చిరుజల్లు-62

1
3

బెస్ట్ ఫ్రెండ్

[dropcap]సా[/dropcap]యంత్రం నాలుగు గంటలు అవుతోంది.

విశాలాక్షమ్మ గది తలుపు తీసి వీధి లోకి తొంగి చూసింది. ఇంకా ఎండ వేడి తగ్గలేదు. కానీ నలుగురు పిల్లలు రోడ్డు మీదనే క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లను చూస్తే విశాలాక్షమ్మకి విసుగు, చిరాకు, కోపం.. ‘వెధవలు.. చదువూ సంధ్యా ఏమీ ఉండదు. రోజంతా బంతిని కొట్టుకుంటూ కూర్చుంటారు..’ అని గొణుక్కుంది.

బంతి వచ్చి ఠపీమని గోడకు తగిలి ఆమె కాళ్ల దగ్గర కొచ్చింది. ఒక పిల్లాడు రివ్వున వచ్చి బంతి అందుకుని పరుగెత్తాడు. ఆమె పెద్దగానే తిట్టింది. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ‘నో బాల్’ అని అరుచుకుంటున్నారు.

స్కూలు నుంచి ఒక చిన్న పిల్ల స్కూలు డ్రెస్‍లో, వీపున బ్యాగ్, వాటర్ బాటిల్ తగిలించుకొని, వాటి బరువు వల్ల కొంచెం ముందుకు వంగి నడుస్తోంది. ఈసారి బంతి వచ్చి ఆ పిల్ల భుజానికి తగిలింది. విశాలాక్షమ్మ చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆ కుర్రాళ్ళను గట్టిగా తిట్టి పంపించేసింది. ఆ పిల్లను దగ్గరకు తీసుకొని, “ఏడవకు.. వాళ్ళు మనుషులు కాదు, గాడిదలు. అడ్డ గాడిదల్లా పెరిగారు. మనుషులు తిరిగే రోడ్ల మీద ఆటలేమిటి?.. మా తల్లే.. ఎంత దెబ్బ తగిలిందే నీకు” అంటూ ఓదార్చింది.

ఆ పిల్లను లోపలికి తీసుకెళ్ళి, కుర్చీలో కూర్చోబెట్టింది. మంచి నీళ్ళు ఇచ్చింది. ఏడుపు మొహం కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చింది.

“నీ పేరేంటి?” అని అడిగింది.

“పావని”

“ఏం చదువుతున్నావమ్మా?”

“థర్డ్ క్లాస్”

“మీ ఇల్లు ఎక్కడ?”

“ఇటెళ్లి అటెళ్లాలి”

“మీ నాన్న ఏం చేస్తాడు?”

“బ్యాంక్‍లో మేనేజర్”

వాళ్ళమ్మ కూడా ఉద్యోగం చేస్తోందనీ, ఇద్దరూ సాయంత్రం ఆరు గంటలకు గానీ ఇంటికి రారనీ చెప్పింది పావని. అయితే కాసేపు కూర్చోమన్నది.

విశాలాక్షమ్మ కాఫీ తాగుతూ పావనికీ ఇచ్చింది.

“మీ అమ్మా, నాన్నా వచ్చేదాకా ఎక్కడుంటావు?”

“గుమ్మం ముందు కూర్చుని హోం వర్క్ చేసుకుంటాను” అన్నది పావని.

“చిన్నపిల్లవు. ఒక్కదానివి, తిండీ తిప్పలు లేకుండా, ఒక్కదానివీ గుమ్మం ముందు పడి ఉంటావా? ఏం ఉద్యోగాలో, ఏం సంపాదనలో? పిల్లల ఆలనాపాలనా చూసే దిక్కు లేకపోయాకా ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం?” అని విశాలాక్షమ్మ సగం స్వగతం గానూ, సగం ఆ పిల్ల తోను అన్నది.

పావని కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది.

విశాలాక్షమ్మకు మనమరాలు గుర్తొచ్చింది. దీప్తి.. అదీ ఇలాగే ఉంటుంది. ఆ పిల్ల మీద ఆమెకు వల్లమాలిన మమకారం. దాన్ని అనుక్షణం తన దగ్గరే ఉంచుకోవాలని ఆరాటం. కానీ దాన్ని ఆమె దగ్గరకు రానివ్వరు. ఒక క్షణం ఆ పిల్ల దగ్గరకొచ్చినా, వెంటనే దాన్ని పిలిచి ఏవో పనులు చెప్పి అవతలకు పంపిస్తారు.

