[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
సబర్మతీ తీరంలో..
[dropcap]చే[/dropcap]తిలో రాట్నం, తలపైన ఒక ఆశ్రమం ఉంటే చాలు నేను స్థిరపడిపోయానా అంటే, లేదు. అలా ఒక చోట స్థిరపడిపోతారా అమ్మాయ్ మనుషులు?
కొచ్రాబ్ బంగళాకు మేము వచ్చిన రెండు సంవత్సరాలయ్యాయి. అన్ని వైపుల నుండి జనాలు వచ్చేవారు. సదా జనాలే జనాలు. అలా ఉన్నప్పుడు అమదావాదుకు ప్లేగ్ వచ్చింది. మా బంగళాకూ వచ్చింది. ప్లేగ్ వచ్చినప్పుడు అక్కడ ఉండడం ఆశ్రమవాసులకు, అదీ పిల్లలకు అపాయకరం అనిపించింది. మా నివాసం ఇంకో చోటికి మార్చాల్సి వచ్చింది. చోటు మార్చడానికి అదొక్కటే కారణం కాదనుకో. కొచ్రాబ్‌లో పెరడు చాలా తక్కువ. వ్యవసాయానికి ఎక్కువగా భూమి లేదు. పశువులకు కొట్టం కట్టడానికీ లేదు. కాబట్టి అమదావాద్ నుండి మూడు మైళ్ళ దూరంలో సబర్మతి నది తీరం పైనున్న ఒక బయలులాంటి జాగాకు ఆశ్రమాన్ని తీసుకెళ్ళాము.
నదీ తీరం పచ్చగా ఉండవచ్చు అనుకుంటారేమో మీరు! లేదు. ముప్ఫైయారు ఎకరాలుండి పాడుపడిన ఆ స్థలం జైలు, స్మశానాల నడుమ ఉండింది. సత్యాగ్రహులకు జైలు, స్మశానం రెండు ఇంటి మాదిరే, మాకిది సరిపోతుంది అని నవ్వుతూ అన్నారు బాపు. దానికి ఏం పేరు పెట్టాలి అని పత్రికలో అడిగారు. దేశ సేవాశ్రమం, సేవా మందిర్, సత్యాగ్రహాశ్రమం అని పేర్ల సూచనలు వచ్చి, చివరికి అది ఉన్న నదీతీరం పేరిట ‘సబర్మతీ ఆశ్రమం’ అని నామకరణం జరిగింది. మహాశివభక్తుడైన దధీచి మహర్షి తన వెన్నెముకను వజ్రాస్త్రం చెయ్యడానికి దానమిచ్చిన జాగా అట అది. అందులో ఉత్త పాములే నిండి ఉండినాయి. అదీ నాగుపాములు. ఏ జీవిని కూడా చంపేటట్టు లేదు. కాబట్టి ఆశ్రమవాసుల ధైర్యాన్ని పరీక్షించడానికి ఒక అవకాశం దొరికింది.
బాపు బిహార్ రైతులతో చంపారన్ సత్యాగ్రహంలో మునిగి ఉన్నారు. మేమంతా కొచ్రాబ్ బంగళానుండి సబర్మతి ఆశ్రమానికి సామాను, సరంజామా అంతా తీసుకెళ్ళాము. అదే ఊళ్ళోనే అయినా కొత్త ఆశ్రమం నాలుగైదు మైళ్ళ దూరంలో ఉంది. బళ్ళల్లో, నావల్లో సామాను తీసుకెళ్ళాము. మా వద్ద ఉన్న అమూల్యమైన వస్తువులన్నా ఏమని? నూలు, రాట్నం, పుస్తకాలు! అవి కాక మావి అన్నవి ఏముండేవి మా వద్ద?
