[dropcap]అ[/dropcap]టూ ఇటూ రెండు కిలోమీటర్ల దూరం వరకు మరో ఇల్లనేదే లేని చోట, విస్తరించిన పొలాల మధ్య కట్టిన ఒంటరి ఇంట్లో అమ్మా నాన్నగారూ, మామ్మా తాతగార్ల సంరక్షణలో పెరిగాం – మేము నలుగురు పిల్లలం.
ఏవో బొమ్మలు గీసుకుంటూ పాటలు పాడుకుంటూ, పొలాల్లో తిరుగుతూ, ఏడెనిమిదేళ్ల వరకూ బడి మొహం కూడా చూడకుండా గడిచింది నాకు. అన్నలిద్దర్నీ అయితే ఏకంగా ఆరవతరగతిలో చేర్పించారు. మా చెల్లి ఒక్కర్తే ఒకటో తరగతి నుంచి అన్ని క్లాసులూ వరసగా చదువుకుంది పాపం. అంటే అందర్నీ ఒక్కసారే తీసుకుపోయి బడిలో వేశారన్నమాట.
ఇంట్లో తాతగారే తెలుగూ, లెక్కలూ, కాస్తంత ఇంగ్లీషూ నేర్పించారు. పిల్లల పుస్తకం కనిపిస్తే చివరిదాకా చదివేయడానికి ఆ తెలుగు సరిపోయేది. ఏడేళ్లప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తిన్నగా మూడో తరగతిలో చేర్పించదానికి తీసుకెళ్తే హెడ్ మాస్టారు గారు ఏదో పుస్తకం ఇచ్చి చదవమనడమూ, ఎక్కాలేవో అప్పచెప్పమనడం గుర్తుంది.
ఇంటి చుట్టూ పచ్చటి పొలాలూ చెట్లూ పక్షులూ. ఎటు చూసినా నీలాకాశం మబ్బులూ. మనసెపుడూ ఏవో రాగాలు తీస్తూ ఉండేది. తెల్ల కాగితం కనిపిస్తే పెన్సిల్‌తో తోచినట్టు బొమ్మలు గీస్తూ, రంగులు పులుముతూ ఉండేదాన్ని. పదేళ్లు కూడా రాకముందే పాటలు రాయడం మొదలు పెట్టాను. వాటి నిండా ప్రకృతి దృశ్యాలే.
నేను పుట్టి పెరిగిన పొలాలూ తోటలూ విడిచి పెట్టి నగరవాసినైన తర్వాత ఎక్కువగా నేను మిస్ అయింది స్వచ్ఛమైన గాలినీ, ప్రశాంత సుందర పరిసరాలనీ, పక్షుల కలరవాలనీ. ముఖ్యంగా ధాన్యపు గింజలు నోట కరుచుకుని ఇంటి చుట్టూ ఎగురుతూ తిరిగే పిచుకలనీ.
బెంగుళూరులో మూడున్నరేళ్లున్నాక, హైదరాబాద్ వచ్చాం. మెహదీపట్నంలో, ఇంజనీర్స్ కాలనీలలో కొంతకాలం, శ్రీనగర్ కాలనీలో కొంతకాలం ఉన్నాం. ఎక్కడుంటే అక్కడ చిన్నదో చితకదో ఒక బాల్కనీ గార్డెన్ పెంచుకుంటూ వచ్చాను. గచ్చిబౌలిలోని మా ప్రస్తుత నివాసానికి వచ్చి పదేళ్లు దాటింది.
బెంగుళూరులోనూ, తర్వాత హైదరాబాద్ వచ్చాకా అప్పుడూ అప్పుడూ రాసిన పాటలన్నీ కలిపి ‘వాన చినుకులు’ లలితగీత మాలికగా ఒక పుస్తకాన్ని వెలువరిస్తే దాన్ని నారాయణ రెడ్డి గారు త్యాగరాయ గాన సభలో ఆవిష్కరించారు. కొమాండూరి రామాచారిగారు అందులోని పదిహేడు పాటలు ఎన్నుకుని, స్వరపరచి, లిటిల్ మ్యుజిషియన్స్ అకాడెమీ బాలబాలికల చేత పాడించారు. ఆ పాటల్లో మూడొంతులు ప్రకృతి దృశ్యాలూ పక్షులే.
