అందిన ఆనందం

21
3

[dropcap]ర[/dropcap]ఘుకి బ్యాంక్‍లో ఉద్యోగం. ముగ్గురు పిల్లలు, భార్య, తల్లితో హైదరాబాద్‍లో ఉంటున్నాడు. తండ్రి, తను చదువుకునే రోజుల్లోనే చనిపోయారు. తల్లి జానకమ్మ, స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ తనని చదివించింది. ఒక్కడే కొడుకు అవడం వలన గారాబంగా పెంచినా మంచి చదువు చదివించింది. ప్రయోజకుడు అయ్యాడు. రఘు భార్య సరోజ, ఉత్తమ ఇల్లాలు. MBA పాస్ అయినా ఉద్యోగం చెయ్యకుండా, ఇల్లు చూసుకుంటుంది.

ముగ్గురు పిల్లలలోనూ, మొదటి ఇద్దరూ మగ పిల్లలు అవడం, ఆడపిల్ల లేకపోవడం, చాలా వెలితిగా అనిపించింది సరోజ రఘులకు. ఆడపిల్ల అంటే ‘మహాలక్ష్మి’ అంటారు, ఒక్క అడపిల్లనాయినా ఉండాలి అని మూడో సంతానం అయ్యేవరకు ‘పిల్లలు పుట్టకుండా ఆపరేషన్’ అన్న ఆలోచన అసలు చెయ్యలేదు. ఆ భగవంతుడి దయవల్ల మూడోది ఆడపిల్లే పుట్టింది. ‘మహాలక్ష్మి’ అన్న పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టు మహాలక్ష్మీనే.

అమ్మాయి పుట్టిన తర్వాత బాగా కలిసివచ్చింది రఘు ఫ్యామిలీకి. పిల్లలు బాగా చదువుకుని పైకి వచ్చారు. మగ పిల్లలు ఇద్దరూ, సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయి కూడా B.Tech చదువుతోంది. పెద్దవాడు రమేష్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. పోయిన సంవత్సరమే వాడికి పెళ్లి చేశారు. కోడలు కల్పన కూడా బెంగళూర్ లోనే ఉద్యోగం. వాళ్ళు అక్కడే ఉంటారు. చిన్నవాడు సత్యనారాయణ. ‘సత్యం’ అని పిలుస్తారు. వీడు అమెరికాలో ఉద్యోగం. ఇక పోతే అమ్మ, సరోజ, మహాలక్ష్మితో రఘు హైదరాబాద్‍లో ఉంటున్నాడు.

“అమ్మా! మంచి కాఫీ ఇవ్వు” అంటూ వచ్చింది లక్ష్మి. మహాలక్ష్మిని, లక్ష్మి అని పిలుచుకుంటారు.

“ఇపుడు కాఫీ ఏమిటి, రాత్రి 8 అవుతోంది, కాళ్ళు చేతులు కడుక్కుని రా, ఏకంగా భోజనం చేద్దువు గానీ” అన్నది సరోజ, కూతురు లక్ష్మితో, టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ.

“హబ్బా! ఏంటమ్మా!” అంటూ దీర్ఘం తీసింది లక్ష్మి.

“కాదు లేవే, భోజనం టైంలో భోజనం చెయ్యాలి, ఇపుడు కాఫీ ఏంటి” అంది సరోజ కూతురుని బుజ్జగిస్తూ.

ఇంట్లో అందరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటుంది. కొంచ్ స్ట్రిక్ట్‌గా కూడా ఉంటుంది. టైం కి తినాలి, టైం కి పడుకోవాలి అంటుంది సరోజ.

రఘు, లక్ష్మి, జానకి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు.

సరోజ వడ్డిస్తూ..

“ఏమండీ, మొన్న ఒక పెళ్లి సంబంధం వచ్చిందండి మన లక్ష్మికి” అన్నది భర్త రఘుతో.

“ఓహ్ గుడ్” అన్నాడు రఘు.

