తొలగిన ఆపద

1
9

[కన్నడంలో బి.ఆర్.నాగరత్న రచించిన ‘ముక శంకె’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

[dropcap]“ఒ[/dropcap]రే! మాధవా! చూడరా. నందిని ఎందుకురా ఇంకా నిద్రపోతూనే వుంది. ఎంత ముద్దు చేసినా లేవటం లేదు. స్కూల్‌కి టైం అవుతోంది కదరా. ఇప్పటికప్పుడే లేచి స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యేది. ఈ రోజు ఎందుకో మారం చేస్తూ వుంది. నీవోసారి వచ్చి చూడరా.. రారా” అని కొడుకుని పిలిచింది లలితమ్మ.

హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న మాధవ్ “అమ్మా! దానికి ఒళ్లు వేడెక్కిందో ఏమో! చూచావా?” అన్నాడు.

“అదీ చూశారా! అలాంటి దేమీ లేదు.”

“రుక్కు ఏం చేస్తూవుంది?” అడిగాడు మాధవ్.

“అదేం చేస్తుందిరా. వంటింట్లో దూరుకుని వుంది. ఈ నీ కూతురికి వాళ్లమ్మంటే అంతకు అంతే. మొదట్లో జడ వేయించుకునేది. అమ్మ చేత. ఇప్పుడన్నీ నేర్చింది కదా? అమ్మా కూతుళ్లు మాట్లాడుకుంది ఎప్పుడు! ఇంట్లో వున్నప్పుడు దానికి నేను లేదా నీవు. ఓ నిమిషం ఊరికే వుందేది కాదు కదా నా మనుమరాలు. నిన్నట్నుంచీ చూస్తూనే వున్నా. బిమ్ముగ బిగదీసుకుని వుంది. దానికేమయ్యిందో కాస్త చూడు. దిష్టి తగిలిందో ఏమో” అని కూమారుణ్ణి అవసరించింది.

నిన్నటి రోజు తాను నందినిని స్కూల్‌కి దిగ బెట్టి రాలేకపోయాడు. నీవే వెళ్లమని పంపించాడు. అందుకని కోపగించుకొందేమో, అని మాధవ్ లేచి కూతురు పడుకుని ఉన్న గదిలోకెళ్లి, “నాన్నా, బంగారం – నందూ – లేవమ్మా. స్కూల్‌కి టైం అయ్యింది కదా. ఇంకోసారి నిన్ను ఒంటరిగానే స్కూల్‌కి వెళ్లమని అననులే. సారీ రా. లాస్ట్ వీక్ నీవే అన్నావు కదా ‘కోక్కో’ ఆటకి నీవే కేప్టన్ అని, నెక్స్‌ట్ మంతే కదా టోర్నమెంట్స్, దానికి చక్కగా ప్రాక్టీస్ చేయాలి అని. అది ఈ రోజు నుండే కదా. లెగు మరి’ అని కూతుర్ని తట్టి లేపటానికి ప్రయత్నించాడు.

“డాడీ, నేను స్కూల్‍కి వెళ్లను. బలవంతం చేయమాకు” అని చెప్పేసి ముసుగు తన్ని పడుకుంది నందిని.

“ఏంటీ! స్కూల్‌కి వెళ్లవా! నందూ, నీవేనా ఈ మా అంటున్నది! నీవెప్పడైనా స్కూల్‌కి పోకుండా వుండటం జరిగిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు స్వల్పంగా జబ్బు చేసినప్పుడు, మేము వద్దన్నా స్కూల్‌కి వెళ్లేదానివి. అల్లాంటిది పోనని మారం చేస్తున్నవ్ ఎందుకమ్మా. నిన్న స్కూల్‌కి దిగబెట్టలేదని కోపమా? ఇంకొకసారి ఇలా జరగదులే. లేవమ్మా” అని మరీమరీ బుజ్జగించాడు.

ఊహు! ససేమిరా అంది. మరీ గద్దించి అడిగితే, “నేను వెళ్లనుగాక వెళ్లను” అని గట్టిగా అనేసింది.

ఈ తతంగానంతట్నీ గమనిస్తున్న రుక్మిణికి సహించలేదు. వచ్చి “నందూ ఎందుకా మొండితనం. వద్దు. లెగు. ఎందుకు వెళ్లవు. స్కూల్‌లో నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా?” అని అడిగింది.

“ఒసే రుక్కూ! మాధవ్ విచారిస్తున్నాడు గదా. మధ్యలో నీదేంటి, పో లోనికెళ్లు. ఇది ఇలా ప్రవర్తించటానికి నీ పితలాటకం ఏమైనా వుందా? ఎందుకంటే ఏడో క్లాస్‌కే చదువుకి తిలోదాకాలిచ్చిన దానివి. కూతురు చదువుకుంటూందని నీకు కడుపు మంట. లోనికెళ్లు” కసురుకుంది అత్త లలితమ్మ.

అవ్వ మాటలు విన్న నందు “అమ్మ నాతో ఏమీ అనలేదు. ఆమె నేమీ అనవద్దు. నాకిష్టం లేదు, నేనెళ్లను అంతే. అమ్మను కసురుకోక” అంది నందిని.