పల్లవి:
తురాయి చెట్టున తుషార బిందువులు
తళతళ లాడే తుహినకణాలు
తూరుపు వాకిట వెలుగుల వేడుకలు
సుహాస వికాస సుందర వదనా
చరణం:
పిచుకమ్మల కిలకిలరావాలు
చెట్టుకొమ్మల మాటున చలాకి చేష్టలు
నేలకు రాలే తళుకుల బిందువులు
మిలమిల మెరిసే గరిక తివాచీలు!
ప్రభాత సమయపు శీతల పవనాలు
వేకువ తెచ్చిన వెచ్చని కిరణాలు! //
చరణం:
ఉషోదయానా విహంగ నాట్యాలు
భాషేలేని భావకవిత్వాలు
తాళం ఎరుగని పిక సంగీతాలు
కుంచెలు వాడని రంగుల చిత్రాలు!
ప్రభాత సమయపు శీతల పవనాలు
వేకువ తెచ్చిన వెచ్చని కిరణాలు! //
ఈ పాట విని రామాచారి గారు ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు కనబడేలా హుషారైన బాణీ కట్టారు.
‘పిచికా పిచికా, చెట్టెక్కీ.. కిచకిచ కిచ కిచ లాడేవు!
కాకీ కాకీ, ఇల్లెక్కీ.. కావ్ కావ్ మని అరిచేవు!
కోకిలమ్మా కొమ్మెక్కీ.. కూకుకు కూకుకు కూసేవు!
గువ్వపిట్ట గువ్వ పిట్ట నువ్వెందుకే.. కువకువకువకువలాడేవు?’
అంటూ పిల్లలకోసం మరో పాట రాస్తే దాన్నికూడా రామాచారి ముచ్చటగా స్వరపరచి, ఇంకా పసిగొంతు వీడని చిన్నారులతో పాడి రికార్డు చేశారు.
~
ప్రస్తుతం మేమున్న అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తులో ఉంది. ఈ ఫ్లాట్‌లో రెండు బాల్కనీలున్నాయి. ఒకటి చిన్నది. రెండోది కాస్త పెద్దది. వచ్చీరాగానే రెండిటిలోనూ కాసిని కుండీలూ, వాటిలో మొక్కలూ పెట్టి ఓ పరమ చిన్న తోట పెంచడం మొదలుపెట్టాను.
చక్కగా ఎదుగుతున్న ఈ మొక్కల మధ్యకి పావురాలొచ్చి నానా గొడవా చేసేవి. చిగుళ్లూ మొగ్గలూ కొరికేసి, కొమ్మల నిండా రెట్టలేసి, చోటు దొరికితే చాలు గుడ్లు పెట్టేసీ, అవి చేసిన రభస ఇంతా అంతా కాదు. ఒకోసారి తలుపు తెరిచి ఉంటె హాల్లోకి వచ్చేసి బయటికి వెళ్లడం రాక నానా గొడవా అయిపోయేది. మూడేళ్ళ క్రితం కోవిడ్ బారిన పడ్డ నాకు, వీటి ఈకలూ, రెట్టలతో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చి బతికినంత పనయింది.
ఈ పావురాలతో మరో బాధ ఏమిటంటే అవి వచ్చే చోటికి ఇంకే చిట్టి పొట్టి పిట్టలనీ రానియ్యవు. దాంతో నాకెంతో ఇష్టమైన పిచుకలు కనపడకుండా అయిపోయాయి. వాటితో పడలేక పెద్ద బాల్కనీకి పెద్ద పెద్ద కన్నాలున్న నెట్ వేయించుకున్నాం. అప్పట్నుంచీ పిచుకలూ ఇతర చిన్న పక్షుల కోసం నిరీక్షణ మొదలు. అపుడపుడు ఒకటో రెండో పిట్టలు రావడం, చిట్టి పొట్టి గంతులేసి తుర్రుమనడం. ఆ కాసేపూ మంత్రముగ్ధులమై వాటిని చూడడం. మళ్లీ ఎప్పటికో వాటి పునరాగమనం.
అయిదారు నెలల క్రితం ఒక జంట పిచుకలు వచ్చి, కాసేపు ఆ నెట్ తాళ్ల మీద వాలి, అటూ ఇటూ తిరిగాయి. ఇంక నాకు ఆశ పుట్టింది. అవి మా తోటలో గూడు కట్టుకోవాలనీ, అందులో బుజ్జి పిచుకమ్మలు పుట్టి కిచ కిచలాడాలనీ.