“ఏంటి నాన్న గుడ్డు!, నాకిపుడే పెళ్లి వద్దు” అన్నది లక్ష్మి.

“నువ్వాగవే. మాకు తెలుసు ఎప్పుడూ చెయ్యాలో” అన్నది సరోజ, వడ్డిస్తూ.

“అమ్మా, నేను కనీసం ఒక సంవత్సరం అయినా జాబ్ చెయ్యాలి” అన్నది లక్ష్మి.

“అలాగే చెద్దువు గానీ, ఇప్పుడు మొదలు పెడితే అప్పటికి సంబంధం కుదురుతుంది, అందుకే చెపుతున్నాను” అన్నది సరోజ, ఖాళీ గిన్నెలు తీసేస్తూ.

“అలాగే, నెమ్మదిగా చూద్దాం లేమ్మా!” అన్నాడు రఘు లక్ష్మిని ఉద్దేశించి.

***

రోజులు గడుస్తున్నాయి. రఘు రిటైర్మెంట్ ఇక ఆరు నెలల్లోకి వచ్చింది. లక్ష్మికి క్యాంపస్ సెలక్షన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

ఒకరోజు రఘు తల్లి, జానకమ్మ గారు, బాత్రూంలో జారిపడ్డారు. ఎక్కడా ఫ్రాక్చర్ అవలేదు కానీ, నడుముకు గట్టి దెబ్బ తగిలిందని, డాక్టర్ ఆమెను ‘ఫుల్ బెడ్ రెస్ట్‌గా ఉంచాలి’ అని చెప్పారు.

సరోజకు, ఇంట్లో పని డబుల్ అయ్యింది. రఘుకి రిటైర్మెంట్ దగ్గరకు రావడంతో, ఆఫీసులో ఊపిరి సలపడం లేదు. తన వద్ద ఉన్న పెండింగ్ పనులు అన్నీ పూర్తిచేయాలి.

లక్ష్మికి మంచి సంబంధం కుదిరింది. ఈ టైంలో అమ్మ మంచాన పడటం రఘుని, మానసికంగా బాగా దిగజార్చింది. సరోజకు కూడా ప్రతిరోజు, ఇంటిపనితో పాటు అత్తగారి పని చూసుకోవడం చాలా కష్టంగా ఉంది.

ఒకరోజు.. అందరూ జానకమ్మ గారి రూంలో ఉన్నారు.

“అమ్మకి ఒక లేడీ నర్స్‌ను ఏర్పాటు చేస్తే బెటర్ అనుకుంటా” అన్నాడు రఘు సరోజను, అమ్మ జనకమ్మను ఉద్దేశించి.

“ఖర్చు ఎక్కువ అవుతుందేమో!” అన్నది సరోజ.

“అలా కాదురా, వైద్య సదుపాయం ఉన్న వృద్ధాశ్రమం ఏదైనా వుందేమో చూడు, అందులో ఉంటాలేరా” అన్నది జానకమ్మ కొడుకుతో.

“లేదమ్మా నిన్ను అలా, వృద్ధాశ్రమంలో ఎలా ఉంచుతామమ్మా! మరీ దిక్కు లేని వాళ్ళ లాగా!” అన్నాడు రఘు అమ్మతో.

“లేదురా! మహాలక్ష్మికి పెళ్లి కుదిరింది కదా! దాని పెళ్లి పనులు, ఇంటిపనులు, అన్నీ చూసుకోవడం అందరికీ కష్టమే! సరోజకు మరీ ఇబ్బంది, నన్ను వృద్ధాశ్రమంలో దింపు, పెళ్లి టైంకి వస్తానులే, అప్పటికి ఈ నడుం నొప్పి తగ్గక పోతుందా” అన్నది జానకమ్మ కొడుకుతో.

“నిన్ను అలా ఉంచడం నాకు ఇష్టం లేదు” అన్నాడు రఘు.

“కానీ తప్పని పరిస్థితి కాబట్టి మనమూ సర్దుకోవాలిరా!” అన్నది జానకమ్మ రఘుతో.

