[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]ము[/dropcap]స్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామ్‌కు, హైదరాబాద్ రాజ్యంలో నివసించే ప్రజలందరిపై అధికారం చేసే హక్కు దైవదత్తం అని విశ్వసించినవారికి భారతదేశ ప్రభుత్వం అస్థిరమైన ప్రభుత్వం అనీ, హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకునే శక్తి భారతీయ సైన్యానికి లేదన్న నమ్మకం బలంగా ఉండేది. ఒకవేళ భారత ప్రభుత్వం హైదరాబాద్‍కు వ్యతిరేకంగా ఎలాంటి చర్య అయినా చేపడితే దేశంలోని ముస్లింలందరూ ఏకమై ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, ప్రభుత్వాన్ని పడగొడతారన్న విశ్వాసం ఉండేది.
అదీ గాక, ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా మారితే, హైదరాబాదులో ఉన్న హిందువులందరినీ బందీలుగా చేసుకోవచ్చు. “ఒకవేళ భారత ప్రభుత్వ సైన్యం హైదరాబాదులో అడుగుపెడితే, హైదరాబాదులో ఒక కోటి అరవై అయిదు లక్షల (హిందువుల సంఖ్య) కాలుతున్న శవాలు వారికి దర్శనమిస్తాయి. మమ్మల్ని బ్రతకనివ్వనప్పుడు మేము ఇతరులను కూడా బ్రతకనివ్వం” అని హెచ్చరించాడు కాశిం రజ్వి.
నేను గమనించిన తొమ్మిది నెలల్లోనూ ఒక్కసారి కూడా కాశిం రజ్వీ తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టిన ఉదాహరణలు లేవు. హైదరాబాదును నాశనం చేయాలని ప్రయత్నించినవారిలో, భారత సైన్యం నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించనిది కాశిం రజ్వీ ఒక్కడే. లేక అతనికి తప్పించుకునే అవకాశం లభించలేదేమో!
రజ్వీ నేతృత్వంలో రజాకార్లు మత పోరాట వీరుల ముసుగు ధరించారు. ఇత్తెహాద్‍లో సభ్యత్వం పొందేందుకు అభ్యర్థులు ఓ ప్రతిజ్ఞ తీసుకోవాల్సి ఉంటుంది. తన నాయకుడి ఆజ్ఞానుసారం ఇత్తెహాద్ కోసం, హైదరాబాద్ కోసం తాము తమ ప్రాణాలను త్యాగం చేస్తామని ప్రతిజ్ఞ పట్టాల్సి ఉంటుంది. ‘అల్లా పేరు మీద, నేను నా చివరి శ్వాస వరకూ దక్కనులో ముస్లిం ఆధిక్యం నిలపటం కోసం పోరాడుతాను’ అంటూ సాగుతుంది ప్రతిజ్ఞ.
1948లో నేను హైదరాబాదులో అడుగుపెట్టిన సమయానికి, ఇత్తెహాదులు సైన్యంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అంతా కలిసి ముప్పైవేల పైగా స్వచ్ఛంద పోరాట వీరులున్నారు. జూలై-ఆగస్టు 1948 నడుమ దాదాపుగా లక్ష పైగా స్వచ్ఛంద సేవకులుగా ఇత్తెహాద్‍లో చేరారు. ఇత్తెహాద్ లక్ష్యం ఈ సంఖ్యకు ఇంకా ఐదు రెట్లు.
రజాకార్ల కార్యకలాపాలు పలు రకాలు. తమను వ్యతిరేకించిన వారిని హింసాత్మకమైన దూషణలతో విమర్శిస్తూ నగరాల్లో, జిల్లాల్లో ప్రదర్శనలు చేసేవారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం రావాలని కోరేవారిని, భారత ప్రభుత్వాన్ని సమర్థించే వారిని విపరీతంగా వేధించేవారు. పాదయాత్రలు, సైకిళ్ళు, బస్సులు, లారీలలో యాత్రల ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసేవారు. తమ ప్రదర్శనలలో భాగంగా కత్తులు, బల్లేలు ప్రదర్శించేవారు. అప్పుడప్పుడు గాల్లోకి తుపాకులు కాల్చేవారు.
