[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]ఈ[/dropcap] ఎండాకాలం మన తెలుగిళ్ళలో ఓ పెద్ద పండుగ వంటి సంబరం, ప్రహసనం, అత్యంత ముఖ్యమైనది ఆవకాయ పెట్టడం అంటే కాదనే వారెవరూ లేరు.
ఒకానొకప్పుడు.. ఇరుగుపొరుగులు.. చుట్టాలు ఇలా అందరూ తలా ఒక హార్లిక్స్ సీసాడు తగ్గకుండా.. రుచి చూడండి అంటూ.. ఆవకాయ, మాగాయ, మెంతికాయ వగైరాలు శాంపిల్ ఆవకాయ ఇచ్చేవారు.. అవన్నీ కలిపితే ఓ జాడీడు అయిపోయేవి. నాలాంటిదైతే.. వాటితోనే ఏడాది గడిపేస్తుంది. ఏ ఇంట చూసినా వందకాయలకి తగ్గకుండా పెట్టేవారు కాబట్టి ఇలా పంపిణీలు కూడా ఉండేవి. పెళ్లి అయాక దాదాపు పది పదిహేనేళ్ళదాకా ఆడపిల్లలు కూడా.. వేసంగి సెలవలకి పుట్టింటికి రావడం.. మూత ఉండే ప్లాస్టిక్ బకెట్లో, డబ్బాలో కొనుక్కుని.. పాత చీరలు చింపి వాసిన కట్టి.. పెద్ద బుట్టలలో నింపుకుని పట్టుకెళ్ళడం ఆనవాయితీగా ఉండేది. వాటితో పాటే అమ్మ పెట్టే వడియాలు, అప్పడాలు కూడా మూట కట్టుకుని సర్దుకునిపోయేవారు. ఈ ఆవకాయలు పెట్టడం అనేది ఓ పేద్ద ప్రహసనమే ప్రతీ ఇంటా.. ఓ పెద్ద తతంగమే అందరికీ.. పెద్ద యెత్తున యజ్ఞం చేసినట్టే.. జాడీలకెత్తి, వాసినలు కట్టి.. మూలగదిలోకి చేర్చడం.. రెండు మూడు రోజుల పని.
అప్పటితో పోల్చుకుంటే.. ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు.. అన్నీ రెడీమేడ్.. పొడులే.. అలా మామిడికాయ ముక్కలు కొట్టించుకురావడం.. ఇంటికి వచ్చి ఇలా కలిపేయడం.. పాతిక కాయలు పెడితే ఎక్కువ. ఇరుగుపొరుగులకి ఇచ్చుకోవడాలు తగ్గిపోయాయి.. ఒకవేళ ఇచ్చినా ఓ బుల్లి కప్పుడే.. అమ్మాయిలు కూడా అమ్మకి శ్రమెందుకుని.. వద్దు వద్దనే అనేస్తారు.. పంపితే ఓ అరకేజీయో, కేజీయో.. కవర్‌లలో పేక్ చేయించి కొరియర్ చేయడమే.. పిల్లలు చాలా మంది దూరాలలోనే ఉంటున్నారు ప్రత్యేకించి ఊరగాయలకోసం పుట్టిళ్ళకి వెళ్ళడం అవడమే లేదు. తినాలన్నా.. బిపీలు భయపెడుతున్నాయి.
పెద్దవాళ్లు కూడా ఆరోగ్యాలు సహకరించక, ఆవకాయలు పెట్టాలన్నా, తినాలన్నా దూరంగానే ఉంటున్నారు. చేతిమీద ధారగా పప్పు నూనె పోసుకొని, ఇంతంత ముద్దలు ఎర్రగా వర్రగా కలుపుకుని.. ఏ ఉల్లిపాయ ముక్కో, ఇంత వెన్నపూసో, మామిడిపండో జుర్రుకుంటూ తినే.. ఆ.. ఆవకాయ ఏదీ? ఇదివరకటిలా ఆ రుచి ఉండడం లేదు కదూ?
అయినా ఇప్పుడు.. ఇవి కూడా కొనుక్కోవడం అయిపోతోంది. వీధికి నలుగురుంటున్నారు. ఇలా ఆర్డర్ ఇవ్వగానే అలా వచ్చేస్తాయి. అప్పటికప్పుడు చేసిందో.. అడుక్కొచ్చిందో (జాడీలో అడుక్కొచ్చిన ఆవకాయ) ఏదో ఒకటి.. కొరియర్ వాడి తెచ్చిచ్చేస్తాడు. దాంతో మమ అనిపించడమే.
