ఎడారి పూలు

0
3

[dropcap]ఆ[/dropcap] ద్వారానికి పైభాగాన ‘కవి, రచయిత మహీధర్ గారికి స్వాగతం’ అనే బ్యానర్ వేలాడుతుంది. గేటునుంచీ హాల్ దాకా ఇరుపక్కల రచయిత ఫోటోల ఫ్లెక్సీ బ్యానర్లు నిలబెట్టి ఉన్నాయి. ట్యూబ్ లైట్ల వెలుగులో అవన్నీ మిలమిలా మెరిసిపోతున్నాయి. పైన చిన్నచిన్న బల్బులతో తోరణాలు కట్టారు. ఫంక్షన్ హాలు మొత్తం లైట్లతో డెకరేట్ చేసారు. అక్కడి ఏర్పాట్లు అన్నీ చూస్తూ కారు దిగాను. నిర్వాహకులు ఎదురువచ్చి ఆహ్వానించారు. వేదపండితులు వేదమంత్రాలలో స్వాగతం చెప్పారు. లోపలికి వచ్చాను. అప్పటికే హాల్ మూడొంతులు నిండిపోయింది. జనం ఇంకా వస్తున్నారు.

స్టేజీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. నేను కథలు, వ్యాసాలు, పద్యాలు రాస్తూ ఉంటాను. నా రచన ప్రచురించని పత్రిక లేదు. కొన్ని వందల రచనలు చేసాను. ఈ రోజు నాకు సాహితీ విభూషణ్ బిరుదు ఇస్తున్నారు. కొంచెంసేపటి తర్వాత సభ మొదలైంది. నన్ను, ఇంకా కొంతమంది సాహితీవేత్తలను స్టేజీ మీదకు ఆహ్వానించారు. వక్తలు నా గురించి, నా రచనల గురించి పరిచయం చేశారు. “అయన సమాజంలోని సమస్యలనే కథావస్తువులుగా తీసుకున్నారు. ఆ  కథల్లోని పాత్రలు ఏవీ ఊహాలోకంలో విహరించవు. నేలమీదే నడుస్తాయి. పూర్తి మంచివాళ్ళు గానీ, పూర్తి చెడ్డవాళ్ళు గానీ అయన కథల్లో ఉండరు. ప్రతిమనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పాత్రలకు కష్టాలు వస్తాయి, కానీ అవి కొద్దికాలంలోనే తొలగిపోతాయి. నిజమే! జీవితమంతా కష్టాలే అయితే సుఖపడేది ఎప్పుడు?..” ఇలా సాగిపోయింది ప్రసంగం.

సాధారణంగా ఇలాంటి సభల్లో అనవసరంగా పొగుడుతూ ఉంటారు. అవి వింటుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వినేవాళ్ళకి. కానీ ఇక్కడ సరిగ్గా నా కథల్లో ఉన్న విషయాలనే ప్రస్తావించారు. ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందం కలిగింది. అందరూ మాట్లాడటం అయిన తర్వాత నాకు సన్మానం చేశారు, శాలువాలు కప్పి మెమొంటో ఇచ్చారు. తలమీద పూలు చల్లారు. వేదపండితులు ఆశీర్వచనం చదివారు. నా ప్రసంగం కూడా అయి సభ ముగిసేసరికి రాత్రి పదిగంటలు దాటింది.

కార్యకర్తలు నన్ను కారులో ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయారు. తలుపు తట్టాను. రెండు మూడుసార్లు తలుపుకొట్టిన తర్వాత నా భార్య రజిత నిద్రకళ్ళతో వచ్చి గ్రిల్స్ తాళం తీస్తూ “అర్ధరాత్రి దాకా ఏం తిరుగుళ్ళో? ఏమిటో?” అని తల గోక్కుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది. గ్రిల్స్ లోపల పొడవు తక్కువగా ఉన్న వెడల్పాటి వరండా ఉంది. చేతిలోని మెమొంటో, దండ, శాలువాలు తీసి చెక్కసోఫాలో పెట్టాను. ఒక మూల చాలా చెప్పులు ఉన్నాయి. రజిత వాళ్ళ తమ్ముడి కుటుంబం వచ్చినట్లుంది అనుకున్నాను. అతను ఈ ఊళ్లోనే ఉంటాడు. నెలకోసారి వచ్చి, రెండురోజులు ఉండి వెళతాడు.

