శిల్పం

3
4

[dropcap]అ[/dropcap]లసటగా కుర్చీలో కూర్చుని గడియారం మీదకి దృష్టి సారించింది సునంద. మరో అరగంటలో భర్త ఇంటికొస్తాడు. అతని కోసం దోసెలు రెడీ చేసి హాట్ ప్యాక్‌లో ఉంచింది. నిత్యం భర్త కోసం ఏదో టిఫిన్ తయారుచేస్తుంది. టిఫిన్ తిని టీ తాగి రిలాక్స్ అవుతాడతను. ఇంట్లో ఉండేది ఇద్దరే కాబట్టి ఆమెకి మరేం పని ఉండదు.

నెలకి ఒకసారి రిలయన్స్ స్మార్ట్‌కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారు. ఉదయం తాజా కూరలు అమ్మే బండి ఇంటి ముందుకి వస్తుంది. కావల్సినవి తీసుకుని వంట పూర్తి చేస్తుంది. ఆర్య నిద్ర లేచేది కూడా అప్పుడే. కాఫీ తాగి ఆఫీసు పని ఉంటే చేసుకుంటాడు. లేదంటే కబుర్లు చెబుతూ కూర్చుంటాడు. పనిమనిషి ఇల్లు ఊడ్చి, అంట్లు తోముతుంది. వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతుంది. బట్టలు తనే ఇస్త్రీ చేస్తుంది సునంద. చీకు చింత లేకుండా సాగిపోతోంది జీవితం.

ప్రైవేట్ కాలేజీలో చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టిందామె. ఏడో నెల వచ్చింది కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవాలని భర్తతో ఆలోచించి సెలవు తీసుకుంది. నిజానికి ఆర్థిక సమస్యలు లేకపోయినా ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఉద్యోగంలో చేరింది. తనకంటూ ఎవరూ లేకపోవడంతో పుట్టింటికి వెళ్ళాల్సిన అవుసరం లేదు. ఆ వెలితి మనసులో కదులుతున్నా ఆర్యని విడిచి ఉండక్కర్లేదన్న ఆలోచన తృప్తి కలిగించింది.

చిన్నతనంలోనే ఒంటరి కావడంవల్ల ఆశ్రమంలో పెరిగింది. దాతల ఆర్థిక సాయంతో ఇంజనీరింగ్‌లో చేరింది. అక్కడ పరిచయమయ్యాడు ఆర్య. అతనికి తల్లి తప్ప ఎవరూ లేరు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ కావడంతో ఉద్యోగం తొందరగానే వచ్చింది ఆర్యకి. సునందని ఇష్టపడడంతో ఆశ్రమ పెద్దలతో మాట్లాడి అక్కడే పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిని ఓల్డేజ్ హోమ్‌లో చేర్చి సునందతో హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. అత్తగారిని తమతో ఉంచుకోవాలని సునంద అనుకుంది. కాని కొంతకాలం సంతోషంగా ఉందామని చెప్పాడు ఆర్య.

కాలింగ్ బెల్ ఆమె ఆలోచనల్ని చెదరగొట్టింది. సేఫ్టీ లాక్ వరకూ తలుపు తెరిచి చూసింది. భర్త కనిపించడంతో తలుపు పూర్తిగా తెరిచింది.

“ఒంట్లో ఎలా ఉంది?” లోపలికి వస్తూ ప్రేమగా అడిగాడు ఆర్య.

“బాగానే ఉంది.” చెప్పిందామె బ్యాగ్ అందుకుంటూ.

ఆర్య స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి దోసెలు డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉన్నాయి. భర్త బలవంతం మీద తనో దోసె తింది సునంద. ఆ తరువాత ఆర్యకి టీ ఇచ్చింది.

“డాక్టర్ అపాయింట్మెంట్ రేపే కదా?” అడిగాడు ఆర్య.

“అవును ఉదయం పదకొండుకి.”

“నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ దగ్గర దించుతాను. అపాయింట్మెంట్ అయ్యాక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రాగలవా? పదకొండు వరకూ అక్కడ వెయిట్ చెయ్యడమంటే బోర్ కొడుతుందేమో!” ఆర్య అన్నాడు.

“పర్లేదు. నాతోపాటు ఎందరో అక్కడ ఉంటారు. ఏదోటి మాట్లాడుతూ కూర్చుంటారు. సమయం ఇట్టే గడిచిపోతుంది.” చెప్పింది సునంద.

ఆ రాత్రి కొద్దిగా పెరుగన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు.

***

ఉదయం తొమ్మిదిన్నరకి సునందని తీసుకుని బయలుదేరాడు ఆర్య. ఆమెని హాస్పిటల్ దగ్గర దింపి,

“జాగ్రత్త. ఆపాయింట్మెంట్ అయ్యాక కాల్ చెయ్యి..” చెప్పి వెళ్ళిపోయాడు.