పోలీసుల సహాయంతో కొన్ని మార్లు, తమంతట తామే అధిక మార్లు, రజాకార్లు గ్రామాలకు శిక్ష విధించేవారు. ఎవరో ఒకరు అనుచితంగా ప్రవర్తించారనో, కమ్యూనిస్టులు ఆ గ్రామంలో ఉన్నారనో, గ్రామాలపై దాడులు చేసేవారు. ఒక్కోసారి రెచ్చగొట్టేందుకు వాళ్ళవారే మసీదుపై బురద జల్లేవారు. అది వంకగా రజాకార్లు గ్రామాలపై దాడులు చేసేవారు. భారతదేశం సరిహద్దులో కల గ్రామాలపై కూడా దాడులు జరిపేవారు. బాధితుడిని వెతుకుతున్నామనో, ఎవరో తెలియని అనుమానితుడిని శిక్షిస్తున్నామనో కారణం చెప్పి దాడులు చేసేవారు. దీనికి పోలీసుల మద్దతు కూడా ఉండేది.
రజాకార్ల సిద్ధాంత ప్రచారం నేర్పటం కోసం, గూఢచర్యం నేర్పటం కోసం రజాకార్లు ప్రత్యేక పాఠశాలలు నడిపేవారు. ఇక్కడ కూడా శిక్షణ పొందేవారు కొందరు బ్రాహ్మణుల వేషాలలో గ్రామస్థులను మసీదులపై దాడులకు ప్రేరేపించేవారు. అది స్థానిక ముస్లింలకు ఆగ్రహ కారణం అయ్యేది. ఇది సాకుగా తీసుకుని, స్థానిక ముస్లింల రక్షణ కోసం ముస్లింలు ఆఘమేఘాల మీద ఆ గ్రామం చేరి గ్రామస్థులను చంపేవారు, దోచేవారు. ఇళ్లను తగులబెట్టేవారు.
రజాకార్లు మారువేషాలలో భారతదేశానికి చెందిన ప్రాంతాలు చేరేవారు. అక్కడ తమ సమర్థకుల జట్టును ఏర్పాటు చేసేవారు. స్థానిక ముస్లింలను రజాకార్ల వైపు ఆకర్షించేవారు. ఇలా ఏర్పడిన సమర్థక బృందాల సహాయంతో ఆయుధాలు హైదరాబాదులోకి దొంగతనంగా రవాణా చేసేవారు. రాష్ట్ర పోలీసుల్లోనూ, సైన్యం లోనూ చేరేందుకు ఆయా ప్రాంతాల ముస్లింలను ప్రోత్సహించేవారు. ఇంకా సాహసవంతులు కొందరు భారతదేశంలోని ప్రలు ప్రాంతాలలో ప్రచారం చేసేవారు. ముస్లింలను భారతదేశ వ్యతిరేకులుగా తయారు చేసి పెద్ద సంఖ్యలో వారిని హైదరాబాదుకు తరలించేవారు. ఈ రకంగా హైదరాబాదులో ముస్లింల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రయత్నించేవారు.
హైదరాబాదులోని ముస్లింలకు భారతదేశంలో భాగం అవటం ఇష్టం లేదని, స్వచ్ఛందంగా వారిలో చెలరేగిన వ్యతిరేకతకు ప్రతిరూపం రజాకార్ల ఉద్యమం అని ఇత్తెహాద్ నాయకులు నొక్కి చెప్పేవారు. ఒక పద్ధతి ప్రకారం ఎంతో జాగ్రత్తగా ఈ ఆలోచనను ఇత్తెహాద్ వారు ప్రచారం చేశారు. ఈ ప్రచారం న్యూఢిల్లీ లోని నాయకులు, విదేశీయులపై ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసేవారు.