మూడుగదుల చిన్నఇల్లు అది. బెడ్ రూమ్, హాల్, కిచెన్. హాల్ బయట సన్నటి వెడల్పు వరండా. అక్కడ నాలుగు కుర్చీలు, చెక్కసోఫా ఉన్నాయి ఎవరైనా వస్తే కూర్చోవటానికి. హాల్‌లో బావమరిది మడతమంచం మీద నిద్రపోతున్నాడు. నవ్వారుమంచం మీద పది సంవత్సరాల వయసున్న మా అబ్బాయి, అంతే వయసు ఉన్న బావమరిది కొడుకు నిద్రపోతున్నారు. బెడ్ రూమ్‌లో అతని భార్య, రజిత, మా అమ్మాయి, వాళ్ళ అమ్మాయి ఉండిఉంటారు.  మొహం, కాళ్ళు కడుక్కుని బట్టలు మార్చుకుని వంటగదిలోకి వచ్చాను.

మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. కడుపులో ఆకలి నకనకలాడుతూ ఉంది. గిన్నెలు మూతలు తీసి చూసాను. గిన్నెలో అన్నం అయిపోయినట్లు అక్కడక్కడ మెతుకులు కనబడుతున్నాయి. కూరగిన్నె కూడా ఖాళీగానే ఉంది. ఇలాంటి సభలు జరిగినప్పుడు నేను రావటం ఆలస్యం అవుతుంది, భోజనం ఉంచుదాం అనే ఆలోచన లేదు రజితకు. “అక్కడ తినే వస్తావుగా!” అంటుంది మాటిమాటికీ. “ఫార్మాలిటీ కోసం సమోసాలో, ఏవో పెడతారు. స్టేజీ మీద కుర్చుని తినటం బాగుండదు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను” అని రెండుమూడు సార్లు చెప్పాను. అయినా వినిపించుకోదు.

వంటగది అంతా వెతికాను. తినటానికి ఏమీ దొరకలేదు. సన్మానంలో వేసిన పూలదండ తీసుకువచ్చి దానిలోని గులాబీరేకలు తుంచి ఒక ప్లేట్‌లో వేసి, పంచదార కలుపుకుని తింటూ కూర్చున్నాను. ఆకలితో కడుపు కాలిపోతున్న నాకు అవి రుచిగానే అనిపించాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. గ్లాసుడు నీళ్ళు తాగి వరండాలోకి వచ్చి చెక్కసోఫాలో పడుకున్నాను.

చిన్న నైట్ బల్బ్ గుడ్డి వెలుగుని ఇస్తుంది. ఎదురుగా రోడ్డుమీద ఉన్న స్ట్రీట్ లైట్లు చుట్టూ ఆవరించుకున్న చీకటిని పారద్రోలటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. స్తంభం చుట్టూ వరకు వెలుగునిస్తున్నాయి. మిగతా రోడ్డు అంతా చీకటిగానే ఉంది. ఇందాక జరిగిన కార్యక్రమం గుర్తువచ్చింది. ఎంత బాగా జరిగింది అవార్డ్ ఫంక్షన్! బయట వెలుగులమయం అయిన ఆ జీవితం నిజమా, ఇంట్లో చీకటి, ఒంటరితనం నిండిన ఈ జీవితం నిజమా అనిపించింది. ఇప్పట్లో నిద్రవచ్చే సూచనలు కనబడటం లేదు.

మా నాన్న ఎలక్రీషియన్‌గా పనిచేసేవాడు. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరిలోకి నేను పెద్దవాడిని. అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి డిగ్రీ వరకే చదివాను. చిన్న చదువు, చిన్న ఉద్యోగం. పెద్ద చదువులు చదివించే స్తోమత నా తండ్రికి లేదు, నాకూ ఆ అవకాశం లేదు. తల్లిదండ్రుల అనారోగ్యం, తమ్ముడి చదువు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ముగిసి బాధ్యతలు తీరేసరికి నలభైయ్యవ పడిలోకి వచ్చాను.. తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. నేను చాలా ఉద్యోగాలు మారాను. కొన్నాళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేశాను, కొన్నాళ్ళు టైప్ ఇన్‌స్టిట్యూట్ నడిపాను. ప్రస్తుతం నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాను. జిరాక్స్, బైండింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను.

