అమ్మా నువ్వు మారాలి

0
4

[dropcap]“అ[/dropcap]మ్మా” సుమ పిలుపుకి తల్లి ఫోటో ముందు ఏడుస్తూ కూర్చున్న స్వర్ణ తల ఎత్తి చూసింది.

“మామయ్య, నవీన్, కృష్ణ ముగ్గురు విజయవాడ అస్థి నిమజ్జనానికి బయలుదేరుతున్నారు.”

“సరే” అంది స్వర్ణ ముక్తసరిగా.

స్వర్ణ, హరిల తల్లి కాంతమ్మ పోయి 5వ రోజు.

స్వర్ణ పెళ్లి అయిన నాటి నుంచి తల్లి, తండ్రి ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకొని ఉంది. ఆ తరవాత అక్కడే ఇల్లు అమ్మకానికి వస్తే కొనుక్కుని ఇంచుమించు వాళ్ళతో కలిసే ఉన్నారు. స్వర్ణ భర్త సూర్యంకి ట్రాన్స్‌ఫర్లు లేని ఉద్యోగం కావడంతో ఇబ్బంది లేక పోయింది.

15 ఏళ్ళ క్రితం తండ్రి పోయాక తల్లి దాదాపు స్వర్ణ తోనే. పెద్ద ఇంట్లో ఒక్కతి ఉండలేక ఒక వాటా ఉంచుకొని మిగతా ఇల్లు అద్దెకి ఇచ్చి కూతురు తోనే ఉండేది. అందుకే తల్లి మరణం స్వర్ణని బాగా బాధపెడుతోంది.

స్వర్ణ తమ్ముడు హరి 40 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు. ఏడాది, రెండేళ్ళకి ఒకసారి వచ్చి తల్లి, తండ్రిని చూసి వెళ్ళేవాడు.

భర్త పోయాక కాంతమ్మ అమెరికా వెళ్ళడానికి మొగ్గు చూపక ఇక్కడ స్వర్ణ తోనే ఉండేది. తల్లికి అసలు బాగా లేదు అని తెలిసాక హరి 15 రోజుల క్రితం వచ్చాడు భార్య కవితతో.

హరికి ఇద్దరు పిల్లలు. అందరూ అమెరికానే.

స్వర్ణ కూతురు సుమ, అల్లుడు కృష్ణ, కొడుకు నవీన్, కోడలు నవ్య.

సుమ, నవీన్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు. హైటెక్ సిటీ దగ్గర వాళ్ళు ఇద్దరు ఒకే కాంప్లెక్స్‌లో ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు.

నవీన్‌కి పెళ్లి అయిన వెంటనే వేరే ఇల్లు తీసుకోమని చెప్పిన స్వర్ణ, చాలాసార్లు సుమకి చెప్పింది తమతోనే ఉండమని, కానీ సుమ వినలేదు.

సుమకి ఒక బాబు ఆర్యన్, నవీన్‍కి ఒక పాప దియా.

సుమ, కృష్ణ, నవీన్, నవ్య అందరికీ హైటెక్ సిటీలో ఉద్యోగాలే.

వీళ్ళు నలుగురు బాగా కలిసిపోయి ఉంటారు. అది అంత నచ్చదు స్వర్ణకి. నవ్యతో సుమ ఫ్రీగా ఉండడం, నవ్య సుమ మీద జోక్స్ వెయ్యడం ఇష్టం ఉండదు. ఆడపడుచుతో ఏమిటి ఆ జోక్స్ అంటుంది స్వర్ణ. ఆడపడుచు అంటే ఏమన్నా మంత్రి పదవా అంటుంది సుమ.

అమ్మమ్మ పోయిన రోజు అందరూ వచ్చి దహన కార్యక్రమం అవగానే, నవ్య ఇద్దరు పిల్లలని తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లలకి స్కూల్ పోకుండా ఇద్దరినీ పెట్టుకొని వాళ్ళ ఫ్లాట్‍లో ఉంది. ఇద్దరు ఒకే స్కూల్. మళ్ళీ పదో రోజుకి వస్తాను అని వెళ్ళిపోయింది నవ్య.

సుమ, నవీన్, కృష్ణ ఇక్కడే ఉన్నారు ఇక్కడ సహాయానికి.

