[dropcap]ప్ర[/dropcap]సిద్ధ కవి, రచయిత శ్రీ గుండాన జోగారావు రచించిన చిన్న కథల, నానో కథలతో వెలువడిన సంపుటి ‘జీవిక’.
“ఇందు పొందుపరిచిన అత్యధిక శాతం కథలు వివిధ రూపాల్లో మానవ జీవన సంఘర్షణ నేపథ్యంతో ముడిపడి బ్రతుకుతెరువుకీ, మెతుకు పోరుకీ ప్రతీకలు. నా సాహితీ ప్రపంచయాత్రలో నాకు కనిపించిన, కదిలించిన మానవీయ అమానవీయ దృశ్యాల్ని కథలుగా రూపొందించి ఒక అప్రమత్త సందేశాన్ని అందించడానికి ప్రయత్నం చేసాను” అన్నారు రచయిత ఈ కథల గురించి.
‘చదవాల్సిన కథలే ఇవి!’ అనే ముందుమాటలో “కథ పుట్టిన నాటి నుండి నేటి వరకూ వస్తోన్న అనేకానేక మధ్య తరగతి అత్తెసర బతుకుల కుతకుతలతో విసిగిస్తోన్న సమస్యలేవీ ఇందులో లేవు. పెన్నునే గన్నుగా చేసి, బడుగు వర్గాలకు వెన్నుగా నిలిచి, పోరాటమే ఊపిరిగా చేసే ఉద్యమ బాట వైపు నడిపించే కథావస్తువులు కావు. స్త్రీవాదమూ, దళితవాదమూ, అధివాస్తవిక ధోరణితోనూ సాగే కథలు కావు. ఇవేవీ కాకపోయినా, ‘ఇవీ కథలే’ అని పాఠకులను మరో కొత్త కోణం వైపు తీసుకెళ్ళి ఆలోచింపజేసే అద్భుత రచనా శిల్పాలివి” అని వ్యాఖ్యానించారు శ్రీ పి.వి.బి. శ్రీరామమూర్తి.
***
రౌలి – లిల్లిగుమ్మ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై పెట్రోలింగ్ చేసే ఉద్యోగంలో ఉన్న గురువులు నిజాయితీపరుడు. తన విధులని అత్యంత బాధ్యతతో నిర్వహించాలనుకునే వ్యక్తి. గ్యాంగ్‌మన్‍గా ఉన్న తన బావమరిది ఈరాసామిని పెట్రోలింగ్‍లో తనకి జూనియర్‍గా వేయించుకుంటాడు. ఈరాసామి విధులను నిర్లక్ష్యం చేస్తుంటే మందలిస్తాడు. అయితే గురువులుకి ఓ సమస్య ఎదురవుతుంది. తండ్రి ఉద్యోగంలోకి ప్రవేశించాలనుకుంటాడు అతని పెద్ద కొడుకు. తండ్రిని అన్‌ఫిట్ సర్టిఫికెట్ పెట్టమని, అలా చేస్తే ఆ ఉద్యోగం తనకి వస్తుందని ఒత్తిడి చేస్తుంటాడు. అయితే కొడుకు స్వభావం తెలిసిన గురువులు అందుకు ఒప్పుకోడు. ఒకరోజు డ్యూటీకి వెళ్తుండగా, దారిలో పులి సంచరిస్తోందని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు స్టేషన్ మాస్టర్. ఆ రాత్రి పనిలో ఉండగా, వెనుక నుండి పులి గాండ్రింపు వినబడుతుంది. బెదిరిపోయిన గురువులు లోయలోకి జారి చనిపోతాడు. మానవతా దృక్పథంతో అతడికి కొడుకుకి ఉద్యోగం ఇస్తుంది రైల్వేశాఖ. మనుషుల్లో పెరిగిపోతున్న స్వార్థం, కుటుంబ సంబంధాలను నాశనం చేయడంలో వెనుకాడదని ‘రౌలి పులి’ కథ చెబుతుంది.
అనాథ పిల్లల్ని యాచకులుగా మారుస్తున్న ‘చైల్డ్ మాఫియా’ గురించి ప్రస్తావించిన కథ ‘గారడీ’. మనవడిని కాపాడుకోవాలన్న తపనతో స్టేషన్‍లో ఆగిన గూడ్సు రైలు నుంచి బొగ్గుల చోరీకి పాల్పడిన బామ్మ కథ ‘దొంగ’. జీవితపు దుర్భర పరిస్థితుల పట్ల, నిస్సహాయ స్థితిలో నిలిచిపోవడం వల్ల వేదనకి గురి చేస్తాయి ఈ కథలు.