రజిత ఎప్పుడూ ఇరుగుపొరుగు వారితో పోల్చుకుని ఆ స్థాయిలో లేనని దెప్పిపొడుస్తూ ఉంటుంది. “వాళ్ళు విమానంలో బెంగుళూరు వెళ్లారట. నేను సినిమాల్లో చూడటమే గానీ ఏనాడూ విమానం ఎక్కలేదు” అనేది.

“నీక్కూడా ఆ అవకాశం వస్తుందేమో!” అనేవాడిని.

“కారుకే దిక్కులేదు గానీ, నా బతుక్కు విమానం కూడానా!”

“ఊరికే అలా నిరాశపడకు. నేను కూడా కారు కొనే రోజు రావచ్చు, అందులో నిన్ను కూర్చోబెట్టి షికారు తిప్పే రోజు రావచ్చు” అన్నాను నవ్వుతూ.

“ఆ.. ఆ.. నువ్వు కారు కొనే లోపు నేను కాటికి వెళ్ళిపోతాను” అన్నది.

“అబ్బా!” ఆ మాటలు వినలేక చెవులు మూసుకున్నాను.

ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అవన్నీ కథల్లో, సినిమాల్లో అనిపిస్తుంది. అలాంటిది నేను నిజజీవితంలో ఎరగను. రజిత ఏనాడూ నన్ను ప్రోత్సహించలేదు. నేను రాసుకుంటుంటే “ఎందుకా కథలు? కూటికొచ్చేనా, గుడ్డ కొచ్చేనా!” అనేది. ఆమె మాటలు కంకరరాళ్ళతో కొడుతున్నట్లు ఉండేవి. సమాధానం చెబితే ఇంకా రెచ్చిపోయేది. తనతో వాదించకుండా షాప్‌కి వచ్చి, పని చూసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని.

నిజానికి నా సంపాదన మరీ అంత అధ్వాన్నంగా ఏమీలేదు. నా సంపాదనతోనే తమ్ముడి చదువు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. చిన్నఇల్లు ఏర్పాటు చేసుకున్నాను. కాస్తోకూస్తో దాచి ఉంచాను. అత్యాశకు పోకుండా ఉన్నదాంతో సంతృప్తిపడితే జీవితం పెద్దగా ఒడిదుడుకులు లేకుండానే గడిచిపోతుంది. కానీ రజిత ఆశలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాయి. నా రచనలు, నా అవార్డులు, నా సన్మానాలు, నా ప్లస్ పాయింట్‌ల గురించి ఏనాడూ మాట్లాడదు. విమానాల్లో తిరగలేదనీ, ఒంటినిండా నగలు లేవనీ, నలుగురిలా ఉండలేకపోతున్నాననీ, నేను ఎదురింటాయన లాగానో, పక్కింటాయన లాగానో సంపాదించటం లేదనీ.. ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరితో పోల్చుతూ నన్ను కించపరచి మాట్లాడుతూనే ఉంటుంది. రజిత సాధింపులు పడలేక ఎటైనా వెళ్ళిపోదాం లేదా ఏదైనా ఆశ్రమంలో చేరిపోదాం అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఈ క్షణంలో మృత్యువు వచ్చినా విచారపడను అనిపించేది. ఈ మధ్య అలాంటి ఆలోచనలు మరీ ఎక్కువగా వస్తున్నాయి.

ఈరోజు ఎందుకో ఆలోచనలు వదలటం లేదు. అర్ధరాత్రి దాటినట్లు ఉంది. చాలాసేపటి నుంచీ నిద్ర పట్టక కళ్ళు గుచ్చుకుంటున్నట్లు ఉన్నాయి. బలవంతాన ఆలోచనలు ఆపుకుంటూ పక్కకు తిరిగి పడుకుని నిద్రకు ఉపక్రమించాను..