ఇంకా ఎక్కువగా ఒత్తిడి చేయటం మంచిది కాదనిపించింది మాధవ్‌కి. “సరే స్కూల్‌కి వెళ్లకపోతేనేమి, లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, టిఫిన్ తిని నాతో పాటు షాప్‌కి రా. ఈ రోజంతా అక్కడే కూర్చుని వ్యాపారం చూసుకుందవుగాని, ఓకేనా?” అని వెళ్లిపోయాడు.

ఇంటికానుకునే ఉంది షాప్. వ్యాపారం చేస్తున్న మాటే కాని మనస్సంతా కూతురి ఈనాటి ప్రవర్తన పైనే కేంద్రీకరించి వుంది. తాను తన కూతుర్ని ఎంత గారాబంగా, ఏమి అడిగినా లేదనకుండా సమకూరుస్తున్నాడు. చదువుల్లో, ఆటల్లో పాటల్లో అన్నింటిలోనూ ముందే. అల్లాంటిది ఈ విధంగా స్కూలుకు వెళ్లటానికి ఎందుకు మొండికేస్తున్నది? ఓసారి స్కూలుకెళ్లి కారణమేమై యుంటుందని తెల్సుకు రావటం మంచిదని అనుకుంటుండగానే నందిని వచ్చింది.

“ఓ వచ్చావా, ఈ వేళ నా తల్లి కెందుకో స్కూల్ అక్కర లేకుండ వుంది. పోనీలే. ఈ రోజు ఇక్కడే కూర్చుని చూచుకుంటూ వుండు. నాక్కాస్తా పని వుంది. అది చూచుకుని త్వరగా వచ్చేస్తా” అని లేచి, నందిని స్కూల్ వైపు నడిచాడు మాధవ్.

అప్పుడే ప్రార్థన ముగించి పిల్లలందరూ తమ తమ తరగతుల వైపు వెడుతున్నారు. అంతలోనే నందిని క్లాస్ టీచర్ శారదా మేడం పలుకరించింది మాధవ్‌ని. “నమస్తే మాధవ్ గారూ.. ఏంటి? నందిని ఈ రోజు కూడా స్కూల్‌కి చెక్కర్ ఇచ్చింది. ఒంట్లో బాలేదా. లీవ్ లెటర్ కూడా పంపలేదు. ఎప్పుడూ స్కూల్‌కి ఇలా చక్కర్ ఇచ్చేది కాదే” అంది.

“అంటే నిన్న కూడా ఆబ్సెంటా?” ఆశ్చర్యపోయాడు మాధవ్. “మేడం, అన్యథా భావించకండి, నా కూతురు ఎవరితోనైనా గొడవ పడిందా?” అడిగాడు మాధవ్.

మాధవ్ ఇంకా ఏదో చెప్పబోతూండగా మధ్యలోనే ఆపి, “ఏం మాట్లాడుతున్నారు మీరు మాధవ్! మీ నందిని గొడవ పడటమా? ఎవరైనా గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పి వాళ్లని ఒకటి చేసే నందిని, ఒకరితో గొడవ పడటమా! నో, ఛాన్స్” అంది శారదా మేడం.

అల్లకల్లోలమయ్యింది మాధవ్ మనస్సు. ఎక్కడో లెక్క తప్పింది. ఏం చెప్పాలో తెలీక, తన ఇంట్లో నడచిన విషయాలని సంక్షిప్తంగా శారదా మేడంకు వివరించాడు మాధవ్. అతడి దీన వదనాన్ని గమనించిన శారదా మేడం, “చింతించకండి మాధవ్, స్కూల్ అవర్స్ ముగియంగానే నేనే మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలనీ కనుక్కుంటాను “ అని టైం అయినందున క్లాస్‌కు విసవిసా నడచి వెళ్లిపోయింది.

ఇంటి వైపు నడిచాడు మాధవ్. తన ఇంటికి ఎంతో దూరం లేదు స్కూలు. నందిని విషయం తలుచుకుంటుంటే బుర్ర వేడేక్కిపోతూవుంది. ఏ భూతం ఆవరించిందో ఏమో? నిన్న కూడా నందిని స్కూల్‌కి వెళ్లలేదంటే ఇంకెక్కడికి వెళ్లి వుంటుంది. ఎవరైనా కిడ్నాప్ చేయగా తప్పించుకు వచ్చి వుంటుందా? ఆ విషయాన్ని చెప్పక దాచి వుంచిందా? ఆలోచనలతో తల మునకలైన మాధవ్, తాను తన అంగడి ముందున్నాడని అప్పుడే తెల్సుకుని, తేరుకున్నాడు. అక్కడ అంగట్లో నందిని లేదు. తన భార్య వుంది. నందినికి నిద్రవస్తుంటే ఇంటకెళ్లగా తాను ఉన్నానన్నది రుక్మిణి. భార్యతో విషయాల్ని చర్చించదలచుకోలేదు మాధవ్.

