ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-25

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

అన్యైరపి కృతం పాపం ప్రమత్తైర్వసుధాధిపైః।

ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్ఛామ్యతే రజః॥

తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః।

వధో వానర శార్దూల న వయం స్వవశే స్థితాః॥

శృణు చాప్యపరం భూయః కారణం హరిపుంగవ।

యచ్ఛ్రుత్వా హేతుమద్వీర న మన్యుం కర్తుమర్హసి॥

(కిష్కింధకాండ, 18. 36-38)

ప్రజలు పాపములను చేసినప్పుడు రాజులు ఏమరుపాటున వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. ప్రాయశ్చిత్తం చేసుకుంటే శాంతిస్తాయి. వానరశ్రేష్ఠా! నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది. అందుచేత దీనికి పరితపించవలదు. మనము స్వతంత్రులము కాము. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలసినవారము.

ఇంకా..

శ్లో:

న మే తత్ర మనస్తాపో న మన్యుర్హరియూధప।

వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః॥

ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్।

ప్రధావితాన్ వా విత్రస్తాన్ విస్రబ్ధాంశ్చాపి నిష్ఠితాన్॥

ప్రమత్తాన్ అప్రమత్తాన్ వా నరా మాంసార్థినో భృశం।

విధ్యంతి విముఖాంశ్చాపి న చ దోషోత్ర విద్యతే॥

యాంతి రాజర్షయాత్ర మృగయాం ధర్మకోవిదాః।

తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర!।

అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి॥

(కిష్కింధకాండ, 18. 39-42)

ఓ వానరోత్తమా! ఇలా శిక్షించినందుకు నాకు సంతాపము లేదు, దుఃఖమూ లేదు. రాజులు మొదలగువారు వలలను పరిచి, పాశములను ప్రయోగించి, కటోపాయములు పన్ని, చాటున లేక ఎదురుగా గానీ పెక్కు మృగములను వేటాడుతారు. ఆ మృగములు ఏ పరిస్థితిలో నున్నా క్షత్రియులు గాయపరుస్తారు. అందులో దోషముండదు.

బాగా ధర్మములను ఎరిగిన మహారాజులు కూడా వేటాడుతారు. నిన్ను యుద్ధములో బాణముతో వధించాను. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున పొంచి యుండి వధించుటలో తప్పు లేదు – నీవు శాఖామృగానికి కాబట్టి!

శ్లో:

ఏవముక్తస్తు రామేణ వాలీ ప్రవ్యథితో భృశం।

న దోషం రాఘవే దధ్యౌ ధర్మేధిగతనిశ్చయ।

ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వరః॥

యత్త్వమాత్థ నరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయః।

ప్రతివక్తుం ప్రకృష్టే హి నాపకృష్టస్తు శక్నుయాత్॥

తదయుక్తం మయా పూర్వం ప్రమాదాద్వాక్యమప్రియమ్।

తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ॥

త్వం హి దృష్టార్థతత్త్వజ్ఞః ప్రజానాం చ హితే రతః।

కార్యకారణసిద్ధౌ తే ప్రసన్నా బుద్ధిరవ్యయా॥

మామప్యగతధర్మాణం వ్యతిక్రాంతపురస్కృతమ్।

ధర్మసంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ॥

(కిష్కింధకాండ, 18. 46-50)

శ్రీరాముడు సమాధానం చెప్పిన తరువాత వాలి తన అజ్ఞానముచే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు ఎంతో బాధపడ్డాడు. ధర్మతత్త్వం బోధపడ్డందులకు శ్రీరామునిలో ఏ దోషం లేదని గ్రహించాడు.

వాలి: నీవు పలికినది నిజం! నీ వంటి సర్వజ్ఞునకు నా బోటి అల్పజ్ఞుడు సమాధానం ఇయ్యజాలడు. నేను అనాలోచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించాను. నీకు కష్టము కలిగించినందుకు నన్ను దోషిగా ఎంచకు. సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది –

నేను ధర్మము తప్పినవాడను. నాకు ధర్మబద్ధమైన వచనములతో దారి చూపుము. ప్రజా మేలు కొరకై పాటుపడేవాడవు.

