[ఇయర్‍హుక్ 2023 ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ.]
[dropcap]అ[/dropcap]లారం మ్రోగుతోంది. మెదడు లోతుల్లో ఎక్కడో వుండిపోయిన మెలకువ పొరలు దాటి దాటి దాటుకుంటూ నెమ్మదిగా పైకి వస్తోంది నన్ను సృజించటానికి. తెలిసీ తెలియనట్లుగా వుంది ప్రస్తుత ప్రపంచ భావనా స్పర్శ. లేవాలి సుజి టైమ్ సరిపోదు లే. సెల్ఫ్ మోటివేషన్.. అన్నీ టైమ్ ప్రకారం జరిగిపోవాలి. లేవటం లేట్ అయితే రోజు మొత్తం గందరగోళం అవుతుంది, కాలేజీ నించి వచ్చి సాయంత్రం విశ్రాంతి తీసుకోవచ్చులే. మనసు ఏదో ఆశ పెడుతోంది, నాచేత పని చేయించటానికి. ఇంకొక రోజు మొదలు.. ఇంక మొదలవుతుంది బోల్ట్ స్థాయి ఒలింపిక్ పరుగు.. వంటిల్లు,హాలు. పిల్లలని లేపటం, ఇంట్లోకి బయటికి.. మధ్యలో టైమ్ చూసుకోవడం, వులిక్కిపడడం.. మళ్ళీ స్పీడ్ పెంచుతూ.. పిల్లలకి లంచ్ పాక్స్, నా లంచ్ పాక్స్, వాళ్ళ యూనిఫామ్స్, బుక్స్, నా బుక్స్ ఓహ్ ఒకటే పరుగు.. నా కాలేజీ ఎనిమిది గంటలకి. ఏడున్నరికి ఇల్లు వదిలితేగాని చేరలేను. ఇల్లు తాళం పెట్టే పని అనన్యకి వదిలి బాగ్ తీసుకుని బైటికి వచ్చాను. అంతా హడావిడిలో కూడా ఋత్విక్ కోసం వెతికాయి నా కళ్ళు. వాళ్ళ అమ్మని బాగా విసిగిస్తున్నట్లు వున్నాడు.. కళ్యాణి గట్టిగా అరుస్తోంది,. సాయంత్రం చూడాలి వాడి సంగతేంటో, నా నాలుగేళ్ల స్నేహితుడిని తల్చుకుని నవ్వుకున్నాను. నేను పని చేసేది ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో. టీనేజ్ పిల్లలని డీల్ చేయాలి.. వాళ్ళకి పుస్తకాలలో సిలబస్ కన్నా విలువైన జీవిత పాఠాలు ఎన్నో చెప్పాలి. కానీ మాకు అంత అవకాశం ఇవ్వరు. ఎవర్ని పలకరించిన కాలేజీ విద్యార్దులు చెడిపోతున్నారు అని మరి ఈసడించుకునేవారే. వాళ్ళు ఇలా వుండకూడదు, అలా వుండకూడదు అంటారు. మరి ఎలా వుండలో చెప్పేవాళ్ళు ఎవరు. ఇంట్లో ఒకరు లేక ఇద్దరు.. తల్లితండ్రులు తగని గారాబం చేస్తారు. మంచి చెడు విచక్షణ నేర్పటం లేదు. పోనీ కాలేజీ అంటే ఇక్కడ మార్కులు తప్ప దేన్ని పట్టించుకోని ఒక అద్వైత స్థితి. మరి పదే పదే విద్యార్ధులని తిట్టుకుని ఏం ప్రయోజనం. తల్లితండ్రులు ర్యాంక్‌ని కాక పిల్లలని పట్టించుకునే రోజులు ఎపుడు వస్తాయో. ప్రస్తుతానికి వేదన పడటం తప్ప ఏం చేయలేకపోతున్నాం, పిల్లలకే నచ్చ చెప్తున్నాము అంతా మీ భవిష్యత్తు కోసమే అని.. ఇదొక వంచన..