మాట ఇచ్చినట్టుగా శారదా మేడం ఇంటికొచ్చింది. సాదరంగా ఆహ్వనించారు ఇంటివారు నందిని తప్ప. నందినిని పిల్చుకు రావటానికని వెళ్తున మాధవ్‌ని ఆపి తానే వెళ్లింది శారదా మేడం. ఈ ఇంట వాళ్లేమీ క్రొత్త కాదు తనకు. చాలా కాలం నుండి వీళ్లతో ఆమెకి మంచి అనుబంధం వుంది. “నందూ! నందినీ ఎక్కడున్నావ్.. చూశావా? నిన్ను వెదుక్కుంటూ నేనే వచ్చేశా. ఎందుకే స్కూల్ అంటే విసుగొచ్చిందా? నిన్న కూడా రాలేదు కదా? ఎందుకు? ఎవరైనా నీతో గొడవ పడ్డారా? ఏమైనా అన్నారా? నేనెవరికీ చెప్పనులే. అదేంటో నాకు చెప్పు. ఒంట్లో నలతగా వుందా? నీకు తెల్సుగా నేను ఒంటరిదాన్నని. అక్కడికే వెళదాం. అక్కడే చెబుతువుగాని. నీవు రాలేదని ‘కొక్కో’ ఆట ప్రాక్టీసును వాయిదా వేశారు, తెల్సా, రేపు వస్తున్నావు కదూ?” అని ఎంతో బుజ్జగిస్తూ మాట్లాడింది.

అంత వరకూ ముసుగేసుకుని నిద్ర నటిస్తున్న నందిని “లేదు, నేనెక్కడికీ రాను. స్కూల్‌కి అసలే రాను.” అని మొండిగా సమాధాన మిచ్చింది. అది విని శారదా మేడం, “ఏంటి! ఈ మాటలు నా ప్రియ శిష్యురాలు నందిని యేనా మాట్లాడుతున్నది!” అని అనునయించింది. నందిని తాను చిన్నప్పట్నించీ ఎరిగినది. ఎప్పుడూ నెమ్మదిగా, మృదువుగా మాట్లాడుతుండే ఈ నందిని ఇప్పుడేమో కఠినంగా.. ఉందనీ – ఎక్కువగా ఒత్తిడి చేయటం మంచిది కాదనిపించి, బయటకొచ్చి, “ఓ రెండు రోజులు, నందిని ముందు స్కూలు విషయం ప్రస్తావించకండి. ఇంట్లోనే ఉండనివ్వండి. విసుగెత్తి, తానే తప్పక వస్తుంది స్కూల్‌కి. ఇక వస్తాను.” అని ఇంట్లో వాళ్ల దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్లిపోయింది శారదా మేడం.

రెండు రోజులు గడచిపోయాయి. నందినిలో ఎల్లాంటి మార్పు కనబడకపోయింది. పుస్తకాల వైపు కన్నెత్తి చూడటం కూడా లేదు. పేలాలు పేలినట్టు మాట్లాడే నందని మూగనోము పట్టింది. తన స్నేహితురాండ్రు వచ్చినా, వారిని కలవటానికి బయటకి రాకపోయింది. కూతురు ఒక కొఱకరాని కొయ్యగా మారింది మాధవ్‌కి.

ఇలా ఓ వారం రోజులే గడిచిపోయాయి. దిష్టి తీసేసింది లలితమ్మ. జాతకం చూపించటమూ జరిగింది. ప్రయోజనం మాత్రం శూన్యం. తన భర్త, అత్త లలితమ్మ లేని సమయాల్లో తల్లి రుక్మిణి శతవిధాలా ప్రయత్నించి చూచించింది. నందిని నోరు విప్పలేదు.

ఇన్ని విధాలుగా వీళ్ల ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయాని తెల్సిన శారదా మేడం, ఓసారి మాధవ్‌తో “అన్యథా భావించకండి మాధవ్ గారు.. నాకో మనస్తత్వ శాస్త్రజ్ఞరాలితో చక్కటి పరిచయం వుంది. ఓసారి ఆమెను సంప్రదిస్తే ప్రయోజనం ఏదైనా వుంటుందేమోనని నా అభిప్రాయం. మీరు సమ్మతిస్తే వారితో మాట్లాడి ఎపాయింట్‌మెంట్ తీసుకుంటా” అన్నది.

ఆమె ఇచ్చిన సలహా మాధవ్, లలిత్మమలకు అంతగా రుచించక పోయినా, నందిని పరిస్థితి దృష్యా ఒప్పుకోవాల్సి వచ్చింది. డా. అపర్ణగారిని కల్సుకోవటానికి ఏర్పాటు చేయమన్నారు శారదా మేడంను.

డా. అపర్ణగారు ఇచ్చిన ఎపాయింట్‌మెంటుకు, భార్య రుక్మిణి, కూతురు నందిని వెంట బెట్టుకుని క్లీనిక్ చేరాడు మాధావ్. అక్కడ ఓ మధ్యవయస్కురాలు, “రండి, ఈ పుస్తకంలో మీ పేరు, విలాసం వ్రాసి, పాదరక్షలని బయటే విడిచి, అదో ఎదురుగా కన్పిస్తున్నది కదా ఆ రూంలోకి వెళ్లండి” అని చూపించింది. ఆమె చెప్పినట్లే చేసి, భార్య కుమార్తెలతో పాటు లోనికెళ్లాడు మాధవ్. వీరి ఆగమనాన్ని తెలిసి “రండి కూర్చోండి,” అంది డాక్టర్. మాధవ్ వాళ్లు ప్రతి నమస్కారం చేశారు. “మీ సమస్య గురించి శారద నాకున్ని విషయాలనీ తెలియజేసింది. సంకోచమనేది లేకుండా, ఏ ఒక్క విషయాన్ని దాచకుండా వివరంగా చెప్పండి. డాక్టర్ల వద్ద ఏదీ దాచకూడదు కదా!” అంది.