చిరుద్యోగులు, అల్పాదాయం కలిగిన వ్యక్తులు తమ మధ్య ఉన్న ప్రేమాభిమానాలను ఎలా నిలుపుకోడానికి ప్రయత్నిస్తారో చెప్పిన కథ ‘సంచి’. ఈ కథలో చెల్లెలు చేసిన పని పాఠకుల హృదయాలను తాకుతుంది.
స్వార్థపరులతో చేతులు కలిపి, లంచాలు మరిగి రైల్వే స్టేషన్‍లో ప్రయాణీకులు నగలను/ఆభరణాలను పోగొట్టుకోవడానికి కారకుడవుతుంటాడు రైల్వే విద్యుత్ ఉద్యోగి ముకుందం. ఓ రోజు అతని కూతురు పుట్టింటికి వస్తున్నప్పుడు స్టేషన్‍లో బండి దిగగానే, ఆమె మెడలోని గొలుసుని దొంగిలిస్తారు. దొంగతనాలు చేసే ముఠాతో తనకీ సంబంధం ఉండడం వల్ల, పోలీసు కంప్లయింట్ ఇవ్వకుండా తేలు కుట్టిన దొంగలా ఉండిపోతాడు. కానీ ఆ సంఘటన అతన్ని మారుస్తుంది. కష్టం మీద ప్రయత్నించి తన స్వభావాన్ని మార్చుకుని నిజాయితీ అలవర్చుకుంటాడు. ‘లైట్లు ఆరుతున్నాయి’ కథ ఓ వ్యక్తిలో ప్రతికూల ధోరణితో ప్రారంభమై అతనిలో సానుకూల ధోరణి కలగడంతో ముగుస్తుంది.
రోజంతా సెల్‍ఫోన్‍లో ఉబుసుపోని కబుర్లతో కాలం గడిపేసే వందలాది వాట్సప్ గ్రూపులున్న ఈ రోజుల్లో ఓ వాట్సప్ గ్రూప్ ఓ వృద్ధుడి ఆరోగ్యం కాపాడడంలో ఎలా తోడ్పడిందో ‘తోడు’ కథ చెబుతుంది. తన క్రింద పనిచేసే బంట్రోతును వేరే చోటకి బదిలీ చేయించడంలో పై అధికారి అంతరంగంలోని వికారాన్ని వెల్లడిస్తుంది ‘కాంప్లెక్స్’ కథ.
విశాఖపట్నం విజయనగరం మద్య నడిచే లోకల్ రైల్లో ప్రయాణించే చిరుద్యోగి గోవిందు – చప్పట్లు కొడుతూ రైల్లో డబ్బులు అడిగే హిజ్రా రోజీని చీదరించుకుంటాడు. అయితే గోవిందు కుమారుడి జబ్బు చేసి, వైద్యానికి చాలా డబ్బు అవసరమైనప్పుడు రైల్లో రోజీ తారసపడి సాయం చేస్తుంది. గోవిందు కుమారుడికి ఆపరేషన్ అయ్యాకా, రైల్లో అందరూ చప్పట్లు కొడుతూ రోజీని అభినందిస్తారు. తన కుమారుడిని కాపాడడంలో తోడ్పడిన రోజీకి మౌన ప్రణామాలు చేస్తాడు గోవిందు. ‘చప్పట్లు’ కథ మనుషుల్లో ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్న మానవత్వాన్ని చాటుతుంది.
‘కన్నప్రేమ’ కథ పాఠకుల ఊహకి అందని మలుపుతో ముగుస్తుంది. తన సొంత ఊరినే వెలివేసే పరిస్థితులు కామేశానికి ఎందుకు తటస్థించాయో ‘నాకో తోడు.. నీకో నీడ’ కథ చెబుతుంది. నిజానిజాలు పట్టించుకోకుండా మనుషులపై తప్పుడు ముద్రలు వేసే సంఘపు ప్రతినిధులు ఈ కథలో తారసపడతారు.
