చెల్లవ్వ నిప్పు

1
3

[డాకిధా (డా. కిషోర్ ధారా) రచించిన ‘చెల్లవ్వ నిప్పు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

కథా నేపథ్యం:

గుడిసానులు

దేవగణికలు, దేవరకొల్వుసానులు, గుడిసానులు, కళావంతులు. వీరి చరిత్ర గురించి విసృతమైన విచారణ, విమర్శ, పాండిత్యముంది. దృష్టాంతాలు, పరామర్శ గ్రంథాలు, పరిశోధన ఆంశాలు చరిత్రకి ఆయవుపట్టు. చరిత్ర సార్వజనికమైనది (pertains to larger public).. చారిత్రిక కల్పన వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి మీద చారిత్రక ఘటనలు ప్రభావం, ఆ వ్యక్తి ఉన్న సమకాలీన వ్యవస్థ యొక్క ప్రత్యేక నేపథ్యం, చారిత్రిక కల్పనలకు ఆయువుపట్టు (pertains to private space).

పన్నెండొవ శతాబ్దంలో తూర్పు చాళ్యుకులు కట్టిన పీఠికాపుర శ్రీకుంతీమాధవస్వామి దేశంలోని అయిదు మాధవస్వామి ఆలయాలలో ఒకటి. కుంతదేవి కొలిచిన మాధవుడని ఈ ఆలయానికి కుంతీమాధవస్వామి ఆలయంగా పరిగణించబడినది. పిఠాపురం చిన్న గ్రామము. రాజులు, జమిందారులు ఆధ్వర్యంలో పీఠాపురానికి, కుంతీమాధవస్వామి ఆలయానికి ఒక లయ, ఒక క్రమం ఉంది. మాధవస్వామి కోవెల చాలా చిన్నది కాని ప్రశస్తమైనది. అక్కడ గుడిసానులు ఆచారము, అందులో భాగంగా ఆ ఆలయానికి ప్రత్యేకంగా నవజనార్ధన పారిజాతం కలాపము, శనివారం సాయంత్రం దర్బారు సేవ ఇరవైయవ శతాబ్దం దాకా జరిగేవి.

సక్రమంగా నడుస్తున్న ఓ చిన్న ఆలయం దాన్ని ఆశ్రయించుకొని మనసా వాచా కళని దైవాన్ని నమ్మిన చెల్లవ్వ కథిది. ప్రత్యేకత చూడలేక, అందరిలాగా మధ్యమానికి (regression to the means) లాగే ప్రయత్నం నడుమ జరిగిన ఒక అసాధారణ గుడిసాని కథ.

~

చెల్లవ్వ నిప్పు

[dropcap]“ఆ[/dropcap] పూలు కోయ్యవద్దని చెప్పానా” గట్టిగా అరిచాడు గోవిందనాయుడు.

ఆ అరుపుకి మోకాలి పీట ఎక్కి మల్లెపందిరి మీద అందిన పూలు కోస్తున్న చెల్లవ్వ క్రింద పడిపోయింది. కిందపడ్డ తన సఖి చెలవ్వని చూసి స్వేచ్ఛగా ఏ బెరుకు లేకుండా నవ్వింది వసంత.

అప్పుడే చక్కెరపొంగలి స్వామి కైంకర్యానికి తండ్రికిచ్చి వస్తున్న వెంకటరాఘవాచార్యులు ఏమి జరుగుతోందో చూద్దామని ఆగిపోయాడు.

“ఎవడెవడో బయట్నించి అందిన మట్టుకు కోసుకునే పూలు స్వామి వారి అలంకారానికి పనికి రావని” అసహనంగా పిల్లల్ని శాసించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు గోవిందనాయుడు.

తూర్పు చాళుక్యలు దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం కట్టిన ఆలయమది. ఆలయానికి మూలవిరాట్ శ్రీకుంతీమాధవస్వామి. ఊరు మధ్యలో ఉండడటం వల్ల పడమర వైపు ఆలయ ప్రాంగణం పక్కనే గృహాలు, రహదారి, వాణిజ్య వ్యవహారాలతో లౌకికంగా ఉంటుంది.

ఎప్పుడు అల్లుకుందో తెలియదు కాని పందిరి వేసిన తర్వాత మల్లె తీగ ఆలయ ప్రాంగణంలో పడమటి గోడకి ఇటు అటు కుడా విస్తృతంగా పెరిగి పోయింది.

గోవిందనాయుడు వెళ్ళిపోవడంతో చిన్నపిల్లలు సమావేశమయ్యారు. చెల్లవ్వ, వసంతల వయస్సు ఎనిమదెండ్లు, వెంకటరాఘవాచార్యుల వయ్యస్సు ఆరు.

ముందుగా చెల్లవ్వ “ఆలయం వెలుపల పూలు కోయడం లేదు కదా, లోపలవి కోయక పోతే స్వామికి పూలు చాలవుగా” అని ప్రశ్నించింది.

“గోవిందనాయుడు గారికి కోపమెక్కువ. ఆయన మాటలు పట్టించుకోక”ని తేల్చింది వసంత.

వారితో పాటు అక్కడున్న వెంకటరాఘవాచార్యులు తలూపుతూ అక్కడనుంచి దక్షిణానున్న తన ఇంటి వైపుకు కదిలాడు.

వాయువ్యానున్న నాట్యమంటపం దగ్గరనుంచి జతి స్వరం వినపడింది.

“థాకట కిటతక ఝొకిట కిటతక

తళంగు తధ్ధి త్తక తదిగిణ తోం”

అది వినగానే ఆడపిల్లలిద్దరూ పాఠం మొదలైందని పరుగెత్తారు.

***

చెల్లవ్వ, వసంత ఏడాది క్రితం, 1918లో, గుడిసానులయ్యారు.

చెల్లవ్వ తల్లితండ్రులు ఆలయ ప్రధాన నర్తకి నీలవేణి దగ్గరికి వచ్చి “అమ్మా, మా చివరిది ఎప్పుడూ ఎదో పాడుకుంటూ కళ్లు తిప్పుతూ, కాళ్లూ చేతులూ ఆడిస్తూ ఉంటదమ్మా. దానికిప్పుడు ఏడేండ్లు. దాని కండ్లలో, చేష్టల్లో మా ఏపోల్ల లాగా పని చేసే లక్షణాలు కనపడవమ్మా. పిల్లేమో సూడ్డానికి సక్కగా ఉంటది. మా లోకం తెలవదు. పనిలో పెడితే ఈ ఏషాలకి, ఏ దోరో చెయ్యకూడంది సెత్తే తర్వాత మాకు దిక్కేది. మీ దగ్గర పెడితే సదువు గురించి తెల్దగాని, సంతోసంగా ఉంటదని తెచ్చామమ్మా” అని అడిగారు.

నీలవేణి పాప కేసి చూసింది. చిన్నారి పెద్ద పెద్ద కళ్లతో మాధవస్వామినే చూస్తోంది.

“పేరేమిటి”నడిగింది.

చిన్నారి పలకలేదు.

“పేరు పెట్టలేదమ్మా, బుల్లెమ్మా అని పిలుస్తాం”

“బుల్లెమ్మా, బుల్లెమ్మా”ని రెండు సార్లు తండ్రి పిలిచాడు. తల్లి దగ్గరికి వెళ్లి భుజాలు పట్టుకోని కుదిపింది.

చిన్నారి తల తిప్పకుండా చక్రాల్లాంటి కళ్లు తిప్పి నీలవేణి కేసి ఒక్కక్షణం చూసి మళ్లి మాధవస్వామి కేసి చూసింది. నీలవేణికి మోహంలో ఓ చిరునవ్వు మెరిసింది.

కులగోత్రాలతో సంబంధంలేని నిర్ణయమది.

నీలవేణి విద్వత్తుపై, నిర్ణయాలపై కుంతీమాధవస్వామి కోవెల ప్రధానార్చకులు తిరుమలాచార్యులు, ఆలయ ధర్మకర్తల ప్రతినిధి గోవిందనాయుడికి అపారమైన గౌరవం. అందుకే ఎవ్వరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయమది.

“ముందుగా ఒక ఆరు మాసాలు చూస్తాను. శిక్షణపై ఆసక్తి, మంచి క్రమశిక్షణ ఉంటే ఇక్కడే ఉంటుంది లేకపోతే పంపించేస్తాను.” ఆ మాటకు ఆ చిన్నారి మొదటిసారి నీలవేణి వైపు పూర్తిగా తిరిగి అభ్యర్థనగా చేతులు జోడించింది.

నీలవేణి ఆ చిన్నారికి తూర్పు చాళ్యుకుల చరిత్రలో తనకు తెలిసిన మొట్టమొదటి దేవాలయనర్తకి ‘చెల్లవ్వ’ పేరు పెట్టింది.

వసంత తీరు వేరు. తల్లి దగ్గరలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఒకప్పుడు గుడిసాని. కొన్ని సంవత్సరాల క్రితం దేవాలయ నాట్యం విరమించుకోని వివాహం చేసుకుంది. తండ్రి ఓ మోస్తరి మాగాణున్న రైతు. వసంత తల్లి నీలవేణి ప్రతిభ తెలిసి తన కూతురుకి విద్యాబుద్ధులు చెప్పడానికి ఆమె మంచి గురువని నీలవేణి దగ్గరకి కూతురుని పంపించింది.

పిఠాపురం చిన్న గ్రామం. రాజుల సంస్థానం, వారి కులదైవం మాధవుడు. తమ ఇలవేల్పు తమలాగే దర్బారు తీరి ఉండాలని వారి కోరిక. ఆలయంలో ఉత్సవ మాధవుడు గర్భాలయంలో ఒక ప్రక్కన కాకుండా అంతరాలయంలో భక్తులకు అభిముఖంగా పరివారంతో మూడు సోపానముల మీద నిత్యం దర్బారు తీరి సేవలు అందుకుంటూ ఉంటారు.

ఒక చిన్న ఊరులోని రెండెకరాల చిన్న ఆలయమైనా గుడి మాన్యాలతో, గుడిసాని మాన్యాలతో, రాజపోషణతో, ఊరు కట్టుబాట్లతో, ధర్మనిష్ఠాపరులైన ఆలయ బ్రాహ్మణికంతో, సదాచార సంపన్నులైన ఆలయకర్తలతో, నిష్ణాతులైన గుడిసానులతో ప్రశస్తమై సక్రమంగా సాగే ఒక వ్యవస్థకి శ్రీపీఠికాపుర కుంతీమాధవస్వామి కోవెల ప్రతీకగా నిలిచింది.