ఆమెను చూడగానే ఓ గౌరవ భావం ఏర్పడింది మాధవ్‍కి. శారదా మేడం, ఈమె ఇద్దరూ సమవయస్కులుగానే కన్పిస్తున్నారు. ఆమె చెప్పినట్టే ఏదీ దాచకుండా అప్పటి వరకూ జరిగిన అన్ని విషయాలను ఏకరవు పెట్టాడు మాధవ్. అన్ని విషయాలనీ తదేకంగా వింటూ వచ్చింది డా. అపర్ణ. సాధారణ స్త్రీలాగా కనిపిస్తున్న రుక్మిణి, ఒకసారి చూస్తే తిరిగి చూడాలనే రూపం కలిగిన మాధవ్, ఏదో చెప్పరాని భీతి నందిని ముఖంలో, తన కిష్టం లేని పనేదో వీళ్లు చేస్తున్నారనే ఫీలింగ్. ఇది వరకూ నడిపించిన పూజలు, దిష్టి పరిహారాలు, జాతక దోషాలు, అన్నింటి నుండీ బెంబేలెత్తిపోయిన ముఖం.

నందిని వైపు తిరిగి డా. అపర్ణ ఆ అమ్మాయి అభిరుచులనీ తన ఇతర ఇష్టానిష్టాలనూ క్షణ్ణంగా ఆ అమ్మాయి ద్వారానే రాబట్టింది.

“అమ్మాయ్ నందూ! ఇన్ని రకాలుగా నీవు అన్నింటా నైపుణ్యాన్ని కలగిన దానివి కదా. మరి స్కూల్‌కి ఎందుకు వెళ్లనంటున్నావు? ఈ హఠాత్పరిణామానికి కారణమేమి?” ప్రశ్నించింది డాక్టర్.

“లేదు, నేను స్కూల్‌కి వెళ్లను అంతే” అని మొండిగా సమాధానమిచ్చింది. లేచి, నాన్నతోటి “ఇంటికి వెళదాం రండి” అని తొందర చేసింది.

“ఓ.కే. పోదువుగాని కూర్చో.” అని తన కూర్చీకి సమీపంలో వున్న మరో కుర్చీలో నందిని చేయిబట్టి కూర్చోబెట్టి ఓ తెల్ల కాగితం గల ప్యాడ్‌నీ, పెన్నునీ నందినికిచ్చి, “నీ హాండ్ రైటింగ్ ఎలా వుంటుందో చూడాలి. అందుకే నిన్ను కూర్చోబెట్టింది.” అని వ్రాయమన్నట్టు సైగ చేసింది డాక్టర్ అపర్ణ.

“చూశారా, చూశారా డాక్టర్. ఇది ఇలాగే అందరితోనూ ప్రవర్తిస్తూ వుంది ఈ మధ్య” కలుగజేసుకున్నాడు మాధవ్.

“భయపడకండి మాధవ్ గారు. మీ అమ్మాయికేం కాలేదు. నేను ట్రీట్‌మెంట్ చేస్తానుగా. ఓ ఇంజెక్షన్ ఇస్తాను. దాని ప్రభావం వల్ల, తన అంతరంగంలో వున్న విషయాలన్నింటినీ బయటపెటేస్తుంది” అని అంటూనే, ప్యాడ్ పేపర్‌పై వ్రాసిన విషయాలని గమనించింది డాక్టర్. “ఇక మీరు వెళ్లి రండి. నేను మళ్లీ కబురంపుతాను. నందిని తప్పక స్కూల్‌కి వెళుతుందనే నమ్మకం నాకుంది. అయితే బలవంతం మాత్రం చేయబోకండి” అని వాళ్లని సాగనంపి, ప్యాడ్‌పై నందిని వ్రాసియుంచిన విషయాన్ని పరిశీలించింది డాక్టర్ అపర్ణ.

అందులో “డాక్టర్, నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం. నేను మీ ముందు అన్ని వివరంగా చెబుతాను. అయితే మా నాన్న, అమ్మ, అవ్వ వీళ్ళెవ్వరూ నా ఎదుట ఉండరాదు. నేను మీతో చెప్పబోయే విషయాలు వాళ్లెవరికీ తెలియకూడదు” అని అవసరవసరంగా వ్రాసి వుంది.

‘ఓ! ఈ అమ్మాయి చాలా చతురురాలు. ఏదో నిగూఢమైన కారణమే ఉంది. దీని విషయమై తెల్సుకోటానికి వీరు కుటుంబ పూర్వాపరాలు తెలిసిన శారదేనే అడగాలి’ అని నిర్ణయించుకొంది డాక్టర్.

అంతలోనే, ‘మేడం’ అనే పిలుపు వచ్చిన చోటికి తిరిగింది. ఆ వచ్చింది శారదా మేడం. “అరే! నిన్నే గుర్తు చేసుకుంటున్నా! ఎప్పుడొచ్చావు?”