రజాకార్లకు అందుబాటులో ఉన్న వనరులకు అంతులేదు. ఒక్క నిజామ్ తప్ప ఇంకెవరు వారికి ఇలాంటి వసతులు కల్పించగలరు? రజాకార్లు పెద్ద సంఖ్యలో మూడు టన్నుల లారీలు, డజన్ల కొద్దీ జీపులు, ఒక టన్ను ట్రక్కులను వాడేవారు. నిజామ్ రాష్ట్ర రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు తమకు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాలని కోరేవారు. ఆ కాలంలో పెట్రోలు సరఫరా సరిగ్గా ఉండేది కాదు. కానీ రజాకార్లకు ప్రభుత్వ డిపోల నుంచి పెట్రోలు అనియమితంగా అందేది.
గ్రామాలలోని హిందువుల వద్ద ఉన్న ఆయుధాలను నిజామ్ స్వాధీనం చేసుకున్నాడు. అలా స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రజాకార్లు వాడేవారు. తరువాతి కాలంలో, నిజామ్ ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలను కూడా వాడేరు రజాకార్లు. సిడ్నీ కాటను, దొంగతనంగా హైదరాబాదుకు తెచ్చిన ఆధునిక ఆయుధాలు కూడా తరువాతి కాలంలో రజాకార్లు వాడేరు.
భారత ప్రభుత్వంతో ఇత్తెహాద్ కొనసాగించిన మానసిక యుద్ధంలో వారి ప్రచార వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. 1948 సంవత్సరంలో ఉర్దూలో ఏడు దినపత్రికలు, ఆరు వార పత్రికలను ఇత్తెహాద్ ప్రచురించేది. నిజామ్ రేడియో అయితే రజాకార్ల చెప్పుచేతలలో ఉండేది. రోజూ వారు పత్రికలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలను ప్రచురించేవారు. రేడియోల్లో భారత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రసారం చేసేవారు. వారి వ్యతిరేక ప్రచారం అధికంగా భారత ప్రభుత్వం పైనే అయినా, పండిట్‍జీ, సర్దార్ లతో పాటు నాపై కూడా వ్యతిరేక ప్రచారం జోరుగా సాగేది. వారి ప్రచారంలో రజ్వీ ఉపన్యాసాలు ప్రధానంగా, తరచుగా కనిపించేవి. రాష్ట్రంలో ఉన్న అమాయక ముస్లింలను ఆకర్షించేందుకు పాకిస్తాన్ రేడియో చేసే భారత వ్యతిరేక ప్రచారంతో పాటు, భారత సైన్యం కశ్మీరులో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని పాకిస్తాన్ పత్రికలు ప్రచురించే వార్తలను ఇత్తెహాద్ ప్రధానంగా ప్రచురించేది.
రజాకార్ల ప్రధాన కార్యాలయం దార్-ఉస్-సలామ్, అంటే ‘శాంతినివాసం’ వద్ద ఉండడం ఓ వ్యంగ్యం. ఆ కార్యాలయంలో ఉండేవాడు రజ్వీ. అక్కడి నుంచే పని చేసేవాడు. రాష్ట్రంలోని 52 కేంద్రాలను, వాటి పాలన అధికారులకు అక్కడి నుంచే నియంత్రించేవాడు. కేంద్రాలలో రజాకార్లకు సైనిక శిక్షణను రిటైరైన సైనికులు ఇచ్చేవారు. కొన్ని కేంద్రాలలో ఇంకా ఉద్యోగంలో ఉన్న సైనికులు, పోలీసులు కూడా సహాయం చేసేవారు.
నిజామ్‍కు నమ్మకస్థుడు, పోలీస్ కమీషనర్ అయిన నవాబ్ దీన్ యార్ జంగ్ – రజ్వీ సమర్థకుడు. రజ్వీపై ఈయన ప్రభావం గణనీయంగా ఉండేది. ఇత్తెహాద్ ఆలోచనా యంత్రాంగంలో ఉన్న మొయిన్ నవాబ్ జంగ్, సయ్యద్ తాకి-ఉద్-దీన్, మీర్ లాయక్ అలీలు – సర్ మీర్జాకు వ్యతిరేకులు. దీన్ యార్ జంగ్ ద్వారా వీరు సర్ మీర్జాకు వ్యతిరేకంగా నిజామ్‍ను ప్రభావితం చేశారు.