“సరేలే వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాలే!” అన్నాడు రఘు ఇష్టం లేకపోయినా.

రఘుకి అమ్మ అంటే మహా ప్రేమ. తనను ఇంతవాడిని చెయ్యడానికి అమ్మ ఎంత కష్టపడిందీ తను కళ్ళారా చూసాడు.

తర్వాత రఘు చాలా వృద్ధాశ్రమాలు చూసాడు. చాలా చోట్ల, పెద్దవాళ్ళు ఇరుకు గదుల్లో ఉంటున్నారు. కొన్ని చోట్ల, మెడికల్ ఫెసిలిటీ సరిగా లేదు. కొన్ని వృద్ధ ఆశ్రమాలు చూసాక, వాటిలో ‘బెస్ట్’ అనిపించిన ఆశ్రమంలో చేర్చడానికి నిశ్చయించాడు రఘు.

***

ఆశ్రమం విశాల వాతావరణం,. చల్లని స్వచ్ఛమైన గాలి, శుభ్రంగా ఉన్న వంటిల్లు చూడటానికి బాగున్నాయి. ఆశ్రమాన్ని నడిపే నలుగురు యజమానులలో ఒకరు డాక్టర్లు అవడం, ఒక ప్రత్యేక ఆకర్షణ.

జానకమ్మ గారికి, విడిగా రూం కావాలని అడిగితే, ‘మరొకరితో షేరింగ్ ఇస్తాము, ఒంటరిగా ఎవరికీ ఇవ్వము’ అన్నారు ఆశ్రమం నడిపే మేనేజర్ గారు.

‘అది కూడా మంచిదేలే, పిలిస్తే పలకడానికి మరొకరు మన గది లోనే ఉంటారు’ అనిపించింది రఘుకి.

అమ్మని చేర్చబోయే ముందు ఒకసారి చూద్దాం అని వచ్చి అక్కడ ఉన్న మేనేజర్‌తో మాట కలిపాడు. “ఇక్కడ సుమారు ఎంతమంది ఉంటారు?” అడిగాడు మేనేజర్ గారిని.

“సుమారు 60 మంది దాకా ఉంటారు” బదులిచ్చాడు మేనేజర్ .

“నెలలో ఎన్నిసార్లు మేము వచ్చి మా వాళ్ళను చూడొచ్చు?” అడిగాడు రఘు.

“మీ ఇష్టం సార్, ఎన్నిసార్లయినా రావచ్చు, మీరు వచ్చి మీ వాళ్ళని చూసుకుంటే మాకు చాలా సంతోషం. చాలా మంది, అసలు ఇక్కడ చేర్చిన కొత్తల్లో, ఒకటి రెండో నెలలు వస్తారు, తర్వాత ఏవో ఒక కారణాలు చెప్పి, రావడం మానేస్తారు. డబ్బు మటుకు పంపిస్తారు. ఈ పెద్దవాళ్ళ పరిస్థితి చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ వయసులో వీళ్లకి ప్రేమ కావాలి, డబ్బు కాదు. కానీ వాళ్ళ పిల్లల నుండి, కావాల్సిన ప్రేమ దొరకదు. ఒక్కసారి నాతో రండి” అని పిలుచుకు వెళ్ళాడు.

ఇద్దరూ కలిసి పక్క గదిలో ఉన్న ఒక ఆమె దగ్గరకు వెళ్లారు.

“సర్, ఈమె పేరు రమ. రమ గారు వచ్చి ఆరు నెలలు అవుతోంది” అన్నాడు రమ గారిని చూపిస్తూ.

“నమస్తే” అన్నాడు రఘు ఆమెను ఉద్దేశించి.

ఆమె కూడా, “నమస్తే” అన్నది.

“ఎన్నాళ్ళయింది మీరు వచ్చి?” అడిగాడు రఘు ఆమెని.

“ఆరునెలలు” చెప్పింది రమ ముక్తసరిగా.

“మీ వయసు ఎంత అండి?” అడిగాడు మేనేజర్, రమ గారిని.

