కలవల కబుర్లు-10

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

అంతం కాదిది ఆరంభం..

[dropcap]ఇ[/dropcap]దేదో నటకీకర సినిమా పేరు అనుకునేరు..

నా ప్రతిభా పాటవత్వాలు చెప్పుకుందామని నా ప్రయత్నం.

చిన్నప్పటినుండీ ఏదేదో కళాప్రావీణ్యం సంపాదించేయాలని దుగ్ధ. దాంతో ఎవరేం చేస్తే.. ఓసోస్ ఇంతేకదా అన్నింటిలోనూ అడుగు పెట్టడం.. నాలుగడుగులు వేసి.. చేతకాకనో, బధ్ధకమో.. ఇంకోటో.. మరొహటో.. కారణం ఏదైతేనేం లెండి అక్కడ నుండి పీచేముఢ్.. యూటర్నింగ్ తీసుకోవడం.

ఎదురింటమ్మాయి తెల్లారేసరికల్లా పేడనీళ్ళు కళ్ళాపి జల్లి, 21, 25, 37 39, ఇక ఇలా నెంబర్లకి అతీతంగా వీధి పొడుక్కీ చుక్కల ముగ్గులు పెట్టేసి.. మెలికలు మెలికలు అవలీలగా వేళ్ళ సందుల నుండి ముగ్గు పిండిని తిప్పేస్తోంటే.. ఓసోస్ ఆ మాత్రం తిప్పలేనా అనుకుంటూ, నేనూ మొదలెట్టి, తిప్పుకుంటూ తిప్పుకుంటూ, మధ్యలో లెక్కలు తప్పుతోంటే, మళ్లీ మొదటినుంచి లెక్క పెట్టుకుంటూ కూడబలుక్కుని చుక్కలు పెట్టేసరికి చుక్కలు కనపడేవి.. ఇక మెలికలు తిప్పడం మొదలెడితే.. ఎక్కడ మొదలెట్టానో, ఎక్కడకి వెడుతున్నానో.. ఎటుతిప్పి ఎటు వస్తున్నానో అర్థం కాక ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలా కూర్చుండిపోయేదాన్ని. కాసేపటికి అయోమయం నుంచి తేరుకున్నాక ఇదంతా మన వల్ల అయే పని కాదని బరబరా మొత్తం తుడిపేసి ఐదు నిలువు ఐదు అడ్డం చుక్కలు చాల్లే మనకి ఫిక్స్ అయిపోయేదాన్ని. ఆతర్వాత తర్వాత నెమ్మదిగా ఐదుచుక్కల నుండి పన్నెండు చుక్కలకి వచ్చి ఇక ఏమాత్రం ఆ పైకి వెళ్ళదలుచుకోలేక ఆ ముగ్గుల హాబీకి చుక్క పెట్టేసాను. అదే ఫుల్‌స్టాప్ పెట్టేసానన్నమాట.

ఆ తర్వాత, నా ఎంబ్రాయిడరీ, సూది దారాలు, మేటీ కుట్టు గురించి చెప్పాలంటే.. ఓసారెప్పుడో అమ్మ.. మేటీ క్లాత్ మీద, డోర్ కర్టెన్ కోసం ఆంజనేయస్వామి సంజీవినీ పర్వతం తీసుకొస్తున్న బొమ్మ రంగు రంగు దారాలతో చక్కగా కుట్టింది. కాలక్రమేణ అది జీర్ణావస్థకి వెళ్ళడం, అప్పటికి నేను సూది, రంగు రంగుల విచ్చిల దారాలతో స్టిచింగ్ ప్రయోగశాలలో గొలుసు, కాడ, ముడి ఇలా రకరకాల అంశాలమీద  తలమునకలై ఉండగా, ఈ మేటీ కుట్టు పట్ల ఆకర్షితురాలినై.. అమ్మకి మాట ఇచ్చేసాను. త్వరలోనే, నువ్వు కుట్టినట్లే మరో సంజీవినీ పర్వత సమేత పవనసుతుడిని, మనింటి గుమ్మంలో నిలిపేలా చేస్తాను చూడంటూ ఒట్టు కూడా వేసాను. అయితే ఆ ఒట్టు గట్టు మీదే నిలబడి ఉండడం, ఆ ఆంజనేయులవారు ఇంకా సంజీవినీ పర్వతం మీదకి ఎగిరే ప్రయత్నం లోనే ఉండిపోయారు. ఆ తర్వాత అమ్మ ఎవరినో బతిమిలాడి బామాలి పాపం ఆ తోకరాయుడ్ని పర్వతం తెచ్చేలా సాధించుకుంది.