కుంతీమాధవస్వామి కోవెలలో దాదాపు ఇరవైమంది గుడిసానులున్నారు. వీరు నృత్య, గీత, వాయిద్యాలతో పాటు సంస్కృతాంధ్రాలలో శిక్షణపొంది స్వామి సేవలో ఉంటారు. నిత్యం ప్రదోష కాల కైంకర్యం నుండి పవళింపు సేవ వరకు కుంతీమాధవస్వామికి నాట్యార్చన చేయడమే కాక ఆలయ అలంకారంలో, వేళకి దీపాలు ఏర్పాటు చెయ్యడంలో, పండగల ఏర్పాట్లలో కావాల్సిన సహాయం చేస్తారు.

కుంతిమాధవస్వామి ఆలయం గుడిసానులు ఆలయం వెలుపుల ఆనుకోని ఉన్న రెండు వీధులలో నివాసముంటారు. వివాహాలు చేసుకొని అందరిలాగా పిల్లాపాపలతో వారి కళని, ఆస్తిత్వాన్ని, ఆశలని, పంచుకుంటారు.

ఈ నేపథ్యంలో కూలిపనిలో ఇమడలేదని గుర్తించిన చెల్లవ్వ తల్లితండ్రులు, కూతురికి విద్యార్జన నీలవేణి దగ్గర బాగా జరుగుతుందని వసంత తల్లి స్వచ్ఛందంగా పిల్లల్ని గుడిసానులు చేశారు. వసంత తన ఇంటనే ఉంటూ శిక్షణ పొందుతోంది. లేమిలో పుట్టిన చెల్లవ్వని నీలవేణి తన ఇంట్లోకి ఆహ్వానించింది.

***

“థాకట కిటతక ఝొకిట కిటతక

తళంగు తధ్ధి త్తక తదిగిణ తోం”

మల్లె పందిరి దగ్గరనుండి పరుగు పరుగున వచ్చి వరుసలో చేరారు చెల్లవ్వ, వసంతలు.

జతిస్వరం పాడుతూ నాట్యం చేసే పిల్లలు మధ్య నడుస్తూ వారి లయని సవరిస్తున్న నీలవేణి వారిని చూసింది. చెల్లవ్వ పరుగు కాస్త మందంగా ఉండడం, కాలికి అయిన చిన్న గాయం కూడా చూసింది.

“థాకట కిటతక ఝొకిట కిటతక

తళంగు తధ్ధి త్తక తదిగిణ తోం”

చెల్లవ్వ వచ్చి తన వరసలో చేరి లయ తప్పకుండా సాధనలో కలిసిపోయింది. అంత చిన్న వయస్సులో ఆ లయ జ్ఞానానికి గురువుగా మురిసిపోయింది నీలవేణి.

“తళంగు తధ్ధి త్తక తదిగిణ తోం

తళంగు తధ్ధి త్తక తదిగిణ తోం”

జతి ముగిస్తూ వసంత ప్రక్కన ఆగి మెచ్చుకోలుగా చూసింది. నిస్సందేహంగా చెల్లవ్వ, వసంతలు ఈ కళకి వారసులని మరో సారి మనస్సులో నిశ్చయించుకుంది. ఆ ఆలోచనిచ్చే సౌఖ్యం, ప్రశాంతత తల్లిదండ్రులతో సమానంగా పొందగలిగేది గురువు మాత్రమే.

అభ్యాసం ముగిసిన తర్వాత పిల్లలందరు గురువుకి నమస్కరించి ఇళ్లకి బయలుదేరారు. చెల్లవ్వ, వసంతలని ఆగమని సైగ చేసింది నీలవేణి. అందరు వెళ్లిపోయిన తర్వాత చెల్లవ్వ గాయం వంక చూస్తూ “ఆలస్యంగా వచ్చారేమిట”నడిగింది.

గోవిందనాయుడు ఉదంతం, చెల్లవ్వ జారి పడిపోయిన విషయం ఉత్సాహంగా నవ్వుతూ చెప్పింది వసంత. చెల్లవ్వ మౌనంగా గురువు ఏమంటుదోనని భయంగా చూసింది.

ఒక్కక్షణమాలోచించి “మీరేమంటార”ని ప్రశ్నించింది.

“గోడ దాటిన మల్లెలు ఎవరో కోసుకుంటే గోడ లోపల కోవెలలో పూసిన మల్లెలు కోయద్దంటున్నారు. బయట కోమ్మలు కొట్టేస్తే పోలా?” ఇంత చిన్నవిషయానికి అంత అస్పష్టత ఎందుకన్నట్లుగా చెప్పింది చెల్లవ్వ.

“బయట కొమ్మలు మళ్ళీ పెరుగుతాయి కదా” సవాలు విసిరింది నీలవేణి.

“పెరిగితే మళ్ళీ కోట్టేస్తారు”

“అవి చూసుకోవటానికి, వాటి గురించి తెలిసిన కాపరి కావాలిగా”

“మల్లెకి కాపరా” నవ్వింది వసంత.

“ఈరోజు మల్లే రేపు మందార, పారిజాతం, అన్నీ పెరుగుతాయి కదా”

“మొక్కలు పీకేస్తే పోలా” తేల్చేసింది వసంత.

“అమ్మో! పెరిగిన మోక్కలు పీకేస్తే స్వామికి పూలో” అమాయకంగా అడిగింది చెల్లవ్వ.

“సర్లే, మీరు వేళ్ళండి, నేను గోవిందనాయడుగారితో మాట్లాడతాను”

పిల్లలకి అర్థంకాలేదని తెలిసినా నీలవేణికి గోవిందనాయుడు నర్మగర్భంగా మాట్లాడడం, పైగా పిల్లల దగ్గర ప్రస్తావించడం అస్సలు నచ్చలేదు.

***

మాధవస్వామి కోవెల ప్రాంగణంలో మూడు మంటపాలుంటాయి. ముఖమంటపం, నాట్యమంటపం, మేడామంటపం. ముఖమంటపం అంతరాలయంతో కలిసే ఉంటుంది. నాట్య, మేడా మంటపాలు ఆలయప్రాంగణంలో ఉంటాయి.

ముఖమంటపం లోనుంచే ఆంతరాలయానకి ప్రవేశం. ఆంతరాలయంలో మొదట దర్బారుస్వామి, దర్బారుస్వామికి వెనకతట్టుగా గర్భాలయంలో మూలవిరాట్ట మాధవస్వామి దర్శనమిస్తారు. స్వామివారి నిత్య సంగీత, నాట్య సేవలు దర్బారు మాధవునికి, మూలవిరాట్ట్ మాధవునికి అభిముఖంగా ఈ ముఖమంటపంలోనే జరుగుతుంటాయి.

నాట్యమంటపం ఆలయప్రాంగణంలో వాయువ్యాన ఉంటుంది. దాదాపు రెండు, మూడు వందలమంది దాకా కూర్చోవచ్చు. విశేష నృత్య ప్రదర్శనలిక్కడ జరుగుతుంటాయి.

మేడామంటపం కోవెల లోపల గుడి ప్రహరీ గోడనానుకోని చుట్టు స్తంభాలతో విశాలమైన అరుగులతో ఉంటుంది. ఈ అరుగుల మీద గుడిసానుల నాట్యశిక్షణ, ఆటపాటలు, అల్లర్లు, వారి కాలక్షేపాలు జరుగుతుంటాయి.

మల్లెపందిరి దగ్గర జరిగిన సంఘటన మరిచిపోయి దక్షిణంవైపు మేడామంటపం అరుగుల మీద చెల్లవ్వ వసంత ఇంకో ముగ్గురు పిల్లలతో కలిసి చింతపిక్కలతో వామనగుంటలు ఆడుకుంటున్నారు. అరుగుల కిందనుంచి బయటకి వెళ్తున్న నీలవేణిని ఇద్దరు గుడిసానులాపారు.

“అమ్మా, నాయుడుగారి మా ఇంటికి వచ్చినప్పుడు దేవాలయ నాట్యానికి, ఇతర నాట్యలకి తేడా లేదని, ఈ సంప్రదాయంలో ప్రత్యేకత లేదని వారి అభిప్రాయంగా మా తల్లితండ్రులుతో చెప్పారు. అప్పట్నించి వారు నన్ను శిక్షణ ఆపేయమని బలవంతపెడుతున్నారు. మీరే ఏదైనా చేసి వారికి నచ్చచెప్పాల”ని ప్రాధేయపడ్డారు.

ఆటలాపి పిల్లలందరూ ఆ మాటలు విన్నడం గమనించిన నీలవేణి అది పెద్ద విషయం కాదన్నట్లు పెదవి విరిచి “నేను మాట్లాడతాన”ని ధీమాగా చెప్పింది.

***

సాయంకాలం. సంధ్యాసమయమింకా మించలేదు. ఆలయ ముఖద్వారము మూసే ఉంది. ప్రొద్దు పొడుస్తోందని అప్పుడే ఆలయం తెరిచే సన్నాహాలు చేస్తున్నారు.

తిరుమాలాచార్యులు, గోవిందనాయుడు, నీలవేణి ఆలయప్రాంగణంలో ఉత్తరాన మేడా మంటపం అరుగుల దగ్గర సమావేశమైయున్నారు. తిరుమాలాచార్యులువారు మఠంవేసుకోని నిటారుగా ఆరుగు మీద కూర్చోనున్నారు. గోవిందనాయుడు మోకాలి మీద కూర్చోనున్నాడు. నీలవేణి నుంచోనున్నది.

“ఆలయ నృత్యం, రాజ దర్బారు నృత్యం, జమిందారీ మేుజువాణిలు ఒకటే ఎందుకవుతాయ”ని నీలవేణి ప్రశ్నించింది.

మిగతా ఇద్దరు మాట్లాడలేదు.

“అవి ఒకటి కానప్పుడు, అందరిని ఒకేలాగా పరిగణించడం తప్పుకాదా? యాంటి నాచ్, యాంటి నాచ్ అని ఉత్తరాదిని మొదలైన ఉద్యమమిప్పుడు దక్షిణాదిన మద్రాసులో కూడా మొదలైందని విన్నాను. ఈ ఇంగ్లీషు చదువుకున్న వాళ్లకీ వ్యత్యాసమేమిటో మన ఆచారమేమిటో ఎలా తెలుస్తుంది?

“ఉత్తరాది, దక్షిణాదంటూ ఏమి లేదు. అంతటా ఉంది. అయినా పదాలు, కల్లాపాలు అలాగే ఉంటాయి కదా”

ఆ మాటన్న గోవిందనాయుడు వైపు కోపంగా తిరిగింది నీలవేణి.