గూగులమ్మ తలుపు తట్టి రకరకాల గూళ్ళు చూశాను కొనుక్కుందామని. అందులో ఎన్ని రకాల గూళ్ళు అమ్మకానికి ఉన్నాయో! ఆశ్చర్యం వేసింది. వాటిలో నచ్చినవి రెండు ఎంపిక చేసి మా అమ్మాయిని ఆర్డర్ పెట్టమని చెప్పాను. రెండు రోజుల్లో ఆ గూళ్ళు మా గూటికి చేరాయి. వాటిని వెంటనే చెరో చోటా కదలకుండా అమర్చి, పిచ్చుకల జంట కోసం నిరీక్షించడం మొదలుపెట్టాను.
ఎపుడో ఒకసారి పిచుకో మరో పిట్టో వచ్చినా, నా గూళ్ళ వంక చూసేవి కావు. ఎందుకా అని ఆలోచిస్తే ఆ గూళ్ళ గుమ్మాలు మాకు అభిముఖంగా ఉండడమే కారణమేమో అనిపించింది. వెంటనే గుమ్మాలు మాకు కనపడకుండా గోడవైపు ఉండేలా మార్చి కట్టాను. మళ్ళీ ఎదురుచూపులు.
‘ఆమనీ ఓ ఆమనీ! నా వనికి రావు ఎందుకనీ?’ అంటూ చాలా కాలం క్రితం ఒక పాట రాస్తే రామాచారి దానికి చక్కని బాణీ కూర్చి పాడారు. అందులో-
‘చిరుకొమ్మల రెమ్మలపై చిలకలెన్నొ వాలాలనీ,
ఎగిరొచ్చే విహగాలతో వనము మురిసిపోవాలనీ’ అంటూ ఒక పంక్తి ఉంటుంది.
తోట అంటే నా ఊహ అది! అలా విహగాలు ఎపుడో వచ్చి మా మీనియేచర్ నందనవనంలో కలరవాలు వినిపించాలని నిరీక్షిస్తుంటే, ఏడాది క్రితం మా అబ్బాయి జయంత్ పెళ్ళికి ముందు ఒక జంట పిచుకలు వచ్చాయి. ఒక రోజంతా మా వేలాడే కుండీల దగ్గర తచ్చట్లాడాయి. వాటితో పాటు నేను పుట్టి పెరిగిన తోటలోని నా బాల్యపు తునక ఒకటి వచ్చి నా భుజం మీద వాలినట్టై, మనసు మురిసిపోయింది!
రోజూ ఆ జంట పిచుకలు రావడం, కొనుక్కుందుకు కొత్త ఫ్లాట్ వెతుక్కునే జంటల్లాగే ఈ గూళ్ల లోపలా బయటా కాసేపు తారాట్లాడడం, లోపలి గోడలూ వ్యవహారం చూసుకుని, ముక్కూ ముక్కూ రాసుకుంటూ ఏవో చర్చించుకోవడం, తుర్రుమని ఎగిరిపోవడం. ఎన్నాళ్లయినా వాటికి నేను కొన్న గూళ్ళు నచ్చలేదు. ఎదురుచూసి చూసి నాకు ఆశ సన్నగిల్లింది.
ఇంతలో ఒకరోజు ఓ పిచుక పొడవాటి గడ్డిపోచ తెచ్చి, నెట్ అల్లిక లోంచి లోపలికి సులువుగా వచ్చి బాల్కనీలో పెట్టిన ఏసీ బ్లోయర్ వెనక్కి వెళ్ళింది. ఆ గడ్డిపోచతో అది కదులుతుంటే ఆ పిచుక ఏదో పొడవాటి వింత పిట్టలా కనపడింది. ఇంత పెద్ద పిట్టా ఈ నెట్ లోంచి ఎలా వచ్చిందా అని కాస్త ఆశ్ఛర్యపోయాను. కాసేపటికి అది పిచుకతో కూడిన గడ్డిపోచ అని అర్ధమైంది. చూస్తుండగానే దానికి తోడుగా రెండోది కూడా వచ్చింది.
రెండూ కలిసి నాలుగు రోజుల్లో ఏసీ వెనకగా ఎవరికీ కనపడకుండా గూడు కట్టేశాయి. కాసిని వేలాడే గడ్డిపోచలు తప్ప ఆ గూడు కూడా సరిగ్గా మాకు కనిపించలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి జాతి, మన మానవ జాతిని తట్టుకుని ఇన్ని యుగాలపాటు నిలబడిందో కదా!