ఆ స్థలం ముందు బయలు ప్రదేశంగా ఉండింది. ఒక్కొక్కటే కట్టడం ప్రారంభించాము. దగ్గర ఉన్న పరిసరాల్లో దొరికే వస్తువులతోనే సరళమైన ఇంటిని కట్టాలనుకున్నాము. మట్టి గోడలు, స్థానిక పెంకుల పైకప్పు, సాదా వాకిళ్ళు, కిటికీల వంటిల్లు, శౌచాలయాలు తలెత్తాయి. టపా ఖర్చు, గౌరవ వేతనం అంటూ నెలకు నాలుగు వందల యాభై రుపాయలు ఆశ్రమానికి అవసరం. మగ్గాలు – వంటిల్లు, ఇతర కట్టడాల కోసం యాభై అయిదు బీఘా భూమిని కొనడానికి ఒక లక్ష రుపాయల సొమ్ము అవసరం ఉంది. మా వద్ద డబ్బు లేదు. తమ పరిచితులు, దాతల నుండి బాపు సొమ్ముని సేకరించారు. మంచి పనులు చేస్తున్నాము అని అర్థమయితే డబ్బులు పోగుచెయ్యడం కష్టమేం కాదు. కానీ అలా వచ్చిన డబ్బులను స్వంత ఖర్చులకంటే ఎక్కువ బాధ్యతతో ఖర్చు చెయ్యాలి. అలా వచ్చిన సొమ్ములోని ఒక పైసా కూడా మన స్వంత ఖర్చులకు వాడకూడదు అని బాపు పదే పదే హెచ్చరించేవారు.
నేను, బాపు ఉంటున్న కుటీరానికి హృదయ కుంజ్ అని పేరు పెట్టారు. నువ్వు చూసుండొచ్చు అమ్మాయ్! హృదయ కుంజ్‌లో గదులకంటే ఖాళీ స్థలమే ఎక్కువ ఉండేది. విశాలమైన నడవా. సగానికి సగం చర్చ నడవాలోనే ముగిసేది. బాపు ఎక్కువగా అక్కడే రాట్నం తిప్పుతూనో, ఏదో రాస్తూనో, రాయిస్తూనో కూర్చునేవారు. వచ్చినవాళ్ళతో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన గది ఉండేది. అది కాకుండా లోపల నాకొక గది, వచ్చినవాళ్ళు ఉండిపోవడానికి రెండు గదులు, ఒక వంటిల్లు ఇంతే ఉండేవి. వసారా ఇంటి మధ్య స్థలంలో ఒకిన్ని పూల చెట్లు పెంచాము. జాజిమల్లే తీగైతే మొత్తం ఆవరణను ఆవరించి ఉండేది. ప్రార్థనా స్థలం కూడా అక్కడే హృదయ కుంజ్ పక్కలో ఉన్న నదీ తీరం పైన తయారైంది. తూర్పు దిక్కుకు తిరిగి, సూర్యుడి అరుణ కిరణాలు తాకక ముందే మా ప్రార్థన ప్రారంభమయ్యేది.
అక్కడే ఆవల, నదికి ఇంకా దగ్గరగా హృదయ కుంజ్ ఎదురుగ్గా వినోబా ఉంటున్న కుటీరం ఉండేది. బాపును మరింత తోమి తోమి మెరిసేటట్టు చేస్తే ఎలా ఉండేవారో అలా ఉండేవారు వినోబా. కానీ, అయన ఆశ్రమంలో ఉండలేదు. మహారాష్ట్రలోని ఇతర ప్రదేశాలలో అలాంటి ఆశ్రమాలను స్థాపించడానికి, ఇతర పనులను చేపట్టడానికి వెళ్ళిపోయాడు. తరువాత అతడి కుటీరంలో మీరా ఉండేది. కుటీరంలో ఉన్నదైనా ఏమిటి? కూచోడానికి, పడుకోవడానికి, ఎండావానలకు తలదాచుకోవడానికి అరచేతి వెడల్పున కప్పున్న స్థలం అంతే. మరెలాంటి సౌకర్యాలు లేని గదులు.
