ఉ(యు)గాది..!
తెలుగుజాతి తొలి పండుగ!!
విశాల విశ్వంలో
జాతి జనసమూహం ఎక్కడ ఉన్నా..
సంస్కృతి సంప్రదాయాలను
ఆచరణాత్మకం చేస్తూ..
హృదయానందముతో నీకు స్వాగతం పలుకుతారు!
అలాగే ఇప్పుడు కూడా
ఆనంద నర్తనంతో..
పట్టు పీతాంబరాలతో..
తెలుగువారి సంప్రదాయ
పిండివంటల ఘుమఘుమలతో..
పంచాంగ శ్రవణానంద లహరితో..
కవిశ్రేష్ఠుల కవితాగాన మధురిమలతో..
సభాప్రాంగణములు వేయివేల వెలుగులుతో శోభిల్లువేళ..
‘శ్రీ శోభకృతు’ నామ ‘ఉగాది’కి
నిండుగుండెతో స్వాగతం పలకాలని..
యావత్ తెలుగుజాతి
సంబరాల ఏర్పాట్లులో మునిగిపోయిన వేళ..
ఏమిటీ అపశృతి..?
చడీ చప్పుడు లేకుండా
అకారణ ద్వేషముతో
అకాల వర్ష రూపమై
ఉభయ తెలుగు రాష్ట్రాలపై
వరుణుడు విరుచుకుపడగా..
వరుణుడికి వాయువు తోడయి
బీభత్సం సృష్టించిన వేళ..
అన్నదాత రైతు రెక్కల కష్టం
నీటిపాలై బురదలో కలిసిపోయింది!
అమ్మా..!
‘శ్రీ శోభకృతు’ నామధారి
‘ఉగాది’ మాతా..
నీ రాకకు ముందే..
ఈ అపశకునములు ఏమిటి తల్లీ!?
నీ సోదరి ‘శ్రీ శుభకృతు’ నేతృత్వంలో..
ప్రజానేతల పాలన అస్తవ్యస్తమై
తృప్తి రహిత జీవనంలో
వేదనా భరిత బతుకును చవిచూశాము!
అయినా..
నీ ఆగమనంతో శుభకామనలను ఆశిస్తూ
ఆశగా బతుకుబండిని లాగుతూ ఉన్న వేళ..
చైత్రమాసం వసంతనవరాత్రిళ్లు
ప్రారంభానికి ముందే..
తెలుగు భూములలో పండించిన..
మామిడి పిందెలు.. వేపపూత.. చెరుకుపంట..
వగైరా వగైరా..
నోటికందిన పంటలు అన్నీ..
రాళ్ల(వడగళ్ల)వాన పాలై పోయె!
మా గుండెలు వేదనతో బండబారిన వేళ..
మా హృదయం లోగిలిలో
కన్నీటి చెలమలు నిక్షిప్తమైన దుస్థితిలో..
ఆశావహ దృక్పథంతో..
బండబారిన అంతరంగంతో
స్వాగతం పలుకుతూ..