మొత్తానికి క్లాసులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్తూనే మళ్ళీ పనిలో పడలేను. కాస్త సేద తీరాలి. ప్రొద్దున్న నించి నా మెదడులో సుడులు తిరిగే ఆలోచనలు అన్నిటినీ ముందు వేసుకుని వాటితో వాదిస్తూ ఓడుతూ, గెలుస్తూ ఒక గంట నాతో నేను వుంటే తప్ప మళ్ళీ శక్తి పుంజుకోలేను.. కాఫీ త్రాగి ఇక రిలాక్స్ అయ్యి పని మొదలుపెడదాం అనుకుంటుంటే ఋత్విక్ వచ్చాడు పరిగెడుతూ, వాణ్ని తరుముతూ కళ్యాణి. ఏంటి అమ్మా కొడుకు దొంగ పోలీస్ ఆడుతున్నారా? అన్నాను నవ్వుతూ. లేదు మేడమ్ చూడండి అన్నిటికీ ఎలా విసిగిస్తాడో. ఈరోజు స్కూల్‌కి కూడ వెళ్లలేదు ఒక పూటే కదా.. దానికి కూడ ఏడుస్తాడు. కిరణ్‌కి తెలిస్తే నన్ను బాగా తిడతాడు. వీడి ఈ ఎల్.కె.జి క్లాస్‌కి ముప్ఫై వేలు కట్టాము. కళ్యాణి ఆవేదన వెళ్ళగ్రక్కుతోంది. వాణ్ని చూస్తూ ఆలోచనలో పడ్డాను. ఋత్విక్ చాలా హుషారైన పిల్లాడు. ఏం చెప్పినా శ్రద్ధగా వింటాడు. నేను కూడా నా ఖాళీ సమయంలో ఏవో కథలు చెప్తాను. శ్లోకాలు నేర్పుతాను. చాలా తొందరగా నేర్చుకుంటాడు ఏదైనా. అర్థం కాకపోతే ఆగి ప్రశ్నిస్తాడు. మరి ఎందుకో స్కూల్‍కి వెళ్ళడానికి మాత్రం చాలా పేచీ పెడుతున్నాడు. కారణం కళ్యాణికి తెలియకపోవచ్చు కానీ నేను వూహించగలను. మొన్న మొన్నటివరకు వాడు చేసే అల్లరి భరించలేక వాణ్ని మాటి మాటికి బెదిరించేవారు వాళ్ళ అమ్మ.. నాన్న.. అన్నం తినకపోతే స్కూల్‌కి పంపుతాం, అల్లరి మానకపోతే స్కూల్‍౬కి పంపుతాం అని. ఆ మాటలు విన్నపుడే అనిపించింది చాలా నెగెటివ్‌గా లొంగదీస్తున్నారని.. ఆ బెదిరింపుల ప్రభావం ఇపుడు కనిపిస్తోంది. స్కూల్ అనేది ఒక శిక్ష అని వాడి చిన్న మనసులో బలంగా నాటుకుపోయింది. వాడికి తెలిసినంతవరకు స్కూల్ అంటే కేవలము ఒక భయం, ఇంకా వాడి ఆనందం లాక్కునే ఒక చోటు. అక్కడ ఎవరో వుంటారు మనల్ని ఏదో చేసేస్తారు.. ఇది వాడి ఆలోచన.. చిన్న మనసు మీద ఎంత ఒత్తిడి పడింది. మనం ఏదో పని గడవటం కోసం అనాలోచితంగా అనే మాటలు ఎదుటి మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మన వూహకు అందదు. అసలు స్కూల్ జీవితాన్ని మనమందరం ఎంత చక్కగా ఆస్వాదించాము.. ఎప్పటికీ తరగని అనుభూతులని ఎన్ని పంచుతాయో తరగతి గదులు.. మరి దాన్ని ఒక భయం లాగా పిల్లలకి ఎందుకు పరిచయం చేస్తున్నాము? మనం యథాలాపంగా అనే ప్రతి చిన్న మాట పిల్లలు సీరియస్‌గా తీసుకుంటారు. ఒక్క క్షణం నన్ను ఎపుడు బెదిరించే బామ్మ గుర్తు వచ్చింది. నా