“నేనింతకు ముందే వచ్చి కార్ షెడ్ వెనకాల వున్న రూం లోకి వచ్చి కూర్చున్నా. వాళ్లు వెళ్లిపోయే దాకా ఇక్కడే వేచి ఉన్నా. ఆ అమ్మాయి చాలా చరుకైనది. దాని విషయం తల్చుకుంటే నా మనసు వికలమవుతూ వుంది. ఏదైనా క్లూ దొరికిందా డాక్టర్” అడిగింది ఆతురతతో.

“ఓ థ్రెడ్ దొరికింది. చూడిక్కడ నీ శిష్యురాలు రాసింది. దాని అమ్మనాన్నలకి తెలియకుండా నాకు అందజేసింది. వారిని గురించి నీకు మొదట్నుంచి పరిచయమున్న దానివి కదా. వారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించిన విషయాలని నాకు తెలియజేయగలవా?” అడిగింది డా. అపర్ణ.

“ఓ, దానికేం.. మా నాన్నగారి కాలం నుంచీ వాళ్ల కుటుంబం తోటి పరిచయాలు మాకున్నాయి. నందిని తాతగారు అంటే రుక్మిణి తండ్రిగారు ఓ పెద్ద వ్యాపారాన్ని నడిపేవాళ్లు. ఆ కాలంలోనే వారికి ఓ స్వంత కారుండేది. రుక్మిణి వారికి ఒక్కగానొక్క కూతురు. రూపంలోనూ, చదువులోనూ రుక్మిణి అంతంతే. నేనే ఆమెకు కొంత కాలం పాఠాలు చెప్పాను. అయితే ఏడవ తరగతి కూడా దాటలేకపోయింది. వాళ్ల నాన్న ఏదో దూరపు సంబంధపు పిల్లవాణ్ణి చూసి అల్లుడుగా చేసికొని ఇల్లరికం పెట్టుకున్నాడు. అలా ఇల్లరికం వచ్చిన వాడే ఈ మాధవ్ – నందిని తండ్రి. రుక్మిణి మృదు స్వభావురాలు. ఆమె తండ్రి తన తదనంతరం మాధవ్‌కి యాజమానత్వం చేజిక్కింది. భార్య, రుక్మిణి పంజరంలో చిలుకలాగ ఎల్లాంటి స్వాతంత్యాన్ని ఇవ్వక తానెక్కడికెళితే ఆమెను తన వెంట తీసుకెళుతూ – తన్ను విడిచి వేరే వాళ్లతో మాట్డాడటం, వ్యవహారాలు చేయటం గాని లేకుండా కట్టుదిట్టం చేశాడు. ఇక అత్త – మాధవ్ అమ్మగారు చాలా ఘటికురాలు. కోడలిపై ఆమె అజమాయిషీ, పైగా నిఘా. అయితే నందిని మాత్రం, మాధవ్, లలితమ్మ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడూ నాన్న అవ్వలతోటే కాలం గడుపుతున్న నందినికి అమ్మతోటి సంపర్కం తక్కువ. అయితే రుక్మిణి దేన్నీ పట్టించుకోక తన పనేదో తాను చేసుకుంటూ పోతూంది. అయితే ఉన్నదున్నట్లుగా నందినిలో ఇల్లాంటి మార్పు ఎలా వచ్చిందేమిటా అని నాకూ చాలా బాధ అనిపించటం వల్ల మీ వద్దకి వాళ్లని పంపాను. దీనికేదైనా పరిహారం చూపించి పుణ్యం కట్టుకోండి.” అని అంటూ “ఆ అమ్మాయిని మరలా నేనే తీసుకురానా?” అడిగింది శారద.

“నీవు పిల్చుకురావటం వద్దు. వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నీవు నాకు తెలియజేశావని వారికి తెలియరాదు. నేనే వారికి కబురంపుతాను, నే జరుపవల్సిన టెస్టులన్నీ జరుపుతాను. సరేనా?” అంది డాక్టర్ అపర్ణ.

“ఎలానో దాన్ని మునుపటి నందినిగా మార్చే బాధ్యత మీది. ఇంకేమైనా సమాచారం కావాలంటే చెప్పండి. ఇరుగు పొరుగు వాళ్లని సంప్రదించి సేకరిస్తాను” అని అంటూ సెలవు తీసుకొని వెళ్లిపోయింది శారదా మేడం.

మరుసటి దినం, డా. అపర్ణా నుండి మాధవ్‌కి కబురు రాగానే, మాధవ్ నందినితో పాటు తన తల్లిని కూడా తీసుకెళ్లాడు.

“మీరిద్దరూ కొంచం సేపు బయటే వెయట్ చేయండి. నందినిని నేను లోనికి తీసుకెళ్తాను. కొన్ని టెస్టులు చేయడానికి” అని నందిని చేయి పుచ్చుకుని లోనికెళ్లింది డా. అపర్ణ.

డాక్టర్‌తో పాటు లోనికెళ్లిన నందిని, రూంలోని వాటిని నిశితంగా గమనించింది. ఓ టేబిల్ పైన రికార్డింగ్ మెషిన్ – ఇంకో చోట టీ.వీ స్ర్కీన్ లాంటి ఓ తెర – పుస్తకాలు – ఇతరత్రా.

