[మాయా ఏంజిలో రచించిన On Ageing అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. వృద్ధాప్యంలోనూ తమ స్వాభిమానాన్ని నిలుపుకోవాలనుకునే పెద్దల తపనని చిత్రించిన కవిత ఇది.]
~
[dropcap]అ[/dropcap]ల్మారాలో వాడి పడేసిన కాలి తొడుగుల్లా
నిశ్శబ్దంగా నిరామయంగా
అలా కూర్చుని ఉన్న నన్ను చూసి
నువు వూర్కే అరవాల్సిన పని లేదు
నేను నా లోపలి స్వరాన్ని వింటున్నాను
నాతో నేను ఉంటున్నాను
ఆగు, ఆపేయ్, జాలి పడకు నాపై
నీ సానుభూతి ఇక ఆపేయ్
అర్థమైందనుకుంటా..
లేదంటే.. నువ్వు నీలా ఉండు
నా ఎముకలు పెళుసై
బిరుసెక్కి
నొప్పి పెడుతుంటే
నా కాళ్ళు మెట్లెక్క లేక మారాం చేస్తుంటే
నా కోసం చక్రాల కుర్చీ తీసుకు రాకు
అది మాత్రమే నేన్నిన్ను కోరే సహాయం
నేను నడవలేక తడబడుతుంటే
పట్టించుకోకు, తప్పుగా చూడకు
అలసిపోవడం, సోమరితనమో
అలసత్వమో కాదు
వీడ్కోలు చెప్పిన ప్రతిసారీ
నా కథ ముగిసినట్టూ కాదు
నేను ఇదివరలో ఎలా ఉన్నానో
ఇప్పుడూ అలానే ఉన్నా
కాస్త జుట్టు తగ్గిందేమో
కొంచెం దవడలు వదులయ్యాయేమో
ఊపిరితిత్తుల్లో బలం తగ్గి
శ్వాస బలహీనమై ఉండొచ్చు
అయినా ఇంకా బతికి ఉన్నానంటే అదృష్టం కాదా!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.