స్వతంత్ర్య భావాలు తనకి నచ్చేవి కాదు. నాన్న నా వెనకాల వుండటంతో నన్ను ఏమి అనలేకపోయేది. నేను తనకి లొంగటం లేదనే కోపం మాత్రం బాగా వుండేది. అదంతా చెల్లి మీద చూపించేది. అది చాలా సున్నిత మనస్కురాలు. బామ్మ తరచుగా వుపయోగించే మాట పెళ్లి అయితే అణుగుతుందిలే, మీ ఇద్దరి పొగరు. నేను ఖాతరు చేసేదాన్ని కాదు కానీ పదే పదే వినే ఆ మాట చెల్లి మీద చాలా వ్యతిరేక ప్రభావం చూపించింది.. చివరికీ పెళ్ళంటే ఒక పనిష్మెంట్ అని, మన ఆనందం హరించే ప్రక్రియ అని గట్టిగా నమ్మింది. అది ఎంతగానో భయపడి జీవితంలో పెళ్లి వద్దని మొండికేసింది.. దానికి ఎన్నో రకాలుగా నచ్చచెప్పి, ఎన్నో చక్కటి జంటలని చూపించి పెళ్లి చేసేసరికి మా తల ప్రయాణం తోకకి వచ్చింది. ఆ తర్వాత కూడ దాని భర్త దాన్ని సరిగా చూసుకుని దాని మోహలో నవ్వు చూసేవరకు అమ్మ, నాన్న ఎంతో టెన్షన్ పడ్డారు. ఇపుది ఋత్విక్‌దీ అదే పరిస్థితి. తనకి తెలియకుండానే కళ్యాణి వాడికి స్కూల్ అంటే భయం కలిగేలా మాట్లాడింది.. ఏదో ఒకటి చేయాలి వీడి భయం పోగొట్టడానికి.
మర్నాడు కాలేజీకి సెలవు పెట్టాను. పిల్లలు ఇద్దరు స్కూల్‌కి వెళ్ళాక ఋత్విక్‌ని పిలిచి బైటికి వెళ్దాం వస్తావా అని అడిగాను. “మరి అమ్మ” వాడి ప్రశ్న. అమ్మ వద్దులే మనిద్దరం వెళ్దాం అని వాడికి మంచిగా డ్రస్ చేసి కళ్యాణికి చెప్పి ఇద్దరం స్కూటీ మీద బైలుదేరాం.. ఏవో మాటలు చెప్తున్నాడు.. ఇంకేదో ఆడుగుతున్నాడు. నేను కూడా వాడితో సమానంగా హుషారాయిపోయాను. ఒక అరగంట ప్రయాణం తర్వాత మాధవి వాళ్ళ ఇల్లు చేరాము.. మాధవి మా కోసమే ఎదురు చూస్తోంది. మూర్తి గారు ఆఫీస్‌కి, పిల్లలు కాలేజీకి వెళ్ళినట్లున్నారు, కాస్త ఫ్రీ గానే వుంది. ఏంటే సెలవు పెట్టి మరి వచ్చావు, నన్ను ఎక్కడికినా తీసికెళ్తావా సరదాగా అడిగినది మాధవి. నీ మొహం లే ముందు కాఫీ పెట్టు అంటూ ఋత్విక్‍ని హాల్లో కూర్చోపెట్టి బొమ్మలు ఏమైనా వున్నాయా అని వెతుకుతున్నాను. అమ్మయ్య ఒక బాల్ కనిపించింది. అది వాడికి ఇచ్చి, దారిలో వాడికోసం కొన్న స్నాక్స్ వాడి ముందు పెట్టి వంట ఇంట్లోకి నడిచాను మాధవితో కబుర్లకి.. సాయంత్రం వరకు వుంటావుగా.. ఋత్విక్ ఏడవడుగా, ఏం కూర చేయమంటావు? ఎన్ని ప్రశ్నలో దానికి. ముందు కాఫీ త్రాగుదాం రా అంటూ ఇద్దరం బాల్కనీలో కూర్చున్నాము. బాల్ ఆడుతూ ఆడుతూ ఋత్విక్ కూడా ఇటే వచ్చాడు. పిల్లలు అరుపులు కేకలు వినబడటంతో వెళ్లబోయేవాడు ఆగి చూడడం మొదలు పెట్టాడు. మాధవి