నందిని సూక్ష్మంగా గమనిస్తున్న డాక్టర్ అపర్ణ “నందినీ, ఎలా వుందమ్మా ఈ రూమ్. రా.” అని ఆత్మీయంగా పిల్చింది. కాళ్లల్లో సత్తువే లేని దానిల్లే నెమ్మదిగా అడుగులేసుకుంటూ దగ్గరికొచ్చింది. “కూర్చో” ఇంతకు ముందు నందిని వ్రాసిన వ్రాతను చూపిస్తూ. “ఎవర్తోటైనా మాట్లాడాలంటే నీకు భయమా?” అడిగింది నందిని. తన రెండు చేతుల్తోటి కళ్లు మూసుకుని ఏడుస్తూ, “నేను స్కూల్‌కి వెళితే నేను లేని సమయాన, నాన్న అవ్వ ఇద్దరూ చేరి మా అమ్మను చంపేస్తారు. అందుకే స్కూల్‌కి వెళ్లను” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

“చూడమ్మా, నా వైపు చూడు. నాతో, అన్ని విషయాలనీ చెబుతానని ప్రామిస్ చేశావ్ కదా? నీవు చెప్పే విషయాలని నేనెవ్వరితోనూ చెప్పను. వాళ్లెందుకు మీ అమ్మను చంపుతారనుకుంటున్నావు. ఆలోచన నీకెలా కలిగింది? భయపడక అన్ని విషయాలనీ నాతో పంచుకో.” అని నందిని భయాన్ని పోగొడుతూ అనునయించింది.

“నేను ఓ రోజు స్కూల్‌కి ఒక్కతినే వెళ్లాల్లి వచ్చింది, నాన్నగారికి ఏదో పని వుండటం చేత. స్కూల్ చేరిన తర్వాత గుర్తుకొచ్చింది మేథమెటిక్స్ హోం వర్క్ బుక్, అటు తర్వాత జామెంట్రీ బాక్స్‌ని ఇంట్లోనే వదిలి వచ్చానని. మా లెక్కల టీచర్ చాలా స్ట్రిక్ట్. స్కూల్ అవటానికి ఇంకా కొద్ది సేపు వుండటం చేత పరుగు పరుగున ఇల్లు చేరుకున్నా. అంగడి వాకిలి మూసి ఉణ్ణింది. ఏదో పని మీద నాన్నగారు వెళ్లి వుండవచ్చు అనుకొని, ఇంటి కాలింగ్ బెల్ నొక్కుదామన్నంతలో లోనుంచి గట్టిగా కేకలు, ఏడ్పులు, ‘అయ్యో’ అన్న శబ్దం. ఎవరో ఎవర్నో కొడుతున్న శబ్దాలు వినవచ్చాయి. టి.వీ సీరియల్ అనుకున్నా. కిటికీ తలుపుల్ని కొద్దిగా నెట్టినా, తెరుచుకున్నాయి. లోపల కన్పించిన దృశ్యాన్ని చూసి హడలెత్తి పోయాను.” అంటూ వెక్కివెక్క ఎడ్వటం ప్రారంభించింది నందిని.

డా. అపర్ణ తాను కూర్చున్న చోటు నుండి లేచి, నీటి గ్లాసును నందినికందిస్తూ, భుజంపై చెయ్యి వేసి, “నందూ, సమాధానం తెచ్చుకో. నీవు చూచిన దృశ్యం చేత నీకెందుకు భయం వేసింది, ఎవర్ని చూశావు అక్కడ.”

“లోపలన మా అమ్మ జుట్టును పట్టుకుని తలను వెనక్కు వంచుతూ వుంది మా అవ్వ. ఏదో కాగితాన్ని చూపించి అమ్మకు, దాని మీద సంతకం చేయమని ఒత్తిడి చేస్తున్నాడు నాన్న. అమ్మ, ఒప్పుకోక తలాడించి నందుకు, అమ్మ వీపు మీద ఓ గుద్దు గుద్దాడు నాన్న. భరించలేక అమ్మ ఏడుస్తోంది నేలబడి. అమ్మకు, ఆమె తండ్రి గారి ఆస్తి, మా తాతగారి నుండి వచ్చందని నాకూ కొద్దిగా తెల్సు. ఆ ఆస్తి అంతా అమ్మ పేరున ఉంది. నా కప్పుడప్పుడే పరిస్థితి అర్థమవుతూ వస్తూండేది. మా అవ్వ నాన్నగారు ఇద్దరూ కల్సి మా అమ్మను ఓసీ మొద్దూ అని చీదరించుకుంటూ వుండేవారు. అమ్మ అప్పుడప్పుడు మంచాన పడుతుండేది. అనారోగ్యం మూలంగానేమో అని అనుకునే దాన్ని – కాని, వీళ్లు కొట్టే దెబ్బలకని నాకు ఇప్పుడే అర్థమౌతూంది. నేనెప్పుడైనా అమ్మను గురించి అడిగితే, “మీ అమ్మ రోగిష్టిది, దాని దగ్గరికెళ్లబాక” అని నన్ను వారించేవాళ్లు. అమ్మతో మాట్లాడటానికి వాళ్లు అవకాశం కల్పించేవాళ్లే కాదు. అమ్మ, తానొంటరిగా బయటకెళ్లేదే కాదు. వెళితే తోడుగా నాన్న ఉండాల్సిందే. మా అమ్మమ్మ తాత గారికి, మా అమ్మ ఒక్కతే కూతురువడం చేత, అమ్మమ్మ తాతగారు చనిపోయి తర్వాత ఆమెకి తోడెవరూ లేకపోయారు. ఇలా హింస పెడుతున్నారనే విషయం నాకు తెల్సింది ఆనాడే. ఆ రోజు “అమ్మా! దీన్ని ఎంత హింసించినా మన దారికి రావటం లేదు – దీనికొకటే దారి, ఏదైనా ఉపాయం చేత దీన్ని ముగించేయాలి.” అనే నాన్న మాటల్ని వినేసరికి కంపించిపోయను. స్కూల్ కెళ్లడానికి మనసొప్పక, సాయంత్రం వరకూ పార్కులో గడిపి యాథాలాపంగా ఇంటికి తిరిగొచ్చా.”

