[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
కుక్క తోక పుచ్చుకుని గోదావరి ఈదటం
[dropcap]కా[/dropcap]లింగ్ బెల్ చప్పుడుకి ‘ఈ టైంలో ఎవరో’ అనుకుంటూ జయశ్రీ మంచం దిగి.. రేగిన జుట్టు సవరించుకుని.. వాకిలి దగ్గరకి నడిచింది.
మధ్యాహ్నం నిద్రే అయినా.. పొద్దుటి నించి చేసిన పని అలసట వల్ల.. ఎండ వల్ల, నిద్ర పూర్తిగా తీరక ఆవులిస్తూనే తలుపు తీసింది.
ఎదురుగా అక్క కొడుకు భాస్కర్‌ని చూసి “ఎక్కడి నించి రా రాక. ఇంత ఎండన పడి వచ్చావ్? రా లోపలికి” అంటూ లోపలికెళ్ళి మంచి నీళ్ళు తెచ్చిచ్చింది.
“మా ఫ్రెండ్ అక్క కొడుకు పెళ్ళి. వాడు బలవంత పెట్టి నన్ను కూడా తీసుకొచ్చాడు. ఎలాగూ మన శ్రేయ పెళ్ళి కూడా కుదిరింది కదా! ఇంటికి సున్నాలు.. రంగులు వెయ్యాలి. పెళ్ళికి నేను చెయ్యాల్సిన పనులు.. ఇతర పెళ్ళిమాటలు.. వగైరా వగైరా ఉంటాయి కదా. అన్నీ మాట్లాడినట్టుంటుంది అని రెండు రోజులు సెలవు పెట్టుకుని వచ్చా పిన్నీ” అన్నాడు.
మార్చి నెల మొదటివారంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
“అవునురా ఇక రెణ్ణెల్లే ఉంది. సున్నాల పని మొదలుపెడితే అప్పటికి తెములుస్తారో లేదో తెలియదు. ముందు బానే చెబుతారు కానీ.. తీరా పనిలో దిగాక పని వాళ్ళ సంగతి తెలియనిది ఏముంది.. దైవాధీనమే! ముందుగానే డబ్బు పుచ్చేసుకుని.. మెటీరియల్ తెచ్చి ఇల్లు నింపుతారు. ఆ తరువాత ఫోన్లు ఎత్తరు.. తుపాకీ గుండుకి దొరకరు.. వస్తారో.. రారో తెలియదు.”
“పనులు చేసుకోవటానికి బయటికి వెళ్ళాలంటే వస్తారేమో అని ఎదురు చూడటం.. పన్నెండు గంటలైనా అజ పజ ఉండరు.”
“ఈ ఎండల్లో పొద్దున్నే బయలుదేరితే ఎండన పడకుండా పనులు చేసుకు రాగలం.. కానీ ఒంటి గంటకి బయలుదేరితే వడదెబ్బ కొట్టటమే కానీ పట్టుమని నాలుగు పనులు కూడా కావు. అందుకే సున్నాల పని పెట్టుకోదలచుకోలేదురా!”
“పెళ్ళి ఎటూ హాల్లోనే చేస్తాం! ముహూర్తం సాయంత్రం ఏడింటికి కాబట్టి మన తరఫు వాళ్ళు కూడా డైరెక్ట్‌గా హాల్ కే వచ్చి.. అటు నించటే వెళతారు.”
“పెళ్ళివారు హాల్ నించే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పెళ్ళి తంతు జరిపే వరకు మనకి పని ఉంటుంది. ఆ మూడు ముళ్ళు పడ్డాక పిల్లా.. పిల్లాడు వాళ్ళ దారిన వాళ్ళు ఎటో చెక్కేస్తారు.”
“మనింటికి వచ్చేదెవరు? ఏదో పెళ్ళి అనేది శుభకార్యం కనుక రంగులు.. సున్నాలు వేస్తే బానే ఉంటుంది. మంగళం! కానీ చేతిలో మనుషులు లేక.. మగ దక్షత లేని నా బోటి వాళ్ళకి ఇవన్నీ జరిగేవి కావు. అందుకే సున్నాల పని పెట్టుకోదల్చుకోలేదబ్బాయ్” అన్నది జయశ్రీ స్థిర నిశ్చయంతో!
“భలే దానివి పిన్నీ.. మేమంతా లేమా? ఉన్న ఒక్క పిల్లకి పెళ్ళి చేసేటప్పుడు రాజీ పడటం ఎందుకు? మా ఫ్రెండ్ అక్క కొడుకు పెళ్ళి అన్నాను కదా! వాళ్ళకి తెలిసిన మంచి పని వాళ్ళున్నారు. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళికి వాళ్ళే రంగులు వేశారు. ఇల్లు చక్కగా కొత్త కళగా ఉన్నది.”