ఆ మర్నాడు నేను షాప్‌లో కుర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటే పక్క షాప్ రమేష్ వచ్చాడు. “మహీ! సాయంత్రం కోనేటిపురం వెళదాం. పని ఉంది. నువ్వు కూడా నాతో వస్తావా!” అని అడిగాడు. రమేష్‌కి, నాకు అయిదేళ్ళ నుంచీ స్నేహం. సహృదయుడు, ఏదైనా అవసరం అయితే చేతనైనంత సాయం తప్పకుండా చేస్తాడు. అందుకే ఎందుకు, ఏమిటి అని అడగకుండా “వస్తాను” అని చెప్పాను.

సాయంత్రం నాలుగింటికి షాప్ తాళంవేసి ఇద్దరం బైక్ మీద బయలుదేరాము. ఇక్కడ నుంచీ కోనేటిపురం దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది. ఇద్దరం అయితే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళవచ్చు. అప్పుడప్పుడు ఇలాగే కలిసి వెళుతూ ఉంటాము. “కోనేటిపురంలో చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన గురువుగారు ఉన్నారు. ఆయన బ్లైండ్ పర్సన్. సుమారు డెబ్బై ఏళ్ళు ఉంటాయి. బి.పి., షుగరు, గుండెజబ్బు ఉన్నాయి. అవసరమైన మెడిసిన్స్ ఇచ్చి వస్తూ ఉంటాను” అన్నాడు.

“తెచ్చి ఇవ్వటానికి ఇంట్లో ఇంకెవరూ లేరా!” అడిగాను.

“ప్రస్తుతం లేరు. మొన్నటిదాకా ఆయన తల్లి ఉండి వండిపెట్టేది. ఆమె ఈ మధ్యనే పోయింది” చెప్పాడు.

“అయ్యోపాపం. మరి భార్యాపిల్లలు..?”

“రెండుసార్లు పెళ్లి అయింది. మొదటి భార్య చనిపోయింది. రెండవ భార్య కాపురం చేయటం ఇష్టం లేదని డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది”

“డైవోర్స్ ఇవ్వటం ఏమిటి? చేసుకునే ముందు తెలియదా!”

“అదే కదా!”

“ఏమిటో!” నిట్టూర్చాను. ఇద్దరం మాట్లాడుకుంటూ వెళుతున్నాం. “ఇక్కడ ఒక్క క్షణం ఆపు రమేష్! గురువుగారి దగ్గరకు ఒట్టిచేతులతో వెళ్ళకూడదు. ఏమైనా తీసుకువెళదాము” అన్నాను. బైక్ ఆపాడు. ఓ డజను యాపిల్స్ కొన్నాను. తిరిగి ప్రయాణం కొనసాగించాము. దారి పొడుగునా రోడ్డుకి ఇరుపక్కలా పెద్దపెద్ద చెట్లు కొమ్మలు వంగి గొడుగు పడుతున్నట్లుగా ఉన్నాయి. చల్లటిగాలి వీస్తూంది. అక్కడక్కడ చెట్లకింద కొబ్బరిబొండాలు, కూల్ డ్రింక్స్, నిమ్మకాయ సోడాలు అమ్మేవాళ్ళు కనబడుతున్నారు. దారిన పోయేవాళ్ళు ఆగి, దాహం తీర్చుకుని వెళుతున్నారు.

కోనేటిపురం వచ్చింది. మెయిన్ రోడ్ నుంచీ ఎడమవైపుకు తిరిగితే మట్టి రోడ్ కనిపిస్తుంది. ఊళ్లోకి వచ్చాము. చిన్న పల్లెటూరు. చెట్లమధ్య ఇళ్ళు కనిపిస్తున్నాయి. పేరుకు తగినట్లు ఒకచోట పాతకాలం నాటి గుడికి ఒకపక్క  పెద్ద కోనేరు ఉంది. కోనేటి నుంచీ కిందకి దిగటానికి నాలుగువైపులా మెట్లు ఉన్నాయి. నీళ్ళు వాడుకలేనట్లు పచ్చగా ఉన్నా కోనేటి నిండా ఎరుపు, తెలుపు తామరపూలు ఉన్నాయి. గుడిచుట్టూ తిరిగి ఊరు లోపలికి వచ్చాము. రమేష్ ఒక ఇంటిముందు బైక్ ఆపాడు.