శ్లో:

న వయం భవతా చింత్యా నాప్యాత్మా హరిసత్తమ।

వయం భవద్విశేషేణ ధర్మతః కృతనిశ్చయాః॥

దండ్యేయః పాతయేద్దండం దండ్యో యశ్చాపి దండ్యతే।

కార్యకారణసిద్ధార్థా ఉభౌ తౌ నావసీదతః॥

తద్భవాన్ దండసంయోగాత్ అస్మాత్ విగతకల్మషః।

గతస్స్వాం ప్రకృతిం ధర్మ్యం ధర్మదృష్టేన వర్త్మనా॥

(కిష్కింధకాండ, 18. 63-65)

శ్రీరాముడు: మేము చేసిన కార్యమును గురించి గాని, నీ పాపకృత్యములను గురించి గాని ఆలోచింపవలదు. మేము ధర్మ విషయమున స్థిరనిశ్చయము కలిగి యున్నాము. శిక్షింపదగినవానిని సహేతుకముగా శిక్షించినవాడు దోషి కాడు. అతనికి ఏ పాపమూ అంటదు. దోషి తగిన శిక్షను అనుభవించినపుడు దోషము నుండి విముక్తుడవుతాడు. ఇద్దరూ కృతార్థులవుతారు.

ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షను పొందుట వలన నీకు శుద్ధ స్వరూపము లభించింది.

శ్లో:

సుగ్రీవస్య త్వయా భార్యా హృతా స చ వివాసితః।

యత్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప॥

(కిష్కింధకాండ, 20. 10)

తార విలపిస్తూ: ఓ వానరేంద్రా! నీవు సుగ్రీవుని భార్యను హరించి అతనిని కిష్కింధ నుండి వెళ్లగొట్టితివి. దాని ఫలమును ఇప్పుడు ఇట్లు అనుభవించితివి!

శ్లో:

రాఘవస్య చ తే కార్యం కర్తవ్యమ్ అవిశంకయా।

స్యాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాద్విమానితః॥

ఇమాం చ మాలామ్ ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీమ్।

ఉదారా శ్రీస్థితా హ్యాస్యాం సంప్రజహ్యాన్మృతే మయి॥

(కిష్కింధకాండ, 22. 14-15)

వాలి సుగ్రీవునితో: తమ్ముడా! శ్రీరాముని కార్యమును ఎట్టి సంకోచమూ లేకుండా చేయుము. అలా చేయకపోతే అది అధర్మమగును. ఆయన మనస్సును నొప్పించినచో నిన్ను శిక్షింపక మానడు.

ఇదిగో! ఈ దివ్యమైన బంగారు మాలను నేను బ్రతికి యుండగానే ధరింపుము. లేనిచో నేను మృతి చెందిన మరుక్షణమే దీని ప్రభావము మాయమగును.

శ్లో:

కశాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితం।

అంతః స్తనితనిర్ఘోషం సవేదనమివాంబరమ్॥

నీలమేఘాశ్రితా విద్యుత్ స్ఫురంతీ ప్రతిభాతి మే।

స్ఫురంతీ రావణస్యాంకే వైదేహీవ తపస్వినీ॥

క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభః ప్రకీర్ణాంబుధరం విభాతి।

క్వచిత్ క్వచిత్ పర్వతసన్నిరుద్ధం రూపం యథా శాంతమహార్ణవస్య॥

(కిష్కింధకాండ, 28. 11, 12, 17)

శ్రీరాముడు లక్ష్మణునితో: మెరుపులనెడి బంగారు కొరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘ గర్జనలనెడి ఆర్తనాదములతో తన వేదనను ప్రకటించుచున్నట్లు ఉన్నది. నీలమేఘములను ఆశ్రయించి మెరుస్తున్న విద్యుల్లత రావణుని చెరలో శోకించుచున్న సీతాదేవిని స్ఫురింపజేయుచున్నది!