“అసలు సున్నాలు వేస్తూనే సగం పెళ్ళి కళ వచ్చేస్తుంది. నేను మా ఫ్రెండ్ అక్కతో మాట్లాడి వాళ్ళనే ఫిక్స్ చేస్తాను. వాళ్ళ రేట్స్ కూడా చాలా రీజనబుల్‌ట. నేను ఉండగానే రంగులు కొని, మనుషులని మాట్లాడి వెళతాను. రోజూ ఫోన్ చేసి పని ఎంతవరకు అయిందో కనుక్కుంటుంటాను.”
“మధ్యలో వచ్చి చూసి వెళతాను. ఎంత!.. మీ ఇంటి సైజుకి.. గోడల సున్నాలు.. కిటికీలు, తలుపులు రంగులతో కలిపి ఐదు రోజుల్లో ఐపోతుంది. నేను ఇప్పుడే కనుక్కుంటానుండు” అని ఫోన్ చేశాడు ఫ్రెండ్ అక్క వాణికి.
ఆవిడ ఫోన్‌లో ఏం మాట్లాడిందో తెలియదు కానీ.. “ఆ అలాగే. నేను ఇప్పుడే వచ్చి మీకు ఆ పెయింటర్స్ మెటీరియల్ ఎక్కడ కొన్నారో కనుక్కుని అక్కడే కొనేసి పిన్ని వాళ్ళింట్లో పెట్టేసి వెళతాను. రేపటి నించి పని మొదలుపెట్టమందాము” అని ఫోన్ పెట్టేశాడు.
“పిన్నీ.. మెటీరియల్, లేబర్ చార్జిలు కలిపి ఏభై వేలు అవుతుందిట. ముందు ఇరవై వేలు ఇవ్వు. వెళ్ళి పెయింటర్‌తో మాట్లాడి.. రంగులు తెచ్చి ఇంట్లో పెడతాను. రేపు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆవిడని కూడా కొంచెం నీతోనూ.. పని వాళ్ళతోను టచ్‌లో ఉండమంటాను”
“నేను మళ్ళీ రెండు రోజుల్లో వస్తాను” అని పిన్ని దగ్గర డబ్బు తీసుకుని బజారుకెళ్ళి పెయింట్స్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళాడు భాస్కర్.
800 చ. అడుగుల ఇల్లు.. అందులోను పెళ్ళి జరగబోయే ఇల్లు.
ఇల్లు.. ఇంటి ముందు బాల్కనీ రంగు డబ్బాలతో నిండి పోయింది. కాలు కదిపే చోటు లేదు.
మరునాడు నిద్ర లేస్తూనే భాస్కర్ ఇచ్చి వెళ్ళిన పెయింటర్‌కి ఫోన్ చేసింది.
“పది గంటలకల్లా వచ్చేస్తానమ్మా” అని చెప్పిన మనిషి 11.30 కి వచ్చాడు. గరుకు కాయితం తీసుకుని అతని అసిస్టెంట్స్.. ముందు హాల్లో ఒకడు.. బెడ్ రూంలో ఒకడు గోడల మీద ఉన్న దుమ్ము దులపటం మొదలుపెట్టారు.
వీళ్ళకి ఆ పని అప్పచెప్పి మేస్త్రి బయటికెళ్ళాడు.
జయశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని పెళ్ళికి కొనాల్సిన బట్టలు, పిలవాల్సిన బంధువుల లిస్ట్ తయారు చేసుకుంటోంది.
“అమ్మా మంచి నీళ్ళిస్తావా.. పాత బట్ట ఇస్తావా.. స్టూల్ కావాలి” అంటూ మాటి మాటికీ పిలవటంతో జయశ్రీకి విసుగొచ్చింది. “అమ్మా చాయ్ తాగొస్తాం” అని వాళ్ళు బయటికెళ్ళగానే.. “హమ్మయ్యా కాసేపు నడుం వాల్చచ్చు” అనుకుని.. లిస్టులు పక్కన పెట్టి పడుకుంది.
ఇలా మంచం మీద వాలిందో.. లేదో బయట బాల్కనీలో పని చేసేవాడు “అమ్మా భోజనంలోకి ఏదైనా కూర ఉంటే ఇస్తారా” అని బెల్ కొట్టి మరీ అడిగాడు.
వాడికి కూర ఇచ్చి తలుపు వేసి వచ్చేసరికి చాయ్ తాగటానికి వెళ్ళిన బ్యాచ్ వచ్చి బెల్ కొట్టారు.
ఇలా ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి విసిగిపోయిన జయశ్రీ ‘భాస్కర్ సంగతి తెలిసి వాడి మాట నమ్మి సున్నాల పని మొదలుపెట్టి కొరివితో తల గోక్కున్నాను’ అనుకుంది.