“ఈ ముసలోళ్ళ దగ్గరకు పిల్లలకు చేరనిస్తే, వాళ్ళ బుద్ధులూ, వాళ్ళ అలవాట్లు అవే అబ్బుతాయి. వాటిని వదిలించడం కష్టం” అని కోడలు స్పష్టంగా కొడుకుతో చెబుతూనే ఉంటుంది. కోడలు తనను ఎందుకూ పనికిమాలిన దానిలాగా చూడడం ఒక ఎత్తు అయితే, కొడుకు మౌనంగా, కోడలు మాటలు ఆమోదించటం ఒక ఎత్తు.

బతకటానికి కూడూ, గుడ్డ, నీడ అవసరం. కానీ మనిషిగా బ్రతకటానికి ఆత్మగౌరవం అంతకన్నా ఎక్కువ అవసరం. అందుచేత ఆమె కొడుకూ, కోడలికి దూరంగా, విడిగా ఒక్కత్తే ఉంటోంది. ఇక్కడ ఆమెకు ఫోన్లు లేవు. సోఫాలు, ఏ.సి. రూంలూ లేవు. అలాగే అవమానాలు, అమర్యాదలు లేవు. “కాళ్లకు అడ్డం పడుతోంది” అంటూ విసుక్కునేవారు లేరు.

మర్నాడు నాలుగు గంటలకు గుమ్మం దగ్గర నిలబడింది. నిన్న జరిగిన దానికి గొడవ అవుతుందని భయపడ్డారేమో, ఇవాళ క్రికెట్ వీరులు రోడ్డు ఎక్కలేదు. వాళ్ళ అరుపులూ, కేకలూ లేనందువల్ల కొంత ప్రశాంతంగానూ ఉంది.

నిన్నటి లాగానే ఆ పిల్ల.. స్కూలు యూనిఫాంలో వీపున పుస్తకాల సంచీతో కొద్దిగా ముందుకు వంగి నడుస్తూ వస్తోంది.

విశాలాక్షమ్మ పావనిని చూసి నవ్వింది. ఆ పిల్ల ఆగిపోయింది. జేబులో నుంచి చాక్లెట్ తీసి ఆమెకు ఇచ్చింది.

“ఏంటిది?” అని అడిగిందామె.

“నిన్న మీరు బంతి తగిలితే హెల్ప్ చేశారుగా.. అందుకని..” అన్నది పావని.

విశాలాక్షమ్మ పావనిని లోపలికి తీసుకెళ్ళింది. కుర్చీలో కూర్చోబెట్టింది. మంచినీళ్ళు ఇచ్చింది. కాఫీ కూడా ఇచ్చింది.

ఆమెకు ఒకప్పటి విషయం గుర్తొచ్చింది. తన మనమరాలు లడ్డూ తింటూ తన దగ్గరకు వచ్చింది. ఆమె ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. మనమరాలు తన నోట్లో లడ్డూ పెట్టబోయింది. వెనుక నుంచి కోడలి గొంతు ఖంగుమని మోగింది.

“పసిపిల్ల నోట్లోది తీసుకోవటానికి సిగ్గుండాలి..” అని.

గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అలాంటి అవమానాలు ఆమెకు కొత్త ఏమీ కాదు. ఏడుస్తూనే అన్నీ భరించింది అప్పట్లో.

“ఎందుకు బామ్మా, ఏడుస్తున్నావు?” అని అడిగింది పావని.

“ఏం లేదు” అని కన్నీళ్ళు తుడుచుకుందామె.

ఇంటికి వెళ్తాలని లేచింది పావని.

“మీ అమ్మా నాన్నా వచ్చేదాకా ఇక్కడే హోం వర్క్ చేసుకోమ్మా. నేను నీకు తోడుగా ఉంటాను” అన్నది విశాలాక్షమ్మ.

పావని సంచీలో నుంచి పుస్తకాలు తీసుకుని ముందు పరుచుకుని వాటి మీదకు వంగిపోయి హోం వర్క్ చేసుకుంటోంది.

“అలా కాదు, ఆ బూట్లు తీసేసి, కుదురుగా కూర్చో” అని చెప్పింది. “మంచి అలవాట్లు నేర్చుకోవాలి” అనీ అన్నది.

