌తో ఆల్కలైన్ చర్య జరుపుతుంది. మట్టి పాత్రలలో వండిన పదార్థాలలో ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. కుండలో వండే పదార్థాలకు నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు. పైగా కుండలో వండిన పదార్థాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి’ చెప్పాడు చక్రి. మా జాతికి ఇన్ని మంచి లక్షణాలున్నాయని తెలిసి ‘ఎంత గొప్పో’ అనుకుంటుండగా, ‘కుండల్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో కూడా పెట్టుకోవచ్చుట. ఈ మధ్య చదివాను. మనం ఎప్పుడు ప్లాస్టిక్, పింగాణీ పాత్రలే పెడుతుంటాం. ఈసారి చిన్నచిన్న కుండలు కొనుక్కురావాలి’ అంది శుభ.
‘మా అమ్మమ్మ వాళ్లింట్లో పాల కుండ, పెరుగు కుండ, నేతికుండ ఉండేవి. ఆ పెరుగు ఎంత కమ్మగా ఉండేదో’ ఆ రుచి తలుచుకుంది జయమ్మ. ‘ఇప్పుడు మళ్లీ కుండల ప్రత్యేకతను గుర్తిస్తున్నారు. స్టార్ హోటళ్లలో పెరుగుకు కుండలే వాడుతున్నారు. కొన్ని హోటళ్లలో కొన్ని వంటలు కూడా చేస్తున్నారు. కుండబిర్యానీ ఇప్పుడు అందరూ ఇష్టపడే వంటకం’ అన్నాడు చక్రి. ‘సూరత్‌లో తయారయ్యే కుండ పిజ్జా ఎంతో పాపులర్ అయింది. దాన్నేకుల్షాద్ పిజ్జా’ అని కూడా అంటారని చదివాను’ చెప్పింది శుభ. ఆ విశేషాలు మా చెవులకు పండుగ చేస్తున్నాయి. ‘కుల్ఫీ ఐస్‌క్రీమ్ కూడా చిన్ని కుండల్లో వస్తుంది కదా. మనం చాలా సార్లు తిన్నాం’ అంది నీలూ. ‘అవునవును’ అన్నారంతా. ‘అసలు మానవ మనుగడలో మట్టిపాత్రలది ప్రధాన పాత్ర. సింధులోయ, హరప్పా, మొహంజొదారోలలో దొరికిన కుండ పెంకుల ఆధారంగా, నాటి సంస్కృతి, ఆహారపు అలవాట్లను విశ్లేషించి, ఆ కాలంలో మాంసాహారం, శాకాహారం, పాల ఉత్పత్తుల వినియోగం ఉందని తేల్చారు’ అన్నాడు చక్రి.
మాకు అంతటి ప్రాచీన చరిత్ర ఉందన్న మాట, అనుకుంటుండగా, జయమ్మ అందుకుని ‘పూరిక్షేత్రంలో జగన్నాథస్వామికి రోజు నివేదించే యాభై ఆరు రకాల వంటకాలను నిత్యం కొత్త మట్టి కుండల్లోనే వండుతారు. వండే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి ఒకేసారి వండుతారు. ఇలా చేసినప్పుడు మంటపైన ఉన్న కుండలోని ఆహారం మొదటగా ఉడకాలి. కానీ పూరిలో ఏడవ కుండలోని ఆహారం ఉడికిన తర్వాత చివరగా ఉన్న కుండలోని ఆహారం ఉడుకుతుంది!’ అంది. నాకు చిత్రంగా అనిపించింది. తాతగారేమో ‘విశేషమే’ అంటే, ‘చిత్రంగా ఉంది’ అంది శుభ.
ఎప్పుడు తండ్రి బ్యాగ్ శోధించిందో కానీ స్వీట్ ప్యాకెట్ పట్టుకువచ్చి, ‘నాన్నా! స్వీట్లు తెచ్చినట్లు మాకు చెప్పకపోతే తెలీదనుకున్నావా?’ అంటూ తానేదో రహస్యాన్ని ఛేదించినట్లు చూసింది నీలూ. ‘మర్చిపోయానమ్మా. మా ఆఫీసులో సత్యం, కాకినాడ వెళ్లొచ్చాడు. వస్తూ, వస్తూ ఆత్రేయపురం పూతరేకులు పట్టుకొచ్చాడు’ అన్నాడు చక్రి. నీలూ స్వీట్ బాక్స్ తెరిచింది. ‘అందరికీ ఇవ్వు’ అంది శుభ. ‘తాతగారికివ్వకు. ఆయనకు డయాబెటిస్’ అంది జయమ్మ. ‘ఫర్వాలేదమ్మా. అవి బెల్లంతో చేసినవే’ అన్నాడు చక్రి.