“ఎక్కడో మన సంప్రదాయం తెలియని ఉత్తరాది వాళ్ళననేమి లాభం, ఇక్కడ మనకే తెలియదు. పదాలు, జావళీలు ఆవే అయినంత మాత్రాన, ఆలయ నృత్యం, ఆస్థాన నృత్యం ఒకటయిపోతుందా? ఆలయ దర్బారులో స్వామి ఆనే పిలుపుకి ఒక రాచరికపు దర్బారులో స్వామి ఆనే పిలుపుకి వ్యత్యాసము లేదా? నర్తకి హోయలు, ఛాతి విరుపులు, ఒకటేమిటి అసలు వస్తునిష్ఠ, లక్ష్యమే వేరు. ఆ వ్యత్యాసం ఒక దేవగణికకి తెలుసు, ఆ కుంతీ మాధవస్వామికి తెలుసు.”

“మన ఆలయాలలో నేర్చుకునే వారు కుడా ఆలయ నృత్యాన్ని వీడి ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు”

“దురదృష్టవశాత్తు, మీరన్నది నిజం. విచ్చలవిడిగా పెరిగిన కొమ్మలని సవరించుకోవాలి గాని, చెట్టు మనది కాదని నరుకుకోకూడదని” గట్టిగా చెపింది నీలవేణి.

గోవిందనాయుడికి పొద్దున తను పిల్లల ద్వారా చెప్పదలచుకున్నది చేరవలసిన చోటికే చేరిందనుకున్నాడు.

ఈ లోగా గుడి తలుపులు తెరవగానే, దంపతులొకరు వారి పాపతో తిరుమాలాచార్యులు దగ్గరకి వచ్చారు.

“మా ఆమ్మాయి పెండ్లి కుదిరింది. స్వామివారితో పాటు తమరి ఆశీర్వాదం కోసమొచ్చాం”

“చాలా సంతోషం, వరుడు జోడైన వాడేనా”

మామూలుగా అడకకూడని ప్రశ్న. కాని తిరుమాలాచార్యులు తప్పుడు ఆశీర్వాదాలిచ్చే మనిషి కాదు.

“జోడంటే, జోడుదేముంది స్వామి. ఒకరికొకరు ఇట్టే అలవాటయిపోతారు”

“ఇంతకీ వరుడెవరు” గోవిందనాయుడడిగాడు.

“మన వెంకటప్పయ్య, మొన్ననే తాంబులాలిచ్చుకున్నాము”

వెంకటప్పయ్య అక్కడందరికి పరిచయస్థుడే. యాభై పైబడిన వయస్సు. చిన్నారికి నిండా ఎనిమిది నిండి ఉండవనిపించింది వారికి.

తిరుమాలాచార్యులు వారు, గోవిందనాయుడు, నీలవేణి కట్టుబాటులకి సాంఘిక దురాచారాలకి భేదం తెలసిన వారు. ఆ చిన్నారిని చూసి ఒక్కసారి ఆ ముగ్గురి గుండెలు బరువెక్కాయి.

“ఆ మాధవస్వామే ఆందరికి దిక్కు. అక్కడ మా అబ్బాయి వెంకటరాఘవాచార్యులు అర్చన చేస్తున్నాడు. స్వామి వారి దీవెనలు సరిగ్గా అందుకుంటే ఇంక మా దీవెనలెందుకు అందరికి ఆయనే రక్ష”

ఆ దంపతులు స్వామివారి గోపురం చుట్టూ ప్రదక్షిణం చేయ్యాడానికి వెళ్లారు. పాప ఈ లోగా గుడిలో ముఖమంటపంలోకి వేళ్ళింది. అక్కడ కూర్చోని చదువుతున్న చెల్లవ్వ చూసింది. తన ఈడేనని మాట కలిపింది.

“నీకు చదవడమొచ్చా”

చెల్లవ్వ తలూపుతూ “రాయడం కుడా వచ్చు. నీకు రాదా”ని అడిగింది.

“వచ్చు. ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేను. జాబు రాసే దాకా వస్తే చాలని ఆపేశారు”

“ఇవి పెద్ద పుస్తకాలు కావు. ఆర్థం చేసుకోకుండా నాట్యం చెయ్యకూడదని నీలవేణమ్మ అక్కలకి చేబుతుంటే విన్నాను. ఈ పుస్తకమంతా శ్రీకృష్ణుని గురించే. నేను కుడా పెద్దైన తర్వాత మన మాధవస్వామి మీద ఈలాంటి పుస్తకం రాస్తానని”నని మురిపంగా చేప్పింది చెల్లవ్వ.

గుడిలో ఆర్చనానంతరం హారతి గంటలు మ్రోగుతున్నాయి. గర్భగుడిలోనుంచి బయటకి వచ్చి ఆ చిన్నారిని ప్రదక్షిణం చేసి రమ్మని సౌంజ్ఞ చేశాడు వెంకటరాఘవాచార్యులు. చిన్నారి ప్రదక్షిణం మొదలుపెట్టింది.

ఇంతలో గోవిందనాయుడు దగ్గర పని చేసే గురవయ్య పరిగెత్తుకుంటు వచ్చాడు. వగరుస్తూ కొంత దూరంలో నిలబడ్దాడు. సాధారణంగా తిరుమాలాచార్యులు, గోవిందనాయుడు, నీలవేణి సమావేశమయితే ఎవ్వరూ వారిని భంగపరచరు. అంతదాకా వచ్చాడంటే ఏదో పెద్ద విషయమై ఊండాలి.

ఆప్పుడే హారతిచ్చిన వెంకటరాఘవాచార్యులు, ముఖమంటపంలోని చెల్లవ్వ, వసంత అందరూ అటే చూస్తున్నారు.

దంపతుల వెంట వచ్చిన చిన్నారి మాత్రం ఏమి పట్టనట్లు గుడి చుట్టు ప్రదక్షిణం చేస్తోంది..

“పంతులుగారింక మనకి లేర”ని బిగ్గరగా అరిచి కుప్పకూలిపోయాడు గురవయ్య.

అప్పటి దాకా నిటారుగా కూర్చున్న తిరుమలాచార్యులు ఒక్కసారి వెనక్కి తూలి రెండు చేతులతో నిలదోక్కుకున్నారు.

“ఏమిట్రా ఏమంటున్నావ”ని అరిచాడు గోవిందనాయుడు.

“ఇప్పుడే రాజమహేంద్రవరం నుంచి బండి ఒచ్చింది కదండి. అందులో జనం సెప్పారండీ. అది ఇని పరుగు పరగున ఈడ కోచ్చేసానండీ”

నిశబ్దం ఆ సంధ్యని చీకటి కంటే భయంకరంగా ఆవరించింది.

అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో తిరుమలాచార్యులు కంటినీరు బంగారు వర్ణంతో కంటి కోనలలో మెరిసింది. ప్రదక్షిణం చేస్తున్న చిన్నారి పెళ్లికూతురు మలుపు తిరిగి భగవన్నామస్మరణ చేస్తూ కనిపించింది. ఆ చిన్నారి గతి, ఈ వార్త కలిసి అప్పటదాకా ఆపుకున్న కన్నీరు ఒక్కసారిగా తిరుమలాచార్యులు కంటినుండి జలజలా కారిపోయింది.

అక్కడెవ్వరూ తిరుమలాచార్యులు వారి కంటినీరు పుట్టెరిగి చూడలేదు. ఆలయమంతా తల్లడిల్లిపోయింది.

ఇంకక్కడుండలేక తిరుమలాచార్యులు లేచి గృహానికి బయలుదేరారు. నీలవేణి, గోవిందనాయుడు గుర్తుకు వచ్చారు. వారు సమాధానం కోసం చూస్తున్నారని ఒక్కసారి వెనక్కి తిరిగారు.

“మన ముగ్గురి మార్గాలు వేరైనా అందరము ఆ స్వామి కైంకర్యానికి ఆరాట పడేవాళ్లమే. ఇప్పుడైనా ఎప్పుడైనా మన ఉనికికి మన నిష్ఠ, మన సదాచారమే ప్రకాశము. ఈ కుంతీమాధవస్వామి ఆలయ వ్యవస్థేమిటో, ఇది కొనసాగాలంటే ఎటువంటి సంఘర్షణ జరగాలో మనకి తెలుసు. ఒకరికి చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ వ్యవస్థకి ఇంకా రాలేదు కదా! నీలవేణి, ఆ కుంతీ మాధవస్వామి దయవల్ల మీకిచ్చిన మాన్యాలు మీ చేతులలోనే ఉన్నంత కాలము మీకూ, మీ కళకి, మీ సేవలకీ ఏ విధమైన ఆటంకం రాదు, ఎవ్వరూ అడ్డు కాకూడదు”.

తిరుమలాచార్యులు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా గుబులుతో నిండిన నిశబ్దం ఆవరించింది.

పిల్లల ముగ్గురికి ఆ రాజమహేంద్రంలోని పంతులుగారేవ్వరో తెలియదు కాని వారికి అక్కడందరూ ఏదో కోల్పోయినట్లనిపించింది.

వసంత అయన మాటలు శ్రద్ధగా విన్నది. మాన్యాల ప్రస్థావన అర్థం కాలేదు.

వెంకటరాఘవాచార్యలు తండ్రి కన్నీరు చూసి కలవరపడిపోయాడు.

చెల్లవ్వకి అయన కన్నీరు చూసి, గురువు బేలతనం చూసి భయం వేసింది. ముఖ్యంగా మాధవస్వామి ప్రస్థావన గురువునుద్దేశించి సేవలు గురించి అన్న మాటలు చెల్లవ్వని కలవరపరిచాయి. పంతులు గారు గురించి తెలుసుకోవాలనిపించింది.

ఆక్కడ ఆ కీ.శ. 1919 వేసవి సాయింత్రాన కోటి దివ్వెల సూరీడు అస్తమించాడు.

***

ఈ అటుపోటులతో ఒక పన్నెండేళ్లు గడిచాయి.

