డాక్టర్ అన్నా బి.యస్.యస్.-22

0
4

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తమ ఇంట్లో ఉన్న బంధువులందరికీ అన్నాని పరిచయం చేస్తాడు నారాయణమూర్తి. అందరికీ చిరునవ్వుతో నమస్కరిస్తాడు అన్నా. మాధవ్ ఫొటోలు, వీడియోలు తీస్తాడు. కాసేపటికి పార్వతి కేక్ కట్ చేస్తుంది. అందరూ కేక్ తిని తాము తెచ్చిన కానుకలని పార్వతికి అందజేస్తారు. చివరగా అన్నా కూడా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, తను తెచ్చిన వాచ్ కానుకగా ఇస్తాడు. కాసేపయ్యాక డిన్నర్ చేసి అక్కడ్నించి బయల్దేరుతాడు అన్నా. బాగా హడావిడిగా ఉండడంతో నారాయణమూర్తికి చెప్పి బయటకి వచ్చేస్తాడు అన్నా. కారులో ప్రయాణించి రాజమండ్రి చేరుతాడు. ఒక పండ్ల వ్యాపారి నుంచి ఆశ్రమం పేర్లు తెలుసుకుంటాడు. మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయి, బయటకి వచ్చి కారు డ్రైవ్ చేస్తూ నారాయణమూర్తి నుంచి ఫోన్ వస్తుంది. తాను రాజమండ్రిలో ఉన్నానని, విషయం ఏమిటని అడిగితే, రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయారని పార్వతి బాధపడిందని అంటాడు. ఫోన్ పార్వతికి ఇవ్వమని అడిగి, ఆమెతో మాట్లాడి రాత్రి అత్యవసరంగా పని ఉన్నందున బయల్దేరిపోయానని, ఆ టైమ్‍లో ఆమె కనిపించకపోవడం వల్ల చెప్పలేకపోయానని అంటాడు. పని పూర్తి కాగానే తిరిగి వచ్చేస్తానని అంటాడు. జాగ్రత్త చెపుతుంది పార్వతి. కాసేపటి వృద్ధాశ్రమం చేరి అక్కడ పని చేస్తున్న సునీత అనే మహిళను పరిచయం చేసుకుని ఆశ్రమ వ్యవస్థాపకులని కలవాలని చెప్తాడు. తనకి ఇరవై సంవత్సరాల క్రిందటి సమాచారం కావలని అడుగుతాడు. ఆ రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయనీ, అయితే అవి ఆశ్రమ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు గారి అనుమతితో మాత్రమే బయటకు తీయగలనని చెప్తుంది. ఆయన సాయంత్రం నాలుగు గంటలకి వస్తారని అంటుంది. ఆశ్రమానికి అన్ని వసతులు ఉన్నాయా అని అన్నా అడుగుతాడు. అన్నీ ఉన్నాయనీ, దాతలు చాలామంది ఉన్నారనీ ముఖ్యంగా అమెరికా నుంచి ఒక మహానుభావుడు నెలకు లక్ష రూపాయలు పంపుతాడని చెబుతుంది. ఆయనెవరో తెలుసుకోవచ్చా అని అన్నా అడిగితే ఆయన పేరు ధర్మతేజ అని చెబుతుంది. తండ్రిని తలచుకుని గర్వపడతాడు అన్నా. తన సందేహాలు తీరాలంటే వెంకటేశ్వర్లు గారిని కలవాలని అనుకుంటాడు. ఆ ఆశ్రమానికి సాయంత్రం మళ్లీ వెళ్తాడు. అప్పుడు వెంకటేశ్వర్లు గారు ఉంటారు, కానీ వేరొకరితో మాట్లాడుతున్నారనీ, కాసేపు వేచి ఉండమని చెబుతుంది సుమతి. పిల్లలకి ఇవ్వమని తాను తీసుకువెళ్ళిన చాక్లెట్లు ఇస్తాడు అన్నా. ఇక చదవండి.]

[dropcap]చి[/dropcap]రునవ్వుతో సుమతి కవర్లను అందుకొంది.

“కూర్చోండి సార్.. ఫైవ్ మినిట్సులో వస్తాను..” కారిడార్‍లో ముందుకు వెళ్లి మలుపు తిరిగింది సుమతి.