“65” అని చెప్పారు రమ గారు.

“మీరు ఇక్కడికి ఎందుకు రావలసి వచ్చింది చెబుతారా?” అడిగాడు మేనేజర్ రమ గారిని.

రమ గారు చెప్పసాగారు “నాకు ఒక్కడే కొడుకు, కోడలికి నేనంటే పడదు, మావారు చనిపోయాక, మా అబ్బాయికి పెళ్లి చేసాము, రెండు సంవత్సరాలు కోడలు మాతో బాగానే ఉంది. తర్వాత నాకు కోడలికి పడలేదు, కోడలు నన్ను బయటకు పంపేసింది. కొడుకు నన్ను ఇక్కడ చేర్చాడు. అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుంటాడు.” అన్నది.

మరొకరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నా, మగ పిల్లలు విదేశాలలో ఉద్యోగం, ఆడపిల్ల ఇంట్లో వీళ్ళు ఉండలేరు. మరికొందరు భార్య చనిపోయిన వాళ్ళు, కొందరు భర్త చనిపోయి ఒంటరి అయిన వాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు.

ఎవరిని అడిగినా, అందరూ మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్లే. వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. మరికొందరు వాళ్ళ వయసే ఎక్కువ అయి, తల్లిదండ్రులకు పాటు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు.

కానీ, ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, అనిపించింది రఘుకి. సమ వయసు కలవారు ఉన్నారు. అంతా కలిపి ఒక కుటుంబం లాగ ఉంటున్నారు. మెడికల్ చెకప్‌కి డాక్టర్ వస్తారు. ఎమర్జెన్సీకి అంబులెన్స్ కూడా ఉంది. ఒక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అమ్మకు సౌకర్యవంతం గానే ఉంటుంది అనిపించింది రఘుకి.

ఇంత ఉన్నా, అంతా వసతిగా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళలో, వాళ్ళ కళ్ళలో, మాటల్లో ఎక్కడా సంతోషం కనబడటం లేదు. వాళ్ల కళ్లలో ఏదో దిగులు కనిపిస్తోంది. మగవాళ్ళు దాదాపు అందరూ గడ్డం పెరిగిపోయి, దిగులు మొహంతో చావలేక బ్రతుకుతున్నారు అనిపించేట్టు ఉన్నారు. ఆడవాళ్ళలో కూడా కళాకాంతులు కనపడటం లేదు.

వీళ్ళందరినీ చూస్తే ‘అయ్యో’ అనిపిస్తోంది. వీళ్ళలో ఏదో బాధ ఉంది, కనుక్కోవాలి అనుకున్నాడు రఘు. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు రఘు.

అన్నీ పండగలకి ఇక్కడ పండగ వాతావరణం ఉంటుందట. ఉగాది, శ్రీరామనవమి, దీపావళీ, క్రిస్టమస్, న్యూ ఇయర్ ఇలాటి పండగలు అన్నీ జరుపుతారు, అలాగే అక్కడ చేరిన వాళ్ళ బర్త్ డే ఫంక్షన్లు కూడా జరుపుతారు. వీళ్ళు జాయిన్ అయిన రోజు ఒకరి బర్త్ డే జరిగింది.

“సార్! ఇపుడు ఉన్న వాళ్ల కథలు బాగానే ఉన్నాయి కానీ, ఇంత క్రితం, వీళ్ళ కన్న ముందు ఉన్న వాళ్ళ జీవితాలు కొంచం కష్టం గానే గడిచాయి. ఇప్పుడున్న వాళ్ళు, కనబడినంత సంతోషంగా, అందరూ ఉండరు” అన్నాడు మేనేజర్.

“అదేమిటి! అందరూ బాగానే ఉన్నారుగా!” అన్నాడు రఘు.