అంతా పూతరేకులు తినసాగారు. ‘ఇంత ఉలిపిరి పొరలాగా ఎలా తయారు చేస్తారో’ అన్నాడు చక్రి. వెంటనే శుభ అందుకుని, ‘నేను చెపుతా వినండి, పూతరేకుల తయారీకి కూడా కాల్చిన, గుండ్రని, నున్నగా ఉన్న పెద్ద మట్టికుండే వాడతారు. దాని మూతి, కట్టెలు పట్టేంత వెడల్పుగా ఉంటుంది. మినప పిండి, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా, జారుగా తయారు చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మర్నాడు కుండ మూతిద్వారా కట్టెలు పెట్టి మంట రాజేసి, కుండను వేడెక్కిస్తారు. అప్పుడు పిండి మిశ్రమంలో శుభ్రమైన, పలుచని వస్త్రాన్ని ముంచి దానిని వెడల్పుగా కుండపై ఒకవైపు నుంచి మరొకవైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పలుచని పొరలా, సన్నని కాగితంలా ఊడివస్తుంది. దాన్నే ‘రేకు’ అంటారు. పిండి పూసి తయారుచేసే రేకు కాబట్టి ‘పూతరేకు’ అయింది. ఈ రేకులో తీపి ఈ పదార్థాలను వేసి పొరలు, పొరలుగా మడిచిపెట్టి తయారుచేస్తారు. నెయ్యి, బెల్లం వేయడం సంప్రదాయక పద్ధతి. కొందరు పంచదార పొడి కూడా వాడుతున్నారు. ఇటీవల జీడిపప్పు, బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్లు కూడా కలుపుతున్నారు’ వివరించింది. అందరు మెచ్చే స్వీటు తయారీలో మా జాతిది ప్రధాన ‘పాత్ర’ కావడం నాకు ఎనలేని ఆనందం కలిగించింది. ‘ఏమైనా వీటి తయారీకి మంచి నైపుణ్యం కావాలి’ అంది జయమ్మ. ‘నిజమే’ అన్నారు తాతగారు, చక్రి.
‘పెళ్లిళ్లకు కూడా కుండలు కావలసిందే. వాటిని ఐరేని కుండలు అంటారు. చక్కని డిజైన్లతో చూడముచ్చటగా ఉంటాయి. వీటినే పెళ్లి కుండలని కూడా పిలుస్తారు. వీటిలో నీళ్లు నింపి ఉంచుతారు. వీటి గురించి పొడుపు కథ కూడా ఉంది’ అంది జయమ్మ. ‘పొడుపు కథా.. అదేంటో చెప్పు’ తొందర పెట్టాడు వంశీ. ‘పచ్చ పచ్చల కుండ, పగడాల కుండ, లచ్చమ్మ చేయించు లక్ష వరాల కుండ ఏమిటది?’ అంటే ఐరేని కుండ అని జవాబు చెప్పాలి’ చెప్పింది జయమ్మ.
‘కుండల మీద సామెతలు కూడా ఉన్నాయా?’ అడిగింది నీలూ. ‘ఎందుకు లేవూ, కుండ బద్దలు కొట్టినట్లు, నిండు కుండ తొణకదు, అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టిన కుండ కొత్త కుండ.. ఇంకా ఉన్నాయి కానీ నాకిప్పుడు గుర్తొచ్చినవి ఇవే’ అంది జయమ్మ. ‘వాటి అర్థం కూడా చెప్పు, లేకపోతే పిల్లలకు అర్థం కాదు’ అన్నాడు చక్రి. ‘అయితే వినండి.. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పడాన్ని కుండబద్దలు కొట్టడం అంటారు. ఇక నీళ్లు నిండా ఉన్న కుండ ఎటువంటి చప్పుడూ చేయకుండా, కుదురుగా ఉంటుంది. అలాగే అన్నీ తెలిసిన విద్యావంతుడు, వివేకవంతుడు ఏమాత్రం గర్వం లేకుండా, ఒద్దికగా ఉంటాడు. విషయ పరిజ్ఞానం సరిగా లేని కొందరు గొప్పలు చెపుతూ, తెలిసినట్లు నటిస్తుంటారు. మూడోది.. అత్త, తాను కుండ పగలగొడితే అది ఓటి కుండని, కోడలు పగలగొడితే కొత్త కుండని అంటుందని.. నేను మాత్రం కాదు సుమా’ అంది జయమ్మ. దాంతో అంతా నవ్వేశారు. ‘మా గురించి ఎన్ని విశేషాలు తెలిసాయో’ అనుకున్నాను నేను.