ఒక దొంగ మనిషిగా మారాలనుకున్నప్పుడు ఎదురైన సమస్యలని చెబుతుంది ‘తీర్పు’ కథ. నేరాలు వ్యవస్థీకృతమైపోతున్నప్పుడు వ్యక్తులని శిక్షించినంత మాత్రానా ఆగుతాయా అని ఈ కథ ప్రశ్నిస్తుంది. దొంగ వస్తువును అమ్మినవాడి ఎంత తప్పో కొన్నవాడిదీ అంతే తప్పని చెబుతుంది ‘ప్రక్షాళన’ కథ. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైల్లో సూట్‍కేస్ దొంగతనం చేసినా, సూట్‍కేస్ సొంతదారుకి మంచి జరగాలని కోరుకున్న ఓ మంచి దొంగ కథ ‘అనూహ్యం’.
కొత్త బంధాలు కోరుకుంటున్నప్పుడు పాత బాధ్యతలను విస్మరించకూడదని ‘బంధం’ కథ చెబుతుంది. ‘గుప్పెడు కష్టాలూ.. కడివెడు కన్నీళ్ళూ’ కరోనా కాలంనాటి వెతలపై అందించిన చిన్న కథ. దొర చేతిలో మోసపోయి జైలు పాలయిన సాంబయ్య కథ ‘నిచ్చెన’. అమాయక నిరక్షరాస్యులని తమ రాజకీయ క్రీడలో కామందులు ఎలా పావులుగా వాడుకుంటారో ఈ కథ చెబుతుంది. తండ్రి మాట కాదని తప్పు చేసిన పుష్ప తెలివిగా తను తప్పును సరి చేసుకున్న వైనాన్ని ‘ఇది మరో దిద్దుబాటు’ కథ చెబుతుంది.
అవినీతిపరుడైన ప్రసాద్ అనే రైల్వే టిసి తప్పు చేస్తూ పై అధికారులకి దొరికిపోయి, మానసిక వ్యథకి గురై, అతి కష్టం మీద సస్పెన్షన్‍ని రివోక్ చేయించుకోగలుగుతాడు. ఈ క్రమంలో అతనికి తన తప్పు తెలుస్తుంది. అవినీతి సొమ్ముతో కొత్తగా అలవాటు చేసుకున్న జీవన శైలిని – మామూలుగా మార్చుకోలేకపోతాడు. ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతాడు. అయితే కొన్ని రోజులకి విచారణలో అతను చేసిన తప్పు ఋజువై శిక్షగా హోదా తగ్గించి, క్లాసు ఫోర్‍గా టిటి పోర్టర్‌గా మారుస్తారు పై అధికారులు. అవినీతికి పాల్పడేవాళ్ళకి హెచ్చరిక ‘వైకుంఠపాళి’ కథ.
‘స్పెషల్ డెలివరీ’ కథ – బిడ్డల ఆదరణ దక్కని నేటి వయోవృద్ధులకు అవసరమైనదేమిటో చెప్తుంది. మామూలుగా ఒకరి సాంగత్యాన్నొకరు ఇష్టపడిని ఇరుగుపొరుగు వారు – కరోనా కాలంలో తోటివారికి ఎలా సాయం చేశారో ‘ప్యాకెట్’ కథ చెబుతుంది.
రైల్వే టిసిల వెతలని చెప్పే కథ ‘పదహారు గంటల మనిషి’. రైల్వే టిసిలు అవినీతిపరులన్న అభిప్రాయం అందరి పట్ల సరైనది కాదని చెబుతుందీ కథ. అయితే నలుపు కోటు వేసుకుని మనసునీ నలుపు చేసుకున్న ఓ టిటి గురించి ‘లాంగ్ మార్చ్’ కథ చెబుతుంది. మొదట సక్రమంగా విధులు నిర్వహించి, ఆ పై ఒత్తిడులకి లొంగిపోయి అవినీతికి ఆస్కారమిస్తూ, మానసికంగా నలిగినపోయిన ఆ టిటి చివరకు పాసింజర్ టైన్ నుంచి గూడ్స్ ట్రైన్‍కి గార్డుగా వెళ్ళి తన స్వచ్ఛతని కాపాడుకుంటాడు.
వ్యక్తిగత జీవితంలో నిబద్ధత కోల్పోకుండా ఉండేందుకు ఓ రైల్వే గార్డు చేసిన ప్రయత్నాన్ని ‘దిగజారుడు బల్ల’ కథ వెల్లడిస్తుంది. అవయవ దానం చేసి, తాను చనిపోయినా, ముగ్గురి జీవితాలని నిలిపిన ఓ హిజ్రా కథ ‘ఒక దీవెన.. మూడు హేళనలు’. రైలు ప్రయాణం నేపథ్యంగా సాగిన ఈ ఆర్ద్రమైన కథలో హిజ్రాల స్థితిగతులను అతి తక్కువ వాక్యాలలో గొప్పగా చెప్పారు రచయిత.