సుమ వాళ్ళ కార్ కదిలాక లోపలికి వచ్చింది. హాల్‍లో తండ్రి సూర్యం, అత్త కవిత టీవీ చూస్తూ మాట్లాడుకుంటున్నారు. తల్లి మాత్రం లోపల ఒకత్తి కూర్చుని ఏడుస్తోంది.

“అమ్మా టిఫిన్ తిన్నావా?”

“మీరందరు తిన్నారుగా చాల్లే. నా గురించి ఎవరికీ పట్టింది?” సుమతో మొహం చిట్లించి అంది స్వర్ణ.

“వంట ఏమి చేయించను, వాళ్ళు లంచ్‌కి రారు, మనం నలుగురమే” అంది సుమ కోపం ఆపుకుంటూ.

“కోడలమ్మ గారిని అడుగు. అత్తగారు చచ్చిపోతే హాయిగా కబుర్లు, టీవీ” అక్కసుగా అంది స్వర్ణ.

సుమకి చికాకు వచ్చింది.

“90 ఏళ్ళ అత్తగారు అందునా ఏనాడూ కొడుకు, కోడలిని, మనవల్ని ఏమాత్రం పట్టించుకోని ఆవిడ పోతే ఏం చేయాలి? తిండి మానేసి ఏడవాలా?” కోపంగా అడిగింది.

“ఇంత ఇల్లు, బంగారం ఇచ్చింది. ఇంకా ఏమి చేయాలి? ఆవిడ బావున్నప్పడు ఏనాడైనా పది రోజులు ఆవిడతో ఉన్నారా? ఏదో డబ్బులు పంపి చేతులు దులుపుకున్నారు. అమ్మ నాన్నలది అంతా నాదే బాధ్యత. నేను లేకపోతే వాళ్ళు వృధ్ధాశ్రమంలో అనాథలుగా చచ్చేవాళ్ళు.” కచ్చగా అంది స్వర్ణ.

ఇంక లాభం లేదు అనుకున్నది సుమ. ఇన్ని రోజులనుంచి తను ఆగుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు కూడా అమ్మకి అర్థం అయేట్టు చెప్పకపోతే ఎప్పటికి చెప్పలేను అనుకుంది.

బయటికి వెళ్లి “అత్తా! కొంచెం వంట ఆమెకి ఏమి చెయ్యాలో చెప్పరా! నేను అమ్మ దగ్గర ఉంటాను” అని తల్లి రూమ్ లోకి వచ్చి తలుపు దగ్గర వేసి కూర్చుంది.

“అమ్మా! నువ్వు అమ్మమ్మ పోయిన బాధలో ఉన్నావు. ఎంత వయసు వచ్చినా తల్లి తల్లే కదా. నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం మాట్లాడదామని అనుకుంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాను, నేను చెప్పేది విని నువ్వు ఏమనుకుంటావో అని. కానీ ఇప్పుడు తప్పదు అనిపిస్తోంది. నేను చెప్పేది స్తిమితంగా విని ఆలోచించు అమ్మా .

నేను కిందటిసారి ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లినప్పుడు మామయ్య, అత్తయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి కిశోర్‌ని కలిసాను. నేను వస్తున్నానని తెలిసి వచ్చాడు. రెండో అబ్బాయి కిరణ్ ఫోన్‍లో మాట్లాడాడు. వాళ్ళ ఊరు చాలా దూరం అని కలవలేకపోతున్నందుకు బాధపడుతూ మాట్లాడాడు.

అత్తయ్య మామయ్య కూడా ఎంత ప్రేమగా చూసారో తెలుసా? ఉన్నంత సేపు మీ చిన్నప్పటి కబుర్లే మా అక్క అలా, మా అమ్మ ఇలా అంటూ. నీ గురించి కానీ అమ్మమ్మ గురించి కానీ ఒక మాట కూడా చెడ్డగా అనలేదు. ఒకసారి కూడా అత్తయ్య ఒక్క విరుపు మాట అనలేదు.

కానీ కిశోర్ మాత్రం నేను అమ్మమ్మ గురించి ఎంత ప్రేమగా ఉంటుంది అని గొప్పలు చెపితే ‘వద్దు సుమక్కా, మీ అమ్మమ్మ చాల మంచిది కానీ మా నానమ్మ కాదు. ఆవిడ ఏ రోజు మా అమ్మతో సరిగా లేదు. మీకు గిఫ్ట్స్ పంపమని ఫోన్ చేస్తుంది కానీ మాకు ఎప్పుడైనా పంపిందా, అమ్మతో కానీ నాన్నతో కానీ సరిగా మాట్లాడదు. అసలు మా పేర్లు కూడా ఆవిడకి తెలీదు’ అన్నాడు బాధగా.