“లేదు సార్, ఆ పెద్ద ఆవిడను చూడండి,. ఆమెకు చెప్పకుండా, ఆమెను ఇక్కడ ఆశ్రమంలో వదిలి, ‘ఇప్పుడే వస్తాను’ అని చెప్పి, ఆమె కొడుకు వెళ్ళాడు, సంవత్సరం దాటింది. ఇంతవరకు రాలేదు. ‘నా కొడుకు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు’ అని ప్రతి రోజూ ఆమె ఆ అరుగుల మీద కూచుని ఎదురు చూస్తుంది. చీకటి పడ్డా కూడా లోపలికి రాదు. ‘రేపు వస్తాడేమో, లోపలికి రండి’ అంటే , అపుడు ‘మా అబ్బాయి రేపు వస్తాడు’ అన్న ఆశతో. లోపలికి వస్తుంది, మరుసటి రోజు మళ్లా అరుగు మీద మామూలే. వాళ్ళ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఇది సార్ ఆమె పరిస్థితి” అన్నాడు మేనేజర్.

కళ్లలో నీళ్లు తిరిగాయి రఘుకి.

‘ఇలాటి కొడుకులు కూడా ఉంటారా’ అనిపించింది. కానీ తను మటుకు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు.

రఘు వాళ్ల అమ్మ జానకమ్మ గారిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. మొదట వారం రోజులు రోజూ వెళ్లి వస్తూ ఉన్నాడు, తర్వాత ఇక లక్ష్మి పెళ్లి పనులు మీదపడటం తోటి బాగా బిజీ అయిపోయాడు. అయినా వారానికి ఒకసారి వచ్చి అమ్మను చూస్తూ ఉన్నాడు. పెళ్లి సమయానికి మటుకు రెండు రోజుల ముందే వచ్చి అమ్మను పిలుచుకు వెళ్ళాడు.

జానకమ్మకు ఇంటికి వచ్చిందే కానీ, వృద్ధాశ్రమం లోనే ప్రశాంతంగా వుందనిపించింది .

పెళ్లి అయిన తర్వాత, జానకి, వృద్ధాశ్రమంకి వెళ్తాను అని ఒకటే గొడవ చెయ్యసాగింది. ఆమెకి అక్కడ కొందరు స్నేహితులయ్యారు. ఒంటరితనం లేదు. రఘు కేమో అమ్మ మీద దిగులు ఎక్కువ. కాకపోతే ఆమెకి ఇంటికన్న అక్కడే బాగుందని గ్రహించి,. మళ్లా అమ్మని వృద్ధాశ్రమంలోనే చేర్పించాడు.

వృద్ధాశ్రమంలో అమ్మని చేర్పించాడు కానీ, అందరూ తమ తల్లిదండ్రులను వదిలేసినట్లు, వదిలెయ్యడం రఘుకు ఇష్టం లేదు. దాదాపు రోజు ఒకసారి వెళ్లి అమ్మని చూసి వస్తాడు.

రిటైర్ అయిన తర్వాత, ఎక్కువ సమయం ఆమ్మను చూసుకుంటూ ఆశ్రమం లోనే ఉంటున్నాడు. అమ్మకు సేవ చేస్తూ, మిగిలిన వాళ్లు అందరికీ కూడా సహాయం చేస్తున్నాడు.

రఘు ఆశ్రమంలో అమ్మను చేర్చి, తను కూడా ఆశ్రమంకి రావడం మొదలు పెట్టిన తర్వాత, మేనేజ్‌మెంట్‌తో మాటాడి చాలా మార్పులు తెచ్చాడు. చదువుకోవడానికి మంచి బుక్స్ తెప్పించాడు. ఒక చిన్న లైబ్రరీనే తయారయింది. పెద్దవాళ్ళ ఆనందం కోసం క్యారమ్ బోర్డ్ తెచ్చాడు. ఆడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషం వేసేది. కొందరు ఓపిక ఉన్నవాళ్లు, షటిల్ కూడా ఆడుతున్నారు.