అంతలో శుభ ‘నేను మరో సంగతి చెపుతా, తెలంగాణ లోగిళ్లలో కూరాడు కుండ, నీరాడు కుండ సంప్రదాయంగా వస్తున్నాయి. కూరాడు కుండలో ‘కలి’ పోస్తారు. అంటే ఆ కుండలో నీళ్లు పోసి, గోరువెచ్చ అయ్యేదాకా పొయ్యిమీద ఉంచి, కొంచెం బియ్యం పిండిని అందులో వేసి వేళ్లతో చిలకరిస్తారు. అది క్రమంగా పుల్లగా అవుతుంది. ఈ కలితో అంబలి కూడా తయారు చేస్తారు. గతంలో కూరాటి కుండను రోజు పసుపు, కుంకుమలతో పూజించేవాళ్లు. ఆ కుండ ఆడబిడ్డతో సమానం. నీరాడు కుండలో నీళ్లు పోసేవాళ్లు. రెండింటిని పక్కపక్కనే జతగా ఉంచేవాళ్లు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇంటి ఆడబిడ్డతో కూరాడు కుండ పెట్టించే సంప్రదాయం ఉంది’ వివరించింది. ‘బాగుంది’ అంటూ జయమ్మ, ‘కొన్ని పల్లెల్లో సంక్రాంతికి కొత్త కుండకు పసుపురాసి, ఆకులు తోరణంగా కట్టి, పొయ్యిమీద ఉంచి, కొత్తబియ్యం, బెల్లంతో పొంగలి వండుతారు. తమిళులు కూడా కొత్త కుండలోనే పొంగల్ వండి, సూర్యుడికి నివేదిస్తారు’ చెప్పింది.
‘నీటికుండలు, వంట కుండలు సరే, సంగీత వాయిద్యంగా కూడా కుండ ఉంది. దాన్ని ‘ఘటం’ అంటున్నాం. అయితే దాని తయారీ మామూలు కుండ తయారీ కన్నా భిన్నంగా ఉంటుంది. ఘటం మూతి ఇరుకుగా ఉంటుంది. దీని తయారీకి బంకమట్టిలో ఇత్తడి లేదా రాగి రజను, కొద్దిగా ఇనుప రజను కలుపుతారు. వీటిని ఎక్కువగా తమిళనాడులోని మనమదురైలో తయారు చేస్తారు. చెన్నై, బెంగళూరు వగైరాలలో కూడా ఘటాలు తయారవుతున్నా, మనమదురై ఘటాలు ప్రత్యేక స్వర నాణ్యతకు పేరొందాయి’ చెపుతుండగానే శుభ, ‘నాకూ ఓ విషయం గుర్తొచ్చింది, మనమదురైలో ఘటాలను తయారు చేసే ఏకైక మహిళ మీనాక్షి కేశవన్ గురించి ఆ మధ్య చదివాను. ఐదేళ్ల క్రితం ఆమె కన్నుమూసింది. సంగీత వాయిద్యమైన ఘటం తయారీలో చేసిన కృషికి ఆమె సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకుంది. సంగీతం ఒక గొప్ప కళ అయితే, ఘటం తయారుచేయడం కూడా గొప్ప కళే. ఘటం గోడలు మామూలు కుండ గోడలకంటే రెండు రెట్లు మందంగా ఉంటాయి. ఇవి ఎనిమిది నుంచి పదికిలోల వరకు బరువు ఉంటాయి. కుమ్మరి చక్రంపై కుండ తయారయ్యాక ఒక రోజు పాటు అలా ఉంచేస్తారు. ఆ మర్నాడు కాల్చడానికి ముందు కుండ లోని ప్రతి అంగుళాన్ని హ్యాండిల్ ఉన్న ప్లాంక్‌తో కొడతారు. దాదాపు మూడువేల సార్లకు పైగా కొట్టాల్సి ఉంటుంది. ఎంత శ్రమో కదా’ చెప్పింది. ‘మీనాక్షి కేశవన్ నిజంగా గొప్ప మహిళ’ అన్నాడు చక్రి. ‘అవునవును’ అన్నారు తాతగారు, జయమ్మ. మా జాతి సంగీతపరంగా కూడా సేవలందించడం ఎంత ఘనత అనుకుంటూ మా నేస్తం వైపు చూశాను. అది కూడా సాభిప్రాయంగా నావంక చూసింది.