నాకు ఆలోచిస్తే నిజం అప్పుడే అర్థం అయింది.

అమ్మా! మామయ్యకి నువ్వు, నీకు మామయ్య, ఈ ప్రపంచంలో మొదటి బంధం మీ ఇద్దరిదే. నీకు ఎలా ఉన్నా అంత దూరాన ఉండడం వల్ల మామయ్యకి ఎప్పుడు నీతో మంచి బంధం ఉండాలని ఆశ. దాన్ని అత్త కూడా ఎప్పుడూ కాదనలేదు. నేను అప్పటి నుంచి నీకు చెపుతూనే ఉన్నాను. మామయ్యా వాళ్లతో ఫోన్‌లో మాట్లాడు, అత్తయ్యతో సరిగా ఉండు, అని విన్నావా? లేదు.

అమ్మమ్మ పాత కాలం మనిషి, ఆవిడకి, కోడలు కొడుకుని తనకి కాకుండా చేస్తోంది అని భయం. అది కప్పిపుచ్చడానికి అత్తయ్య చేసే పనులలో తప్పులు వెదికి వాటిని ఎక్కువగా చేసి చెప్పేది.

తాతయ్య పోయాక అమెరికా వెళ్లి అక్కడ ఉండలేను అని నిశ్చయించుకుంది. నీ దగ్గర ఉండాలంటే నీ సానుభూతి పొందడానికి, నీతో మంచిగా ఉండడం కోసం అత్తయ్య, మామయ్య గురించి నీకు చాడీలు చెప్పేది.

నువ్వు కూడా అమ్మమ్మ చెప్పింది నమ్మేసావు. ఇంతకాలం కలిసి పెరిగిన తమ్ముడు గురించి, నీకు పూర్తిగా తెలియని అతని భార్య గురించి చెడ్డగా చెపితే, నువ్వు ఒకసారి కూడా ‘ఎందుకు అమ్మా ఇలా అంటావు వాళ్ళ గురించి’ అని అనలేదు.

అమ్మమ్మ చెప్పినవి విని, నమ్మి, నువ్వు మామయ్య వాళ్ళతో కూడా సరిగా మాట్లాడక పోయేసరికి నీకు మామయ్యకి మధ్య దూరం పెరిగింది.

అమ్మా! మన ఇంట్లో ఏ శుభకార్యానికి అయినా అత్తయ్య, మామయ్య, పిల్లలు వచ్చి సరదాగా గడిపారా? నీకు వాళ్ళ పిల్లలు ఏమి చదివారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా? అసలు మామయ్య పిల్లలు వాళ్ళ నాయనమ్మతో ఎందుకు ఎక్కువ సమయం గడప లేదు” అడిగింది సుమ.

మళ్ళీ తనే మాట్లాడుతూ, “అమెరికాకి టికెట్స్ పంపి రమ్మంటే చాకిరీ చేయడానికి పిలుస్తున్నారు అని అమ్మమ్మ అంటే ‘ఏమి పని చేయకు’ అని అమ్మమ్మతో అనేదానివి. నువ్వు ఇక్కడ ఏ పని ఆవిడ చేత చేయించలేదా? కొడుకు ఇంట్లో చేస్తే తప్పా? అందరు అత్తగార్లు చెడ్డవాళ్ళు కాదు అలాగే అందరు కోడళ్ళు కూడా చెడ్డవాళ్ళు కాదు. నువ్వు అత్తని నీ తమ్ముడి భార్యగా కాక, ఒక స్నేహితురాలిలా చూసి ఉంటే మీ ఇద్దరి మధ్య ఏ తేడాలు వచ్చేవి కావు. నువ్వు ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ చేసిన తప్పే చేస్తున్నావు. ఈ మధ్య నువ్వు నన్ను, నవ్యని వేరుగా చూస్తున్నావు.

అక్కడితో ఆగితే పరవాలేదు. దీనివల్ల నాకు, నవీన్‌కి మధ్య కూడ మనస్పర్ధలు వస్తాయి.