ఇక రోజూ పొద్దున్న మా కాఫీ సమయంలో పిచుక పిల్లల కిచకిచలు. ఎంతసేపూ జంట పిచుకలు వస్తూ పోతూ ఉండడమే గాని పిల్ల పిచ్చుకల జాడ కనపడలేదు. వాటి ముద్దు ముచ్చట్లు మాకు కనబడకుండానే వాటిని పెంచడమూ, వాటికి అవసరమైన విద్యలు మప్పడమూ, తమ వెంట తీసుకుపోవడమూ జరిగిపోయింది. ఆ సమయంలో మేం మా అబ్బాయి పెళ్లి హడావుడిలో ఉండడం వల్ల వాటిని గమనించలేకపోయామో ఏమో!
సరే, మూడు నాలుగు నెలలు గడిచాయి. కిందటి వారం హఠాత్తుగా నాలుగు పిచుకలు పదే పదే రావడం, కొమ్మల మీద వాలడం, ఆ గూడూ ఈ గూడూ శల్య పరీక్ష చేయడం. రోజంతా ఇదే పని.
ఎంతైనా ఒకటో ఫదో కథలు రాసిన బాపతు కదా నేను! వాటిలో రెండు పాత పిచ్చుకల జంట అనీ, మిగిలిన రెండూ మా ఇంట్లో పుట్టిన పిల్ల పిచుకలనీ ఊహాగానం చేసి, శర్మగారికి చెప్పి, ఎలాగో ఒప్పించాను. ఈ సారి నాలుగైదు రోజుల ఎదురుచూపుల తర్వాత, పిచుక పెళ్ళాం పిచుక మొగుడితో సంప్రతింపులు జరిపి, ఏసీ పక్కన నేను ఫిక్స్ చేసిన గూడు ఎంపిక చేసుకుని లోపలికీ బయటకీ తిరిగి తిరిగి, లక్షణంగా గృహప్రవేశం చేసుకుంది.
మిగిలిన రెండు పిచుకలూ మళ్ళీ కనపడలేదు. ఏవో వాళ్ళమ్మా నాన్నా చూపించిన గూళ్ళు చూసి సరే అనేసి, వాటి దోవన అవి పోయినట్టున్నాయి. మర్నాడో మూడోనాడో సీమంతం, తర్వాత మరో రెండు మూడు రోజులకి పురుడూ పూర్తై, ఇపుడు ఆ గూటిలో మూడు గుడ్లు నిద్రావస్థలో ఉన్నాయి.
రోజూ నేను ఆ పక్కనున్న మొక్కలకి నీళ్లు పోస్తుంటే వాటికి ఇబ్బందే. రెండు పిచుకలూ ఆ కాస్త సవ్వడికే ఎగిరిపోతాయి. మొదటిసారి భయపడ్డాను, మళ్ళీ రావేమో అని. అదేం లేదు. నా మీద నమ్మకం కుదిరినట్టే ఉంది. నిజానికి మనుషులకి ఇంత దగ్గరగా ఉన్న గూడు ఎన్నుకుని అందులో గుడ్లు పెట్టడానికి వాటికి చాలా ధైర్యమే ఉండి ఉండాలి. నేనూ వాటి ప్రయివసీని గౌరవిస్తూ జాగ్రత్తగా మసలుకుంటున్నా.
మా జయంత్ పుట్టినపుడు నేను మా పుట్టింటిలో ఉన్నాను. వాడి ఉంగా ఊసులూ, బారసాలా, ఉయ్యాల వేడుకా అక్కడే జరిగాయి. మా అమ్మ అస్తమానూ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతుంటే ‘అమ్మా, ఇలా ఎత్తు అలవాటు చేశావంటే బెంగుళూరు వెళ్ళాక నాకు కష్టమైపోతుంది’ అంటే ‘ఏమిటే, ఎపుడో నువ్వు కష్టపడతావని నా మనవణ్ణి నేను ముద్దాడకుండా పంపేయాలా?’ అని అమ్మ నా విన్నపాలని తోసిపుచ్చేసింది.
చూస్తుండగానే జంటగా వచ్చిన ఇద్దరం, ముగ్గురమై మా ఇంటికి మేం వెళ్తుంటే, అమ్మా నాన్నగారూ గుమ్మంలో చూస్తూ నిలబడిన దృశ్యం ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుంటుంది. ఇపుడు ఈ బుజ్జి కూనలు బయటికొచ్చి ఎగిరేలోపు నా కంటపడకపోతాయా అని ఎదురుచూస్తుంటే.. ఆ దృశ్యం గుర్తొస్తోంది!
*