అక్కడ ఒక మగ్గం కోసం కట్టడం కట్టసాగాము. పునాది వేసి ఇసుక నింపాము కానీ, డబ్బుల కొరతతో ఆగిపోయింది. కట్టడం ఖర్చు ఇరవై వేలు అవ్వచ్చు అని అనుకున్నాము. అంతలో అమదావాద్ మర కార్మికుల సమ్మె ప్రారంభమయ్యింది. బాపు వారికి ఒత్తాసుగా నిలిచారు. ఆ కార్మికులకు తీరిక దొరికడంతో వాళ్ళంతా ఈ పనికి సహాయపడ్డారు. భవంతి ఖర్చు కాస్త తగ్గింది. బాపు ఇలా సహాయం చేస్తూ, వారినుండి సహకారం పొందే అవకాశాన్ని బాగా ఉపయోగించుకునేవారు. అలాంటి సమయాల్లో “మీరు పక్కా బనియా” అని నేను తమాషా చేసేదాన్ని.
ఆశ్రమం లెక్కలు మాత్రం పైసా పైసా పెట్టేవాళ్లము. మేము పండించిన వాటిలో మిగిలిన దాన్ని అమ్మి డబ్బులు గడించేవాళ్ళం. వెళ్ళిన ఒకటి రెండు సంవత్సరాల్లో పత్తి, గోధుమ, పప్పు దినుసులు, కొర్రలు పెంచసాగాము. మా పెరట్లో కమలా పళ్ళు, దానిమ్మ పళ్ళ చెట్లుండేవి. అక్కడ వర్షాలు తక్కువ కాబట్టి నీళ్ళు తక్కువ అవసరమున్న చెట్లనే పెంచాము. ఆశ్రమం ఆవరణలో ఉన్న ఒక బావి నీళ్ళే నీటి వనరు మాకు. పది సంవత్సరాల్లో పాతిక పశువులయ్యాయి. వంద ఎకరాల నేలలో ధాన్యాలు, మేత, కూరగాయలు పండించేవాళ్ళము. పశువులున్నా వాటి పాడి వాడేవాళ్ళం కాము. మరెందుకు అన్ని పశువులు అని మీరు అడగవచ్చు. వ్యవసాయానికి అవి అవసరం. ఆవులు ఉండి తీరాలి. గోసేవ చెయ్యడం మన ధర్మం అనేవారు బాపు. ఆయన ప్రకారం గోరక్ష అనే పదమే తప్పు. మనల్నందిరినీ ఆ భగవంతుడు రక్షిస్తుంటే, మనం సేవ చేసేవాళ్లమే కానీ ఎవరినీ రక్షించేవాళ్ళమెలా అవుతాం అనేవారు. ఒకసారి ఆశ్రమవాసులను పరీక్షించడానికి వచ్చే వైద్యుడు ఆశ్రమవాసులు, అందులోనూ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నరని అన్నారు. తరువాత పాలు, నెయ్యి వాడడం మొదలుపెట్టాము. అంతకు ముందే నేను అనేక మార్లు చెప్పి చూశాను. వేలాది సంవత్సరాల నుండి మనుషులు పాలు, నెయ్యి తిని బ్రతికారు, పిల్లలకైనా ఇద్దాం అని, వినలేదు. ఇప్పుడు శంఖం నుండి వచ్చిన తరువాత అది తీర్థంగా మారింది.
బాపు సమయపాలనలో చాలా కచ్చితంగా ఉండేవారు. ఆయనే కాదు, ఆశ్రమంలో ఉన్నవారంతా కూడా సోమర్లు కాకూడదు అని ఆయన అభిమతం. రెండు పూటలా ప్రార్థన, శ్రమదానం, పనులు, అధ్యయనం, ఉత్తరాలు రాయడం అన్నీ తప్పనిసరి. ఒకసారి బాపు ఒక సభ కోసం గుజరాత్ విద్యాపీఠానికి వెళ్ళారు. అది ఆయనే ప్రారంభించిన పాఠశాల. కార్యక్రమం అయినాక ఒక సేఠ్ ఆయనను తమ కారులో ఆశ్రమానికి తీసుకు వెళ్తానని చెప్పారట. కానీ ఆయన కారు రావడం ఆలస్యమయింది. తరువాత మరో సభ ఉండడం వలన దానికి ఆలస్యం అవుతుందని బాపు ఒక విద్యాపీఠం విద్యార్థి సైకిల్ తీసుకుని తొక్కుకుంటూ వచ్చేశారు.