అసలు ఒక వయసు వచ్చాక పిల్లలని స్నేహితులుగా చూడాలి అంటారు. పిల్లలు అంటే స్వంత పిల్లలే కాదు. కోడళ్ళు, అల్లుళ్ళు కూడా పిల్లలే కదమ్మా. నువ్వు కృష్ణతో ఎంత ఆప్యాయంగా ఉంటావో అంతే ప్రేమగా నవ్యతో కూడా ఉండాలి. నవీన్ వేరే ఇల్లు కొనుక్కొని వెళతాను అంటే నువ్వు ఆపలేదు. నన్ను మాత్రం వేరే ఇల్లు ఎందుకు పైనది నీ వాటాయేగా ఈ ఇంట్లోనే ఉండమని అన్నావు.

మొన్న దియా మా ఆర్యన్‌తో అంటోంది ‘నేనంటే నానమ్మకి ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం’ అని. వెంటనే నవ్య కోప్పడింది. ‘తప్పు అలా ఏమీ కాదు. నువ్వు అల్లరి ఎక్కువ చేస్తే నానమ్మ కోప్పడతారు అంతే’ అని. అంటే పిల్లలకి కూడా తేడా తెలుస్తోంది.

మా అత్తగారు వాళ్ళు పండగకి వస్తామని అంటే సణుగుతావు ప్రతి పండక్కి రావాలా? అని, నువ్వు మాత్రం నవీన్ దగ్గరికి వెళ్ళాలి, కానీ నవ్య వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ ఇంటికి రాకూడదు అనుకుంటే ఎలా?

ఆర్యన్‌కి నువ్వు ఎంతో దియాకి వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా? నువ్వు పిల్లలకి ఎంత ప్రేమ ఇస్తే అంత పొందుతావు.

కృష్ణ ఇంటి పనులు సాయం చేస్తే నా అల్లుడు బంగారం అంటావు, అదే నవీన్ చేస్తే ఆడంగి వెధవ, పెళ్ళాం చేతిలో బొమ్మ అంటావు. అందరితోనూ నాకు కూతురు కోడలు ఒకటే అంటావు కానీ, నీకు నవ్యకి ఏమి వంట ఇష్టమో తెలుసా, ఏ రంగు ఇష్టమో తెలుసా? నాకు తనకి ఒకే రకమైన చీరలు కొనవు. ఆఖరికి నా కొడుక్కి, నవీన్ కూతురికి ఒకే ఖరీదైన బొమ్మలు, బట్టలు కొన్నావా?

అమ్మ ముందు మీరు మారాలి, నిజంగా కోడలినీ కూతురు లాగా, కొడుకుని అల్లుడిని ఒకేలాగా చూస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మా, నాన్న లాగానే చూస్తారు. నువ్వు నవ్యతో బావుంటే నవీన్ సంతోషంగా ఉంటాడు.

నా భర్త మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అంటే నేను కూడా వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూడాలి కదా. నీకు ఎందుకు ఈ విషయం అర్థం కాదు అమ్మా? నువ్వు నీ ఆలోచనలో మార్పు చేసుకో.

అమ్మమ్మలాగా ఆలోచించి కొడుకుని దూరం చేసుకోకు, నువ్వు అమ్మమ్మ మాటలు విన్నట్టు నేను వినను.

నాకు నవీన్, నవ్యల బంధం, స్నేహం కావాలి. నవ్య మంచిదే కానీ ఎంతకాలం ఓర్పు పడుతుంది? నువ్వు ఒకోసారి అనే మాటలకి నవీన్‍ని నిలదీస్తుంది. ఇద్దరి మధ్య వాడు నలిగిపోతున్నాడు. అసలు నేను కృష్ణ, వాళ్ళ దగ్గరే ఫ్లాట్ కొన్న కారణం కూడా అదే. నవీన్‌కి సపోర్ట్‌గా ఉంటామని. వాడికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, అలానే నవ్యకి కూడా. అలా అని నవీన్, నవ్య నిన్ను, నాన్నని సరిగా చూడకపోతే కూడా నేను ఊరుకోను. మీకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇవ్వాల్సిందే.