ఆశ్రమంలో ఉన్నవాళ్ళలో కొందరు పది సంవత్సరాల పైగా ఉన్నారు. వీళ్ళలో ఏదో నిరాశ కనబడుతోంది. ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాదు అన్నట్టు ఉన్నారు. ఎవర్ని కదిలించినా ఒక దీనమైన కథ ఉంటోంది. అందరి కథల సారాంశం దాదాపు ఒకటే. తమ పిల్లలు తమను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలేసి వెళ్లారు. వీళ్ళందరూ తమ పిల్లల ప్రేమ, మమకారాలకు దూరమయ్యారు. వీళ్ళ పిల్లలు వీళ్ళను చూడటానికి వచ్చి చాలా రోజులయ్యింది. కొందరి విషయంలో చాలా ఏళ్ళు అయ్యింది. అందరూ దాదాపు పిల్లల మీద ఆశ వదులుకున్నారు. వాళ్లకు మిగిలినదల్లా దిగులు పడటమే.

వీళ్ళ విషయంలో కూడా ఏదో ఒకటి చేయాలని, రఘు ఆ ఆశ్రమం మేనేజర్ దగ్గర, ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళ పిల్లల ఫోన్ నంబర్స్ అడిగి తీసుకున్నాడు.

“ఎందుకు సార్, మీకు అనవసరమైన శ్రమ” అంటూ ఫోన్ నంబర్లు ఇచ్చాడు మేనేజర్.

“సార్, ఇంత క్రితం మీరు వీళ్లకు ఎపుడైనా ఫోన్ చేశారా?” అడిగాడు రఘు, మేనేజర్‌ను.

“చేసాను సార్, దాదాపు ప్రతి నెల వాళ్ళు డబ్బు క్రెడిట్ చేసినప్పుడు , ఫోన్ చేసి మాట్లాడుతునే ఉంటాను, కొందరు ఫోన్ తీసి, ఏదో అయిందనిపిస్తారు, కొందరు అసలు ఫోన్ తీయరు సార్” అన్నాడు.

“ప్రతి నెలా చేసే ఫోన్ గదా, అని మన ఫోన్‌కి విలువ ఇవ్వరు సార్” అన్నాడు రఘు.

“సరే మీకు నంబర్స్ ఇచ్చాను కదా, మీరు ట్రై చెయ్యండి “అన్నాడు మేనేజర్.

మేనేజర్ దగ్గర తీసుకున్న నంబర్స్‌కి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాడు రఘు. మొదటిసారి చాలా మంది ఫోన్ తీయలేదు. కొందరు, చెప్పేది పూర్తి వినను కూడా వినలేదు.

రఘు పట్టు వదలకుండా 15 రోజుల పాటు ఫోన్లు చేసి, అతి కష్టం మీద ఆశ్రమంలో ఉన్న వాళ్ళ పిల్లలందరినీ ఒక చోట చేర్చ గలిగాడు. అందరికీ తల్లిదండ్రుల విలువ తెలియ చేశాడు. వాళ్ళు పిల్లల కోసం చేసిన త్యాగాలు గుర్తు చేసాడు.

కొందరు తల్లిదండ్రుల మీద కసి పెంచుకున్నారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు వాళ్ళను పెట్టిన కష్టాలకు ప్రతీకారం అన్నట్టు మాటాడుతున్నారు. మరికొందరు ఆస్తి పంపకాలలో తమకు న్యాయం జరగలేదని, వీళ్ళని పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు. డబ్బు, ఆస్తిపాస్తులు, మాటపట్టింపులకి విలువ ఇస్తున్నారు కానీ, విలువలకు ఎక్కడా ప్రాధాన్యత లేదు. ప్రేమానురాగాలు పూర్తిగా తగ్గిపోయాయి.

రఘు అందరితో..

