[dropcap]ఇ[/dropcap]ల్లు ఊడుస్తున్న మంగ, లక్ష్మిని చూస్తూనే నిటారుగా నిలబడి “అమ్మగారూ, అయ్యగారు ఏరండీ.” అడిగింది.
“సరిపోయింది. పొద్దున్న నుండీ నాకే ఆయన కనబడలేదు. ఇంతకీ ఆయనతో నీకేంటి పని” అడిగింది లక్ష్మి
“ఏటి లేదండీ. నిప్పు మింగినట్టు, నిన్న ఒకటే గొంతు మంట. ఆ విషయవే అయ్యగారితో చెబితే, ఏదో కలిపి ఇచ్చి తాగమన్నారు. అది తాగినాక అప్పటికి అప్పడు గొంతు మంట కొంచెం తగ్గినట్టు అనిపించినా, ఈరోజు ఎవరో గట్టిగా నా గొంతు పిసికేసినట్టు గొంతు నొప్పి వస్తోందండీ. అదే కాస్త భయంగా ఉంది. దీనికి కూడా ఏదైనా మందు అయ్యగారినడుగుదామని” అంటూ తల గోక్కుంది.
“సరిపోయింది. ఆయనని మాత్రం మళ్ళీ అడక్కు. ఈ సారి ఆయనేదో కలిపి ఇచ్చారనుకో, గొంతు నొప్పి పోయి గుండెనొప్పి వచ్చినా వస్తుంది. తరవాత మీ ఆయన అన్యాయం అయిపోతాడు. నువ్వు పని ముగించుకుని వెళ్ళే ముందు, ఓసారి నాకు కనబడు డబ్బులు ఇస్తాను, డాక్టర్‌కి చూపించుకుందువు గాని” చెప్పింది లక్ష్మి.
“ఆయ్. సరేనండీ” అని మళ్ళీ ఇల్లు ఊడవటం మొదలు పెట్టింది.
‘అవునూ! ఈయనేవిటి, పొద్దుననగా మేడ ఎక్కి ఇంకా రాలేదు. ఈయన ఈ మధ్య యోగా బానే చేస్తున్నారనిపిస్తోంది. రోజు, రోజుకీ ఆసనాల సంఖ్య పెంచేస్తున్నారల్లే ఉంది. నిన్నటి కంటే ఈరోజు అరగంట ఆలస్యం చేశారు. మేడ మీద ఎండ ఉష్ణోగ్రత ఎంత ఉన్నా, మంచి ఏకాగ్రతతో మొదలు పెడితే ఇక మనలో ఉండరు. అయినా ఈ వయసులో అంత సేపు రోజూ యోగా చేయడం కష్టం అని ఆలోచించకుండా, ఇలా పట్టుదలగా చేయడం గొప్ప విషయమే. రోజూ ఈయన వెళ్ళి చేసి రావడమే కానీ, నేను ఓసారి కూడా మేడ మీదకి వెళ్ళి చూసి వచ్చింది లేదు. ఈరోజు వెళ్తాను, ఆయన ఎలా చేస్తున్నదీ కళ్ళారా చూసి, మనసారా మురిసిపోయి వస్తాను.’ అనుకుని చక, చకా నడుస్తూ ఒక్కసారే చెక్క బొమ్మలా ఓ క్షణం ఆగిపోయి, ‘ఆయన యోగా చేసి చేసి అలసిపోయి ఉంటారు. ఒట్టి చేతులతో వెళ్ళడం కన్నా, జ్యూస్ తీసుకు వెళ్తాను. తాగి శక్తి పుంజుకుని, శక్తిమాన్ అయిపోతారు.’ అనుకుని ఫ్రిడ్జ్ తెరిచి, జ్యూస్ బాటిల్ చేతిలోకి తీసుకుని మేడ మీదకి వెళ్లింది.
వెనక నుండి చూస్తూ, ‘పళ్ళెంలో ఆవకాయ బద్దలా, కదలకుండా పద్మాసనాన్ని ఎంత పద్దతిగా వేస్తున్నారో.’ అంటూ కళ్ళప్పగించి మరీ చూసి మురిసిపోయింది. కాసేపటికి అలా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి, అతనికి ఎదురుగా నిలబడింది.
సుబ్బారావ్ ముఖంలో ఏదో ఇబ్బంది. బిత్తర చూపులు చూస్తున్న అతనితో, “అబ్బో, లాఫింగ్ బుద్ధాలా కూర్చుని, పద్మాసనం భలే వేస్తున్నారండీ” అంటూ మురిసిపోతూ మరోసారి అతని వంక చూస్తూ ఉండిపోయింది. కానీ కొద్ది సేపటికి కాళ్ళు పీకడంతో, “అబ్బా ఇంకా ఎంత సేపు ఇలా నించోమంటారు. త్వరగా ఆ పద్మాసనం ముగించి వచ్చి ఈ మావిడికాయ రసం తాగండి” చెప్పిందామె.
“ఇదిగో లక్ష్మి, ఇలా పద్మాసనంలో నలభై నిమిషాలనుండీ ఉండిపోయాను తెలుసా” చెప్పాడు ఆవదం తగిన మొహంతో.
“భలే వారే, అంతసేపు ఎందుకండీ. ఒక్క పద్మాసనమే అంత సేపు వేస్తే, మిగతా ఆసనాలు వేసేప్పటికి ఆఫీసు టైమ్ అయిపోదూ. లేవండీ” అందామె జ్యూసే అందిస్తూ .