మీరు నా దగ్గరికి, నవీన్ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి. మాతో మనవలతో గడపండి. పిల్లలు చిన్నప్పుడు తప్పు చేస్తే దిద్దే అధికారం ఎలా అమ్మ నాన్నలకి ఉందో, అలానే పెద్ద వాళ్ల ఆలోచనలో తేడా ఉన్నా చెప్పే అధికారం మాకు ఉంది. మీరు ఇప్పడు మాతో ఎక్కువ సమయం గడపాలి సంతోషంగా ఉండాలి అని మేము అనుకుంటాము. మమ్మల్ని అందర్ని సమానంగా చూడాలి, కొడుకు ముఖ్యమే కూతురూ ముఖ్యమే, అంతే కానీ ఒకరి పక్షాన ఉండకూడదు.

సాయంత్రం మామయ్య వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా తీసుకొని మా ఇంటికి వెళతాము, నాలుగు రోజులు అక్కడ ఉండి 10వ రోజుకి వస్తారు. నేను చెప్పినదాని గురించి నువ్వు నెమ్మదిగా ఆలోచించుకో, నీ పద్దతి మార్చుకో” అని సుమ తల్లిని ఒంటరిగా వదిలి నెమ్మదిగా తలుపు దగ్గరికివేసి బయటికి వచ్చింది.

నేను తప్పుగా మాట్లాడానా? అనుకున్న సుమ, వెంటనే లేదు, అమ్మ ఈమధ్య తమకి, నవీన్ వాళ్ళకి చాలా తేడా చూపిస్తోంది, అది నవ్య మీద ప్రభావం చూపుతోంది. ఒక రెండు మూడు నెలలుగా నవ్య ఇదివరకటంత కలుపుగోలుగా ఉండడంలేదు తమతో.

ఎందుకు ఈ తల్లులకి అర్థం కాదు ఇలా చేస్తే కోడలికి తన మీద ప్రేమ, గౌరవం ఎలా వస్తాయి? నిజంగా అవసరం అయి నవీన్ దగ్గర ఉండాల్సి వస్తే నవ్య వీళ్ళని బాధ్యతగా చూస్తుంది తప్ప ప్రేమగా చూడలేదు.

‘తప్పదు, తప్పు అనిపిస్తే వాళ్ళు అమ్మ నాన్నా అయినా సరే చెప్పాలి. వాళ్ళని మార్చాలి, అప్పుడే పిల్లలకి,తల్లి తండ్రులకి మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి’.

‘అది తాను మాట్లాడితే ఫర్వాలేదు, అదే నవ్య అంటే గొడవలు. అందుకే చాలా రోజులనుంచి అనుకున్నది ఇవాళ చెప్పాల్సి వచ్చింది’ అనుకొని సుమ కూడా వెళ్లి తండ్రి దగ్గర హాల్‌లో కూర్చుంది.

సుమ వెళ్ళాక మాట్లాడిన కూతురు మాటలన్ని గుర్తు తెచ్చుకున్న స్వర్ణ నిశ్చేష్టంగా కూర్చుండిపోయింది.

నిజంగా తన పద్ధతి అలానే ఉందా? తను కోడలికి కూతురికి అంత తేడా చూపిస్తోందా? పసిపిల్లకి కూడా తేడా తెలుస్తోందా?

అవును సుమకి కంచి పట్టు చీర కొని, నవ్యకి నువ్వు కట్టుకోవు అంటూ జార్జెట్ చీర కొంటుంది. నవ్యని ఎప్పుడు నీకు కూడా పట్టుచీర కొననా అని ఏ రంగు కొనమంటావు అని అడగలేదు.

ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళితే అందరూ తనని ఒకసారి పలకరించి వెళ్ళిపోతారు, కానీ మిగిలిన అందరితోనూ బానే కబుర్లు చెప్తారు.

మీ అమ్మ ఎలా ఉన్నది అని ఎవరైనా అడిగితే, బావుంది అని చెప్పకుండా తమ్ముడు మీద మరదలు మీద చాడీలు చెప్పేది.

‘నేను ఇలా ఎందుకు అయ్యాను? నిజంగా సుమ అన్నట్టు తను మంచి అనిపించుకోడానికి తమ్ముడిని చెడ్డ చేసిందా? ఇరవైనాల్గు గంటలు తల్లి మాట్లాడే మాటలకి ప్రభావితం అయిందా? తన ఆలోచన ఏమైంది? కానీ చివరికి తాను ఎవరికి మంచి అయింది? మరదలికి కాదు, తమ్ముడు సరే సరి తప్పనిసరి అయి ఉన్నాడు కానీ ఎప్పుడు హోటల్ లోనే ఉంటాడు.