ఇలా చెప్పాలంటే ఒకటా రెండా.. ప్లాస్టిక్ బుట్టలు అల్లుతానంటూ వైరు కట్టలు కట్టలు కొనిపించడం.. తర్వాత అవి పడ్డ చిక్కులు విడదీయలేక నేను చిక్కుల్లో పడడం.. అసంపూర్తిగా అవి అటకెక్కడం..ఆ తర్వాత అవతలికి గిరాటెట్టడం అయిపోయేది.

మధ్యాహ్నం చిరుతిళ్ళకి సాయం చేస్తానంటూ అమ్మ చేత చేగోడీల కోసం పిండి ఉడకపెట్టించి, పది నిముషాలు అక్కడ నిప్పులు మీద కూర్చున్నట్లే కూర్చుని, సాయం చేసినట్లు చేసి, మొదటి వాయ వేగగానే పళ్ళెంలో వేసుకుని ముందుగదిలోకి పరారే పరారు. పాపం అమ్మ నన్ను నమ్ముకుని మొదలెట్టి ముక్కుతూ మూలుగుతూ పూర్తి చేసుకునేది.

కూచిపూడి నృత్యం మెదలెట్టా! అది కాస్తా.. తై తై తై.. అడుగుల దగ్గరే ఆగిపోయింది.

సంగీతం మాత్రం, ఏం పాపం చేసిందనుకుంటూ.. ఓ మంచి గురువుగారి దగ్గర, ఓ మంచిరోజు చూసుకుని స్వరం సవరించాను. పొద్దున్నే వేడినీరు సేవించి, గొంతును ళుళుళుళూ.. అనుకుంటూ సాధన కూడా మొదలెట్టాను. కానీ.. తొడ మీద.. చేత్తో తాళం వేసీ వేసీ కాలు వాచిపోయేసరికి, ఆ నొప్పి భరించలేక.. నా సంగీతానికి తాళం వేసేసాను.

చీరల మీద ఎంబ్రాయడరీ కార్బన్ పేపర్ తోనూ, ఉల్లిపొర కాయితం మీద డిజైన్‌లు వేయడం వరకూ సాగేది. ఇహ ఆ తర్వాత సూది మాత్రం కదిలేది కాదు.

ఇహ ఇప్పుడు కథలు కూడా చాలా వరకూ మొదలెట్టి అసంపూర్తిగా ఉండిపోయినవి కూడా ఉన్నాయి. వాటిని పూర్తి చేద్దామంటే, మొదలెట్టినపుడు ఆ కథ గురించి ఏమాలోచించినదీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. అవన్నీ కంచికి చేరని కథలయిపోయాయి.

ఇలా ఏదైనా పంతం కొద్దీ మొదలెట్టినా కూడా చాలా పనులు అంతం దాకా చేయడం నా వల్ల అయేది కాదు.  ఆరంభ శూరత్వమేనే నీది అని విసుక్కునేది అమ్మ. అందుకే అంతం కాదు ఇది ఓన్లీ ఆరంభమే అన్నాను. అలా అని అన్నింటిలోనూ అనుకునేరు.. కొన్ని కొన్ని పనులు పూర్తి చేసి.. హమ్మయ్య ఇది పూర్తయింది అని సంతృప్తి పడ్డ సందర్భాలు బోలెడు ఉన్నాయనుకోండి. కానీ మధ్యాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులే ఎక్కువ. ఆ మధ్య ఎవరో కానీ, నాకు ‘పరమ బద్ధక శిరోమణి’ అనే బిరుదుని కూడా ఇచ్చి సన్మానం చేద్దామనుకున్నారట. వాళ్ళకి కూడా నాలా బద్ధకంగా వచ్చింది కాబోలు వాయిదా వేసినట్టున్నారు.

అదన్నమాట సంగతి.. కబుర్లు చెపుతున్నది..

కలవల గిరిజా రాణి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here