ఉనికి అనేది చాలా చిత్రమైనది. మన ఉనికి మనం తెలియజేయకపోతే ఇతరులు నిర్వచిస్తారు. మాధవస్వామి గుడిసానుల విషయంలో కుడా అదే అయ్యింది. ఎక్కడో జరిగే భాషాంతర చర్చలలో కలుపో కాదో తేలియని మొక్కలయ్యారు. బహుశా దేవదాసి ఆచారం ఉత్తరాది ఆలయాలదో, దక్షిణానాదినున్న పెద్ద ఆలయాలదేమో. సమాన రుపాంతరాలు లేక పంతొమ్మిదో శతాబ్దపు చివర్లో అందరికీ ఆపాదించబడింది. ఆ రూపాంతరం ఒక మూలనున్న పీఠికాపుర కుగ్రామములోని కుంతీమాధవస్వామి గుడిసానుల అస్తిత్వాన్ని కొల్లగొట్టింది. దేశవ్యాప్త చర్చలలో అందరితో పాటు పీఠికాపుర శ్రీకుంతీమాధవస్వామి గుడిసానుల ఉనికి నిర్దిష్టతలేని, నిర్వచనములేని మధ్యమానికి నిర్దేశించబడ్డారు. చర్చలలో గుంపులో గోవింద అయ్యారు.

నీలవేణి జరిగే పరిణామాలు దృష్ట్యా శిక్షణ మీద ఇంకా శ్రద్ధ పెట్టి నేర్పసాగింది.

చెల్లవ్వ, వసంత వయస్సులిప్పుడు ఇరవై దాటింది. వారిప్పుడు నీలవేణికి కుడి ఎడమలయ్యారు. వెళ్లిపోయేవారు వెళ్లగా, కోత్తగా చేరేవారితో కలిపి గుడిసానులోక పాతికమంది దాకా ఉన్నారు. వెళ్లిపోయేవారు నీలవేణికి తృణప్రాయం. వారెంచుకున్న జీవితం వేరు తన చూపిస్తున్న మార్గం వేరు.

గోవిందనాయుడికి మాత్రం వెళ్లిపోయిన వారిని ఇంకా శ్రీకుంతీమాధవస్వామి గుడిసానులుగా పరిగణిస్తాడు. ముఖ్యంగా ఆలయంలో నాట్యం నేర్చుకునే నర్తకిలు వారి దేవాలయేతర కార్యకల్లాపాలు అతనికి తెలుస్తూ ఉంటాయి. కొంతమంది ఆలయంలో నేర్చుకున్న విద్య వెలుపుల కూడా నేర్పడం మొదలు పెట్టారు. వారిపై కట్టుబాటులు లేకపోవడం అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. అది నీలవేణి, దేవగణికల ఆచారపు వైఫల్యంగా పరిగణిస్తున్నాడు. గుడిసానుల వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోతోంది.

***

అది మాఘ పౌర్ణమి.

పరదా కప్పిన గుర్రపు బండిలో నీలవేణి, చెల్లవ్వ, వసంత, ఇంకా కొంతమంది గుడిసానులు ఉన్నారు. వెనకాల అలాంటి మరో బండిలో మరికొంత మందున్నారు. ఇంకా పైట వేసుకోని గుడిసానులు, చిన్నపిల్లలు, కోలాహలంగా ఎడ్లబండి మీద ఏ అడ్డు లేకుండా ప్రయాణం చేస్తున్నారు.

గుడిసానుల బళ్ళ ముందర పల్లకిలో దర్బారు మాధవస్వామి, వెనక అర్చకస్వాముల బృందం, గుడిసానుల వెనకాల గోవిందనాయుడు దళం గుంపుగా పీఠికాపురం నుండి కొండెవరం, ఎండపల్లి కూడలి, కొత్తపల్లి గ్రామాల మీదగా ఉప్పాడ సముద్రం వైపు వెళ్తున్నారు.

ప్రతి మాఘ పౌర్ణమి నాడు మాధవస్వామికి సముద్ర స్నానోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాన్ని చక్రస్నానోత్సవమంటారు. మాఘ మాసపు నీలాకాశంలో, నిండు పున్నమి వెలుగులో, తెల్లని సముద్ర కెరటాలలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో చక్రస్నానమొక పెద్ద ఉత్సవం.

సమూహము ఎండపల్లి కూడలి దాటి కొత్తపల్లి చేరుతోంది.

“పదాల సాహిత్యం చూస్తే ఇలా మగవారు వ్రాసారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడవారి మనసు వారి ఆరాధన ఎంత బాగా అర్థం చేసుకున్నారో ”నని మురిపంగా పైకనేసింది చెల్లవ్వ.

“ఖచ్చితంగా ఆడవారి ప్రభావముండే ఉంటుంద”ని వసంత సమాధానమిచ్చింది.

“ఏమో!! వారి ప్రస్తావన కనబడదు. అయినా చదువుకున్న ఆడవారు ఎంతమందున్నారు. జమీందారీ బిడ్డలు, కాస్త అభ్యుదయ భావాలు గల తల్లిదండ్రులున్న, ముఖ్యంగా ఆలాంటి తండ్రులున్న, గొప్పింటి అమ్మాయిలు కాకుండా ఇంక చదువుకున్నది మనమే కదా. మిగతా వారందరూ ఇంటి చాకిరికీ, కూలి పనులకి, సంసారాలకి, మూఢనమ్మకాలకి, సంప్రదాయమనే కట్టుబాట్లకి పరిమితమైపోయారు.”

“అంటే ఈ సాహిత్యంలో గుడిసానుల భాగముందంటావ”ని సవాలు విసిరింది వసంత.

“నేనలా అనలేదే”

“జమిందారీ, గొప్పింటి కట్టుబాటులున్న ఆడవారు సాహిత్యం అంత స్వేచ్ఛగా వ్రాయగలరా, వ్రాస్తే హర్షిస్తారా? వారి ప్రభావముంటుందా వారిని తీసేస్తే నీ చదువుకున్న ఆడవారి జాబితాలో మిగిలింది మనమే కదా”

“ఏమో నాకేమి తెలుసు”

“ఏమి తెలియకుండానే స్వామి మీద శృంగార పదాలు వ్రాశావా, నువ్వు పీఠీకాపుర ముద్దుపళనివి కదా” యని కవ్వించింది వసంత.

“ఆవిడ రాజులనాశ్రయించింది నేను మాధవుడినాశ్రయించాను, అయినా గట్టిగా అనకు, ఎవరైనా వింటారు. వారికా తేడా కూడా తెలియదు.”

చెల్లవ్వ పరదా తీసి దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో చూసింది. నీలవేణితో సహా అందరూ నవ్వారు. చెల్లవ్వ కంగారుగా పరదా మూసేసింది.

“ఎవరు? గోవిందనాయడు గారు వింటారనా” పొడిగించింది వసంత.

గోవిందనాయుడి ప్రస్తావన రాగానే ఇంక చాలన్నట్లు నీలవేణి సమాధానమిచ్చింది.

“ఇప్పుడు మనమున్న కొత్తపల్లికి దక్షిణానున్న కోమరిగిరి, నేమాం గ్రామాల మధ్యలో మన గుడిసానుల మాన్యులుంటాయి. గోవిందనాయుడు గారి సంరక్షణలో ఉంటాయి. మన ఆదాయానికి మన మనుగడకి గోవిందనాయుడు గారి కృషి చాలా ఉంది. కాకపోతే ఆయన కళ కోసం కాదు ఆలయ ధర్మం కోసం చేస్తున్నారు.”

“ఎవరిచ్చారీ మాన్యాలన”డిగింది బండిలో ఉన్న ఒకమ్మాయి.

“ఇవి ఇప్పటికి కావు, తూర్పు చాళ్యుకుల నాటి గుడిసాని మాన్యాల”ని సమాధానమిచ్చింది చెల్లవ్వ.

గుడిసానుల గుంపు వెనకాలే వస్తున్న గోవిందునాయుడు చెల్లవ్న పరదా తీయడం, అందరూ నవ్వడం చూశాడు. పరదా తీయగానే ఊరేగింపు చూడడానికి వచ్చిన వారిలో కోలాహలం పెరిగింది. అతనికి ఇదంతా అనవసరమనే భావన.

ఈ ఉత్సవానికి గుడిసానుల రావడం అతనికి ఇష్టం లేదు. వారు కోవెల ప్రాంగణంలో, ఉత్సవాలప్పుడు కోవెల బయట తూర్పు వైపున తప్ప మరెక్కడా గజ్డె కట్టరు. ఉప్పాడ సముద్ర చక్రస్నానం ఉత్సవంలో వారు రావడం, అందరి కళ్లు వారి మీద ఉండడం అతనికి ఎప్పుడూ నచ్చదు.

గోవిందనాయుడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఆ మాఘమాసంలోనే అతనికి ఆ అవకాశం వచ్చింది.

***

గోవిందనాయుడు బంధువుల వివాహం నిమిత్తం కాకినాడ వచ్చి పిఠాపుర రాజావారి కళాశాల సమీపంలోని సూర్యాపేటలో విడిదింట్లో బస చేసి ఉన్నాడు. సాయంత్రం గడిచే కొద్ది అతనిలో అసహనం, కోపం ఎక్కువ అవ్వసాగాయి. దానికి కారణం పెళ్ళివారు ఆ సాయంత్రం ఎర్పాటు చేసిన మేజువాణి. కొప్పు సరోజ మేజువాణి.

మేజువాణి మొదలవబోతునట్లు వాయిద్యాలు, గాత్రం శృతి చేసుకోవడం వినబడుతోంది.

“రా బావా, ఒక్కడివే ఈడుండిపోయావేటి. సరోజ స్టేజీ మీదకి వచ్చేస్తుంది.”

“నువ్వెళ్ళరా సూరిగా, నే వస్తాను”

“మయంలో వస్తే వెనకాల కూర్చోవాల, నువ్వు రా. నిన్ను తీసుకేళ్లే దాకా నే వేళ్లను”

అందరిని తోసుకోని సూరి, తనకు, బావ గోవిందనాయుడికి రెండో వరసలో చోటు కుదిర్చాడు.

వేదికకి మూడు వైపులా జనం నిండిపోయారు. చాలా కోలాహలంగా ఉంది. సందడి ఎక్కువయే కొద్ది గోవిందనాయుడులో కలవరమెక్కువైపోయింది. సంగీత కచ్చేరి ముగిసింది. ఒక్కసారిగా చపట్లు రెట్టింపైనాయి. నట్టువాంగ బృందం మొదలుపెట్టారు. చపట్లు తారాస్థాయికి చేరుకునేటప్పటికి కొప్పు సరోజ ప్రవేశ దరువుతో వేదిక మీదకి వచ్చింది.

గోదావరి జిల్లా మేజువాణి తంజావూరు దాకా ప్రసిధ్ధి. పదాలు, జావళీలలోని సాహిత్యానికి ధీటుగా ప్రత్యేకమైన ఆభినయం, లాస్యం మేళివించి చాలా జనరంజకముగా ఉంటుంది. అప్పుడప్పుడే నామకరణం చేసి మొదలైన భరతనాట్యం కుడా గోదావరి తీరంలోని మేజువాణి నుంచి కొన్ని ఆంశాలు ఇముడ్చుకుంటోంది.