ఇంటిని ఆనుకుని ఒక ప్లే స్కూల్ వుంది. అది వాడు చూడాలనే ఇలా తీసుకు వచ్చాను. ఋత్విక్ ఆట మాని అక్కడే అతుక్కుని పోయాడు, చాలావరకు అందరూ వాడి వయసు వాళ్ళే. ఒక గ్రూప్ ఆడుకుంటున్నారు. ఇంకొక గ్రూప్ టీచర్ చుట్టూ చేరి కథ వింటున్నారు. ఇంకోకచోట మట్టితో ఏదో బొమ్మలు చేస్తున్నారు.. మొత్తానికి అక్కడి వాతావరణం అంతా చాలా హుషారుగా వుంది. పిల్లలు ఎవరు ఏడవటం లేదు. ఏ టీచర్ కూడా పిల్లలని కొట్టటం లేదు. ఇంకా ముద్దు చేస్తున్నారు కూడా. ఋత్విక్ చాలా అయోమయంగా చూస్తున్నాడు. వాడి ఆలోచనలో వాడికి తెలిసిన స్కూల్ వేరు. అక్కడ అంతా భయమే వుంటుంది. కానీ ఇక్కడ అంతా విరుద్ధంగా వుంది. ఇదే టైమ్ అని “ఋత్విక్ నువ్వు కూడా అక్కడ ఆడుకుంటావా” అని అడిగాను.. సంతోషంగా తల వూపాడు. మాదవి,నేను వాణ్ని తీసుకుని స్కూల్‍కి వచ్చాము. అందరూ తెలిసిన వాళ్ళే కావడంతో ఒక రెండు గంటలు వాణ్ని అక్కడ ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. వాణ్ని అక్కడ దింపి వస్తున్నా కూడా నన్ను వాడు పట్టించుకోలేదు. ఇంటికి వచ్చి బాల్కనీలోనే కూర్చుని వాడిని గమనిస్తున్నాను. మధ్యలో నన్ను చూసి చేయి వూపుతున్నాడు. రెండు గంటలు ఇట్టే గడిచిపోయాయి. స్కూల్ అయిపోయింది. ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టాను. కొంచెం డల్‍గా కనిపించాడు. అన్నం తిని నిద్రపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చే దారిలో నెమ్మదిగా వాడికి చెప్పాను స్కూల్ బావుంటుందని, టీచర్ అమ్మ లానే ప్రేమగా వుంటుందని, చాలామంది ఫ్రెండ్స్ అవుతారని, ఇలా చాలా చెప్పాను. వాడు వూ కొడుతున్నాడు.. చూడాలి ఏం చేస్తాడో! రేపటి వరకు వెయిట్ చేయాలి. నా ప్లాన్ ఫలిస్తుందో లేదో?
మర్నాడు మళ్ళీ కాలేజీ హడావిడి. ఈ విషయం మర్చిపోయాను. బైటికి వచ్చి లాక్ వేస్తుంటే వాడు కూడా బైటికి వచ్చాడు స్కూల్ యూనిఫామ్‌లో. వాళ్ళమ్మ చేయి పట్టుకుని స్కూల్‌కి వెళ్తూ “బై ఆంటీ సాయంత్రం అడుకుందాం” అని పరిగెత్తాడు. చాలా సంతోషం అనిపించింది.
బస్ కోసం నడుస్తూ ఆలోచిస్తున్నా. స్కూల్ ఎప్పుడు ఒక శిక్ష కాదు.. శిక్షణ మాత్రమే,.. అల్లరి చేస్తే స్కూల్‍కి పంపుతా, టి.వి. చూడడం ఆపకపోతే హాస్టల్‌కి పంపిస్తా.. హోంవర్క్ చేయకపోతే ట్యూషన్‌కి పంపిస్తా.. ఎలాంటి నెగెటివ్ వైబ్రేషన్ వున్న మాటలు ఇవి. పసి మనసుల్లో స్కూల్ పట్ల చదువు పట్ల ఒక ఆహ్లాదకరమైన భావన నింపటం మన అందరి బాధ్యత. సామాజిక బాధ్యత.