బ్రతుకుపోరులో ఓటమిని అంగీకరించక ముందుకు సాగిన ఓ మహిళ కథ ‘పొట్టమ్మ’. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఓ ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్‍ని పొట్టమ్మ కాపాడుతుంది. కానీ రైల్వే సిబ్బంది మాత్రం పొట్టమ్మకి అవసరమైన సాయం చేయలేకపోతారు.
సినిమాల్లో హీరోయిన్ అయిపోవాలని ఇంట్లో చెప్పకుండా మద్రాస్ వచ్చిన సుమ తాను అనుకున్నట్టుగా హీరోయిన్ వందనని కలవగలుగుతుంది. తన డైరీ ద్వారా తన కథని సుమకి తెలిపి, ఆమె తల్లితండ్రులను పిలిపించి సుమని వాళ్ళ ఊరికి పంపించేస్తుంది వందన. ‘ఈ బ్రతుకు నీకొద్దు చెల్లీ’ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
‘ఎదురీత’ కథ భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుతుంది. ‘జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది. అదే భవిష్యత్తు..’ అనే సందేశమిస్తుంది. అవినీతికి పాల్పడి ఎం.ఆర్.ఓ.గా ఎదిగిన మాజీ స్నేహితుడికి సాయం చేసి – అతడిలో మార్పుకు కారణమవుతుంది నీరజ ‘హితైషి’ కథలో.
పేదరికాన్ని జయించటానికి, కష్టపడి సైన్యంలోకి ఎంపికయిన గ్రామీణ యువకుడి కథ ‘సాధనమున..’. ఈ పుస్తకంలోని మరికొన్ని కథలు వర్తమాన సమాజానికి అద్దం పడుతూ సాగేవే.
***
ఈ కథలలో ఒకటి రెండు తప్ప, మిగతావన్నీ రెండు-మూడు పేజీల కథలే. వేగంగా చదివింపజేస్తాయి. రచయితగా జోగారావు గారిది సరళమైన శైలి. కొన్ని కథలలో జటిలమైన పరిస్థితులను కూడా చిన్న చిన్న పదాలతో వర్ణిస్తూ, సన్నివేశానికి అవసరమైన గంభీరతని తేగలిగారు. చాలా కథలు క్లుప్తంగా ఉండి, చురుక్కుమనిపిస్తాయి. ముఖ్యంగా నానో కథలు – నాలుగైదు వాక్యాలలో ఉండి పాఠకులని ఆకట్టుకుంటాయి. సమాజంలోని వ్యక్తుల జీవితాలలోని చీకటి వెలుగులను కథలుగా మలచిన తీరు విశిష్టం!
రచయిత రైల్వేశాఖలో 35 ఏళ్ళపాటు ఉద్యోగం చేసినందున చాలా కథల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, స్టేషన్ పరిసరాలు, రైల్వే ఉద్యోగులు, రైల్వే పరిబాష ఉండటం సహజమే. అత్యంత నైపుణ్యంతో పాఠకులని ఆయా కథల వాతావారణంలోకి తీసుకువెడతారు రచయిత. కొన్ని కథలు చదువుతుంటే – పాఠకులు కూడా పాత్రలై, ఆ కథలోని పరిసరాలలో తచ్చాడిన అనుభూతి కలుగుతుంది. తన కథల ద్వారా కొన్ని సామాజిక సమస్యలకి – యోగ్యమైన పరిష్కరాలుగా తాను భావించినవాటిని సూచిస్తారు రచయిత.
ఈ కథలన్నీ చదివాక, ఒక మంచి పుస్తకం చదివిన భావన పాఠకులలో కలుగుతుందని నా అభిప్రాయం.
***
జీవిక (కథా సంపుటి)
రచన: గుండాన జోగారావు
ప్రచురణ: సమత పబ్లిషర్స్, విశాఖపట్టణం
పేజీలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
శ్రీమతి జి. సరళ
డోర్ నెం. 6-253/6, శ్రీ సాయి నగర్ కాలనీ,
సింహాచలం పోస్ట్,
విశాఖపట్టణం -530028
ఫోన్: 9490185708, 9441571260