పాతకాలం నాటి చిన్న పెంకుటిల్లు. గేటు దగ్గరనుంచీ ఇంటిదాకా  నడవటానికి బండలు పరిచి ఉన్నాయి. కొబ్బరి, వేప, రకరకాల పూలచెట్లు ఉన్నాయి. ఒకచోట నీళ్ళ పంపు ఉంది. అవన్నీ చూస్తూ వచ్చాము. “నమస్కారం మాస్టారూ!” అన్నాడు రమేష్. వరండాలో ఒకాయన కూర్చున్నాడు. ఆయనకు డెబ్బై ఏళ్ళు ఉంటాయి. దబ్బపండు ఛాయలో ఉన్నాడు, జుట్టు తెల్లబడి పోయింది. కాలి మీద కాలు వేసుకుని కుర్చుని టేప్ రికార్డర్‌లో పాటలు వింటున్నాడు. రమేష్ గొంతు వినగానే పాటలు ఆపేసి “నువ్వా రమేష్! రా! రా!” అన్నాడు. ఇద్దరం అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాం.

“రమేష్! నీతో పాటు వచ్చింది ఎవరు?” అడిగాడు అయన.

“నా స్నేహితుడు” చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. “నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అంతలోనే ఎలా గ్రహించారు?” అన్నాను.

“మీరైతే ఎలా చెబుతారు?”

“చూసి చెబుతాను”

“అంటే కళ్ళమీద ఆధారపడతారు. అలాగే నేను చెవులమీద ఆధారపడతాను. శబ్దాన్ని బట్టి చెబుతాను. ఇంట్లోకి పిల్లి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది” అన్నాడు. లోపలివెళ్లి రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆ నడకలో ఎలాంటి తొట్రుపాటు లేదు. కళ్ళతో చూసి వెళుతున్నట్లుగానే ఉంది. మంచినీళ్ళు తాగి నేను తెచ్చిన యాపిల్స్ కవర్ ఆయనకి అందించాను. రమేష్ కూడా తను తెచ్చిన మెడిసిన్స్ ఇచ్చాడు.

ఆ పాతకాలపు పెంకుటిల్లు, తాడుమీద వేసిన బట్టలు, ఇనపకుర్చీలు ఆ వాతావరణం చూస్తూ ఉంటే నా గుండెల నిండా విషాదం పేరుకోసాగింది. “మీకు కాలక్షేపం ఎలా అవుతుంది మాస్టారూ!” అడిగాడు రమేష్.

“పిల్లలకి ట్యూషన్ చెబుతాను. ఇంత అని అడగను. వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాను. పెన్షన్ వస్తుందిగా! ఇబ్బంది లేదు. టేప్ రికార్డర్‌లో పాటలు వింటాను, ఇందులోనే రేడియో కూడా వస్తుంది” అన్నాడు.

“మరి మీకు భోజనం అదీ ఎలా!” అడిగాను.

“టిఫెన్లు తినే అలవాటు లేదు. టీ తాగుతాను, అన్నం, కూర నేనే వండుకుంటాను”.

“అయ్యో పాపం!” అప్రయత్నంగా అన్నాను.

అయన నవ్వాడు. “పాపం తలచటానికి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదుగా! పుట్టినప్పటి నుండీ ఉన్నదేనయ్యే! భగవంతుడు చూపు ఇవ్వకపోయినా మా అమ్మ నన్ను అన్యాయం చేయలేదు. అన్ని పనులూ నేర్పి వెళ్ళింది. వంట ఒక్కటే కాదు, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, ఇస్త్రీ కూడా చేసుకుంటాను”

“అవునా!” అన్నాను.

“మాష్టారు చిన్నప్పుడు స్కూల్‌కి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకునేవారట. మాకు చదువు చెప్పేటప్పుడు కూడా నడిచే వచ్చేవారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్టేట్ అవార్డ్ కూడా తీసుకున్నారు” చెప్పాడు రమేష్.

నేను ఆశ్చర్యంగా వింటూ ఉన్నాను. ఇంతలో పక్కన ఉన్న చిన్న ఫోన్ మోగింది. అయన గ్రీన్ బటన్ నొక్కి “హలో!” అన్నాడు. అవతలవారి మాటలు విన్న తర్వాత “ఇంకా పెన్షన్ రాలేదు. ఈరోజో రేపో వస్తుంది. రాగానే వేస్తాను” అన్నాడు. “ఎవరు మాస్టారూ! అప్పులవాళ్ళా!” అడిగాడు రమేష్.