ఇత్తెహాద్‌కు ‘మెదడు’లా పరిగణనకు గురయ్యేవీరు ‘రజ్వీ తాము చెప్పినట్టు వింటాడు, తమ మనిషి’ అని అనుకునేవారు. ‘వీరంతా తన చేతిలో పనిముట్లు’ అని రజ్వీ భావించేవాడు.
1946 కల్లా ఇత్తెహాద్ మత ప్రచార చర్యలను వదిలివేసింది. కానీ నిజామ్ మసీదులకు పెద్ద మొత్తం అందించేవాడు. ఈ ధనం అంతా బలహీనమైన హిందువులను ఇస్లాం మతంలోకి మార్చటానికి ఉపయోగపడింది. ఎక్కడయితే ధనం పని చేయదో, అక్కడ, ఇతర హిందువుల వ్యతిరేకతను రెచ్చగొట్టకుండా, సున్నితంగా ఒత్తిడి చేయటం ద్వారా మత మార్పిళ్ళు జరిగేవి.
గ్రామాలలోని పేద హరిజనులు ధనానికి లొంగకుండా ఉండలేకపోయేవారు. ఒత్తిళ్ళను తట్టుకోలేకపోయేవారు. నేను కొన్ని విచిత్రమైన మత మార్పిళ్ళను చూశాను. ఆకలి బాధకు తట్టుకోలేక హరిజన కుటుంబాలు, తమ కుటుంబంలో ఒకరిని ముస్లింగా మారనిచ్చేవి. తద్వారా ఆకలి బాధ తీరేది. అయితే, ఆ ఒక్కరూ ముస్లింగా మారేవారు కానీ, కుటుంబం మొత్తం హిందువులుగానే ఉండేది, చివరికి మతం మారిన వ్యక్తి భార్య కూడా హిందువుగానే ఉండేది.
ఇలాంటి పరిస్థితి హాస్యం కలిగించేది. మతం మారిన వ్యక్తి గడ్డంతో, టోపీతో, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూర్చునేవాడు. అతని భార్య కూడా దూరం నుంచే వడ్డించేది. మతం మారిన వ్యక్తి తన పిల్లలకు తండ్రి అయినా, మతం మారినందుకు దూరం పెట్టేది భార్య. భార్య హిందువుగానే ఉండేది. అతను అవసరార్థం ముస్లింగా ఉండేవాడు.
ఇలాంటి వారు, ఒత్తిడి తగ్గగానే, ఇస్లాం మతం వదిలి మళ్ళీ హిందువులుగా మారిపోయేవారు.
1948 వరకూ దీన్‍దార్లు మత ప్రచారం ఉధృతంగా సాగించారు. 1948 తరువాత వారి ప్రభావం పరిమితమైపోయింది.
దీన్‍దార్ సంస్థ పెద్ద తనని తాను ‘హజ్రత్ మౌలానా సిద్ధిఖ్ దీన్‍దార్ చన్న బసవేశ్వర్ ఖిల్లే’ గా భావించేవాడు. ఆయన హిందువుల లింగాయత్ కులాన్ని ఏర్పాటు చేసిన చన్న బసవేశ్వరుడి అవతారంలా ప్రచారం చేసుకున్నాడు. హిందూ సన్యాసులకు ఉండే రీతిలో తన శరీరంపై దైవ చిహ్నాలున్నాయని చెప్పుకునేవాడు.
సిద్ధిఖ్ వెంట ఉండే నలుగురు అనుచరులు కూడా తమని తాము వ్యాసుడు, శ్రీకృష్ణుడు, నరసింహుడు, వీరభద్రుల అవతారాలుగా ప్రకటించుకున్నారు. వీరి సర్వ దేవతల జాబితాలో నిజామ్ ప్రధాన స్థానం ఆక్రమించాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి ప్రకారం భారతీయ పురాణాల ప్రకారం ధర్మమూర్తి అయిన ధర్మరాజు అవతారం నిజామ్.