అన్నా.. ఆశ్రమ పరిసరాలను తిరిగి చూచాడు. చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారు. క్లాస్ గదుల్లో పిల్లలకు టీచర్లు పాఠాలు చెబుతున్నారు. పావుగంటలో అంతా తిరిగి చూచి వచ్చి ఆన్నా ఆఫీసు గది ముందువున్న కుర్చీలలో కూర్చున్నాడు.

ఐదు నిముషాల తర్వాత భుజంగవర్మ.. అతనితో మరో వ్యక్తి కలసి బయటికి వచ్చారు. భుజంగవర్మ కూర్చొనివున్న అన్నాను చూచాడు. అచేతనంగా ఆగిపోయాడు. అతని ప్రక్కన వున్న గోవిందు కాంట్రాక్టర్ అతన్ని తట్టి “ఏమయిందన్నా!..” ఆత్రంగా అడిగాడు.

సుమతి ఆఫీస్ గది నుండి బయటకు వచ్చింది. అన్నా వైపు చూస్తూ.. “సార్!.. రండి..” అంది.

అన్నా గదిలో ప్రవేశించాడు.

భుజంగవర్మ గోవిందును గిల్లి వరండాలో వున్న కుర్చీలలో కూర్చున్నారు. గోవిందు చెవిలో భుజంగవర్మ ఏదో వూదాడు. వాడు పళ్లికిలిస్తూ భుజంగవర్మ ముఖంలోకి చూచాడు.

“నమస్కారం సార్!..” వెంకటేశ్వర్లు గారిని చూచి అన్నా చేతులు జోడించాడు.

చిరునవ్వుతో వెంకటేశ్వర్లు.. “రండి సార్!.. కూర్చోండి..” అన్నా వారి టేబుల్ ముందు వున్న కుర్చీలో కూర్చున్నాడు.

“చెప్పండి సార్!.. మీ కోసం నేను ఏమి చేయగలను!..” అడిగాడు వెంకటేశ్వర్లు.

“సార్!..” తన మనస్సులోని మాటను ఎలా వారికి తెలియచేయాలనే సంశయంతో.. అన్నా వెంటనే మాటలను కంటిన్యూ చేయలేకపోయాడు.

“చెప్పండి సార్!..” అన్నా ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు వెంకటేశ్వర్లు.

“సార్!.. అమెరికాలో వుండే ధర్మతేజ!..”

“ఆ ధర్మతేజ నాకు మంచి మిత్రుడు.. సహృదయుడు.. దాత.. జ్ఞాని..” నవ్వాడు వెంకటేశ్వర్లు.

“మీరు..”

“నేను!..”

“వారికి..”

“వారికి!..”

“ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తమరు వారికి విలువ కట్టలేని కానుకను ఇచ్చినట్టు వారు వారి డైరీలో వ్రాసుకొన్నారు. అదేమిటో చెప్పగలరా.. సార్!..” సందేహంతో మెల్లగా అడిగాడు అన్నా..

“మీరు వారికి ఏమవుతారు?..”.

“కొడుకును..”

వెంకటేశ్వర్లు ముఖంలోకి ఎంతో ఆతృతతో వారు ఏమి చెపుతారా అని చూస్తున్నాడు.. అన్నా..

కొన్ని క్షణాల తర్వాత వెంకటేశ్వర్లు..

“మీ తల్లికి మీరెంతమంది?..” అని ప్రశ్నించారు.

“నేను ఒక్కడినే సార్!..”

వెంకటేశ్వర్లు చిరునవ్వుతో ఆప్యాయంగా అన్నా ముఖంలోకి చూచాడు.

“బాబూ!.. నీ పేరేమిటి?..”

“అన్నా సార్!..”

తన వెనుక గోడకు వున్న కిటికీ గుండా వెలుపలికి చూచాడు.. ముద్దమందార పూల వృక్షం విరబూసి వుంది. వారి పెదవులపై చిరునవ్వు..

“మీరు ఏం చేస్తుంటారు బాబూ!..”

“డాక్టర్!..”

“అమ్మా నాన్నలు బాగున్నారా బాబూ!”

అన్నా.. దీనంగా విచారంతో తలదించుకొన్నాడు.

“సార్!.. ఇరువురూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయారు..”

కన్నీటితో మెల్లగా చెప్పాడు అన్నా.