ఆకాశమున మేఘములు చెల్లాచెదురై యున్నవి. మేఘములు ఆవరించి యున్న చోట ఆకాశము కనిపించుట లేదు. అవి అడ్డు లేన చోట స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా.. అక్కడక్కడ పర్వతములడ్డుకొని యుండుటచే ప్రశాంతంగా, సముద్రంలా భాసిల్లుచున్నది!

..వర్షఋతువు లోని అద్భుతమైన దృశ్యాలను కథతో గొప్పగా కలిపేసాడు మహర్షి! చివరగా తాత్వికపరమైన అంశంతో వర్ణనకు ఒక అంచు ఏర్పాటు చేశాడు – మోహం వలన పరమాత్మతత్వం కనిపించదు (ఆకాశం కనిపించటం లేదు). మోహం లేని చోట కనిపిస్తున్నది! అది వీడినప్పుడే ఆత్మస్వరూపం స్పష్టమగును!

అవసాన దశలో వాలికి మోహం తొలగి శ్రీరామ తత్వ దర్శనం జరిగినదన్న విషయం స్పష్టమవుతున్నది. అది తొలగనంత వరకు తాను నిర్వరిస్తున్నదే ధర్మమనుకుంటారో ఎందరో! ఆ పరిస్థితులలో ఇతరుల ధర్మాన్ని గుర్తించలేరు. పైగా అది అధర్మం అని కూడా తలుస్తారు!

12వ శ్లోకంలో సీతాదేవిని ‘తపస్వినీ’ అన్నాడు శ్రీరాముడు. ఎట్టి పరిస్థితిలోనైనా శ్రీరాముని (పరబ్రహ్మ స్వరూపాన్ని) తప్ప మరో యోచన లేని సీతాదేవి తపస్వినియే గదా! ఆ ఇరువురి అనుబంధం స్థాయి తపస్సు చేతనే అర్థమవగలదన్నది కూడా గమనార్హము.

శ్లో:

వాఙ్మతిభ్యాం తు సర్వేషాం కరిష్యామి ప్రియం హి వః।

యద్ధి దాశరథేః కార్యం మమ తన్నాత్ర సంశయః॥

తే భవంతో మతిశ్రేష్ఠా బలవంతో మనస్వినః।

ప్రేషితాః కపిరాజేన దేవైరపి దురాసదాః॥

(కిష్కింధకాండ, 59. 25, 26)

సంపాతి: నేను వాఙ్మనస్సులచే తోడ్పడి మీ అందరికిని సంతోషము గూర్చెదను. శ్రీరాముడి కార్యము నా కార్యమే. అందు సంశయము లేదు. వానర రాజగు సుగ్రీవుడు పంపగా వచ్చిన మీరందరును ప్రజ్ఞావంతులు.

శ్లో:

రామలక్ష్మణబాణాశ్చ నిశితాః కంకపత్రిణః।

త్రయాణామపి లోకానాం పర్యాప్తాస్త్రాణనిగ్రహే॥

(కిష్కింధకాండ, 59. 27)

రామలక్ష్మణుల బాణాలు రెక్కలు గలవి! ముల్లోకమును నిగ్రహించుట లోనూ, అనుగ్రహించుట యందు సమర్థములు.

..సంపాతికి శ్రీరామ కార్యానికి సహాయపడే విధానం గూర్చి పూర్వమే ముని ద్వారా తెలుసుకోవటం జరిగింది. ఆ విధంగా శ్రీరామ కథ (అప్పటి వరకు)ను వినిన వాడై వానర వీరులకు రావణుడు సీతను తీసుకొని వెళ్ళటం గురించి వివరించి లంకకు చేరుకునే మార్గం చెప్పాడు సంపాతి. ఇదే విషయాన్ని సీతాదేవితో ఆంజనేయుడు కూడా చెప్పాడు. సంపాతి తెలుపగా ఈ విధంగా వచ్చాను అన్నాడు (జటాయువు ఆమెకు పరిచయం కాబట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు తద్వారా తన మీద నమ్మకం కుదురును అని యోచించాడు ఆయన!).