సునంద హాస్పటల్ లోపలికి నడిచింది. రిసెప్షన్‌లో కేసు షీట్ ఇచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుంది. ఎదురుగా టీవీలో నేషనల్ జాగ్రఫీ ఛానల్ నిశ్శబ్దంగా వస్తోంది. పల్లంలోకి జారిపోయిన ఏనుగు పిల్లని బయటకు తియ్యడానికి ప్రయత్నిస్తోంది తల్లి ఏనుగు.

అలా చూస్తూనే ఆలోచనల్లో మునిగిపోయింది సునంద. కొద్ది రోజుల్లో తన జీవింతంలోకి ఓ ప్రాణి రాబోతోంది. ఆ ప్రాణి కదలికలు కడుపులో కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి. తను బిడ్డ తల్లి అవుతుంది. తన బాధ్యతలు పెరుగుతాయి. ఏమీ తెలియని బిడ్డని, అన్నీ తెలిసిన బిడ్డని చూసుకోవాలి. అందమైన తన జీవితానికి మరింత అందం సమకూరుతుంది. ఆర్య ప్రేమకి తిరుగులేని గుర్తు ఆ బిడ్డ.

కాలేజీకి సంవత్సరం పాటు సెలవు పెట్టింది. అవసరమైతే ఆ ఉద్యోగం మానేయాలనేది ఆమె ఆలోచన. ఎవరో వచ్చి పక్క కుర్చీలో కూర్చోవడంతో తల తిప్పింది సునంద. ఆమెకి యాభైపైనే ఉంటుంది వయసు. ముఖం నిండా ఆందోళన. సునంద తనవైపు చూడడంతో చెప్పింది.

“నిన్న సాయంకాలం తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను..”

ఆమె ఏం చెబుతున్నదో అర్థంకాక అయోమయంగా చూసింది సునంద.

“ఈ కబురు కోసం రెండేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను.”

“దేని గురించి చెబుతున్నారు?” అడిగింది సునంద.

“నా కూతుర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారట. పొట్టకోసి బిడ్డని తీస్తారట..” చెప్పింది దిగులుగా.

“దానికే కంగారు పడుతున్నారా? ఇప్పుడు సిజేరియన్ చాలా కామన్.”

“పొట్టకోసి బిడ్డని తియ్యడమంటే మాటలా..” ఆ దృశ్యం కళ్ళముందు కదిలినట్టు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

“నూటికి తొంభై మంది తల్లి పొట్ట చీల్చుకుని పుడుతున్నారు.” నవ్వుతూ చెప్పింది సునంద.

దానిని ఇష్టపడనట్టు తల అడ్డంగా ఊపిందామె.

“మా కాలంలో మంత్రసాని వచ్చి పురుడు పోసేది. ఇన్ని మందులు, ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండేవి కావు. పురుడు కష్టమయితే గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్ళేవారు.”

“డెలివరీ అవుతున్నది మీ అమ్మాయికా?” అడిగింది సునంద.

“అవును. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. పెళ్ళయ్యాక అల్లుడుతోపాటు హైదరాబాద్ వచ్చింది అమ్మాయి. మా ఊళ్ళో ఎకరం మెట్ట భూమి ఉంది నాకు. కూరగాయలు సాగు చేస్తాను. నా బతుకు సాఫీగా సాగిపోతోంది. నిన్న సాయంకాలం అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. ఎక్కడి పనులు అక్కడ వదిలి వచ్చాను. మనవడినో, మనవరాలినో చూడటంకంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి ఈ వయసులో మాకు” చెప్పిందామె. మాటల్లో పడటం వల్ల ఆందోళన తగ్గినట్టు కొద్దిగా మొహం తేటపడింది. కాయకష్టం చేసుకునే మనిషి కావడంతో ఆ వయసులో కూడా దృఢంగా కనిపిస్తోంది.

ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆమెతో చెప్పాడు,

“ఇంకో అరగంట పడుతుందట. మీరు ఇక్కడే కూర్చోండి.. నేను ఇంటికెళ్ళి వస్తాను.” చెప్పాడు.

ఆమె తలూపింది. అతను వెళ్ళిపోయాక తల తిప్పి సునందతో అంది,

“అల్లుడికి నా కూతురంటే ప్రాణం. వాళ్ళు సుఖంగా ఉన్నారు. వాళ్ళ మధ్య దూరడం ఇష్టం లేక అమ్మాయి ఎన్నిసార్లు రమ్మని పిలిచినా నేను రాలేదు. ఈ చేతులతో పెంచాను దాన్ని. అదిప్పుడు తల్లవుతోంది. ఎంత చిత్రం.. నేను పొలానికి వెళుతుంటే తోకలా వెనుక వచ్చేది. దానికి అన్నం తినిపించాలంటే నాకు తాతలు దిగి వచ్చేవారు.”

“కూతుర్ని అంత ప్రేమించిన మీరు ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు?”

ఆమె చిన్నగా నవ్వింది.

“దాని సంతోషానికి అడ్డుపడకుండా ఉండడం కూడా ప్రేమలో భాగమే. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు దాని కెందుకు భారం కావాలి?” అడిగి సునంద ముఖంలోకి చూసింది.

“గొప్ప ఆలోచన..” మనస్ఫూర్తిగా మెచ్చుకుంది సునంద.