ఆశ్రమంలో మూడు కోతి బొమ్మలు పెట్టాము. చెడు చూడరాదు, చెడు వినరాదు, చెడు మాట్లాడరాదు అని. అవి జపాన్ బొమ్మలు. వాటిని అనుసరించడం అందరికీ అవుతుందా లేదా అన్నది చర్చనీయమే. కానీ అన్ని నియమాలను పాటిస్తున్నారా లేదా అని చూసే పని మాత్రం నాది.
జలియన్ వాలా బాగ్, చౌరిచౌరా సంఘటనల తరువాత ఒక రోజు ఉన్నట్టుండి పోలీసులు మా ఆశ్రమానికి వచ్చారు. అన్నిటినీ జప్తు చేసి, బాపును జైలుకు పంపారు. రాజద్రోహ నేరానికి ఒకటి కాదు, రెండు కాదు, ఆరు సంవత్సరాల శిక్ష. మాకు ఇది ఆఘాతకరమైన క్షణం. బాపు దక్షిణ ఆఫ్రికాలోనూ జైలుకు వెళ్ళారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇది మనదేశం అని నేను భావించాను. మనదే దేశంలో మనం జైలుకు వెళ్ళడం జరిగిందంటే బాపు బ్రిటిష్ వాళ్ళను ఎదురించి ఎందుకు పోరాడుతున్నారు అని నాకు అర్థమయ్యింది.
ఆశ్రమంలో ఖాయంగా యాభై మందిమి ఉన్నాము. గాంధీ కుటుంబానికి చెందిన పెద్దవాళ్ళు, పిన్నలు, మహదేవ దేసాయి. ఆయన భార్య దుర్గా బేన్, కొడుకు నారాయణ, కాకా సాహెబ్, మావళంకర్, వినోబా, ఇమాం బావజీర్, నారాయణ ఖరె, ఎస్తర్ మొదలైనవాళ్లమున్నాము. కానీ, మహదేవ, మగన్ అనే ఇద్దరు లేకుంటే ఈ ఆశ్రమం ఆశ్రమంగానే ఉండేది కాదు. వారినంతా నీకు పరిచయం చేసి తీరాలమ్మాయ్!
మా మహదేవ మీకు తెలిసుండాలి. మహదేవ దేసాయి. మహరాష్ట్రకు చెందినవారు. చాలా బుద్ధి, చురుకు, ఎప్పుడు చూసినా బాపు నీడలా ఉండేవాడు. మా మణికంటే పెద్దవాడు. అతడు ఉన్నందుకే బాపు ఆరోగ్యం, ప్రయాణాలు, దుస్తులు, మందులు, డాక్టర్లు, ఉత్తరాల వ్యవహారం, పోరాటం, భేటీలు ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన పట్టించుకోనవసరం లేకుండా పోయాయి. ఆయన ఏం చెయ్యాలి, ఎవరిని కలవాలి అని అతడే నిర్ణయించేవాడు. ఆయన ప్రయాణ ఏర్పాట్లు, వెళ్ళిన చోట ప్రార్థన, రాట్నం, ఉండడానికి ఏర్పాటు, భోజనాలు వీటన్నిటి గురించి తనే శ్రద్ధ తీసుకునేవాడు. ఆశ్రమానికి వచ్చి పోయేవారు, వాళ్ళకు చెయ్యల్సిన ఏర్పాటు, భోజనాలు, ఖర్చులు, లెక్కలు, జీతాలు అన్నీ అతడిదే బాధ్యత. మహదేవ విలేకరి కూడా. నవజీవన్ పత్రిక నడుపుతూ, రాస్తూ, అనువదిస్తూ, ప్రచురణ చేస్తూ అన్నిటి బాధ్యత తీసుకుని చూసుకుంది అతడే. ఒక రకంగా బాపు మనసులో ఉన్నదాన్ని అతడి చేయిగా, కాలుగా, నోరుగా చేసింది మహదేవ. బాపుకంటే తొందరగా లేచి పనులు మొదలుపెట్టి ఆయన పడుకున్నాక ఎంతో సేపటికి కానీ పడుకునేవాడు కాడు. ఆ పనుల