“అమ్మ మౌనంగా పడుకుని వుంది ఎప్పట్లాగానే. కళ్లు ఉబ్బి వున్నాయి. చీర చెరగు వీపును సరిగా కప్పి వుంచక పోవటం వల్ల వీపు మీద దెబ్బ చారలు కన్పిస్తున్నాయి స్పష్టంగా. నాకు నా పైనే అసహ్యం వేసింది. కన్న తల్లిని నేనిదివరకూ ఒక్కసారైనా ప్రేమతో కౌగలించుకొని, ఆమె ఒడిలో నిద్రపోయింది లేదు. ఎప్పుడూ అవ్వ ప్రక్కనే. సంతోషపు క్షణాలని అమ్మతో ఏనాడూ పంచుకొని ఎఱగను. ఎప్పుడో గాని అమ్మతో రెండు మూడు మాటలకన్నా ఎక్కువ మాట్లాడింది లేదు. నేనిప్పుడు పెద్దదానయ్యాను. నా తప్పు నాకిప్పుడు తెల్సి వచ్చింది. ఇంత పెద్ద ఇల్లు, ఇన్ని సౌకర్యాలు మేం అనుభవిస్తున్నామంటే, మా తాతగారి చలువే. ఇప్పుడు ఇంకా ఏం కావాలని అమ్మను హింసకు గురి చేస్తున్నారో నాకు తెలియటం లేదు. ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే.. అర్థం కావటం లేదు. అయితే నాకు అమ్మ కావాలి. వాళ్ల బారి నుండి అమ్మను కాపాడాలంటే నేను ఆమెకు కావలిగా ఉండాలి. నేనెదురుగా వున్ననంటే వాళ్లేమీ చేయలేరు. అందుకే స్కూల్‌కి వెళ్లకుండా వుండాలనే నిర్ణయానికొచ్చాను” అని అంటూ అపర్ణను వాటేసుకు ఏడ్చేసింది.

నందిని కన్నీళ్లు తుడుస్తూ, “ఏడవకమ్మా, భయపడక. మీ అమ్మకేమీ కాకుండా నే చూస్తాను. మీ నాన్న, అవ్వలకి బుద్ధి చెప్పి మంచి దారిలోకి తీసుకువస్తాను. చింతించకు. నా పైన భరోసా వుంచు. వెళ్లు, వెళ్లి ఆ సింక్‌లో ముఖం కడుక్కో” అని చెబుతూ ముఖం తుడుచుకోటానికి టవల్‌ని ఇస్తూ అనునయించింది.

డాక్టర్ మాటలు కొంతగా నందినిని స్తిమిత పరిచాయి. చెప్పినట్లే చేయగలదనే నమ్మకం కుదిరింది. నెమ్మదించి పూర్వస్థితికి వచ్చి డాక్టర్ తోటి బయటకొచ్చింది.

లోపల ఏ జరుగుతున్నదో ఏమోనన్న ఆదుర్దాగా వున్న మాధవ్‌కి నందినిని చూడగానే మనసు నెమ్మదించింది. “నా కూతురు ఏదైనా చెప్పిందా డాక్టర్,” అని ఆతురతతో అడిగాడు మాధవ్.

“చెబుతాను తొందర పడకండి” అని అంటూ నందినితో చూడు “నందినీ మీ అమ్మగారిని పిల్చుకొని, మా క్లినిక్ వెనకాల వున్న మిని గార్టెన్‌ని చూసిరా.” అని వాళ్లిద్దర్నీ బయటకి పంపింది, డాక్టర్ అపర్ణ. వాళ్లు వెళ్లగానే “చూడండి మాధవ్, సాధ్యమైతే ఈ సాయంకాలమే మీరూ, మీ అమ్మగారు ఇక్కటికి రండి. మీ భార్య రానక్కర లేదు.” అని అంది .

“డాక్టర్ మా అమ్మగారెందుకు?” ప్రశ్నించాడు మాధవ్.

“కారణం వారు వచ్చిన తర్వాత వివరిస్తాను. మీ కూతుర్ని మీరేమీ ప్రశ్నించకండి. మీరిక వెళ్లవచ్చు.. ఆ.. మీరు వచ్చే సమయాన్ని తెలియ జేయండి.”