“ ‘జాతస్య మరణం ధృవం’.. పుట్టుట గిట్టుట కొరకే!..” అని విచిత్రంగా నవ్వుతూ.. “అన్నా!.. బాధపడకు నాన్నా!.. వారు వచ్చిన పని ముగిసింది.. వెళ్లిపోయారు..” విచారంగా చెప్పాడు వెంకటేశ్వర్లు..

అన్నా తమాయించుకొని వారి ముఖంలోకి చూచాడు.

వెంకటేశ్వర్లు ప్రీతిపూర్వకంగా నవ్వుతూ కుర్చీ నుండి లేచి అన్నా తలపై తన కుడి చేతిని వుంచి.. “యశోధాముడవై చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లు నాన్నా. నేను వారికి ఎన్నడో ఇచ్చింది యీ అమూల్య కానుకనే!..” చిరునవ్వుతో అన్నా ముఖంలోకి ప్రీతిగా చూచాడు.

అన్నా ఆశ్చర్యంతో వారి ముఖంలోకి పిచ్చివానిలా చూచాడు.

“నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను నాన్నా!..” మెల్లగా అన్నారు వెంకటేశ్వర్లు.. తన కార్డును అన్నా చేతికి అందించాడు.

అన్నా కొన్ని నిముషాలు మౌనంగా కళ్లు మూసుకొని కూర్చున్నాడు.

అతని కన్నుల నుండి కన్నీరు.. చెక్కిళ్లపైకి దిగజారాయి.

వెంకటేశ్వర్లు లేచి.. అతన్ని సమీపించి పై పంచతో అన్నా కన్నీళ్లను తుడిచి

“పవిత్రమైన డాక్టర్ వృత్తిని చేపట్టావు.. అందరి బాధలను తీర్చి వారి దృష్టిలో దేవుడవౌతావు అన్నా.. విచారించకు.. అంతా దైవ నిర్ణయం..” అన్నాడు.

అన్నా కుర్చీనుంచి లేచి.. వారికి నమస్కరించి మౌనంగా కారువైపుకు నడిచాడు.

***

శ్యామ్.. ధర్మతేజ వ్రాసిన ‘బి.యస్.యస్.’ కథనాన్ని, సూత్రాలను టైప్ చేయించి.. తనకు తెలిసిన వారికందరికీ మెయిల్లో చివరన అన్నా పేరుతో పంపాడు. తన.. అన్నా రెండు మొబైల్ నెంబర్లు ఇచ్చాడు.. చివరగా ‘వివరాలు నచ్చితే.. ‘బి.యస్.యస్. జిందాబాద్’ అని మెంబర్‌షిప్‍కి మీ మీ సమ్మతిని తెలియచేయవలసినది.’ ఇది ఆ ప్రకటన ముగింపు వాక్యాలు. రిలీజ్ చేసిన అరగంటలో దాదాపు నూటికిపైగా అక్‍నాలెడ్జెమెంట్ అండ్ అప్రిసియేట్ కాల్స్ వచ్చాయి.

అన్నా సెల్ – వెంకటేశ్వర్లుగారితో మాట్లాడేటపుడు ఆఫ్ చేసిన కారణంగా.. రిసీవ్ చేసుకోలేకపోయాడు.

శ్యామ్ కొన్ని కాల్సు రిసీవ్ చేసుకొని సమాధానంగా ‘ధ్యాంక్స్’ కన్వే చేశాడు.

శ్యామ్ నారాయణమూర్తికు పంపగా.. వారు చదివి పార్వతికి పంపారు.. పార్వతి చదివి తన ముఖ్య స్నేహితులకు, గురువులకు, బంధువులకు పంపింది.

అన్నా కోసం.. నాలుగైదు సార్లు ట్రై చేసింది.. సెల్ ఆఫ్ వున్నందున అన్నాతో మాట్లాడలేకపోయింది.

మొదట కోపం.. కొంతసేపు ఆలోచించేసరికి భయం.. ఎక్కడ వున్నాడో.. ఏం చేస్తున్నాడో.. అనే విచారంతో పార్వతి మనస్సున అశాంతి.

అన్నా.. కార్లో కూర్చొన్నాడు.. సెల్ ఆన్ చేశాడు.. తొలి కాల్ పార్వతిది.