సంపాతి  ఇక్కడి నుండి వీరితో పాటు లంకకు వచ్చి యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు, ఎంత స్వార్థపరుడు అన్న దిక్కుమాలిన ప్రశ్న వేస్తారు కొందరు. తమ్ముని కోసం రెక్కలు కాల్చుకున్న వీరుడు ఆయన. శ్రీరామ కార్యానికి లంకకు మార్గం చూపించి ప్రత్యక్షంగా రెక్కలు తిరిగి పొంది ఇదిగో ఇదే నిదర్శనం అని చెప్పినవాడు! స్వయం ప్రభ, శబరి, సంపాతి, కబంధుడు ఇత్యాది పాత్రలు శ్రీరామ కార్యానికి పరోక్షంగా తోడ్పడ్డవారు అన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి. శాప విమోచనం తరువాత కబంధుడు కూడా వచ్చి లంకలో సైన్యంలో ఎందుకు కలవలేదు అని ప్రశ్నించే మూర్ఖులూ లేకపోలేదు!!

శ్లో:

ఏష్యంత్యన్వేషకా స్తస్యా రామదూతాః ప్లవాంగమాః।

ఆఖ్యేయా రామ మహిషీ త్వయా తేభ్యో విహంగమ॥

(కిష్కింధకాండ, 62. 11)

సంపాతి: ‘శ్రీరాముని దూతలైన వానరులు సీతాదేవిని వెదుకుచు నీ సమీపమునకు రాగలరు. అప్పుడు నీవు ఆ రామపత్ని సమాచారామును వారికి తెలుపవలసి యుండును. ఏ విధముగను నీవు ఇచట నుండి కదలరాదు!’ అని నిశాకరముని చెప్పిన విషయాన్ని తెలియజేసాడు సంపాతి.

శ్లో:

యౌవనే వర్తమానస్య మమాసీద్యః పరాక్రమః।

తమేవాద్యానుగచ్ఛామి బలం పౌరుషమేవ చ॥

సర్వథా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథ।

పక్షలాభో మమాయం వః సిద్ధిప్రత్యయకారకః॥

(కిష్కింధకాండ, 63. 11, 12)

సంపాతి: నా రెక్కలు తిరిగి వచ్చినవి. నా బల పరాక్రమములు తిరిగి వచ్చినవి. గట్టిగా అన్వేషించండి. మీకు సీతాదేవి జాడ తప్పక లభింపగలదు. నాకు మరల రెక్కలు వచ్చుటయే అందుకు ప్రబల నిదర్శనము. కనుక ఇక మీ కార్యము సిద్ధించినట్లే.

శ్లో:

బుద్ధ్యా చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చ మే తథా।

అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః॥

మారుతస్య సమో వేగే గరుడస్య సమో జవే।

అయుతం యోజనానాం తు గమిష్యామీతి మే మతిః॥

(కిష్కింధకాండ, 67. 27, 28)

హనుమంతుడు: నా బుద్ధి ద్వారా నిశ్చయించుకొనిన కార్యమునకు నా మనస్సు కూడా అనుకూలముగా ప్రవర్తించును. కనుక నేను సీతాదేవిని తప్పక దర్శింపగలను. మీరును ఆనందింపగలరు.

వేగమున నేను వాయుదేవుని యంతటి వాడను. వేలకొలది యోజనములను కూడా అవలీలగా లంఘింపగలను!

..కార్యసాధన అనునది ఎటువంటి పద్ధతిలో చేయాలి? ఆ యోగం ఎలా ఉండాలి – ఇది స్పష్టం చేసాడు మహర్షి! ఏ అంశాలు ఎలా సమకూర్చుకోవాలి, సంకల్పబలం ఎటువంటిది అన్నది ఈ రెండు శ్లోకాలలో నిబద్ధం చేయటం జరిగింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here