కొప్పు సరోజ కలాపం మొదలు పెట్టింది. గోవిందనాయుడు నాట్యం కంటే పరిసరాలని, వచ్చిన వారి స్పందనని ఎక్కువగా గమనించసాగాడు. కరతాళధ్వనులతో కొప్పు సరోజ మేజువాణి ముగిసింది.

“ఎంత బాగా ఆడింది”

“ఇప్పుడేమి చూశావు. మన పిఠాపురంలో కుంతిమాధవస్వామి కోవెల్లో నవజనార్ధన పారిజాతమని తొమ్మిది రోజులు కలపాలాడతారు. కొప్పు సరోజ చిన్న వయస్సులో ఆ బృందంలో ఆడేది. ఎలా ఆడేదనుకున్నావు”

సాయంత్రం నుంచి ఏదైతే వినవలసి వస్తుందని భయపడ్డాడో ఆ మాటలు వినేసరికి గోవిందనాయుడు రక్తం కోపంతా సలసలా కాగిపోయింది. వెనక వరసలో ఉన్న వారి మాటలు ఇంకేమి వినవలసి వస్తుందోనని అక్కడనుంచి గబగబా నిష్కృమించడానికి సన్నధ్ధుడయ్యాడు.

కొప్పు సరోజ వేదిక మీద ముట్టవలసిన దక్షిణ వ్యవహారాలు చూస్తోంది. కొంతమంది చిన్నారులు వేదిక మీద రాలి పడిపోయిన పూలని ఏరుతున్నారు. గోవిందనాయుడు నిష్కృమించేముందు ఒక్కసారి వేదిక కేసి చూశాడు. వెంటనే ఆతని భృకుటి ముడిపడింది. తన చూసింది ఖచ్చితమని నిర్ధారణ చేసుకుందామని ఒక్కసారి ఆగిపోయాడు. నిర్ధారణ అయిందని ఖరారు చేసుకోని, వడివడిగా అక్కడనుంచి బయటకి వచ్చేశాడు.

***

మర్నాడుదయం ఎప్పటిలాగా కోవెల మేడా మంటపంలో నాట్యశిక్షణ జరుగుతోంది. ఆ రోజు చిన్న పిల్లలకి ముందుగా చెలవ్వ, వసంతలు ముద్రలు నేర్పుతున్నారు. ఇంకా నీలవేణి రాలేదు. మొదటి స్థాయి పిల్లలకి శిక్షణ పూర్తయిన తర్వాత నీలవేణి వచ్చి పై స్థాయి వారికి మెళకువలు, మొత్తం గణానికి కలాపాలు నేర్పుతుంది. నీలవేణి వచ్చే దాకా ఆ మొదటి స్థాయి పిల్లలకి చెలవ్వ, వసంతలే గురువులు.

గోవిందనాయుడు గుడిలోకి అడుగు పెట్టాడు. కుంతీమాధవస్వామి వారికి నమస్కరించి, వెంకటరాఘవాచార్యులు వారిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకోని నాట్యమంటపం వైపు అడుగులు వేశాడు. నాట్యశిక్షణ జరిగే సమయంలో ఎప్పుడూ అటు వైపు వెళ్లని గోవిందనాయుడుని చూసి వెంకటరాఘవాచార్యులు ఆశ్చర్యపోయి, ఆసక్తిగా అటు చూశాడు.

బాగా దగ్గరికి వచ్చే దాకా గోవిందనాయుడుని చెల్లవ్వ కాని వసంత కాని చూడలేదు. చూడగానే ఒక్కసారి పాఠం ఆపేశారు. పిల్లలందరూ ఒకమూలకి చేరారు.

గోవిందనాయుడు కళ్లు ఆ పిల్లలో ఏదో వెదుకుతున్నాయి. అందులో ఒక అమ్మాయి చూపించి “ఆ, నువ్వే ఇటురా” అని అజ్ఞాపించాడు. ఆ పిల్ల భయపడి ఇంకా వెనక్కి జరిగింది.

“నిన్నే, బయటకి రా”

“వినపట్టం లేదా? పిలిచేది నిన్నే”

ఆ పాప ఇంక చేసేదేమి లేదని బయటకి వచ్చి గోవిందనాయుడు వైపు నడవడం మొదలు పెట్టింది.

“నువ్వాగు సత్యా!! గోవిందనాయుడుగారు ఈ అంతరాయమేమిటో, సత్యనెందుకు పిలస్తున్నారో తెలుసుకోవచ్చా”

చెల్లవ్వ మాటలు పెద్దగా పట్టించుకోలేదు గోవిందనాయుడు. సత్యతోనే మాట్లాడాడు.

“నిన్న నువ్వు కాకినాడ వెళ్లావు కదా”

“ఎందుకడుగుతున్నారో తెలుసుకోవచ్చా”

“ముందు వెళ్లిందో లేదో తెలుసుకుందాం, తర్వాత మీ గురువు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం”

“సత్య కాకినాడ వెళ్లడానికి నీలవేణమ్మతో మాట్లాడడానికి సంబంధమేమటి. సత్య మా శిష్యురాలు, ఏమైనా ఉంటే మాతోనే మాట్లాడండి. సత్యా, నేనడిగే దాకా నువ్వెవరికి సమాధానమివ్వక్కర లేదు”

చెల్లవ్వ మాటలకి వసంతతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. గోవిందనాయుడుకి ఉక్రోషమొచ్చింది.

“సరే, నువ్వే అడిగి చెప్పు, నేను మిగతా విషయం తర్వాత చెబుతాను”

చెల్లవ్వ విషయం పెద్దది చేయడం ఇష్టంలేక సత్యనడిగింది.

“నువ్వు నిన్న కాకినాడ వెళ్ళావా”?

అవునన్నట్లుగా తలూపింది సత్య.

“చెప్పానుగా, నే చెప్పానుగా!! ఎక్కడికి వెళ్లిందో చెప్పమను”

వసంత ఇంక విన్నది చాలునన్నట్లుగా “మీరెక్కడ చూశారో, మీకెలా తెలిసిందో, ఆయినా కాకినాడ వెళ్తే ఏదో అపరాధంలా నిలదీస్తున్నారేమిటి” అనడిగింది.

“మా బంధువుల పెళ్ళిలో ఈ పిల్లని మేజువాణి వేదిక మీద చూశాను”

అప్పటిదాకా గంభీరంగా ఉన్న చెల్లవ్వ ఒక్కసారి వణికి పోయింది.

వసంత వెంటనే తేరుకోని “నిస్సందేహంగా సత్య కాదు, ఎవరినో చూసుంటారు”

“లేదు లేదు, నేను చూసింది ఈ పిల్లనే”

“అసలు సత్యకింకా జతులు కుడా పూర్తి కాలేదు, వేదికల్లో ఏమి చేస్తుంది”

గోవిందనాయుడు అసహనంగా వసంత కేసి చూశాడు.

“నేను నాట్యం చేసిందన్నానా, ఆ వేదిక మీద పూలు ఏరుతూ కనబడింది”

చెల్లవ్వ శ్వాస తేలికయ్యింది.

“ఓసి ఇంతేనా! నువ్వు నిన్న పెళ్ళికి వెళ్లావా?”

సత్య మళ్లీ తలూపింది. గోవిందనాయుడుకి ఆ ప్రశ్న సరిపోలేదు.

“పెళ్ళికి వెళ్లడం కాదు. ఆ మేజువాణి మేళంతో ఏమి చేస్తోందో అడగు”

“మీరెళ్లినట్లు బంధువుల పెళ్లికి వెళ్లి, మేజువాణి చూద్దామని అక్కడికి వచ్చిందేమో”నని వసంత సవాలు విసిరింది.

“నే వెళ్లటం వేరు, మన ఆలయంలో నాట్యం నేర్చుకునే ఈ పిల్ల వెళ్లడం వేరు”.

గోవిందనాయుడు మాటమాటకి పిల్ల పిల్ల అనడంలో ఈ విషయాన్ని సత్యకే కాకుండా అక్కడ అందరికీ ఆపాదించదలుచుకున్నాడని చెలవ్వకి, వసంతకి అర్థమైంది.

చెల్లవ్వ వారిని పరిరక్షించుకోవడానికి చూస్తోంది. వసంత గోవిందనాయుడుది అసలు సమస్యే కాదని చూస్తోంది.

ముందుగా చెల్లవ్వ సమాధానమిచ్చింది.

“ఈ పాప పేరు సత్యభామ. ఏడాదినుంచి మన ఆలయంలో నాట్యంతో పాటు సంగీతం, సంస్కృతాంధ్రాలు నేర్చుకుంటోంది. ఒక్క మేమే కాదు, ఏ గురువునడిగినా చెబుతారు, సత్యభామ భావి తరాలలో మన కుంతీ మాధవస్వామి ఆలయ ఘనత సంప్రదాయం నిలబెట్టగలిగే ప్రతిభ, కావలసిన అభ్యాసం చేసే పట్టుదల ఉన్నాయని.”

“చూడడానికి వెళ్లిందని, మీరంటే సరిపోతుందా. రేపు మేజువాణి ఆడదని మీరు జవాబుదారీగా ఉంటారా” ప్రతి సవాలు విసిరాడు గోవిందనాయుడు.

ఆ మాటకి తల్లడిల్లిపోయింది చెలవ్వ. పిల్లలింక విన్నది చాలన్నట్లుగా వారిని వెళ్లిపొమ్మని సైగ చేసింది. గోవిందనాయుడు కుడా అది గ్రహించి వారు వెళ్లిపోయే దాకా ఆగి సమాధానమేమిటన్నట్లు చూశాడు.

“సత్యభామ చిన్న పిల్ల. తప్పొప్పులు ఇంకా తెలియని వయస్సు. మేము సవరించుకుంటాము.”

వసంతకది నచ్చలేదు.

“ఇందులో తప్పేమిటో నాకర్థం కాలేదు. బంధువుల పెళ్లికి వెళ్లి బహుశా అక్కడ కోలాహలం చూసి మేజువాణి దగ్గరికి వెళ్లిందేమో. వేదికి మీద పూలు చూసి ముచ్చట పడిందేమో. దీన్ని ఇంత పెద్ద విషయం చెయ్యడమేందుకు.”

చెల్లవ్వ ఒప్పుకోలేదు. ఆమెకి కళ స్వామి సేవ వేరు కాదు.