మధ్యలోనే చదివేవాడు, రాసేవాడు, అనువాదం చేసేవాడు, మాట్లాడేవాడు. ఒక రోజు కూడా వదలకుండా దినచరి రాసేవాడు. బాపు ఒక సత్యాగ్రహి ఎలా ఉండాలని అనేవారో అలాగే అంటే అలాగే ఉన్నవాడు మహదేవ. బాపును గ్రహించింది, తెలిసింది అతడే. అలాంటివారు కోటికొక్కరైనా దొరకరు. పెద్ద మనసు, ఉదార స్వభావం. ఒక్క రోజైనా సెలవు పెట్టలేదు. ఒకసారి ఆరోగ్యం చాలా పాడైంది. అయినా సరే పని చేస్తూనే ఉన్నాడు. నేనే “విశ్రాంతి తీసుకో మహదేవా” అన్నాను. కానీ, బాపు ఆశ్రమంలో లేకుంటే అతడు విశ్రాంతి తీసుకోవడానికి వీలయ్యేది కాదు.
అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. బాపు జైలుకు కానీ, విదేశాలకు కానీ, ప్రవాసానికి కానీ, సభకు కానీ ఎక్కడికి వెళ్ళినా అతడితోనే ఉండేవాడు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నప్పుడు, జార్జ్ దొరను చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా బాపుతో ఉన్నది మహదేవ ఒక్కడే. మేము ఈ దేశానికి వచ్చిన రెండు మూడు సంవత్సరాలకు మాతో పాటు ఉన్నవాడు చివరి ఘడియదాకా మాతో పాటే ఉన్నాడు.
సబర్మతీ ఆశ్రమంలో అన్ని మతాలవారూ ఉన్నారు. మా మీరా తెలుసు కదా అమ్మాయ్! మెడెలిన్ స్లేడ్, ఆమే అంతే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా అమ్మాయే అయిపోయింది. వైష్ణవ సన్యాసినిలా తెల్ల దుస్తులు ధరించి మీరాబేన్ అయింది. ఉర్దు నేర్చుకుంది. ఖాదీ వడికేది. నేసేది. శాకాహారిగా మారింది. ఆమే కాకుండా ఎస్తర్ అని ఒకామె క్రైస్త బంధు సన్యాసిని ఉండేది. ఆమె రమారమి మేము వచ్చినప్పుడే భారతానికి వచ్చింది. మా ఆశ్రమానికి అడపా తడపా వచ్చి వెళ్తుండేది. అది ఆమె దేశస్థులకు, ఆమె మిషన్ వారికి నచ్చలేదు. అందుకే మిషన్ వదిలేసి ఆశ్రమం లోనే ఉండిపోయింది. “మై డియర్ చైల్డ్” అనే ఆమెను బాపు పిలిచేవారు.
ఆశ్రమంలో నారాయణ ఖరె అని ఒక సత్యాగ్రహి ఉండేవాడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ అనే పెద్ద సంగీత పండితుడి శిష్యుడు. మంచి గాయకుడు. మహాన్ సంగీత విద్వాంసుడు. ఆశ్రమ భజనావళి అంటూ ఒకిన్ని ప్రార్థనలు, పాటలు తయారు చేశాడు. అందరికీ నేర్పాడు. ఆయన పాడుతున్న’వైష్ణవ జనతో’ పాట చాలా ప్రసిద్ధికొచ్చింది. నాకు కూడా అది చాలా ఇష్టమైన పాట. నేను అన్యమనస్కురాలనైనప్పుడల్లా దాని ఒక్కో చరణం నాకు సాంత్వన కలిగించింది అని చెప్పొచ్చు. రాను రాను బాపు అంటే వైష్ణవ జనతో అనేలా అయ్యింది.
