[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.
“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! నీవు విద్యాపారంగతుడవే కాదు, అభిషేక, అలంకార, యోగ, వివాహ, ఆస్ధాన, వసంత, గీష్మ, వార్షక, కార్తీక, విహార, జప, డోలా, శయన, నిత్యోత్సవ, అధ్యాయన, వాహన, ప్రణయకలహ, ప్లవోత్సవ, దమనకోత్సవ, మాసోత్సవ, పాలకోత్సవ, వార్షకోత్సవ, నైమిత్తికోత్సవ, అఖేట మండపాలు కలిగిన నీ ఉజ్యయిని రాజ్య గొప్పదనం లోక విదితమే. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘శాశ్వత పరిష్కారం’ అనే కథ చెపుతాను విను.”
***
అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఇతను గొప్ప సాహసవంతుడు, వీరుడు కత్తి పట్టిన నాటి నుండి ఓటమి ఎరుగనివాడు. ఇతని మంత్రి పేరు సుబుధ్ధి. అవంతికి సమృధ్ధిగా నదుల నీరు ఉండటంతో పంటలు బాగా పండేవి. ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. అవంతికి సరిహద్దు రాజ్యం ఉత్కళ. దీని పాలకుడు వక్రకేతు అనే రాజు. ఇతను యుధ్ధ పిపాసి. పలుమార్లు అవంతిపై దండెత్తి ధన, జననష్టంతో ఓటమి చవిచూసాడు. ఏ నాటికైనా అవంతిని జయించి తీరాలని పట్టుదలతో ఉన్నాడు.
వరుసగా రెండేళ్ళు వర్షం సకాలంలో పడకపోవడంతో ఉత్కళ రాజ్యంలో కరువు సంభవించింది. ఉత్కళ రాజ్యప్రజలను ఆదుకునేందుకు తన ధాన్యాగారంలోని ధాన్యాన్ని ఉత్కళ ప్రజలకు ఉచితంగా తరలించడంతో పాటు తన రాజ్యంలో ఎప్పుడూ నీటితో కళకళలాడే జీవనది ఐన గంగానది నీటిపాయను ఉత్కళ రాజ్యానికి కాలువగా తరలించాడు చంద్రసేనుడు. ఉత్కళ ప్రజలు తాము శత్రుదేశమైనప్పటికి మానవతా దృష్టితో ఆదుకున్నచంద్రసేనుడిని అతని దయార్ద్ర హృదయాన్ని మెచ్చుకున్నారు.
గురుకులంలో విద్య పూర్తి చేసి సంవత్సర కాలం వివిధ దేశాలలో పర్యటించి లోకానుభవం పొందిన తన కుమారుని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో యువరాజు పట్టాభిషేకం ఘనంగా నిర్వహించిన చంద్రసేనుడు “చిరంజీవీ, ఈ రోజు చాలాసంతోషంగా ఉంది. త్వరలో మహారాజుగా పట్టాభిషేకం, మరియు వివాహం నీకు జరిపించాలి అని అనుకుంటున్నాను. ఈ ఆనంద సమయంలో నీకు ఏం కావాలో కోరుకో” అన్నాడు చంద్రసేనుడు.
తన మనసులోని కోరికను వెల్లడించాడు యువరాజైన విజయుడు. యువరాజు కోరిక వింటూనే చంద్రసేనుడు, అతని మంత్రి సుబుధ్ధి ఆశ్చర్యపోయారు.
అనంతరం మంత్రితో సమావేశమైన చంద్రసేనుడు “మంత్రివర్యా, నా కుమారుడు ఇలాంటి కోరిక కోరతాడు అనుకోలేదు. ఇచ్చినమాట తప్పలేను. అతని కోరిక మనం తీర్చవలసిందే!”అన్నాడు చంద్రసేనుడు.
“ప్రభూ, మన యువరాజు గారు ఉత్కళ దేశపు రాజకుమారితో వివాహం జరిపించమని కోరాడు అంటే అమెతో మన విజయునికి గత పరిచయం ఉండి ఉండాలి”అన్నాడు మంత్రి.
“నిజమే ఉత్కళ రాజకుమారి నగరపొలిమేరలలోని ఆలయానికి కొద్దిమంది సైనికుల రక్షణలో, తన చెలికత్తెలతో వచ్చిందట. అప్పుడు బందిపోటు దొంగలు కొందరు ఆమె ఒంటిపై నగల కొరకు దాడి చేయగా, ఆలయంలో ఉన్న మన యువరాజు బందిపోటు దొంగలను తరిమి కొట్టాడట, అక్కడ వారి మనసులు కలిసాయి అని చెప్పాడు” అన్నాడు చంద్రసేనుడు.
***
కథ ముగించిన బేతాళుడు, “విక్రమార్క మహరాజా, కుమారుడి కోరిక తీర్చడం కోసం చంద్రసేనుడు శత్రువుతో వియ్యమందడం న్యాయమా? తెలిసి సమాధానం చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.
“బేతాళా, చంద్రసేనుడు చాలా దూరదృష్టి కలిగినవాడు, ఉత్కళదేశ ప్రజలను ఆపదకాలంలో ఆదుకుని వాళ్ళకు వ్యవసాయానికి నిరంతరంగా నీరు ఇచ్చి వారి అభిమానానికి పాత్రుడు అయినాడు. తమ యువరాజుకు ఉత్కళ రాజకుమారితో వివాహం జరిపించాలి అనుకుంటున్నామని ఉత్కళ పాలకుడు వక్రకేతుకు సందేశం పంపితే ఎంతో సంతోషంగా అంగీకరిస్తాడు. పైగా ఆ దేశపు రాజకుమారి కూడా చంద్రసేనుని యువరాజును ప్రేమిస్తుంది. వారి వివాహం జరిపిస్తే రెండు రాజ్యాలకు శత్రువుల బాధ ఉండదు. ఈ వివాహంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది” అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.