అప్పుడు నాకు ఫోన్ చెయ్యి!!

0
3

[హిందీలో శ్రీ సునీల్ అమర్ రచించిన ‘ఫోన్ కర్ లేనా ముఝే తుమ్!’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు గీతాంజలి.]

[dropcap]ప్రి[/dropcap]యా., ఇటు చూడు! ఎప్పుడైనా నీ హృదయం దుఃఖంతో నిండిపోయినప్పుడు., మనసు ఉదాసీనంతో తొణికి పోయినప్పుడు..
నాకు ఫోన్ చెయ్యి!
**
జీవితం ఒక పూలతోట.. ఒప్పుకుంటా.. కానీ అదే సమయంలో ఒక ఎండిపోయిన ఎడారి కూడా కదా!
ఇక్కడి ప్రతీ మలుపూ నీకు పరిచితమే..! అయినా కొన్నిసార్లు అపరిచితంగా ఉంటుందెందుకో ఈ జీవితం (నువ్వు) మరి?
పోనీలే., ఎప్పుడైనా నీ గతం నిన్ను ఏడిపించి.. ఏడిపించీ వదిలిపెట్టినప్పుడు..
వెంటనే నాకు ఫోన్ చెయ్యి!
**
చూడు.. ఇప్పటికే నీ చుట్టూ ఉన్న జీవితంలో ఎంత దుఖం ఉందో..?? నీ దుఃఖంతో దాన్ని మరింత పెంచి పోషించకు సుమా!
ప్రియా.. నా మీద ఒట్టు.. నిన్ను నువ్వు బాధపెట్టుకోకు!!
రాత్రి చిక్కబడిపోతూ.. పగటి పూట ఒంటరితనం ఎప్పటిలా వేధించినప్పుడు.
చూడూ నేనున్నాను మరి నీకు!!
నాకు ఫోన్ చెయ్యి!
**
ప్రియా.. నేనెంత నిస్సహాయినో.. నువ్వు కొంచమన్నా అంచనా వేయలేవు!
అస్సలు ఆ పని చేయలేవు.
ఎందుకంటే నీకు నేను చాలా దూరాన ఉన్నాను!
ఇక..
ఎప్పుడైనా ధ్వంసమైన కల ఏదైనా., నిన్ను ఉండీ-ఉండీ భయపెడితే..
నాకు ఫోన్ చెయ్యి!
నా ప్రియా.. అప్పుడు నేను కవిత్వం నిండిన పదాలతో తిరిగి.. కన్నీళ్లు తుడుచేసుకుంటాను.
ఒక్క మాట! నా లోలోపల మెల్లిగా సలుపుతూ ఉండే బాధని, ప్రతి నొప్పినీ, నా ప్రతి కష్టాన్నీ.. నీతో పంచుకుంటాను కదా!
నీకేమైనా.. ఒక్కటంటే ఒక్క తీపి జ్ఞాపకం గుర్తుకు వచ్చి నువ్వు కూడా పులకరించిపోతే.. దయ చేసి నాకు ఫోన్ చేసి చెప్పవా!
అలాగే., నేను గుర్తుకు వచ్చి కన్నీటితో.. వేదనతో నువ్వు అలమటించిపోతున్నప్పుడైనా., ప్రియా., నాకు వెంటనే ఫోన్ చెయ్యి..!!
ఎదురు చూస్తాను.. నాకు ఫోన్ చెయ్యి..!! చేస్తావు కదూ.. చెయ్యవూ??

హిందీ మూలం: సునీల్ అమర్
తెలుగు: గీతాంజలి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here