“అయ్యో లక్ష్మి, పద్మవ్యూహంలో అభిమన్యుడు ఇరుక్కుపోయినట్టు, నేను ఈ పద్మాసనంలో ఇరుక్కుపోయాను. కాళ్ళు విడిపడి రావడం లేదు. పైగా చాలా సేపు అయిపోయింది కదా, అందుకే అనుకుంటాను రెండు కాళ్ళకి స్పర్శ కూడా తెలియడం లేదు. తిమ్మిరెక్కిపోయాయి. నాకు నేను కాళ్ళని చాపి ఈ ఆసనం లోంచి బయటపడలేను. కొంచెం నువ్వే సాయం చేయాలి” చెప్పాడు బేలగా కాళ్ళ వంక చూసుకుంటూ.
“మీరెప్పుడూ ఇంతే, ఎవరైనా ఇలాంటివి చేసి ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారు. కానీ మీరు ఇలాంటివి చేసి, ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. అయినా, ఏదైనా ప్రయిత్నించే ముందు, తప్పనిసరిగా దానిపై పూర్తిగా ఒక మంచి శిక్షణ తీసుకుని తర్వాత వాటి జోలికి వెళ్ళాలి. అంతే కానీ, తగుదునమ్మా అని యూట్యూబ్లూ, ఫేస్బుక్‌లూ గట్రా చూడటం, ఇలాంటి ఆసనాలు వేసేయాలనుకోవడం. ఆనక అనుకున్నదే తడవుగా, రాందేవ్ బాబాలా ఫీల్ అయిపోయి రాంగ్ డైవ్ చేసేయడం. తర్వాత నేను పెయిన్ బామ్ లతో మర్దన చేయడం. మీరు ఆ నొప్పి తట్టుకోలేక కుయ్యో మొర్రో అని కుక్కపిల్లలా మూలగడం. మొన్న కూడా, చక్కెర వ్యాధి ఇలా చేస్తే తగ్గిపోతుందని ఏవో వీడియోలు చూసి, ఉదయాన్నే ఉసిరికాయలు, మధ్యాహ్నం మారేడుకాయలు, సాయంత్రం సొరకాయలో కొబ్బరి కోరు, గుడ్డు, ఆవదం ఇలా ఏవేవో కలిపి తినేస్తే ఫుడ్ పాయిజన్ అయిపోయింది. తర్వాత కొద్ది సేపటికి దబ్ మని చెట్టుమీద నుండి పండు పడ్డట్టు ఒక్కసారే నేల రాలిపోయారు. తరువాత నాలుగు రోజులు హాస్పిటల్‌లో మాట మంతీ లేకుండా మంచాన వాలిపోయారు. కోలుకుని బయటికి వచ్చాకైనా మీలో చెంచాడు మార్పైనా రావాలి కదా. ఆ తర్వాత కూడా, ఎవడో దరిద్రుడు ఐస్ వాటర్ తాగినా బరువు తగ్గుతారు అనే వీడియో చూసి, మామూలు నీళ్ళు మాని, ఎడా పెడా ఐస్ వాటర్ తాగేసారు. తర్వాత అర్ధరాత్రి పూట, పొట్ట పట్టుకుని పురిటి నొప్పులొచ్చినట్టు, నొప్పి, నొప్పి అని విలవిల్లాడిపోయారు. చివరికి హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ ఫీజ్, మందులు, ఎక్స్‌రేలు, టెస్టులూ అంటూ ఓ ఎనిమిది వేలు బిల్ వేసి పంపారు. ఇలానే దగ్గు వస్తే ఒకడి వీడియో చూసి ఏదో కలుపుకు తాగడం. జ్వరం వస్తే మరొకడి వీడియో చూసి ఇంకో మందు మింగడం. ఆరోగ్యం చక్కదిద్దుకోవడం కోసం ఆరాటపడటం తప్పు కాదు. కానీ ఇలా అడ్డవైనవీ చూసి, విని గుడ్డిగా ఫాలో అయిపోకూడదు. అది మాత్రం ఖచ్చితంగా తప్పే. టైమ్ బాలేకపోతే, ఇలాంటివి ప్రాణం మీదకి తెచ్చినా తెస్తాయి. కొన్ని వందలకి కక్కుర్తి పడి, డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా ఇలాంటి సోషల్ మీడియా వైద్యం చేసుకోకండి” అంటూ గై మంది లక్ష్మి.
ఆమె మాటలకి బిక్కచచ్చిపోయి, “సారీ, ఒకటి కాకపోతే మరోటి పనిచేస్తుందని గుడ్డిగా నమ్మి ఇలా తప్పులో కాలేసాను. ఇక వాటి జోలికి బ్రతికుండగా పోను.” చెప్పాడు దీనంగా.
“సరే” అని అతన్ని అటూ, ఇటూ చేసి అతి కష్టం మీద కాళ్లని పద్మాసనం నుండి విడిపించి, విజయగర్వంతో చిన్న నవ్వు నవ్విందామె.
అప్పుడే వచ్చి అది చూసిన మంగ, చిన్నగా సిగ్గు పడుతూ, “ఛీ పాడు” అని వెనక్కి తిరిగిపోయింది.