ఇంతలో నర్సు హడావిడిగా వచ్చి అడిగింది,

“సావిత్రమ్మ గారు ఎవరు?”

“నేనే.” అంతవరకూ సునందతో మాట్లాడినామె చెప్పింది.

“మీ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. మిమ్మల్ని చూడాలంటోంది మీ అమ్మాయి.”

ఉత్సాహంగా లేచింది సావిత్రమ్మ. నర్సుని అనుసరించింది. అయిదు నిమిషాల తరువాత పాలిపోయిన ముఖంతో కాళ్ళీడ్చుకుంటూ వచ్చి సునంద పక్కన కూర్చుంది. ఆమె వాలకం చూసి కంగారు పడింది సునంద.

“ఏమైంది?” అడిగింది.

“రక్త సంబంధం ఉన్న వాళ్ళే వెళ్ళాలంట. వార్డు గోడకి బోర్డు పెట్టారు.” చెప్పింది.

“కరోనా కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు హాస్పిటల్ యాజమాన్యం. ఎవ్వరు పడితే వాళ్ళు రాకుండా ఈ ఏర్పాటు చేసారు. మీరేళ్ళి చూడొచ్చు” వివరించింది సునంద.

తల అడ్డంగా ఊపింది సావిత్రమ్మ.

“ఎందుకని?” ఆశ్చర్యంతో ప్రశ్నించింది సునంద.

“నిజానికి అది నా కడుపున పుట్టలేదు. ఇరవై రెండేళ్ళ క్రితం ఊరు చివర గుడి దగ్గర దొరికింది. అప్పుడే నా మొగుడు నన్నొదిలేసేడు. మొగుడు లేని లోటు దాని పెంపకం ద్వారా తీరింది. మా మధ్య రక్త సంబంధం లేనప్పుడు లోపలికి ఎలా వెళ్ళగలను?”

అది అమాయకత్వమో, మొండితనమో అర్థం కాలేదు సునందకి.

“ఏమమ్మా, మీకే చెప్పేది. నా తల్లి తప్ప బిడ్డని ఇంకెరూ మొదట చూడకూడదని అంటోంది మీ అమ్మాయి.”

నిస్సహాయంగా చూసింది సావిత్రమ్మ. సునంద లేచి నిలబడి ఆమె చెయ్యిపట్టుకుని లేపింది.

“మీ సంబంధంతో పోలిస్తే రక్త సంబంధం ఏపాటి? ఆ పిల్లకి మీరు దైవమిచ్చిన తల్లి. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పదండి..” చిన్నగా చెప్పి నర్సు వెంట నడిపించుకుంటూ తీసుకెళ్ళింది సునంద. మంచం మీదున్న యువతి ముఖం తల్లిని చూడగానే విప్పారింది. కూతురు బుగ్గలు తడిమి ఉయ్యాలలోని బిడ్డని చూసింది సావిత్రమ్మ.

“అచ్చు నీ పోలికే..” అందామె.

“నీ పోలిక అమ్మా! మట్టిలో బంగారం పండించే నీ చేతుల్లో పెరిగాను. వాడిని నువ్వే పెంచాలి.” చెప్పింది కూతురు. సావిత్రమ్మ కళ్ళల్లో ఆనందబాష్పాలు.

సావిత్రమ్మని అక్కడ వదలి తిరిగి వెయిటింగ్ రూమ్‌కి వచ్చింది సునంద.

***

“మీరు ఈ వీకెండ్ ఒక రోజు సెలవు పెట్టాలి.” టీ తాగుతున్న ఆర్యతో చెప్పింది సునంద.

“దేనికి?” అడిగాడతను.

“వెళ్ళి అత్తయ్యని తీసుకురండి.”

“ఎందుకు? ఆమెకి అక్కడ బాగానే ఉందిగా!” అన్నాడు ఆర్య.

“ఇక్కడ ఇంకా బాగుటుంది. పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఆ సంతోషం మనిషిని ఎక్కువ కాలం బతికిస్తుంది. మన నుంచి దూరమైన వాళ్ళు ఎక్కడకీ పోరు. తిరిగి పిల్లలుగా పుడతారు. తల్లి తన బిడ్డని చూసుకుని భర్త కళ్ళముందు తిరుగాడుతున్నట్టు భావించి తృప్తి పడుతుంది. ఇప్పుడు అత్తయ్య లేదా మామయ్య పసిబిడ్డగా రాబోతుంటే ఆమెని దూరంగా ఉంచడం భావ్యం కాదు. శిలని శిల్పంగా మార్చే శక్తి సామర్థ్యాలు అత్తయ్యకి ఉన్నాయని మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మన బిడ్డ ఆమె సంరక్షణలో పెరిగితే అంతకంటే కావాల్సిందేముంది. మీ చిన్నప్పటి ముచ్చట్లు, మీ తాత ముత్తాతల వివరాలు చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఆమె.”

భార్య కళ్ళల్లోకి చూసి ఆమె నిర్ణయానికి తిరుగులేదన్నట్టుగా తలూపాడు ఆర్య,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here