ఇదంతా అగమ్యగోచరంగా ఉంది మాధవ్‌కి. సరే ఏది ఏమైతేనేం తన కూతురు పూర్వ స్థితికి వస్తే చాలుననిపిచింది.

***

తల్లిని పిల్చుకొచ్చిన మాధవ్‌ని స్వాగతించింది డా. అపర్ణ. వాళ్లిద్దర్నీ లోపలికి పిలుచుకెళ్లి ప్రశ్నలనేకం వేసి తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించింది. శారదా మేడం ద్వారా, నందిని ద్వారా తనక తెల్సిందేమిటంటే పెండ్లి కాక పూర్వం మాధవ్ కడు పేదరికాన్ని అనుభవించి, – ఆ తర్వాత ఏకైక కూతురయిన రుక్మిణిని వివాహం మాడటం ద్వారా ఆస్తి భార్య పేరు ఉండటం వల్ల – మాధవ్‌ని ధనపిశాచం ఆవహించింది. యావదాస్తినీ తన పేరుకే ఉండాలనే దురాశ చేత భార్య రుక్మిణిని హింసించటం ప్రారంబించాడు. పూర్తి ఆస్తి భర్త పరం చేస్తే తననేమి చేస్తారోననే భయంతో ఆమె భర్త పరం చేయటానికి ఇష్టపడలేదు. అందుకే తల్లి, కొడుకులిద్దరూ ఆమెను హింస పెట్టటం మొదలు పెట్టారు. నందిని ఇంటలేనప్పుడు.

అన్ని విషయాలనీ కూలంకషంగా ఆలోచించి వాళ్లతో – “చూడండి! నే చెప్పే విషయాలని శ్రద్ధగా వినండి. ఇది వరకూ మీ ఇంట్లో ఏమి జరిగిందో దాని చర్చ ఇక్కడ ఇప్పుడు అనవసరం. పాయింటుకి వస్తునా. మీ నందిని.. మీ అమ్మాయి తన తల్లిని పోగొట్టుకోటానికి సిద్ధంగా లేదు” తల్లీ కొడుకులిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. “ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదు. ప్రౌఢావస్థలోకి అడుగిడుతున్న అమ్మాయి. పైగా బుద్ధిమంతురాలు. సూక్షంగా అన్నింటినీ అర్థం చేసుకునే సామర్థ్యం కలిగినది.. కొంచం శ్రద్ధగా వినండి. ఆ అమ్మాయి మనసులో ఓ అనుమానం స్థిరపడిపోయింది, అదేమిటంటే.. తన ఇంట్లో తన తల్లికి అపాయం జరుగబోతుందనే భయం పట్టుకుంది. తను లేని సమయంలో ఆమె ప్రాణానికి కీడు జరుగుతుందనే మానసిక ఒత్తిడిలో వుంది. ఇది ఇలానే కొనసాగితే పరిణామాలు మరో రకంగా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ అమ్మాయి క్షేమం కోరే వాళ్లయితే..” అని అంటుండగానే, “అలా అనకండి డాక్టర్.. పాపే మాకు సర్వస్వం..” అన్నాడు మాధవ్.

“అలా అయితే, మీకు మీ కూతురు, మీ తల్లికి మనవరాలు కావాలి అనుకుంటే ఈ రోజు నుండే మీ ఇద్దరూ మీ ఆలోచనలని, మీ ప్రవర్తనలని మార్చుకోవాలి. మార్చుకుని, నందినికి ధైర్యం, భరోసా కలిగేటట్లుగా నడుచుకోవాలి. మీరు ఆ అమ్మాయి తల్లి పట్ల మంచిగా నడుచుకోనగలరనే నమ్మకం, కలిగించాలి. ఇలా చేస్తే మీ నందిని పూర్వపు నందినిగా మారటానికి అవకాశం వుంటుంది. ఆ అమ్మాయిలో ఏర్పడిన శంకను మీరు తొలగించటానికి పూనుకోవాలి. ఆ అమ్మాయికి కలిగిన మానసిక భీతిని మీ ఇద్దరే పోగొట్టాలి. ఏం చేస్తారో మీరే ఆలోచించి ఓ తీర్మానానికి రండి” అంది డా. అపర్ణ. ఇక్కడ జరిగిన విషయాన్ని శారదా మేడంకు తెలియజేసింది.

***

వారం గడిచింది. తన కుటుంబంతో సహా డాక్టర్ ఇంటికి వచ్చాడు మాధవ్. తన కూతురి చేత ఫలతాంబూలాన్ని డాక్టర్‌కి ఇప్పించి ఆమె ఆశీర్వాదాన్ని వేడాడు. ఆమె చేసిన ఉపకారానికి తాము జీవితాంతం ఋణపడి ఉండగలమని చేతులు జోడించాడు.

“నందిని స్కూల్‌కి వెళతావా, లేదా.. ఇంట్లోనే” అని అడిగిన డాక్టర గారికి..

“లేదు డాక్టర్. తప్పకుండా స్కూల్‌కి వెళతాను” చెప్పింది నందిని.

తొలగిన ఆపదకి రుక్మిణి సంతసించింది.

కన్నడ మూలం: బి.ఆర్.నాగరత్న

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here