ఇక ఆ తర్వాత.. అసలు ఈ ఎండాకాలం ముఖ్యంగా చెప్పుకోవలసినవి చెప్పకపోతే ఎలా?
అవేనండీ.. పళ్ళలో.. రాజాధిరాజ, రాజ మార్తాండ ది గ్రేట్ మామిడిపండ్లు.. ఈ సీజన్లో ఆ పళ్ల కోసం.. కళ్ళలో వత్తులు వేసుకుని కూర్చుంటాం.. మళ్లీ వీటిలో ఎన్ని రకాలో.. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరకురసాలు, తోతాపురి, సువర్ణ రేఖ, బంగినపల్లి, నూజివీడు రసాలు, ఉలవపాడు మామిడిపళ్ళు అబ్బో ఎన్ని వెరైటీలో..
సీజన్ మొదలయినప్పటినుండి.. చివర వరకూ.. ప్రతిరోజూ రెండు పూటలా భోజనంలో పక్కన ఇవి వుండాల్సిందే.. ఆవకాయ అన్నంలో నంచుకునేవారు కొందరు, పెరుగన్నంలో నంచుకునేవారు కొందరు, ఆనక పళ్ళెంలో పెట్టుకుని తీరిగ్గా లాగించేవారు కొందరు.. ఆ పంచదార కలశాల పళ్ళు శుభ్రంగా కడిగి ముచిక దగ్గర జీడి కొద్దిగా పిండి.. తినడం మొదలెడితే.. ఇక మాటలుండవు.. మాట్లాడుకోవడాలుండవు.. పీల్చుకోవడమే.. టెంకని బోడిగుండు చేసేదాకాను.
బంగినపల్లి అయితే పల్చగా తొక్క తీసేసి ముక్కలు తరిగితే.. ముక్కలు పెద్దలకి, టెంక భాగం పిల్లలు వదిలిపెట్టరు అసలు..
ఈ ఎండాకాలం.. ఆవకాయన్నం, మీగడ గడ్డపెరుగు.. ఈ మామిడిపండు వుంటే చాలు.. జీవితం ధన్యమయిపోతుంది.
ఇదివరలో పోలిస్తే వీటి ఖరీదు విపరీతంగా పెరిగిపోయిందనే బాధ వున్నపటికీ.. ఎలాగోలా కొనుగోలు చేస్తూనే వుంటాము.
అయితే.. ప్రకృతిసిద్ధంగా కాయలని మగ్గించకుండా.. ఏవేవో మందులు వేసి.. అసహజంగా పండించేసి, పసుపు రంగుకి తెచ్చేసి అమ్మేస్తున్నారు ఈ మధ్య. అలాంటి పళ్ళు ఏమాత్రం రుచి పచి వుండడం లేదు.. చప్పగానో, పుల్లగానో ఏడుస్తున్నాయి. సహజంగా మాగిన మామిడిపండు నిజంగా అమృతమే అనిపిస్తుంది.
ఈ మామిడి పళ్ల సీజన్లో.. తినేటప్పుడల్లా మా నాన్నగారు ఈ జోక్ గుర్తు చేసేవారు..
ఒకచోట బంతి భోజనాలలో.. పెద్దరసాలు వడ్డించారు.. కబుర్లలో పడిన పెద్దమనుషులిద్దరు.. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ.. మామిడిపళ్ళు తినడం మొదలెట్టారు. అందులో ఒకాయన పండు నొక్కగానే.. టెంక వెళ్లి పక్కాయన విస్తరిలో పడింది. కబుర్లలో మునిగిపోయిన ఇద్దరూ ఇది గమనించలేదు.
కాసేపటికి మొదటి వ్యక్తి తన మామిడి పండులో టెంక లేకపోవడం చూసి.. “అరే.. విచిత్రంగా నా పండులో టెంక లేనే లేదు” అన్నాడు. అప్పుడు రెండవ వ్యక్తి తన విస్తట్లో చూసుకుని “అరే.. ఇదింకా విచిత్రం.. నా పండులో రెండు టెంకలున్నాయి” అన్నాడు.
నవ్విన మీ అందరికీ ఈ సీజన్లో మంచి, మధురమైన మామిడిపళ్ళు ప్రాప్తి రస్తు.