వైష్ణవ జనతో తేనే కహియె జె /పీడ్ పరాయి జానె రె/
పరుదుఃఖె ఉపకార్ కరె తోయె/ మన్ అభిమానన ఆనె రె /
సకల లోక మాన్ సహునె వందే /నిందా న కరె కేని రె/
వాచ్ కాచ్ మన్ నిశ్చల్ రాఖె/ ధన్ ధన్ జనని తేని రే /
సమ దృష్టి నె తృష్ణా త్యాగి / పరస్త్రీ జేనె మాత రె/
జిహ్వా తాకి అసత్య న బోలె / పర ధన్ నవ ఝాలి హాథ్ రె /
మోహ్ మాయా వ్యాపి నహి జేనె / దృఢ్ వైరాగ్య్ జేనా మన్ మన్ రె/
రామ్ నామ్ శూన్ తాలి లాగి/ సకల్ తీరత్ తేన తన్ మాన్ రె/
వన్ లోభి కపట్ రహిత్ చె / కామక్రోధ్ నివార్య రె /
భానె నరసియ్యు తేను దర్శన్ కరతా/ కుల ఏకుతర్ తార్యా రె /
అందరి బాధను తెలిసినవాడయితే/ జయింతువు నీవు బ్రతుకులో/ లోభం లేని ఉపకారమె సుఖము/ గర్వం రాకుంటే మనసులో
సమభావంతో దురాశ తొలగని/ వనితకు అభయపు నీడ ఉండనీ/ అసత్యపు అంచును తెలియని నాలుక / పరధనాన్ని కాదననీ
కపటం తెలియక సాగు పడకుండా/ రాగద్వేషాల సుడులలో/ మమతలోనే మనిషివి కమ్ము/ప్రయాణమే బ్రతుకు గురిగానూ
వైష్ణవులు ఎవరు, మనుషులు ఎవరు, ఎలా ఉండాలి అని ఎంత బాగా చెప్పారో కదా మా నరసి? శౌచాలయం కడగడం, స్నానాల గది నీళ్ళు పోవడానికి ఏర్పాటు చెయ్యడం, తూములు కడగడం మొదలైన పనులు చేసేటప్పుడు వైష్ణవురాలిగా ఉంటూ ఇలాంటి పనులు చేయాలా అని అప్పుడప్పుడు నాకనిపించింది కద్దు. కానీ నా అహంకారాన్ని ఈ పాట కరిగించి వేసింది. అందరినీ సమానంగా చూసే, పరస్త్రీలను తల్లిగా భావించే, ఎప్పటికీ అసత్యమాడని, పరుల సొమ్ముకు ఆశపడని మనుషులే వైష్ణవులు అంటాడాయన. అలాంటివారి వల్లనే లోకానికి పుణ్యం ప్రాప్తిస్తుంది. కవి నరసి అలాంటివారి దర్శనం పొందాలని అభిలషిస్తున్నాడు అని కూడా రాశాడాయన. బాపు ఎన్నిరకాలుగా చెప్పినా అర్థం కానిది, నారాయణ భక్తితో ఆలాపించే వరసలో నా హృదయానికి హత్తుకుంది. నరసి పాటలే కాకుండా కబీర్, మీరా, తులసిలది కూడా పాడుకుంటూ ఉండేవారు నారాయణ ఖరె. ఆయన వల్లనే అన్ని పాటలు, సంత వాణి మాకు తెలిసివచ్చాయి అనొచ్చు.