మరునాడు ఉదయం తొమ్మిదయ్యేసరికల్లా మేస్త్రి వచ్చి ఏ రూంలో ఏ రంగులు వెయ్యాలో చెప్పి.. వాళ్ళకి రంగు డబ్బాలప్పచెప్పి పదయ్యేసరికి వెళ్ళిపోయాడు.
జయశ్రీ వంట పని ముగించుకుని హాల్లోకొచ్చేసరికి బెడ్ రూం కొరకు నిర్ణయించిన లేత నీలి రంగు డైనింగ్ ప్లేస్‌లో వేస్తున్నాడు.
బెడ్ రూంలో ఏమేస్తున్నాడో చూద్దామని అక్కడికెళ్ళింది. అక్కడ హాల్ కొరకు కేటాయించిన లేత ముత్యపు రంగు వేస్తున్నాడు.
ఈ గందరగోళాన్ని చూసి భాస్కర్‌కి ఫోన్ చేసింది. “ఏం పని వాడిని చూశావురా బాబూ! వాడు పట్టుమని పది నిముషాలు స్థిమితంగా నిలబడి పని చెయ్యడు.. చేయించడు. మనమొక రంగులు చెబితే వాడొక రంగులు వేశాడు.”
“వాడి అసిస్టెంట్స్‌కి ఏదో పని అప్పజెప్పి పాదరసం లాగా జారిపోతాడు. ఫోన్ చేస్తే తియ్యడు. సాయింత్రం వస్తే వస్తాడు.. లేకపోతే వాడి అసిస్టెంట్స్ తిరుపతి మంగలి వాడి లాగా.. అన్ని రూముల్లోను సగం సగం రంగులు వేసి ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి పోతున్నారు. రెండు రోజులకే.. నా తల ప్రాణం తోకకి వస్తోంది” అని గడ గడా పాఠం చదివింది.
“నేను ఆఫీసులో బిజీగా ఉన్నాను పిన్నీ. వాడికి రేపు ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు. అన్నీ అనుకున్నట్టు అయిపోతాయి. శ్రేయ పెళ్ళి ధూం ధాం గా చేద్దాం. ఇంకా టైముంది” అని జయశ్రీ చికాకుతో సంబంధం లేనట్టు.. చెప్పినది పెద్దగా పట్టించుకోనక్కరలేదు అన్నట్టుగా మాట్లాడాడు.
“ఇవ్వాళ్ళ వాడు రాలేదు. ఫోన్ తియ్యట్లేదు. ఈ పని ఇప్పుడు మధ్యలోనా ఆపలేను. కొత్త వాడినా పిలవలేను. వాడు వస్తే ‘చేసిన నిర్వాకం చాలు’ అని పంపించాలా.. ఎలాగోలా ఈ రొష్టు భరించి ఇంకో నాలుగు రోజులు బయట పనులు పెట్టుకోకుండా పూర్తి చేయించాలా?”
“ఇంటి నిండా రంగు డబ్బాలు, బ్రష్షులు, పాత గుడ్డలు ఎక్కడ అంటే అక్కడ పడేసి పోయాడు. నా సంగతి నాకు తెలిసుండీ నువ్వు చెప్పావని ముందు వెనకలు ఆలోచించకుండా రంగులేయించే పనిలోకి దిగటం కుక్క తోక పుచ్చుకుని గోదావరి ఈదటమే!”
“ఏం చేస్తాం.. బురదలో కాలేశాను! ఇంతకీ ఎప్పుడొస్తున్నావ్? నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చి దగ్గరుండి పని పూర్తి చేయించి వెళ్ళు. ‘వింటున్నావా’..” అన్నది బతిమాలుతున్నట్టు.
“అలాగే పిన్నీ. ఈ శుక్రవారం సెలవు పెడతాను. ఎటూ శని ఆదివారాలు సెలవులే కదా. మూడు రోజుల్లో పూర్తి చేయిస్తాలే. కంగారు పడకు. వచ్చేవారం నీ మార్కెటింగ్ పనులు చూసుకుందువు గాని” అన్నాడు భాస్కర్ పిన్నిని సముదాయిస్తున్నట్టు.
[గోదావరి నది ప్రవాహం బాగా ఉరవడితో ఉంటుంది. నది లోతు కూడా ఎక్కువే! కుక్క తోక వంకర.. ఆ వంకర సరి చెయ్యలేము అని మనందరికీ తెలుసు. అలా వంకరగా ఉండే కుక్క తోకని ఆధారంగా పుచ్చుకుని గోదావరి లాంటి నదిని ఈది ఆవలి ఒడ్డుకి దిగ్విజయంగా చేరటం దాదాపు అసాధ్యం.. లేదా ఒక పెద్ద సాహసం చెయ్యటమే! అలాంటి కష్టతరమైన పనుల్లోకి దిగేటప్పుడు ఈ సామెత వాడతారు]