అదే క్షణంలో జయమ్మ గొంతు వినిపించింది. ‘పురాణాలలో కూడా కుండల ప్రస్తావన ఉంది. కురు, పాండవుల గురువైన ద్రోణుడు పుట్టింది కుండలోనే. ద్రోణము అంటే కుండ అని అర్థం. అలాగే కౌరవులు కూడా పుట్టింది కుండలలోనే’ అంది. ‘అదెలా?’ ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. ‘అది నీకు పెద్దయ్యాక అర్థమవుతుంది కానీ నేనో మంచి కథ చెపుతాను, వినండి’ అన్నాడు తాతగారు. ‘కుండల కథా?’ అడిగింది నీలూ.
‘అవును. అనగనగా ఓ కుమ్మరి. ఓ రోజు అతడు కుమ్మరి చక్రంపై తయారైన కుండల్ని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. కాలుతున్న కుండని చూసి, పచ్చి కుండ ఒకటి తెగ భయపడింది. ‘అమ్మో! ఒళ్లు కాలిపోవడమే! వద్దు. నేను భరించలేను. నన్ను కాల్చొద్దు’ కుమ్మరిని వేడుకుంది. అతడు దానికి నచ్చచెపుతూ, ‘జీవితంలో తొలిదశలో కష్టపడితే జీవితాంతం హాయిగా ఉండవచ్చు. ఇప్పుడు కష్టమని సోమరిగా ఉంటే, నీ జీవితం వృథా అవుతుంది’ అన్నాడు. అయినా పచ్చి కుండ అతడి మాట వినలేదు. దాంతో కుమ్మరి ఆ పచ్చి కుండను అలాగే పక్కన పెట్టేశాడు. కాలుతున్న కుండల్ని చూసి, పచ్చికుండ తానెంతో అదృష్టవంతురాలి ననుకుంది. కాలిన కుండలు చాలా వరకు అమ్ముడుపోయాయి. పచ్చికుండ అక్కడే మిగిలిపోయింది. ఓ రోజు వర్షం కుండపోతగా పడింది. కాలిన కుండలు వానను తట్టుకుని దృఢంగా ఉంటే పచ్చి కుండ మాత్రం వానధాటికి కరిగి పోయి, మట్టిలో కలిసి పోసాగింది. కుమ్మరి మాటల్లోని అంతరార్థం దానికి అప్పుడు బోధపడింది. కానీ ఏం లాభం, సమయం మించి పోయింది కదా. ఇది కుండల కథే అయినా, ఇందులోని అంశం మనుషులకు కూడా వర్తిస్తుంది. ముందు దశలో కష్టపడడానికి ఇష్టపడకపోతే చివరకు జరిగేది నాశనమే’ కథ ముగించారు తాత గారు. ‘బాగుంది తాతయ్యా’ పిల్లలిద్దరూ ఒకేసారి అన్నారు.
మా జాతిలో ఇలాటివారు కూడా ఉంటారన్నమాట అనుకున్నాను నేను. ‘తాతయ్యా! మా స్కూలుకు వెళ్లే దారిలో తడికెలతో ఒక షెల్టర్ లాగా ఉంది, అందులో రెండు పెద్ద కుండలతో నీళ్లు పెట్టారు. చాలామంది నీళ్లు తాగుతున్నారు. పైన బ్యానర్ మీద.. చలి.. ఏదో రాశారు తాతయ్యా! నాకు గుర్తు రావట్లేదు’ అంది నీలూ. తాతయ్య నవ్వి, ‘దాన్ని చలివేంద్రం అంటారమ్మా. వేసవిలో బాటసారులు దాహం తీర్చుకోవడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు’ చెప్పారు.
అంతలో జయమ్మ మాట్లాడుతూ ‘కుండమార్పిడి అనే మాట విన్నారా? గతంలో ఎక్కువగా కుండమార్పిడి పెళ్లిళ్లే జరిగేవి’ అంది. ‘అంటే ఏమిటి?’ అన్నాడు చక్రి. ‘ఆడపిల్లను కోడలుగా పంపే ఇంటి నుంచే వారి అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవడం. అంటే పరస్పరం ఇచ్చి, పుచ్చుకోవడమన్నమాట. వీళ్ల అమ్మాయి వారి కోడలు, వారి అమ్మాయి వీరి కోడలు అవుతారు’ వివరించింది జయమ్మ. ‘ఓహో’ అన్నాడు చక్రి.