“హలో!..”

“ఆ..”

“ఏమై పోయారు?.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేం?..”

అన్నా మౌనంగా కారును స్టార్ట్ చేశాడు.

“నీవు ఎక్కడ వున్నావు?..”.

“ఆఫీస్‌లో!..”

“నా యింటికి రాగలవా?..”

“ఎప్పుడు?..”

“మరో రెండు గంటల్లో!..”

“ఏదో సమస్యలో వున్నట్లున్నారు.. వస్తాను..”

“అలాగే! నేను వచ్చేవరకు ఇంట్లోనే వుండు.. లక్ష్మి నీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది..”

“సరే!.. మీరు జాగ్రత్తగా రండి!..”

“ఆ!.. సరే!..” అన్నా సెల్ కట్ చేశాడు. పార్వతి పలకరింపుతో అన్నాకు కొంత ఊరట..

***

అన్నా కార్లో రాజమండ్రి నుండి గుంటూరు వైపు వస్తున్నాడు.. అతని మనస్సున.. తన తల్లిదండ్రులతో తాము గడపిన రోజులు.. నేడు వెంకటేశ్వర్లుగారు చెప్పిన మాటల సారాంశం.. తాను ధర్మతేజ.. మాధవీల బిడ్డను కానననే విషయం తేలింది.

‘అవును.. అందుకే ధర్మతేజ నాన్నగారు తన డైరీలో.. ‘నేను ఆశ్రమానికి ఇచ్చింది చాలా తక్కువ.. ఆశ్రమం వారు ఇచ్చింది చాలా ఎక్కువ..’ అనే పదాలను వ్రాశారు.. ధర్మతేజ.. మాధవీలు నన్ను పెంచినవారు?.. మరి.. నా జన్మకు కారకులెవరు?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల వ్యక్తి ఒక్క వెంకటేశ్వర్లు గారే!.. వారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా!.. వారికి తప్పక తెలిసి వుంటుంది!.. అవును.. తెలిసి వుంటుంది. కనుక్కోవాలి.. నాకు కావాలి !..’ అనుకున్నాడు అన్నా.

అన్నా వెంకటేశ్వర్లుగారు ఇచ్చిన విజిటింగ్ కార్డును జేబులోంచి తీసి వారికి ఫోన్ చేశారు. వారు ఎత్తలేదు. ఎంగేజ్.. కొద్ది నిముషాల తర్వాత కారును రోడ్డుకు ప్రక్కగా ఆపి.. సెల్ డయల్ చేశాడు. వెంకటేశ్వర్లు గారు రిసీవ్ చేసుకొన్నారు.

“హలో!..”

“సార్.. అన్నా”

“చెప్పండి అన్నాగారూ!..”

“మా అమ్మా నాన్నా మీకు ఎప్పటినుండి పరిచయం సార్?..”

“మేము ఇరుగుపొరుగు వాళ్లం. దూరపు బంధువులం.. మీ తల్లి మీ నాన్నగారి మేనమామ కూతురు. వారిరువురిదీ ప్రేమ వివాహం..

పెండ్లి అయిన మూడేళ్లకు కూడా మీ తల్లి గర్భవతి కానందున.. టెస్టు చేయించారు. దైవ సృష్టిలోనే ఆమెకు గర్భాశయం లేదని డాక్టర్లు చెప్పారు..

అప్పుడు మీ నాన్న నన్ను కలిశాడు. నలుగురైదుగురు పిల్లల్లో నువ్వు నచ్చావు. మీ అమ్మను తీసుకొని వచ్చి చూపించారు. మా ఫార్మలిటీస్ పూర్తి చేసి నిన్ను తమతో తీసుకొని వెళ్లారు..”

“మరి నేను మీకు ఎలా దొరికాను సార్!..” దీనంగా అడిగారు అన్నా..

“ఓ రోజు వేకువన నీవు మా గేట్ ముందు ఏడుస్తున్న అలికిడి విని ఆయాలు ఆశ్రమంలోకి నిన్ను తీసుకొచ్చారు. నీకు సంబంధించిన నాకు తెలిసిన పచ్చినిజం ఇది..

ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత నిన్ను ప్రయోజకుడవైన గొప్ప వ్యక్తిగా చూచి నీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. మీ అమ్మా నాన్నలు ఆదర్శ దంపతులు. గౌరవనీయులు.. వారు లేరని మీరు చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఎంతో బాధగా వుంది. అన్నా!.. కానీ ఒక మాట.. మీరు మీకు ఎవరూ లేరని బాధ పడకండి.. నేను.. వున్నాను. నేను మీకు మీ తండ్రితో సమానం. ఏదైనా సమస్య మీకు కలిగితే నాకు చెప్పండి. చేయగల సహాయాన్ని నేను.. మీకు చేస్తాను.. నేను మీతో గడిపింది కొద్ది నిముషాలను.. మీ తత్వాన్ని నేను గ్రహించాను. మీరు మా ధర్మతేజాకు ప్రతిరూపం..” ఎంతో ప్రశాంతంగా చెప్పారు వెంకటేశ్వర్లు.

అన్నాకు.. అన్ని సందేహాలు తీరిపోయాయి. మదిలో కలిగిన ప్రశ్న.. నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు???.. ధర్మతేజ.. మాధవీలు గుర్తుకు వచ్చారు. వారి మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. పెంచి పెద్దచేసిన మా పని అయిపోయిందని.. ఒకరి తర్వాత ఒకరు వెళ్లి పోయారు.. నన్ను ఒంటరి వాణ్ణి చేశారు..

తన గత జీవితానికి సంబంధించి.. తెలిసిన.. తెలియని.. ఆలోచనలతో అన్నా కారు నడుపుతున్నాడు.

సమయం రాత్రి ఏడున్నర ప్రాంతం.. హైవేపై పోతోంది కారు.. అన్నా దృష్టి తన కారు కన్నా ముందు వెళుతున్న కారుపై పడింది. రోడ్డు నేరుగా వున్న కారణంగా కిలోమీటర్ దూరంలో ముందుకు సాగుతున్న కారు స్పష్టంగా కనుపించింది.

అన్నా వేగం పెంచాడు. ముందు వెళుతున్న కారుకు మూడు మీటర్ల దూరానికి చేరాడు. రెండు కార్లు ముందుకు సాగుతూనే వున్నాయి. కానీ.. ముందు కారు రోడ్డు ప్రక్కకు వెళ్లి పల్టీ కొట్టింది.. బ్రేక్ ఫెయిల్..

ఐదు నిముషాల్లో అన్నా ఆ స్పాట్‌కు చేరాడు. కారు దిగాడు.. రోడ్డు ప్రక్కన పడిన కారును సమీపించాడు. వంగి చూచాడు. అందులో వున్నది ముందు సీట్లో డ్రయివర్.. ప్రక్కన భుజంగవర్మ.. ఇరువురికి తీవ్రగాయాలయాయి. దైవాధీనంగా మరో కారు రావడం.. ఆ వ్యక్తి దిగి సాయం చేయడం.. భుజంగరావును .. డ్రైవర్‌ను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం.. జరిగింది.

ఆ కారణంగా అన్నా పార్వతికి చెప్పిన మాట ప్రకారం తన ఇంటికి చేరలేకపోయాడు. పార్వతికి తన ఇంటి అడ్రస్ మెసేజ్ చేశాడు. ఇరువురికి చికిత్సలు చేసి వార్డుకు చేర్చి.. డ్యూటీ డాక్టర్స్.. నర్సులకు చెప్పవలసిన మాటలు చెప్పి.. అన్నా తన ఇంటికి బయలుదేరాడు.

కార్లో కూర్చొని పార్వతికి ఫోన్ చేశాడు.

“హలో!..”

“పార్వతీ!.. ఆ..”

“ఆలస్యం అయింది..”

“తెలుస్తూనే వుందిగా!..”

“పది హేను నిముషాల్లో వస్తున్నాను.. వచ్చి అన్ని విషయాలను చెబుతాను.. సారీ..”

“ఎందుకు..”

“లేట్ అయినందుకు..”

“డాక్టర్ వృత్తికి ఇది మామూలేగా!..”

“ఒకొక్కపుడు ..”

“ఆ..”

“డోన్ట్ యాంగ్రీ.. ప్లీజ్!.. వచ్చేస్తున్నా!..”

“జాగ్రత్తగా రండి..”

“ఓకే..” అన్నా సెల్ కట్ చేశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here