మా మగన్ ఉన్నాడు కదా, మగన్ లాల్. అతడికి భజనలంటే చాలా ఇష్టం. పాటలు, భజనలు తయారు చేయడం, ఎప్పుడు ఏది పాడాలి అని కూడా పట్టీ చేయడం అన్నిటి వైపు లక్ష్యం పెట్టేది అతడే. ఆశ్రమం హృదయం ‘హృదయ కుంజ్’ అయితే దాని ఆత్మ మగన్ లాల్ అని అందరూ అనేవారు. ఒక రకంగా మొత్తం సబర్మతీ ఆశ్రమం మగన్, మహదేవలతోనే వృద్ధి చెందిందనవచ్చు. అలా చూస్తే సత్యాగ్రహంలో బాపుకు నచ్చిన తత్త్వమైన అహింస ఉండాలని సలహా ఇచ్చింది మగనే. అతడు బాపు మొదటి శిష్యుడు. మా బావగారైన కుశలదాస్ గాంధీగారి పుత్రుడు. మేము దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బాపు తమ అన్నయ్యకు ఉత్తరం రాసి “ఇద్దరు కొడుకులను ఇవ్వు” అన్నారు. అలా మగన్, ఛగన్ ఫీనిక్స్‌కు వచ్చారు. వచ్చిన కొత్తలో మగన్ ఒకింత సంపాదించుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. చివరికి తన బాబాయ్ ఆదర్శాల సాకార రూపమైన డర్బాన్ లోని ఫీనిక్స్ ఆశ్రమం తయారు కావడంలో అతడి శ్రమ చాలా ఉండింది. అక్కడ ఉన్నన్ని రోజులూ ఇండియన్ ఒపీనియన్ పత్రికను తనే నడిపాడు. భాష రాని దక్షిణ ఆఫ్రికాలో అతడు నా ఆత్మబంధువులా ఉండేవాడు. ఛగన్ వేరే దారి చూసుకున్నాడు. మగన్ మాత్రం బాపు మొదటి శిష్యుడిగా కొనసాగాడు. మా హరికంటె కొంచెం చిన్నవాడుగా ఉన్న మగన్ బాపుకు దగ్గరగా ఉంటూ అతడి బాగోగులనన్నిటినీ చూసుకున్నాడు.
మగన్ బాపును భాయి అనే పిలిచేవాడు. ఇంట్లోవాళ్ళంతా చాలా మట్టుకు అలానే పిలిచేవారు. బాపు మనసులో ఏమేమి అనుకునేవారో అవన్నిటినీ చేసేసేవాడు. బాపు ఏర్పరచిన నియమాలకు ఎక్కడా భంగం రాకుండా చూసుకునేవాడు. పత్రికా సమావేశాన్ని పిలవడం, పత్రికలకు వార్తలివ్వడం, గుజరాతిలో రాయడం, వ్యవసాయం, వంటింటి బాధ్యత అన్నిటినీ తనే చూసుకునేవాడు. భారతానికి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలు అతడే బాపు కార్యదర్శిగా ఉండేవాడు. ఆయన పనులనన్నింటినీ, ఉత్తరాలు, ప్రయాణాలు, ప్రణాళికలు తయారు చెయ్యడం అన్నిటినీ చూసుకున్నాడు. మహదేవ వచ్చిన తరువాత అతడి భారం కొంతవరకు తగ్గింది.
ఈ బాపు ఏమైనా అలాంటిలాంటి మనిషా? వంద మనుషులు బ్రతికే బ్రతుకును ఒకే సారి, తను ఒక్కరే, మొత్తం బ్రతికేవారు. ఏవేవో ఉన్నతమైనవాటిని గురించి చెప్పేవారు. అలాగే కావాలంటే సామాన్యమా? కాబట్టి ఆయన చుట్టూతా ఉన్నవారికి నిరంతరం పనులుండేవి. కొంతమంది వచ్చేవారు, ఉండేవారు, ఉండలేక వెళ్ళిపోయేవారు. ఉండిపోయినవాళ్ళు మాత్రం పక్కా సత్యాగ్రహులయ్యారు.