‘మనిషి జీవితంలో శుభాశుభాలు రెండింటిలోనూ కుండల ప్రాధాన్యత ఉంది’ అన్నాడు తాతయ్య. ‘నిజమే. అంత్యక్రియల్లో చితిపై శవాన్ని ఉంచాక, శవం చుట్టూ నీటికుండతో తిరగడం, ఆ కుండకు చిల్లి పెట్టడం చేస్తారు. దాని అర్థమేమిటి?’ అడిగాడు చక్రి. ‘కుండ శరీరం లాంటిది. అందులో ఉన్న నీరు మనిషి ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లిపోయిందో, శరీరం నుండి ఆత్మ బయటికి పోయిందని. కుండను పగలగొట్టడం అంటే, ‘ఇప్పుడు శరీరాన్ని కాల్చేస్తాం, ఇంక నీకు శరీరం ఉండదు, నువ్వు వెళ్లిపో’ అని ఆత్మకు సంకేతం ఇవ్వడం’ వివరించాడు తాతయ్య. ‘ఇంత అర్థం ఉందా!’ తల పంకించాడు చక్రి.
‘నాన్నా! సినిమాల్లో కూడా కుండలుంటాయి కదా’ అంది నీలూ. చక్రి నవ్వి ‘అవును. కొన్ని పాటల చిత్రీకరణలో అందమైన కుండల సెట్టింగ్స్ చూస్తుంటాం. పాత సినిమాలు కొన్నింటిలో ఫైటింగ్ సీన్లలో గుట్టగా ఉన్న కుండలు ఒక్కసారిగా బద్దలయిపోవడం చూస్తుంటాం’ అన్నాడు.
‘రాజస్థాన్‌లో కుండలతో డ్యాన్స్ చాలా పాపులర్ అని మా టీచర్ చెప్పింది. దాన్ని భవాయి డ్యాన్స్ అంటారని, రెండువేల పదిహేనులో జైపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల, ‘బేబీ లఛి ప్రజాపతి’ తల మీద నూటఇరవై అయిదు కుండలను బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని కూడా చెప్పింది’ అన్నాడు వంశీ. ‘అమ్మో! అన్ని కుండలతో డ్యాన్సే’ జయమ్మ, శుభ ఆశ్చర్యపోయారు. నా ఆశ్చర్యానికయితే అంతే లేదు. ఈ మనుషులు ఏమైనా చేయగలరు’ అనుకుంటుండగా, ‘అత్తయ్యా! ఇప్పుడు మట్టి వాటర్ బాటిల్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఆన్‍లైన్‍లో చూశాను. మనమూ ఆర్డర్ చేద్దాం’ అంది. ‘ఇదేదో బాగుందే, తెప్పించు చూద్దాం. మా చిన్నప్పుడు మా తాతగారు ప్రయాణాల్లో కమండలం లాంటి కూజాను వాడేవారు’ చెప్పింది జయమ్మ. ఇంతలో చక్రికి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాతగారు కూడా ‘వాకింగ్‌కి వెళ్లొస్తా’ అంటూ లేవడంతో మిగతావారు కూడా అక్కడి నుంచి కదిలారు.
నాలో ఆలోచనలు మాత్రం ఆగలేదు. మనిషి చల్లగా ఉండాలని ఇన్ని రకాలుగా అండగా ఉండటం మాకెంతో గర్వకారణం. అయితే ఆధునిక కాలంలో మా జాతిని చాలామంది పక్కకు నెట్టేయడం చూస్తే ఎంతో విచారం కలుగుతుంది. ఇప్పటికీ పేదవాడి ఫ్రిజ్‌ను నేనే కదా. విద్యుత్తుతో పనిలేకుండానే, చల్లని, తీయని నీరందిస్తాను. మా వాడకం ఆరోగ్యదాయకం అని తెలిసి మమ్మల్ని చిన్నచూపు చూడటం భావ్యమా? సినిమాల్లో ఫైటింగ్ సీన్ల కోసం మమ్మల్ని నాశనం చేయడం న్యాయమా? మా జాతిని రూపొందించడమే జీవనాధారంగా ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని ఆదరించి వారి జీవితాలను నిలబెట్టమని, కుమ్మరులు కుమిలిపోకుండా చూడమని మనిషికి చెప్పాలనుంది’ అనుకుంటుంటే, జయమ్మ టీవీ పెట్టినట్లుంది.. ఆ శబ్దానికి అటు చూశాను. సంగీత కచేరీ కార్యక్రమం జరుగుతోంది. ఘటం వాయిద్యకారుడు తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.
ఘనత కెక్కిన మా ఘటంగారిని అలాగే చూస్తూ
మైమరిచిపోయా.