[dropcap]త[/dropcap]లపై కిరీటం లేదు
మాసిన తలపాగా తప్ప
చేతిలో రాజదండం లేదు
ఊతకి ఉంది ఊతకర్ర
చిరుగుల చొక్కా జారిన ధోతీ
అన్నం తిని ఎన్నళ్ళో అయినా
నేడు మాత్రం బీద యాదయ్య
రాజు, ఏక్ దిన్ కా సుల్తాన్
వచ్చింది ఎన్నికల దినం
పాలకులకు అది తద్దినం
గుడిసె ముందు నిల్చొని
వంగి వంగి సలాం చేస్తారు
నాయకులంతా వరస కట్టి వస్తారు
నీ ఓటు తమకే వెయ్యమంటారు
యాదయ్యను భుజానకెత్తుకుంటారు
నోటిస్తాం ఓటెయ్యమంటారు
పేద యాదయ్య నేటి రాజు
ఏక్ దిన్ కా సుల్తాన్..!
ఐదేండ్లకు ఒకసారి మాత్రమే..
మరునాడు కథ యథావిధి