“దేనికి?” అని పావని అడిగింది.

“మన అలవాట్లే మన జీవితాలను మార్చివేస్తాయి”

“ఎలాగా?”

“ఒక అబ్బాయి ఒక కంపెనీ యజమాని గదిలోకి వెళ్ళి ఉద్యోగం ఇవ్వమని వినయంగా అడిగాడు. ప్రస్తుతం ఖాళీలు లేవు పొమ్మన్నాడు. ఆ కుర్రాడు వెళ్ళేందుకు వెనక్కి తిరిగాడు. కింద గుండుసూది కనిపించింది. దానిని తీసి కుర్రాడు యజమాని టేబుల్ మీదున్న పిన్ కుషన్‍లో పెట్టాడు. ‘నాకు గుచ్చుకోలేదు, కానీ ఎవరికైనా గుచ్చుకోవచ్చు’ అన్నాడు ఆ కుర్రాడు. ఆ యజమాని అతని అలవాటుకు సంతోషించి ‘మాకు మీలాంటి వాళ్ళు కావాలి’ అంటూ అతనికి ఉద్యోగం ఇచ్చాడు. ఇది మన అలవాట్లు మన జీవితాలను ఎలా మారుస్తాయో తెలియజేసే కథ..” అన్నదామె.

పావని, విశాలాక్షమ్మకు స్నేహం కుదిరింది. రోజూ రెండు గంటలు కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆమె దగ్గర నేర్చుకున్న విషయాలు పావని స్కూల్లోని తన ఫ్రెండ్స్‌కు చెప్పేది. అలా పావని అందరిలో గొప్పదానిగా మారిపోయింది.

ఆ రోజు పావని పుట్టినరోజు. కొత్త బట్టలు కట్టుకొని ముఖానికి బోలెడంత సంతోషాన్ని పులుముకొని స్వీట్స్ తీసుకొని వచ్చింది. పావని తల్లి కూడా వచ్చింది.

పావని తల్లి ఆమెతో “మా అమ్మాయి మీ గురించి రోజూ ఎన్నో విషయాలు చెబుతుంది. నిజానికి మేం మా అమ్మాయితో తగినంత సమయం గడపలేకపోతున్నాం. దగ్గరుండి దానికి ఎన్నో నేర్పాల్సిన సమయలో మేం ఏమీ చేయలేకపోతున్నాం. మేము చేయలేని పనిని మీరు చేస్తున్నారు” అన్నది.

“ఈ రోజుల్లో పిల్లల్ని ప్రయోజకులను చేయటానికి డబ్బూ అవసరమే. ఇప్పుడు మీరు కష్టపడి సంపాదిస్తున్నదంతా మీ పిల్ల కోసమే కదా.. ఇక నేనూ ఒంటరిదాన్ని. నాకూ కాలక్షేపం అవుతోంది. అందుచేత మీరు ఏమీ బాధపడకండి. మీరు ఇంటికి వచ్చేదాకా పిల్ల సంగతి నేను చూసుకుంటాను” అన్నది విశాలాక్షమ్మ.

సాయంత్రం పావనిని తనతో తీసుకువెళ్ళి, ఆ పిల్లకు డ్రెస్ కొన్నది. పావని ఆ డ్రెస్ వేసుకున్నాకా, ఆ పిల్లతో కల్సి ఫొటో తీయించుకుని ఇంట్లో పెట్టుకుంది.

ఒకసారి ఇలాగే దీప్తికి డ్రెస్ కొన్నది. కోడలికి నచ్చలేదు.

“ముష్టి డ్రెస్.. ఇంత చీప్ డ్రెస్ ఎవడిక్కావాలి?” అంటూ తన ముందే పనిమనిషికి ఇచ్చేసింది.

తన కోడలికీ, పావని తల్లికీ మధ్య గల తేడాను బేరీజు వేసుకుంది. అక్కడ అనుబంధం ఉంది, ఆత్మీయత లేదు. ఇక్కడ అనుబంధం లేదు, ఆత్మీయత ఉంది.

ఒకరోజు విశాలాక్షమ్మ కొడుకూ, కోడలూ చూసి పోదామని వచ్చారు. పావని ఫొటో చూసి ఎవరూ అని అడిగాడు కొడుకు.

