యువభారతి వారి ‘పింగళి సూరన కవితా వైభవం’ – పరిచయం

0
3

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

పింగళి సూరన కవితా వైభవం

[dropcap]తె[/dropcap]లుగు ప్రబంధ నిర్మాతలలో పింగళి సూరన కొత్త పుంతలు తొక్కిన ప్రయోగశీలి. పురాణేతిహాసాల్లోని ఒక కథను తీసుకొని, వర్ణనలతో రమ్యంగా మలచి ప్రబంధం అనే కొత్త ప్రక్రియను తెలుగులో తిమ్మన, పెద్దన ప్రవేశ పెట్టారు. కానీ, కథను కూడా కొత్తగా కల్పించి సమకాలిక జీవిత వృత్తంతో మేళవించి కొత్త ఫక్కీలో కథను ప్రారంభించి, పింగళి సూరన అపురూపమైన రచనా సంవిధానంతో తెలుగు ప్రబంధానికి సౌష్టవం కలిగించినాడు. కవిత్వాన్ని గురించి అతి సుందరమైన అభిప్రాయాలను తన పాత్రలతో ప్రకటింపజేశాడు. అతడు కల్పించి వ్రాసిన కావ్యం కళాపూర్ణోదయం. పెద్దనార్యుల పద్ధతిలో వ్రాసిన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నము. ఇక మనకు దొరికినంతలో మొట్ట మొదటి ద్వ్యర్ధి కావ్యం రాఘవపాండవీయం సూరన్నదే. ఈ ద్వ్యర్ధి కావ్య రచన కూడా సూరన్న నూతన ప్రయోగదక్షతను తెలుపుతోంది.

సూరన్న కలభాషిణి, సుగాత్రీ శాలీనుల వృత్తాంతం – సరస్వతీ చతుర్ముఖుల శృంగార చేష్టల వల్ల ఉత్పన్నమైన వినూత్న వస్తుసంపద –  ఎరుగని తెలుగు పాఠకుడు ప్రబంధ సాహితీయామినులలోని నిత్య జ్యోత్స్నలకు నోచుకోని వాడవుతాడు.

శబ్దానికీ అర్థానికీ ఉన్న అనంత శక్తిని అవగతం చేసుకోవడానికి ద్వ్యర్ధి కావ్యపఠనం అమితంగా తోడ్పడుతుంది. శ్లేషలతో చేసే కసరత్తే అయినా శబ్దసంపదకున్న అనంత రూపాలతో పరిచయం ఏర్పడుతుంది. తనకు తానై కట్టుబాట్లు కల్పించుకొని ఒక్క పద్యంలో రెండు కథలకు అన్వయం కుదిరేట్లు వ్రాయడం శబ్ద సామ్రాజ్యం మీద, అర్థ విస్తృతి మీద సూరనకున్న సమున్నతాధికారం వ్యక్తమౌతుంది.

ప్రభావతీ ప్రద్యుమ్నం కళాపూర్ణోదయం కావ్యాల్లో రూపక మర్యాదలు తెలిసిన సూరన పోయిన పోకడలు అన్నీ ఇన్నీ కావు.

పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఉన్న శ్రీ శ్రీరంగాచార్యులు గారు సూరన కావ్యాలలోని కొన్ని పద్యాలను ఏరి, వాటిలోని సొగసులను మనకు పరిచయం చేశారు. ఆయన ప్రాచీనాంధ్ర కావ్యాలను ఎన్నింటినో పరిష్కరించిన వారు. సంస్కృతంలోనూ తెలుగులోనూ గొప్ప కృషు చేసిన పండిత వంశానికి సంబంధించినవారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%A8%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here