“డియర్ ఫ్రెండ్స్,. మీరందరూ ఒక్కసారి ఆశ్రమానికి రండి,. ఒక్కసారి మీ వాళ్లను చూడండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కూడా ఎన్నాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ జీవితాలకు వాళ్ళు అడ్డురారు. వాళ్ళకి కావల్సింది, ప్రేమతో మీరు మాట్లాడే ఒక చిన్న పలకరింపు, ‘బాగున్నావా మామ్మ’ అన్న మనవడు, మనవరాలి పలకరింపు. మీ పలకరింపులు వాళ్ళ ఆయుష్షుని పెంచుతాయి. ఇక్కడ వాళ్లకు ఏదీ తక్కువ అనుకోకండి. స్నేహితుల పలకరింపులు కూడా ఉంటాయి. కానీ ఎంతైనా సొంత బిడ్డల పలకరింపులో ఉన్న బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి” అని చాలా అభిమానంతో, తల్లితండ్రుల విలువ తెలియచేస్తూ మాట్లాడాడు.

రెండు వారాల తర్వాత ఒక ఆదివారం నాడు అందరినీ రమ్మని,. వాళ్ళ తల్లిదండ్రులని పలకరించమని బ్రతిమిలాడుకున్నాడు. అందరూ వస్తామని చెప్పారు.

అందరూ కలవాల్సిన ఆదివారానికి ముందు, శుక్రవారం నాడు మళ్లా అందరికీ ఫోన్లు చేసి, ఆదివారం నాడు రమ్మని గుర్తు చేసాడు.

మేనేజర్ గారితో మాట్లాడి, అందరి గదులు శుభ్రం చేయించి, ఆశ్రమంలో ఒక పండగ వాతావరణం వచ్చేలా ఏర్పాటు చేశాడు.

ప్రతిఒక్కరికీ, వాళ్ళ పిల్లలను కలవబోతున్నామని సంతోషం. అందరి ముఖాలలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతీ ఒక్కరూ నీట్‌గా తయారవుతున్నారు. కొందరు ఏదో పెళ్ళికి వెళ్ళే వాళ్ళ లాగా ముస్తాబు అవుతున్నారు.

రఘు పిలిచిన వారంతా ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు. పిల్లలతో, మనవలు, మనవరాళ్లతో మాట్లాడుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళలో సంతోషం చూసి రఘు, రఘుతో పాటు జానకమ్మ గారు కూడా చాలా సంతోష పడ్డారు.

ఈలోగానే కొంత విషాదం కమ్ముకుంది. ఇద్దరి పెద్దవాళ్ళ జంటల పిల్లలు రాలేదు. రఘు వాళ్ళకి ఫోన్‌లు చేస్తున్నాడు, కానీ కాల్ అందటం లేదు. ఆ పెద్ద వాళ్ళ కళ్ళలో నిరాశ, దుఃఖపు ఛాయలు కనపడుతున్నాయి.

ఇంతలో ఆశ్రమం ఎదురుగా ఆటోలు ఆగిన అలికిడి అయి, రఘు అటుగా పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ బాధపడుతున్న దంపతుల పిల్లలే వచ్చారు. రఘు ఆనందానికి అవధులు లేవు. వెంటనే వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ పెద్దవాళ్ళ ఆనందానికి అవధులు లేవు.

వీళ్ళ అందరి సంతోషాన్ని చూసి రఘు ఎంతో తృప్తిగా తన తల్లి జానకమ్మ గారితో కబుర్లు చెబుతూ కూచున్నాడు.

మేనేజర్ గారు కూడా, వచ్చిన పిల్లలందరినీ కనీసం నెలకు ఒక సారి అయినా వచ్చి వాళ్ల తల్లిదండ్రులను చూడమని బ్రతిమిలాడాడు.

ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ, రఘు చేసిన కృషిని మెచ్చుకుని, తమ బిడ్డలను కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రఘు తన తల్లిని చూసుకుంటూ, ఆశ్రమంలో ఉన్న పెద్ద వాళ్ళను కూడా జాగ్రతగా చూసుకుంటూ, తన సంసార బాధ్యతలతో పాటు, ఆశ్రమం బాధ్యతలు కూడా కొంత తీసుకుని, తన విశ్రాంత జీవితాన్ని (రిటైర్మెంట్ లైఫ్) గడపడం మొదలుపెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here