“కాదు. నా భార్య తరపు బంధువులు. రెండవ తేదీ వచ్చినా మెయింటెనెన్స్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు”

“మీరు ఇస్తేగానీ గడవని స్థితిలో ఆమె ఉందా!” అడిగాను.

“ఉన్నదో, లేదో నాకు అనవసరం. తాళి కట్టిన భార్యను నేను ఉన్నంత వరకూ పోషించాల్సిన బాధ్యత నాది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను” అన్నాడు.

అయన మాటలు అబ్బురంగా అనిపించింది. “మీకు చాలా ధైర్యం ఉంది సార్!” అన్నాను.

“ఎడారిలో చూడండి. నీరు దొరకదు, చుట్టూ ఇసుక, వేడి గాలులు. అలాంటి పరిస్థితులలో కూడా ఆ వాతావరణాన్ని తట్టుకుని కొన్ని మొక్కలు బ్రతుకుతాయి. పూలు పూస్తాయి. ఆ పూలు మనకి ఉపయోగమా, కాదా అనే విషయం పక్కన పెట్టండి. మనం చూడాల్సింది మనుగడ కోసం అవి చేసే పోరాటాన్ని! అలాగే మనం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని బ్రతకాలి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే హక్కు ఎవరికీ లేదు” అన్నాడు.

నేను మౌనంగా ఉండిపోయాను. రమేష్, అయన ఏవేవో విషయాలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. “ఇక వెళ్ళొస్తాం మాస్టారూ! చీకటి పడితే ప్రయాణం ఇబ్బంది అవుతుంది” లేచి నిలబడ్డాడు రమేష్. “జాగ్రత్తగా వెళ్ళండి” అన్నాడు. నేను కూడా చెప్పి వచ్చేసాను.

బండిమీద వెళుతుంటే అయన మాటలే గుర్తుకువస్తున్నాయి. ఆ మాటల్లో ఎంత ఆత్మవిశ్వాసం! అయన చెప్పిన ఎడారిపూల ఉపమానం మరీమరీ గుర్తుకువస్తూంది. కంటివెలుగు లేదు, నా అనేవారు లేరు, ఒంటరిగా తన పనులు తానే చేసుకుంటూ బ్రతకాలి. అన్నీ బాగుండి కూడా ఆత్మహత్యలకు తలపడే వారు ఎంతమంది లేరు? పరీక్షలో ఫెయిల్ అయ్యారనో. ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదనో.. ఇలా చిన్న చిన్న కారణాలకే! ఈ మధ్య ఉపాధ్యాయుడు మండలించాడని విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు కూడా పేపర్‌లో వస్తున్నాయి. ఎంత దారుణం? వాళ్ళ అవకాశాల గురించి, వాళ్ళ కున్న ప్లస్ పాయింట్ల గురించి ఆలోచించరు. లేనిదాని కోసం ఆరాటపడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. ఎవరో దాకా ఎందుకు? నేను ఎటైనా వెళ్లిపోవాలనీ, ఆశ్రమంలో చేరిపోవాలనీ, చనిపోయినా ఫర్వాలేదు అనీ ఎన్నిసార్లు అనుకున్నాను? భార్య అనుకూలంగా లేనంత మాత్రాన చావాల్సిన అవసరం ఏముంది? నా కంటూ ఒక లైఫ్ ఉంది. నా రచనలు, నా సాహితీమిత్రులు, సభలు ఇవే బ్రతుకు మీద ఆశ కల్పిస్తాయి. బ్రతికే దారి చూపిస్తాయి. నా పిల్లలు చిన్న వయసు కావటం వల్ల తల్లి చెప్పినట్లు వింటున్నారు గానీ, పెద్దయితే వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు. ఆ మాటకొస్తే నా భార్య కూడా వయసు మీద పడిన తర్వాత మారుతుందేమో! ఏదైనా జరగవచ్చు. నేను అలా నిరాశ పడకూడదు అనిపించింది.

రమేష్ హుషారుగా ఈలపాట పాడుకుంటూ బండి నడుపుతూ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here