“ఎవరో దారినపోయే అమ్మాయి. పలకరించాను. కాలక్షేపం కోసం స్నేహం చేస్తున్నాను” అన్నది.

“ముసలామెకూ, పసిదానికీ స్నేహం ఏమిటి? అంతే లెండి. ముందొచ్చిన చెవుల కన్న, వెనక వచ్చిన కొమ్ములు వాడి” అన్నది కోడలు. దీప్తిని కాదని ఈ పిల్లను చేరువ చేసుకున్నందుకు, కోడలు ఇచ్చిన కితాబు అది.

పావని తల్లికి ట్రాన్స్‌ఫర్ అయింది. భార్యాభర్తలు ఇద్దరూ ఊరు విడిచి వెళ్తున్నారు. ఆ విషయం చెప్పటానికి వచ్చారు. ఆమె మనసు బాణం దెబ్బ తిన్న లేడిపిల్లలా గిలగిల్లాడిపోయింది.

“దేవుడు ఒక తలుపు మూసినా, మరో తలుపు తెరిచాడని సంతోషించాను. కానీ అదీ మూడునాళ్ళ ముచ్చటే అయింది..” అని బాధపడింది.

పావని తల్లి తన మనసులోని మాట చెప్పింది. “మేము కొత్త చోటుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మేము కుదుట పడి, దీని చదవు కోసం మరో స్కూలు అదీ వెతుక్కోవాలి. సంవత్సరం మధ్యలో అడ్మిషన్ అంటే కష్టం. మీరు ఏమీ అనుకోకపోతే, పాప మీకు బాగా మాలిమి అయింది గనుక, ఈ విద్యా సంవత్సరం అయ్యేదాకా కొద్ది నెలలు మీ దగ్గర ఉంచుకొంటే, దానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాం” అన్నది.

“పావని నా దగ్గర ఉండటం కంటే నాకు కావల్సిందేముంది? రోగీ పాలే కోరాడు, వైద్యుడూ పాలే తాగమని చెప్పాడు అన్నట్టు మీకు వచ్చిన ఆలోచనే నాకూ వచ్చింది” అన్నది విశాలాక్షమ్మ.

పావని విశాలాక్షమ్మ దగ్గర ఉండి చదువుకుంటోంది.

ఈ విషయం తెల్సి ఆమె కోడలు అన్నది “ఈ వయసులో ఈ లంపటాలన్నీ తగిలించుకున్నావేమిటి? దారినపోయే వాళ్ళు కలుస్తుంటారు, విడిపోతుంటారు. అంత మాత్రాన అయినవాళ్ళతో సమానం అవుతారా? అంతగా కావాలనుకుంటే సొంత మనమరాలినే మీ దగ్గర పెట్టుకోండి” అని.

“నేను ముసలిదాన్ని. నాగరికతకు అర్థం తెలియనిదాన్ని. మీ పిల్లను మీ స్థాయికి తగినట్లుగా పెంచలేను. అందుచేత అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు.. ఇక ఈ పిల్ల విషయంలో వాళ్ళ అవసరం వాళ్ళది. నా అవసరం నాది.. మనసుకు నచ్చితే, అన్నీ బాగానే ఉంటాయి” అన్నది విశాలాక్షమ్మ.

అలా.. ఒకటి.. రెండు.. మూడు.. కొన్ని ఏళ్ళు గడిచాయి. పావని ఆమె దగ్గరే ఉండిపోయింది. ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుపోయింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

పావనికి పాతికేళ్ళు వచ్చాయి. విశాలాక్షమ్మ మంచి సంబంధం చూసింది. దగ్గరుండి పెళ్ళి చేసింది.

పావని నాయనమ్మ కాని నాయనమ్మను కౌగిలించుకుని ఏడ్చింది.

“నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి బామ్మా” అన్నది పావని కన్నీళ్ళు తుడుచుకుని.

“ఆస్తులు, ఐశ్వర్యాలు లాగానే మంచి స్నేహితులు దొరకటమూ ఒక అదృష్టమే.. ఆడపిల్లకు భర్తను మించిన బెస్ట్ ఫ్రెండ్ ఉండడు. ఇప్పుడు నీకు జీవితాంతం నీతో కల్సి ఉండే బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. ఇంక అతనే అన్నీ నీకు” అంటూ విశాలాక్షమ్మ పావనిని, ఆ పెళ్ళికొడుకుకి అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here