సిద్ధిఖ్ కేంద్ర కార్యాలయం హైదరాబాదులో ఉండేది. ఆయన అనుచరులు సంఖ్య దాదాపు అయిదు వందలు. వీరికి బ్రతికేందుకు ఎలాంటి వ్యాపారాలు ఉండేవి కావు. ముస్లిం దైవ ప్రచారకుల్లా వీరు ఆకుపచ్చ టోపీ ధరించేవారు. కాషాయ వస్త్రాలు, హిందూ సాధువుల్లా వేసుకునేవారు. సిక్కుల్లా గడ్డం పెంచేవారు. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నప్పుడు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు దారి చూపేవారు. హిందూ ఆస్తులను కొల్లగొట్టే సమయంలో రజాకార్ల దుస్తులు ధరించేవారు.
సిద్ధిఖిలు ఒక దశలో పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని, హంపిని గెలుచుకుని, అక్కడ దాచిపెట్టినట్టు భావిస్తున్న నిధులను కొల్లగొట్టాలని పథకాలు కూడా వేశారు. హిందువులపై దాడుల సమయంలో సిద్ధిఖిలు ఎలాంటి నియంత్రణను పాటించేవారు కాదు. దీన్‍దార్‍ల మతపరమైన సాహిత్యంలో సిద్ధిఖ్‍ను సింహాలు, పులులు, చిరుతలు, నక్కలను చీల్చి చంపేవాడిగా చిత్రించారు. ఈ జంతువులు సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, లింగాయత్‍ల రూపాల్లో ఉండేవి. ‘అవానుల్-నస్’ అనే పుస్తకంలో ముస్లింలను ప్రేరేపిస్తూ ఉన్న ప్రసంగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
‘నా ముస్లిం సోదరులారా! ఖురాన్ మీకు ఒకే ఒక్క విషయం బోధిస్తుంది. మనం నివసించే దేశాన్ని పాకిస్తాన్ (పవిత్ర స్థలం)గా మార్చాలని. అంటే, ఇతరులందరినీ ఖురాన్-ఎ-మస్జిద్ జలం సేవించేట్టు చేయాలని అర్థం. ఒకటికి నాలుగు వంతులు పాలు, మిగతా నాలుగింట మూడు వంతులు ఆవు పేడ ఉన్న పాత్రను శుభ్రం అని అనలేము. అది అరబిస్తాన్ అయినా, తర్కిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, అక్కడ కాఫిరిస్తాన్ (ఇస్లామేతరులు) ఉన్నంత కాలం అది పాకిస్తాన్ (పవిత్ర స్థలం) కాలేదు!’
మత మార్పిడి చర్యలను సిద్ధిఖ్ ఉధృతంగా చేపట్టాడు. హిందువుల మందిరాలపై జిహాద్ (మత యుద్ధం) ను ప్రకటించాడు. ఇందుకోసం ఒక లక్ష స్వచ్ఛంద సేవకులు, అయిదు లక్షల రూపాయల విరాళాలు కావాలని ప్రకటించాడు. అతనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జనవరి 10, 1932 న హిందువులు, అతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిజామ్‍కు వినతి పత్రం అందజేశారు. హిందువుల నుండి వ్యతిరేకత తీవ్రమవటంతో సిద్ధిఖ్‍పై ఏవో కొన్ని నియంత్రణలు విధించాడు నిజామ్. కానీ 1946 వరకూ సిద్ధిఖ్ పరిమిత స్థాయిలో పనిచేస్తూనే ఉన్నాడు. ఆ తరువాత నిజామ్ ప్రభుత్వం అతని కార్యకలాపాలపై కొన్ని పరిమితులు విధించింది.
తనని తాను హిందూ సన్యాసుల అవతారాంగా ప్రకటించుకున్నందుకు సిద్ధిఖ్‍ని ద్వేషించాడు రజ్వీ. అంతే కాదు, అతనిని తనకి పోటీగా భావించాడు. దీన్‍దార్లను రజాకార్లు చులకనగా చూసినా, హిందువులను భయభ్రాంతులను చేయటంలో తమకు తోడ్పడే సహాయకుల్లా భావించి భరించేవారు.
(సశేషం)