“లేదు వసంతా! చిన్నపిల్ల ముచ్చట పడినా, మన ఆలయ నర్తకి మేజువాణి వేదిక మీద తారసలాడడం తప్పని మనం చెప్పుకోవాలి కదా.”

“నేనొప్పుకోను చెల్లవ్వ, మేజువాణి నాట్యం కూడా కళే, మనమెంచుకున్న మార్గం, మన సాధన చేసే కళ కాకపోవచ్చు కాని మనం ఆ కళని తోసిపుచ్చడం సబబు కాదు. కళని, కళ గతిని మనమే మార్చగలం అనుకోవడం ఆత్మవంచనే”

“దేవాలయ నాట్యానికున్న ఎల్లలు, బయట ఉంటాయా?”

“ఖచ్చితంగా ఉండవు. మనం ఉండాలనుకోకూడదు. ఈ ఆలయ సరిహద్దుల వరకే మన పరిమితి.”

తన విషయం మరిచారని గోవిందనాయుడు వారిని హెచ్చరించాడు.

“మన ఆలయంలో నేర్చుకొని బయట వెళ్లిపోతే”

“ఎవ్వరిని ఇక్కడ కట్టడి చెయ్యలేము కదా. ఎవరి ఇష్టం వారిద”ని తేల్చేసింది వసంత.

చెల్లవ్వ తన నమ్మకాన్ని వెల్లడించింది.

“మనం పిల్లలకి సరైన కట్టుబాటులు, నడత చూపించాలి. స్వామి వారి సేవకి, బాహ్య ప్రపంచపు కరతళాలకి హస్తమశికాంతరముందని చూపించాలి. మనకెందరో అక్కరలేదు, అది గ్రహించిన కొద్దిమందున్నా చాలు, ఈ సంప్రదాయానికి మన కళకి ఏ ఆటంకముండదు”

వసంత కళకి స్వేచ్ఛ ప్రధానం. చెల్లవ్వ కళకి భక్తి ప్రధానం, కుంతీమాధవస్వామి సేవ తారకం.

ఈ రెండు సమాధానాలు గోవిందనాయుడుని శాంత పరచలేదు. అతనికి కళాదృష్టి ప్రధానం కాదు.

“మన ఆలయ మాన్యాలు వీరికి, వీరి శిక్షణకి వ్యజించిడం వృథా” అని అక్కడనుంచి వెళ్లిపోడానికి వెనక్కి తిరిగాడు. ఎప్పుడోచ్చిందో గాని ఒక మూల నుంచోని వింటున్న నీలవేణిని చూశాడు. తను చెప్పడానికేమి లేదన్నట్లు ఆమె మౌనంగా తల దించుకోవడంతో ఇంక అక్కడనుంచి వెళ్లిపోయాడు.

వడివడిగా ఇంటికి వెళ్ళాడు. గోవిందనాయుడు కోపంగా ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు. “గౌరవనీయులైన శ్రీమతి డా. ముత్తులక్ష్మారెడ్డి గారికి నమస్కారములు.” ఇక్కడ జరిగిన ఉదంతాన్ని సోదాహరణగా చూపించి ఆడపిల్లలపై సాంఘిక ప్రభావం, గుడిసాని మాన్యాల గురించి తన అభిప్రాయం స్పష్టంగా విశదీకరించాడు.

***

ఉదయం జరిగిన దానికి చెల్లవ్వ చాలా కలవర పడింది. చెల్లవ్వ కలవరాన్ని పక్కన పెట్టాలని రోజంతా మాధవస్వామినే తలుచుకుంది. తను ఎంతో కాలంనుంచి ఎదురు చూసిన రోజు.

శనివారం. ఆ రోజు చెల్లవ్వ దర్బారు సేవ నిర్వహిస్తుందని నీలవేణి తన నిర్ణయం తిరమలాచార్యులవారికి, వెంకటరాఘవాచార్యలకి, గోవిందనాయుడికి కొన్ని నెలల క్రితమే చెప్పింది. పీఠికాపుర కుంతీమాధవస్వామికి ప్రతి శనివారం ఒక విశేష సేవ ఉంటుంది. ఆ సేవ పేరు దర్బారు సేవ. ఆందులో కుంతీ మాధవస్వామి మీద వ్రాసిన కీర్తనకి నాట్యం చెయ్యడం ఆలయ నర్తకిలకొక మైలురాయి. ప్రదర్శనకి గురువు సమ్మతి కావాలి. వారి భక్తి, వారి కళ మరో మెట్టు ఎక్కిందన్నడానికి ప్రమాణం. గురువిచ్చే తాఖీదు. కొన్ని తరాలుగా చేస్తున్న సేవ, సాగుతున్న ఆచారమది.

ఆ వార్త విన్నప్పుడు చెల్లవ్వ ఆనందానికి హద్దుల్లేవు. చెల్లవ్వకి కీర్తన చివర్లో “కుంతి మాధవస్వామికి జోహార”న్న పదాలప్పుడు స్వామి తప్ప ఇంకెవ్వరూ లేనట్లు తన గురువు పొందే తన్మయత్వం అభినయం దాటిన నాట్యమనిపించేది.

నీలవేణి, తిరమలాచార్యులవారు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తిరమలాచార్యులవారు ఆలయ ప్రధాన అర్చకత్వ బాధ్యతలు వెంకటరాఘవాచార్యులకిచ్చి చాలా రోజులయింది. ఈ రోజుతో నీలవేణి నుంచి ఇరవై మూడేళ్ల చెల్లవ్వ అధికారికంగా ప్రధాన ఆలయ నర్తకి బాధ్యతలు చేపడుతుంది. ఓ తరం పూర్తిగా మారుతుంది.

***

చెల్లవ్వ మనస్సంతా దర్బారు సేవ మీదే ఉంది. చెల్లవ్వ కంటే వసంత, వెంకట రాఘవాచార్యులు చాలా ఆనందంగా ఉన్నారు. చెల్లవ్వలో గుడిసాని కళ పట్ల ఉన్న విశ్వాసము, మాధవస్వామి పట్ల నిర్మల భక్తి అందరికి తెలిసిందే. ఈ ఎంపికని గోవిందనాయుడుతో సహా అందరూ ఎకీభావంతో ఆమోదించారు.

సాన్నిహిత్యం లేకపోయనప్పటికి కలిసి పెరిగిన వెంకట రాఘవాచార్యులు చిన్ననాటి నుండి చెల్లవ్వ అంటే చాలా మన్నన, అభిమానం. స్వామి సేవలో, ఈ ఆలయ సంప్రదాయానికి తనకు చెల్లవ్వ సహచారిణని తెలిసినప్పుడు చాలా ఆనందించాడు.

సందె పొద్దు పొడిచింది. వసంత, తోటి సఖులు దగ్గరుండి చెల్లవ్వని అలంకరించారు. వారందరికి అది ఒక పర్వదినం. ఆ సందె అరుణ కాంతిలో చెల్లవ్వ దేవ కన్యలాగా మెరిసి పొతోంది.

వెంకట రాఘవాచార్యలు ప్రదోష అర్చన, కైంకర్యాలు ముగించి ఆలయ బ్రాహ్మణ్యం ఆశీర్వచనాలు పలుకుతుండగా స్వామి వారి ప్రసాదము తెచ్చి చెల్లవ్వకిచ్చి మనసారా ఆశీర్వదించాడు.

“తా తై.. తై తత్తత్‌ తోం కిడతక

తా తై.. తై తత్తత్‌ తోం కిడతక”

జతితో మొదలైంది దర్బారు సేవ. అందరి కళ్లు దేవ కన్యలాగా ప్రవేశించిన చెల్లవ్వ మీదే ఉన్నాయి.

“సంధ్యాసమయము సరస వసంతము

యమునాతీరము కృష్ణవిలాసము”

ఆ కీర్తన దేవగణికల కోసం, శ్రీపీఠికాపురవాస కుంతీ మాధవస్వామిని కొలిచే కళాకారులు కోసం ప్రత్యేకంగా వ్రాసినట్లుంటుంది. తాళగతులతో మృదంగ నాదములతో కీర్తన సాగుతోంది.

“నారీ జనముల నడుమనుండగ

నానా విధ తాళ గతులు పలుకగ”

చెల్లవ్వ నాట్యంలో శిక్షణ, అభ్యాసం, ప్రజ్ఞ కనబడుతున్నాయి. నట్టువాంగ జతులతో సమంగా చెల్లవ్వ నాట్యం పోటీపడింది.

“నయవినయంబుగ నర్తన మాడుచు

నవరసమొప్పగ మొరళినూదుచు”

కీర్తన తారస్థాయికి చేరుకుంది.

“శ్రీపీఠికాపురమున వెలసిన కుంతిమాధవా జోహార్‌

అమృతవల్లీ దేవి సమేత కుంతిమాధవా జోహార్‌

కుంతిమాధవా జోహార్‌ కుంతిమాధవా జోహార్‌”

కీర్తన ముగిసింది. కరతాళధ్వనులతో ఆలయమంతా మారుమ్రోగిపోయింది. చెల్లవ్వ నృత్యానికి తిరుమలాచార్యులు, గోవిందనాయుడు కళ్లు చెమర్చాయి. వారు నీలవేణి మొదటి దర్బారు సేవ చూసినవారు. మూడు తరాల మార్పు చూస్తున్నారు.

చెల్లవ్వ మాత్రం అక్కడ కుంతీమాధవస్వామి తప్ప ఇంకెవ్వరూ లేనట్లు స్వామి విగ్రహాన్ని మనసారా చూస్తోంది.

నీలవేణి చెమర్చిన కళ్లతో లేచి నిలబడి, కుంతీ మాధవస్వామికి నమస్కరించి, తిరుమలాచార్యుల వారికి వందనం చేసి, చెల్లవ్వని హత్తుకుంది.

చెల్లవ్వ స్వామి పారవశ్యం నుంచి బయటికి వచ్చి, గురువు పాదాలకి లయ బద్దంగా నమస్కరించి వెనుతిరిగింది.

“చెల్లవ్వా, ఒక్క నిమషమ”ని ఆపింది నీలవేణి.

అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

నీలవేణి ఒక్క క్షణమాగి, తన ముక్కపుడక తీసి చెల్లవ్వకి తోడిగింది. ఆ రవ్వల ముక్కుపుడక విలువ తెలిసిన జనం ఒక్కసారిగా ‘ఓ’యని శ్వాస విడిచారు. ఆ రవ్వల ముక్కపుడక చరిత్ర తెలిసిన తిరుమలాచార్యులు, గోవిందనాయుడు నీలవేణి కేసి మెచ్చుకోలుగా చూశారు. పీఠికాపుర నర్తకికది శిరోరత్నము. పీఠాపుర రాజులు చేయించినదది. తరాల నుండి నీలవేణి కుటుంబం వారసత్వ కులధనము. కళా వారసత్వానికి ప్రతిభే ప్రమానమని నీలవేణి చేసిన తీర్పుకి చెల్లవ్వ కంటినీరు వరదలా పొంగింది.

“ఆలయ దీపాలతో పాటు నీ మోముపై మెరిసే ఈ రవ్వల మెరుపు మాధవస్వామిపై ఎల్లప్పుడూ ప్రకాశించాల”ని చెల్లవ్వ కంటినీరు ప్రేమగా తుడిచింది.

ఆ సాయంత్రం గోవిందనాయుడు సహా అందరూ ఉదయం జరిగిన విషయం మరిచి పరవశులయ్యారు.

చెల్లవ్వతో పాటు, వసంత, వెంకట రాఘవాచార్యలు కూడా భావోధ్వేగానికి లోనయ్యారు.

ఒక తరం పూర్తిగా మారింది.

పరాయి పాలనలో, ప్రపంచ క్షోభల మధ్య కాలం గడుస్తోంది.

సుసంపన్నమైన ఆలయ మాగాణి మాన్యాల మీద భ్రిటీషు ప్రభుత్వం కన్ను చాలా కాలం నుంచే ఉంది. ఒక వ్యవస్థని, ఒక జీవన సరళిని కాపాడుదామని దాతలు ఇచ్చిన మాన్యాలవి. రాతలు, కోతలు, పట్టాలు లేని భూములు. వాటి మీద భ్రిటీషు వారికి పన్ను వసూలు చేసుకునే అధికారం లేదు. పన్ను రావటం లేదని, మాన్యాల మీద ఆంక్షలు విధించడానికి చాలా కాలంనుంచి చూస్తోంది. అందులో భాగంగా మాన్యం భూమి తగాదాలకు అధికారులని కుడా నియమించడం జరిగింది. ఈ అధికారులు క్రమేనా పన్ను కోసం ఆలయ మాన్యాలు ఆక్రమించిన వారి తరుపున మాట్లాడం, ఇంగ్లీషు కోర్టులకెళ్లడం పరిపాటి అయిపోయింది.

ఐరోపాలో మొదలైన ప్రపంచ యుధ్ధాలు, ప్రపంచ ఆర్ధిక పరిస్ధితుల ప్రభావం తెలుగునాట కుడా చూపసాగింది. కరువు కాటకాలతో ప్రజలు కష్టపడుతున్నారు.

ఈ పరిణామాలు కుంతీ మాధవస్వామి గుడిసానులపై రెండు విధాలుగా ప్రభావం చూపిస్తోంది. వారి ఆర్థిక స్థితి క్షీణించింది. వారి కట్టులో లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రెండోది కరవు కాటకాలలో తమ పిల్లలకి గుడిసానిగా చదువు సంధ్యలు, సంగీత నాట్యాలు అబ్బుతాయని తల్లితండ్రులు పిల్లల్ని తీసుకురావడం మొదలు పెట్టారు. వారి సంఖ్య దాదాపుగా ముప్పైకి పెరగడంతో ఆర్థికంగా ఒత్తిడి ఎక్కవయ్యంది.

కోవెలసానికి, దర్బారు సానికి, మేజువాని సానులకి, బజారుసానికి వ్యత్యాసముందని, ఒకటి దృఢంగా అస్తిత్వాన్ని విస్తరించేదని మిగతావి వరుస క్రమములో బ్రతుకుతెరువు నుండి బజారున పడ్డ బ్రతుకులని తెలుసుకోలేని వ్యవస్ధ ఆనాటిది. సమాజంలో మసిపట్టిన లాంతరు శుభ్రం చేసుకునేకంటే దీపాన్ని ఆర్పుకుందామనే ఆలోచనే ఎక్కువౌతోంది.

***

దాదాపుగా ఓ పుష్కరం గడిచింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది.

తిరుమలాచార్యలవారు మంచం మీదే ఉంటున్నారు. నీలవేణి కాలం చేసింది. గోవిందనాయుడు వయసు పైబడినా ఇద్దరు అనుయాయుల సహాయంతో గుడి వ్యవహారాలు చూస్తున్నాడు. వెంకటరాఘవాచార్యులకి ఇద్దరు పురుష సంతానం కల్గింది.

వసంతలో మునుపున్న చలాకితనం లేదు. తనకీ, చెల్లవ్వ శిక్షణ ఒక్కటే అయినా చెల్లవ్వ నాట్యం వేరని పూర్తిగా తెలిసినది వసంతకే. తన గురించి కాకపోయినా ఈ జరిగే మార్పులు వసంతని గుడిసానుల కళని, వారి జీవితాలని మారుస్తుందనే ఆలోచన వసంతని కృంగదీస్తోంది.

చెల్లవ్వ మాత్రం ఇవేవి పట్టనట్లు దేవగణికలకు శిక్షణలో, స్వామి సేవ మీదే మనస్సంతా పెట్టి తన బాధ్యతలు అచంచలమైన భక్తితో నిర్వర్తిస్తోంది. వయస్సుతో పాటు పెరిగిన ప్రౌఢ తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమెలో అంతర్గతంగా దాగిన దమనము ఆమె ప్రతి అడుగులో ప్రజ్విల్లమౌతోంది. లౌకికమైన మార్పులు ఆమె దీక్షని తగ్గించలేకపోయనాయి.

***

చెల్లవ్వ గుడిసానులందరితో ఉదయం నుంచి హడావిడిగా పూలమాలలు కట్టి ఆలయ అలంకారం పనులలో హడావిడిగా ఉంది. రెండు రోజులలో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు కోసమది. ఆ తొమ్మది రోజులు వారికి పండగే. నట్టువమేళ సంప్రదాయంలో ముఖ్యంగా పిఠాపుర కుంతీమాధవస్వామి ఆలయంలో ఆ తొమ్మిది రోజులు ప్రదర్శించే భామాకలాపం చాలా ప్రసిధ్ధి. దీనికి నవజనార్థన పారిజాతమని పేరు.

ఆలయ ధర్మకర్తలు, వేంకట రాఘవాచార్యలు, గోవిందనాయుడు చాలా సేపునుండి ముఖమంటపంలో సమావేశమయ్యి ఉన్నారు. ఇంగ్లీషు చదువులు పూర్తి చేసుకోని బారిస్టరు పాసైన గోవిందనాయుడు కొడుకు కూడా ఉన్నాడు. మద్రాసు నుంచి వచ్చాడు.

కాసేపటికి మనవల సహాయంతో కష్టపడి వస్తున్న తిరుమలాచార్యుల వారిని చూసి చెల్లవ్వ భృకుటి ముడిపడింది. ఆలయ మేడా మంటపములో మాలలు అలంకరిస్తున్న ఆమె కొంచం సేపు ఆగిపోయింది. మళ్లీ వారందరూ చర్చలలో మునిగిపోయారు. ఏదో పెద్ద విషయమేనని నిర్ధారించుకోని తన బృందాన్ని పని తొందరగా చెయ్యమని హెచ్చరించింది.

తిరుమలాచార్యుల వారు ముఖమంటపానికి వచ్చారు. ఆయన కుంతీ మాధవస్వామికి నమస్కరించి వెనక్కి తిరిగే లోపల ఎవరో పరుగు పరుగున వచ్చి ఒక చెక్క కుర్చీ వేశారు. వారు ఆశీనులయ్యారు, తతిమా వారు కొంతమంది నుంచున్నారు, కొంతమంది నేల మీద కూర్చోనున్నారు.

దేవగణికలలో చిన్నపిల్లలందరిని వెళ్ళిపోమన్నట్లుగా వెంకటరాఘవాచార్యులు సైగ చేశారు. మిగతా వారిని ముఖమంటపంలో రమ్మనమని చెల్లవ్వకి చెప్పారు. పిల్లలు వెళ్లిపొయిన తర్వాత, గుడిసానులందరు వచ్చిన తర్వాత వెంకటరాఘవాచార్యులు గోవిందనాయుడు కేసి చూశాడు.

గోవిందనాయుడు కొడుకు కేసి చూసి “నువ్వే చెప్ప”న్నాడు.

అతను తటపాయిస్తూ తన చేతిలో కాగితాలకేసి చూపించి మొదలుపెట్టాడు.

“చెల్లవ్వా, ఇదిగో ప్రభుత్వం వారి తీర్పు. ఈ రోజు నుంచి గుడిసానులను, వారి మాన్యాలను, ఆలయంలో వారి కార్యకల్లపాలు కాని రద్దు చేస్తున్నారు”.

చెల్లవ్వ మాన్పడిపోయింది. వసంత వెన్నక్కి తూలి మంటపంలోని స్తంభాన్ని ఆసరాగా తీసుకుంది.

చెల్లవ్వ తేరుకోని “రద్దు చేయ్యడమంటే”

“మీ మాన్యాలుపై మీకు ఏ హక్కు ఉండదు.”

“మాన్యాల సంగతి కాదు, కార్యకల్లపాలు రద్దు అంటే”

“మీరికపై ఆలయంలో నాట్యమాడడానికి లేదు”

ఒక్కసారి కుప్పకూలిపోయిన చెల్లవ్వ కింద పడకుండా ఒక్క ఉదుటున వెళ్లి పట్టుకుంది వసంత. నిలదొక్కుకోని లేచి నిలబడింది చెల్లవ్వ.

చెల్లవ్వ చేతిలో ఉన్న పూలమాల వైపు చూసింది.

“అంటే ఈ బ్రహ్మోత్సవాలలో నవజనార్థన పారిజాతము”

“చట్టరీత్యా అది నేరమౌతుంది”

అక్కడంతా నిశబ్ధంగా ఉంది. గోవిందనాయుడు కొడుకు అక్కడ సమావేశమైనందరికి చెప్పాడు.