బాపు చెప్పిన పని చెయ్యడం వరకూ సరే. కానీ బాపు ఆదర్శలకనుగుణంగా తమను తాము మార్చుకోవడమన్నదుందే, అది మాత్రం చాలా కష్టం. ఆ విషయంలో మాత్రం మగన్ చాలా నిజాయితీపరుడు. అదేమైనా కానీ, బాపుకు మోసం చెయ్యరాదు, మోసం జరగకూడదు అని అతడి ధ్యేయం. అతడికి బాపు అంటే భగవంతుడికంటే ఒక మెట్టు తక్కువ అంతే. ఆశ్రమం అంటే ఋషుల ఆశ్రమం అనేలా చేశాడు. దక్షిణ ఆఫ్రికాలో ఆంగ్లుల మాదిరి పెరిగినవాడు, చివరికి సన్యాసి మాదిరిగా తయారయ్యాడు. రోజూ ఉదయం నాలుగు గంటలకు ప్రార్థన ఉండేది. చలి కానీ, వాన రానీ ప్రార్థనకు మాత్రం తప్పించుకునేవాడు కాడు. ఆశ్రమవాసులకు ఎనిమిది గంటల పని తప్పనిసరి. చిమ్మడం, తుడవడం, తోమడం, కడగడం అన్నీ చేసేవాడు. వడికే పని, మట్టి పని, వడ్రంగి పని చేసేవాడు. ఎనిమిది గంటల పని తరువాత చదివేది, రాసేది ఉండేది. మధాహ్నం రెండు తరువాత రాయడానికి కూర్చునేవాడు. తన శ్రమదానం తరువాత ఆడవాళ్ళకు సహాయపడేవాడు. అతడి మాదిరిగా పాత్రలను తోమేవాళ్ళను కానీ, బట్టలను ఉతికేవాళ్ళను కానీ మగవాళ్ళలో నేను చూడలేదు. బాపు అవన్నిటినీ చేసేవారు. కానీ ఆయన బట్టలను చాలా తేలికగా ఎక్కడ బట్ట బాధపడిపోతుందో అన్నట్టు నాజూకుగా ఉతికేవారు. కానీ, ఇతడిది అలా కాదు. పద్ధతిగా, శుభ్రంగా ఉతికేవాడు.
ఒక రోజు మధ్యాహ్నం, సబర్మతిలో మండే ఎండలు. చెమటలు కారే విపరీతమైన ఉక్క. కడుపులో తిప్పట. లోపలినుండి పొంగి వచ్చే వేడి సెగ. నది అప్పటికే పూర్తి ఎండిపోయింది. పక్షులు మాత్రం ఎండకు ఏమాత్రం వెరవకుండా కిలకిల అంటున్నాయి. నేను గోడకు ఆనుకుని కూర్చున్నాను. మనసులో ఏవేవో చిత్రాలు. అదొక ఎర్ర ముక్కు పక్షి. లాలి అని దాని పేరు. బలే అల్లరి చేసేది. నదీ తీరంలో గూళ్ళు కట్టుకునేది. ఆ పక్షి శబ్దం ఆలిస్తూ, ఏవేవో గుర్తుకు తెచ్చుకుంటూ రాట్నం ముందు కూర్చున్నాను నేను. పరికించి చూస్తే మగన్ చెట్టు మొదట్లో ఏమో చేస్తున్నాడు. “ఇదేమిటి? ఈ మండే ఎండలో చెట్టు మొదట్లో పని చేస్తున్నావు?” అన్నాను. “కునికిపాట్లు ప్రారంభమయ్యాయి. ఇలా బయటికొచ్చి ఆకాశం క్రింద ఉంటే తగ్గుతాయి అని వచ్చాను” అన్నాడు. అతడంతే, ఏదైనా పనికి పూనుకున్నాడంటే వెనక్కి తగ్గడమంటూ ఉండేది కాదు. మిగతావాళ్లు కూడా బాపుకు అంతే నిష్ఠులుగా పని చెయ్యాలని ఆశించేవాడు.
(సశేషం)