సుమ అన్నట్టు నవీన్ కూడా ఈ మధ్య తనతో తక్కువగా మాట్లాడుతున్నాడు.

ఎవరికీ పనికి రాకుండా ఏమిటి ఈ జీవితం? బయటవాళ్ళు అందరు ఆహా ఓహో మీ అమ్మని నువ్వు బాగా చూసుకున్నావు అంటారు కానీ చివరలో ఆవిడ కొడుకు కోసం, వాళ్ళ కుటుంబం కోసం తపించింది.

తన గతి కూడా అంతే అవుతుందా? నవీన్ దగ్గర ఉంటే నవ్య తనని సరిగా చూస్తుందా? సుమ అన్నట్టు బాధ్యతగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి తేడా లేదూ?

ఈ మధ్య సూర్యం కూడా అవసరానికి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకు? ప్రతి మాటకి తాను విరుపుగా, విసుగ్గా మాట్లాడుతూ ఉండబట్టేగా?

నిజం నేను మారాలి. నేనే కాదు, నాలాంటి అందరు అమ్మలూ మారాలి. అప్పుడు కానీ కుటుంబం సరిగా ఉండదు.

ప్రపంచం అంతా ఏమనుకున్నదీ అనవసరం, నా కుటుంబం ఏమనుకుంటున్నారో నాకు అవసరం. నా కూతురు ఎంత ముఖ్యమో కోడలూ అంతే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో నేను నా వాళ్ళకి దూరం కాకూడదు’ గట్టిగా నిర్ణయించుకొంది స్వర్ణ.

బాత్రూం లోకి వెళ్లి కన్నీళ్లతో ఉన్న మొహం శుభ్రంగా కడిగి తల దువ్వుకొని బయటికి వచ్చింది.

“వంట ఎంతవరకు వచ్చింది” అంటూ మామూలుగా మాట్లాడుతున్న తల్లిని చూసి ఏమీ మాట్లాడలేదు సుమ.

“చేస్తున్నారు వదినా, అవుతోంది వంట. కాసేపు కూర్చోండి” అంది కవిత. వాడిపోయిన ఆడపడుచు మొహం చూసి తల్లి పోయిన దుఃఖం అనుకుంది కవిత.

“సుమా, సాయంత్రం మామ వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళు, నాలుగు రోజులు ఉండి వస్తారు. నేను ఈ లోగా ఇల్లు అంతా సర్దిస్తాను.” అంటూ కవిత వేపు తిరిగి “కవితా! సాయంత్రం వాళ్ళు వచ్చేలోగా నువ్వు, నేను, సుమ, 12వ రోజుకి మనకి పిలవాల్సిన వాళ్ళ లిస్ట్, ఆరోజు మెనూ, అందరికి ఏదైనా అమ్మ గుర్తుగా గిఫ్ట్, వీటన్నటి గురించి ఆలోచిద్దాము” అంది.

“హరి వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా అన్ని ఓకే అంటే అన్నయ్యగారు కేటరింగ్ వాళ్ళతో మాట్లాడతారు. మీ అక్కయ్య వాళ్ళు, కిషోర్ అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అందరికి చెప్పాలి” అంది స్వర్ణ.

“అలాగే వదినా, ముందు అందరం భోజనము చేద్దాము రండి” అంటూ లేచింది కవిత.

“పిల్లలు వస్తారా కవితా? వాళ్ళకి దగ్గరలో గదులు బుక్ చేద్దాము. ఫోన్ చేసి అడుగు.”

స్వర్ణ చాలా మామూలుగా మాట్లాడినా కూడా మాటల్లో తేడా సుమకి బాగా తెలుస్తోంది. సంభాషణ పొరపాటు దిద్దుకొనే దిశగా ఉంది.

గబుక్కున లేచి తల్లిని కావిలించుకొంది సుమ. “మా అమ్మ బంగారు” అని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

“చాల్లే ముద్దులు” నవ్వుతూ అన్న స్వర్ణ కళ్లలో పశ్చాత్తాపపు కన్నీరు మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here