“కొత్తవారిని తీసుకోకూడదు, గుడిసానిలన్నా, దేవగణికలన్నా, కళావంతులన్నా, దేవదాసిలన్నా, ఎలా పిలిచినా వారి పిల్లలకి మాత్రం నృత్యం నేర్పకూడదు. దేవగణికలు అసలు ఆలయాలలో నాట్యమాడకూడదు. ఇది దేవదాసి ఏక్టు కింద ఆమోదించబడినది”

“మేము దేవదాసిలము కాదు. మమల్నెవరూ బలవంతంగా తీసుకు రాలేదు. మేము కావాలంటే బయటకి వెళ్లి వివాహం చేసుకోవచ్చు. వాళ్లనుకునే దేవదాసిలం కాదు మేము. మాకు ఇది వర్తిస్తుందా”

“మనదొక చిన్న ఆలయమని. మన ఆలయంలో గుడిసానులు దేవదాసిలు కారని, మద్రాసులోను, ఢిల్లీలోనూ ఉన్నవారికి తెలియదు”

చెల్లవ్వ ఆవేశంతో ఊగిపోయింది.

“విగ్రహ ఆరాధన నిషేధమనే నమ్మకమున్న వారికి గుడిసానికి సంకల్పం, ఆలయ వ్యవస్థలో ముఖ్యంగా మన దేవాలయ నాట్య, సాహిత్యలపై గుడిసానులు ప్రభావం ఎలా అర్థమౌతుంది. అది తెలియనప్పుడు గుడిసానికి, మేజువాని సానికి, బజారు సానికి వ్యత్యాసం ఎప్పటికీ తెలియదు. తెలియ చెప్పగలిగే శక్తి ఉన్న వాళ్ళు పాశ్చాత్య భావాలు, ఆంగ్ల భాష నేర్చుకోని, భ్రిటీషు వారిననుసరించడం మన దురదృష్టం. వారు ఎక్కడో కూర్చోని రాత్రికి రాత్రి వ్యవస్థ మారే నిర్ణయాలు తీసుకునే ముందు, మంచేదో చెడేదో తెలుసుకున్నారా?”

అక్కడెవ్వరు చెల్లవ్వని ఆపే సాహసం చెయ్యలేదు. కాని గోవిందనాయుడి కొడుకు మాత్రం అందరికి అర్థమవ్వాలని దేవదాసి ఏక్టు గురించి వివరించాడు.

“బెంగాలులో, ఒడిస్సాలో, తమిళ ప్రదేశాలలో, ఇంకా వేరే చోట్ల, మన తెలుగనాటలో కుడా జరిగే అత్యాచార్యాలను అరికడదామని తెచ్చిన ఏక్టు. సుమారు పదేహెనేళ్ళ క్రితం డా. ముత్తు లక్ష్మారెడ్డి ప్రతిపాదించిన దాని కంటే ఈ ఏక్టు చాలా కట్టుదిట్టం చేసింది”

ఈ మాటలు చెల్లవ్వ ఆవేశాన్ని ఏమాత్రం తగ్గించలేదు.

“ఆవును, దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ నుంచి వేశ్యలగా మారిని వారు, మార్చబడిన వారు ఉన్నారు. ఆ కుంతీ మాధవస్వామి దయ వల్ల, ఈ పిఠాపురవాసుల ఆచారవిచారాల వల్ల మనకు ఆ దుస్థితి రాలేదు. డా. ముత్తు లక్ష్మారెడ్డి వ్యవస్థలో అత్యాచారాలను అరికట్టాలన్నారే కాని నిర్మూలణాని, దేవగణికలు కాని గుడిసానులను కాని ఇంకెన్నడూ ఆలయాలలో నాట్యమాడకూడదని చెప్పలేదు”

“నాట్య ప్రదర్శనే కాదు దేవాలయ నాట్యం నేర్పడానికి నేర్చుకోవడానికి వీలులేదు”

“మరి ఈ కళ?”

“కూచిపూడి గురువులు, ఈ మధ్యనే కూర్చబడిన భరతనాట్యం గురువులు ఈ కళని నవభారతానికి అనుగుణంగా క్రోడీకరించి ముందుకు కొనసాగిస్తున్నారు.”

“ఎవరు? ఎక్కడో మద్రాసులోనూ, డిల్లీలోను ఉన్నవారా? ఆ గురువుల దగ్గర నేర్చుకునే స్తోమత, అవకాశం ఆగ్రవర్ణాలకు, ధనిక కుటుంబాలకే పరిమితమౌతుంది. వారి జీవనం వేరు గుడిసానుల జీవనం వేరు. ఎవరిని కాపాడదామని ఈ నిర్ణయం తీసుకున్నారో వారు రేపట్నించి బజారున పడతారు. గుడిసాని వ్యవస్థ కాపాడబోయి మేజువాని, బజారుసానుల వ్యవస్థని బలం చేస్తున్నారు”

ఆ ఆరోపణకి అక్కడ ఎవరి దగ్గర సమాధానం లేదు.

 నెమ్మదిగా గోవిందనాయుడు లేచి నిలబడి ఏమి చెయ్యాలో చెప్పాడు.

“మన దగ్గరున్న గుడిసానులను వారి వారి కుటుంబాలకు తెలియపరిచే ఏర్పాటు చేస్తాము. మిగిలిన వారికి మన ఆలయ ధర్మకర్తలూ, కొంతమంది దాతలు ఒక నిధి ఎర్పాటు చేసి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.”

చెల్లవ్వ ఎమంటుందా అని అందరూ చూశారు.

చెల్లవ్వ మాటలు చాలా దృఢంగా వచ్చాయి.

“ఎన్నాళ్లు ఇస్తారు. నాట్యమాడకూడదని, మాన్యాలు చెల్లవని ఆంక్షలు పెట్టిన వారు వీరికి తోడుగా నిలబడగలరా? ఈ జీవన సరళిని మనసా వాచా నమ్మన వారిని నడిరోడ్డు మీదకి ఈడ్చేశారు. కలుపు మొక్కలకి తులసి మొక్కలకి ఒకటే సేద్యం. కలుపు ఉంది. వేరు చేసే ఓపిక లేదు. మంచి చెడు అంతా ఏరి పారేయండి. అవసరమయితే భిక్షం పడేస్తామంటున్నారు.”

గోవిందనాయుడు మాత్రం తను చెప్పదలుచుకున్నది చెప్పాడు.

“అందరి సంగతేమో గాని ప్రధాన నర్తకివయిన నీకు మాత్రం జీవితాంతం ప్రత్యేకంగా భత్యమివ్వాలని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు”

“కుంతీ మాధవస్వామి ముందు నాట్యమాడలేని నాకు, ఏ భత్యము వద్దు. స్వామి కైంకర్యానికి చూసే నేను, ఆయన సేవ చేయకుండా ఏ భత్యము తీసుకోలేను”

గోవిందనాయుడు నచ్చచెప్పడానికి చూశాడు.

“చెల్లవ్వా, అలా అనకు. ఏమి తిని బ్రతుకుతావు”

“ఏమో! స్వామి ముందు నాట్యర్చన చేయ్యలేని బ్రతుకు బ్రతుకేనా? మా ఉనికిని జీవచ్ఛవం చేసేశారు.”

పక్కకు తిరగి కుంతీమాధవస్వామిని చూసి చెల్లవ్వ కన్నీరుమున్నీరయింది.

ఎవ్వరూ ఆమెను ఆపలేదు. కొంతసేపు తర్వాత తేరుకొని..

“స్వామి వారిని నా రీతిలో కొలవలేని నాకు, ఈ ఆలయంలో ప్రవేశమేందుకు? ఈ అలంకారమెందుకు?”

ఆఖరిసారి స్వామికి నమస్కరించి, మెడలో గొలుసు, చేతిగాజులు తీసి ముఖమంటపం లోనుంచి అంతరాలయం లోపలికి వెళ్లి దర్భారు మాధవుని పాదాల కింద పెట్టంది.

ఒక్క క్షణం తటపాయించింది. ముందుకి అడుగులు వేసి స్వామివారి గర్భగుడి గడపకి నమస్కరించి తనలో ఇముడిపోయిన రవ్వల ముక్కుపుడకని బలంగా లాగింది. రక్తపు చుక్కతో తడిసిన తన రవ్వల ముక్కుపుడకని మాధవస్వామి గర్భాలయం గడప మీద పెట్టి స్వామిని దగ్గరనుంచి ఆఖరిసారిగా చూసింది.

వెనక్కి వచ్చి ముఖమంటపంలోనుంచి బయటకి వెళ్ళబోతూ, తిరుమలాచార్యులవారికి నమస్కరించి, వెంకటరాఘవాచార్యుల వారి దగ్గరొక్కసారి ఆగింది.

దుఖాన్ని దిగమింగుకుంటూ వెంకటరాఘవాచార్యుల ఉద్దేశించి అభ్యర్ధన చేసింది.

“ఆచారిగారు, నాకు స్వామితో ఇంకోక్కటి మిగిలి ఉంది. నేడో రేపో ఎప్పుడో నా మరణం తథ్యం. ఆ రోజున ప్రధాన గుడిసానుల ఆచారం ప్రకారం నా దేహం ఆలయం ముందునుంచి వెళ్లినప్పుడు, నా పార్థివ దేహాన్ని గుడి ముందు కొన్ని క్షణాలాపి, నా చితికి నిప్పు ఆలయంలో నుంచి రావడమ మా దేవగణికలకిచ్చిన వరం, ఏ చట్టము రద్దు చెయ్యలేని మాన్యం.”

తలెత్తి నిర్ధారణ కోసమన్నట్లు వెంకటరాఘవాచార్యుల కళ్లలోకి చూసింది చెల్లవ్వ.

“నా చితికి మన మాధవస్వామి కోవెల నిప్పు ఇస్తారు కదా? నా మాన్యం నాకిప్పస్తారు కదా? నా చితి నిప్పు నాకిప్పస్తారు కదా?”

వెంకటరాఘవాచార్యుల కళ్ళ వెంట నీరు తిరిగింది. తల ఊపాడు.

చెల్లవ్వ వెన్నక్కి చూడకుండా ఆలయంలో నుంచి బయటకి వెళ్లిపోయింది.

***

కాలం గడుస్తోంది. చెల్లవ్వ ఆలయం బయట పూలమ్ముతోంది. శుష్కించిపోయింది. ఎండయినా, వానయినా, పండగయినా, గ్రహణమైనా ఆమె దగ్గర తప్పకుండా ఇద్దరు పూలు కొని స్వామికిస్తారు. ఒకరు వెంకటరాఘవాచార్యులు. కొడుకుకి అణా ఇచ్చి పంపిస్తాడు. రెండు వసంత. పనివాడికి బేడా ఇచ్చి పంపిస్తుంది.

చెల్లవ్వ తన నిప్పు కోసం ఎదురుచూస్తోంది.

చెల్లవ్వ నిప్పు మాత్రం ఇంకా ఆ పీఠికాపుర శ్రీకుంతిమాధవ స్వామి దగ్గర దివ్వెగా గాలికి నాట్యమాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here