కలల అంచున..!!

0
4

[dropcap]ఒ[/dropcap]కానొక ఒంటరి మధ్యాహ్నపు
మాగన్ను నిదురలో అంటుకున్న,
కన్రెప్పల అంచులలో..
కల లేవో కదులుతాయి..!
వెతుకుతున్న పాదాలకు,
గత జీవితాల –
తీగలేవో తగులుతాయి..
డొంకలేవో కదులుతాయి..!
పట్టుతేనె తుట్టెనిండా –
తేనెటీగలు ముసిరినట్టు,
విరిజల్లుల బరువెక్కిన –
గుబురు చెట్ల కొమ్మలలో,
చిరుగాలుల సవ్వళ్ళకు –
ముత్యాలవాన, మరోసారి,
జలజలా రాలినట్టు,
కనురెప్పల కొసలలో,
ఇవీ.. అని చెప్పలేని,
ఇదమిత్థంగా గురుతురాని,
అనురాగపు కథలేవో..
జ్ఞాపకాల వ్యధలేవో –
భారంగా కదులుతాయి..!
మదిలోపలి గది దాపుల దిగుళ్లన్నీ,
గుబుళ్లుగా ఉబికొచ్చే –
ఆపరాహ్ణ వేళలలో,
చేష్టలుడిగి నిలుచున్న
సాయంత్రపు సంగమాల
వ్యర్థమై మిగిలిన అందమైన
యవ్వనాల జతను వీడి,
బ్రతక నేర్చి –
చితికిపోయిన చెలిమి రగిల్చిన
బెంగలేవో –
మునిమాపుల ముసురులలో,
ఎదురు చూపుల కన్నులలో
వత్తులై వెలుగుతాయి..!
గత జన్మవో – నిన్నవో – మొన్నవో,
మసిబారిన జ్ఞాపకాలు,
మార్చలేని తలరాతలు,
దాటలేని చెలియల కట్టలు
మది నదిలో –
అట్టడుగు గదిలో..
పెదవి గడపమాటున,
లీలగా దాగివున్న –
మనసుపొరల అరలలో,
సజీవంగా నిలిచివున్న నీ రూపును,
చిత్రంగా మేల్కొల్పుతాయి..!
కనులముందు నిలుపుతాయి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here